జీ20 సదస్సు: కశ్మీర్‌లో ఆర్టికల్-370 రద్దు తర్వాత ఈ నాలుగేళ్ళలో ఏం మారింది?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, మాజిద్ జహంగీర్
- హోదా, బీబీసీ కోసం
ఆర్టికల్-370 రద్దు తర్వాత తొలిసారి జమ్మూకశ్మీర్‌లో అంతర్జాతీయ సదస్సు జరుగుతోంది.
జీ-20 బృందానికి ఈ ఏడాది భారత్ అధ్యక్షత వహిస్తోంది. దీనిలో భాగంగా దేశంలోని విభిన్న ప్రాంతాల్లో కేంద్ర ప్రభుత్వం సదస్సులను నిర్వహిస్తోంది. ఆ సదస్సులు నిర్వహించే నగరాల్లో శ్రీనగర్ కూడా ఒకటి. ఇక్కడ జరిగే సదస్సుకు జీ20 సభ్య దేశాల టూరిజం వర్కింగ్ గ్రూపు ప్రతినిధులు హాజరు అవుతున్నారు.
సదస్సు నేపథ్యంలో శ్రీనగర్‌లో భద్రతా ఏర్పాట్లను కట్టుదిట్టం చేశారు. పర్యటకులకు ఎలాంటి ఇబ్బందులూ తలెత్తకుండా ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేస్తున్నారు.
జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక హోదా కల్పించే ఆర్టికల్ 370ను 2019లో రద్దు చేశారు. ఆ తర్వాత క్షేత్ర స్థాయిలో పరిస్థితులు ఏం మారాయో ఇప్పుడు తెలుసుకుందాం.

ఫొటో సోర్స్, EPA
2019లో ఆర్థికల్ 370 రద్దుతో వచ్చే ప్రయోజనాలపై కొన్ని అంశాలను కేంద్ర ప్రభుత్వం ప్రధానంగా ప్రస్తావించింది.
- జమ్మూకశ్మీర్‌లో అతివాదానికి తెర పడుతుంది.
- ఈ ప్రాంతానికి విదేశీ పెట్టుబడులు వస్తాయి.
- జమ్మూకశ్మీర్‌లో కొత్త రాజకీయ శకం మొదలవుతుంది.
- ఇక్కడ కొత్త అభివృద్ధి మొదలవుతుంది.
2019, ఆగస్టు 5న జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక హోదాను కల్పించే ఆర్టికల్ 370ను భారత ప్రభుత్వం రద్దుచేసింది. ఈ ప్రాంతాన్ని రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించింది.
అప్పటివరకూ జమ్మూకశ్మీర్‌లో భాగమైన లద్దాఖ్‌ను ప్రత్యేక కేంద్ర పాలిత ప్రాంతంగా గుర్తించారు. ప్రత్యేక హోదాను రద్దు చేసిన తర్వాత జమ్మూకశ్మీర్‌లో కొన్ని ఆంక్షలు విధించారు. ఇంటర్నెట్, మొబైల్ సేవలను కూడా స్తంభింపచేశారు.

ఫొటో సోర్స్, Getty Images
అతివాదానికి తెరపడిందా?
జమ్మూకశ్మీర్‌లో అతివాదంపై పోరాటంలో భద్రతా బలగాలు కొంతవరకు విజయం సాధించాయని చెప్పుకోవచ్చు. కానీ, ఇప్పటికీ చాలా సవాళ్లు మిగిలే ఉన్నాయి.
కశ్మీర్‌లో మిలిటెంట్ దాడులు ఇటీవల తగ్గుముఖం పట్టాయి. మరోవైపు మిలిటెంట్ల సంఖ్య కూడా తగ్గింది.
కశ్మీర్‌లో క్రీయాశీలంగా పనిచేస్తున్న మిలిటెంట్ల సంఖ్య నేడు కనిష్ఠానికి పడిపోయిందని జమ్మూకశ్మీర్ పోలీసులు చెబుతున్నారు. నేడు వీరి సంఖ్య 30కు తగ్గిందని, గత 33 ఏళ్లలో ఇదే కనిష్ఠమని వివరించారు.
అయితే, గత రెండేళ్లలో జమ్మూకశ్మీర్‌లో దక్షిణ భాగమైన జమ్మూలో ఎక్కువ దాడులు జరుగుతున్నాయి. కశ్మీర్‌లో దాడులు తగ్గినప్పటికీ, జమ్మూలో పరిస్థితులు ఊహించని విధంగా మారిపోతున్నాయని భద్రతా నిపుణులు చెబుతున్నారు.
ఈ అంశంపై జమ్మూకశ్మీర్ మాజీ డీజీపీ శేష్ పాల్ వేద్ మాట్లాడుతూ.. ‘‘కొంతమంది స్థానిక యువకులు స్వల్ప మొత్తంలో అతివాద సంస్థల్లో చేరుతున్నారు. ‘ఆపరేషన్ ఆల్ ఔట్’లో భాగంగా చాలా మంది మిలిటెంట్లను భద్రతా సంస్థలు హతమార్చాయి. అయినప్పటికీ పాకిస్తాన్‌లోని హ్యాండ్లర్ల సాయంతో కొందరు మిలిటెంట్లు దాడులు చేస్తున్నారు. ఇప్పటికీ కొందరు మిలిటెంట్లు ఇక్కడ పనిచేస్తున్నారనేది మాత్రం వాస్తవం’’అని ఆయన చెప్పారు.
2019లో ఆర్టికల్ 370ని రద్దు చేసినప్పుడు జమ్మూకశ్మీర్ నుంచి అతివాదాన్ని పూర్తిగా తొలగిస్తామని చెప్పారు. ఈ లక్ష్యం నెరవేరిందా?
‘‘అప్పట్లో అలా చెప్పిన మాట వాస్తవమే. కానీ, అంతిపెద్ద నెట్‌వర్క్‌ను ఇంత తక్కువ సమయంలో పూర్తిగా తొలగించడం చాలా కష్టం. కేవలం మూడేళ్లు మాత్రమే గడిచాయి. పొరుగునున్న పాకిస్తాన్‌లో మార్పులు రాకుండా, ఇక్కడ అంత త్వరగా అతివాదానికి ముగింపు పలకడం ఎలా సాధ్యం?’’అని ఆయన అన్నారు.
జమ్మూకశ్మీర్‌లో రాజకీయాల పరిస్థితి ఏమిటి?
2014 నుంచి జమ్మూకశ్మీర్‌లో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించలేదు. ఆనాడు పీడీపీ, బీజేపీ కలిసి ఇక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేశాయి. అయితే, 2018లో బీజేపీ మద్దతును ఉపసంహరించుకోవడంతో పీడీపీ ప్రభుత్వం కుప్పకూలింది. దీంతో ఇక్కడ రాష్ట్రపతి పాలన విధించారు.
2019లో జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370ను రద్దుచేశారు. ఆ తర్వాత లెఫ్టినెంట్ గవర్నర్‌కు బాధ్యతలు అప్పగించారు. అప్పటినుంచి ఎన్నికలు నిర్వహించలేదు. ఇక్కడ ఎన్నికలు నిర్వహించాలని కొన్ని రాజకీయ పార్టీలు ఎప్పటికప్పుడే డిమాండ్ చేస్తున్నాయి.
రాష్ట్రంలో అసెంబ్లీ స్థానాల పునర్‌వ్యవస్థీకరణ కూడా నిర్వహించారు. ఇప్పుడు ఈ ప్రక్రియలు కూడా పూర్తయ్యాయి.
రాష్ట్రంలో రాజకీయ పరిస్థితిపై సీపీఎం రాష్ట్ర కార్యదర్శి యూసుఫ్ తారిగామి మాట్లాడుతూ.. ‘‘కశ్మీర్‌లో అంతా సవ్యంగానే ఉందని చెబుతున్నారు. మరి ఎన్నికలు ఎందుకు నిర్వహించడం లేదు?’’అని ప్రశ్నించారు.
‘‘కశ్మీర్‌లో అభివృద్ధి జరుగుతోందని కేంద్రం చెబుతోంది. పర్యటకులు కూడా వస్తున్నారని, జనజీవనం కూడా పూర్వస్థికి వచ్చిందని అంటున్నారు. మరి ఇక్కడ ఇబ్బంది ఏముంది?’’అని ఆయన ప్రశ్నించారు.
‘‘అసెంబ్లీ స్థానాల పునర్‌వ్యవస్థీకరణ పూర్తైంది. ఓటరు జాబితాలో మార్పులు, చేర్పులు కూడా పూర్తయ్యాయి. మరి ఎన్నికలు ఎందుకు నిర్వహించడం లేదు?
2019లో ఇక్కడ లోక్‌సభ ఎన్నికలు నిర్వహించారు. మళ్లీ సార్వత్రిక ఎన్నికలు కూడా వచ్చేస్తున్నాయి. తాజాగా కర్ణాటకలోనూ అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించారు. కానీ, ఇక్కడ మాత్రం ఎన్నికలు నిర్వహించడం లేదు’’అని ఆయన అన్నారు.
దీనిపై కశ్మీర్ బీజేపీ మీడియా ఇన్‌చార్జి మంజూర్ భట్ మాట్లాడుతూ.. ‘‘ఎన్నికలు నిర్వహించాలి. మా పార్టీకి ప్రజాస్వామ్యంపై విశ్వాసముంది. ఎప్పుడు ఈ ఎన్నికలు నిర్వహించాలో ఎన్నికల కమిషనే నిర్వహిస్తుంది’’అని చెప్పారు.
విదేశీ పెట్టుబడుల పరిస్థితేమిటి?
ఆర్టికల్ 370ని రద్దు చేసిన తర్వాత, తొలిసారిగా ఈ ఏడాది మార్చి నెలలో జమ్మూకశ్మీర్‌కు తొలి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల(ఎఫ్‌డీఐ) ప్రాజెక్టు వచ్చింది. దీని విలువ రూ.500 కోట్లు. ఈ ప్రాజెక్టుతో కశ్మీర్‌లో వేల కొత్త ఉద్యోగాలు వస్తాయని దీని కేంద్రం చెబుతోంది.
ఈ ప్రాజెక్టు ప్రారంభ సమయంలో జమ్మూకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా మాట్లాడారు. ‘‘జమ్మూకశ్మీర్‌లో ఇది తొలి ఎఫ్ఐడీ. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌కు చెందిన ఎంఆర్ గ్రూపు ఈ పెట్టుబడులను పెడుతోంది’’అని చెప్పారు.
దీనిపై కశ్మీర్ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ మాజీ అధ్యక్షుడు షేక్ ఆశిక్ హుస్సియాన్ మాట్లాడుతూ.. ‘‘ఆశించిన స్థాయిలో జమ్మూకశ్మీర్‌కు పెట్టుబడులు రావడం లేదు’’అని అన్నారు.
జమ్మూకశ్మీర్ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ప్రస్తుత అధ్యక్షుడు జావెద్ అహ్మద్ భట్ మాట్లాడుతూ.. ‘‘జమ్మూకశ్మీర్‌కు విదేశీ పెట్టుబడులు తీసుకువచ్చేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. ఈ ప్రయత్నాలు సఫలం కావాలని నేను ఆకాంక్షిస్తున్నాను. పెట్టుబడులు వస్తే, స్థానిక యువతకు ఉపాధి కూడా దొరుకుతుంది’’అని ఆయన చెప్పారు.

ఫొటో సోర్స్, EUROPEAN PHOTOPRESS AGENCY
పర్యటకం మాటేమిటి?
గత రెండేళ్లలో కశ్మీర్‌కు వస్తున్న పర్యటకుల సంఖ్య పెరుగుతోందని ప్రభుత్వం చెబుతోంది. 2022లో మొత్తంగా 1.88 కోట్ల మంది పర్యటకులు వచ్చినట్లు ప్రభుత్వ గణాంకాలు వెల్లడించాయి.
పర్యటకుల సంఖ్య పెరిగితే, స్థానిక వ్యాపారాలు, ట్రావెల్ పరిశ్రమకు లబ్ధి చేకూరుతుంది. అయితే, కొందరు వ్యాపారులు మాత్రం ఆశించిన స్థాయిలో వ్యాపార లావాదేవీలు జరగడం లేదని చెబుతున్నారు.
కశ్మీర్ ఎకనమిక్ అలయన్స్ ప్రెసెడింట్ మొహమ్మద్ యాసీర్ ఖాన్ మాట్లాడుతూ.. ‘‘పర్యటకం వరకూ అంతా బానే ఉంది. 2021, 2022లో పర్యటకులు బానే వచ్చారు. 2023లోనూ వస్తున్నారు. కానీ, యాపిల్, ఇతర రైతుల పరిస్థితి చూడండి. రైతులతోపాటు వ్యాపారులు చాలా ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు’’అని చెప్పారు.
‘‘ఆర్టికల్ 370 రద్దు తర్వాత అన్నీ లావాదేవీలు స్తంభించిపోయాయి. ఆ తర్వాత కోవిడ్-19 మహమ్మారి చెలరేగింది. చాలా మంది రైతులు, వ్యాపారులు బ్యాంకుల నుంచి రుణాలు తీసుకున్నారు. అసలతోపాటు వడ్డీ కూడా అలానే ఉంది. ఈ ఇబ్బందులన్నీ మార్కెట్లు, స్థానిక వ్యాపార కేంద్రాల్లో కనిపిస్తున్నాయి’’అని ఆయన అన్నారు.
ఇవి కూడా చదవండి:
- తిరుపతి - వేమన ఇండ్లు: ఈ గ్రామంలోకి దళితులను రానివ్వరు.. ఇక్కడ ఎవరూ చెప్పులు వేసుకోరు
- జనసేన: పార్టీలకు ఎన్నికల గుర్తులను ఈసీ ఎలా కేటాయిస్తుంది?
- కరీంనగర్ - ఆశ: ఒకప్పుడు భిక్షాటనతో బతికిన హిజ్రా.. ఇప్పుడు ఫొటోగ్రాఫర్ ఎలా అయ్యారు?
- రూ. 2,000 నోట్ల వాడకాన్ని ఆపేసిన ఆర్బీఐ.. మీ దగ్గర ఉన్న నోట్లను ఎలా మార్చుకోవాలి?
- నాసిక్: త్రయంబకేశ్వర ఆలయంలో ముస్లింలు ధూపం సమర్పించారా... వైరల్ వీడియోలో ఏముంది, అసలేం జరిగింది?
( బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

















