భారత్-పాకిస్తాన్: కార్గిల్ సరిహద్దుల్లో అంతులేని నిరీక్షణ, సొంతవాళ్లను కలుసుకునే మార్గమే లేదా?

జ్ఞాపకాల మ్యూజియం
ఫొటో క్యాప్షన్, ఈ ప్రాంతంలోని కుటుంబాలు విడిపోయి రెండు దేశాల సరిహద్దులకు ఆవల స్థిరపడ్డాయి
    • రచయిత, షకీల్ అఖ్తర్
    • హోదా, కార్గిల్ నుంచి బీబీసీ కోసం

"నా ముగ్గురు సోదరులు, ఒక సోదరి సరిహద్దు అవతల ఉన్నారు. అందరూ చనిపోయారు. తల్లిదండ్రులు, తోబుట్టువులు, అందరూ ఒకరినొకరు చూడకుండా వెళ్లిపోయారు"

కార్గిల్ లోని హిండర్‌మాన్ గ్రామానికి చెందిన జైనాబ్ బీబీ తన మాటలు ముగియకముందే పెద్దగా ఏడ్చారు. దేశ సరిహద్దులకు ఆవల నివసిస్తున్న తన బంధువుల కోసం ఎదురు చూసి చూసి ఆమె కళ్లు అలసిపోయాయి.

కార్గిల్ నుండి 13 కి.మీ దూరంలో ఇండో-పాకిస్తాన్ సరిహద్దులో ఎత్తైన పర్వతాల మధ్య ఉన్న ఒక చిన్న గ్రామమే హిండర్‌మాన్.

ఈ గ్రామం పాకిస్తాన్‌తో సరిహద్దుకు అతి సమీపంలో ఉంది. హిండర్‌మాన్, దాని పరిసర ప్రాంతం గతంలో పాకిస్తాన్‌లో భాగంగా ఉండేది. 1971 యుద్ధంలో భారతదేశం దీనిని స్వాధీనం చేసుకుంది. యుద్ధం కారణంగా ఏర్పడిన గందరగోళంలో అనేక కుటుంబాలు విడిపోయాయి.

జ్ఞాపకాల మ్యూజియం
ఫొటో క్యాప్షన్, జైనాబ్ బీబీ

కొన్ని కుటుంబాలు పాకిస్తాన్‌కు వెళ్లగా, కొన్ని ఇక్కడే ఉండిపోయాయి. 50 ఏళ్ల తర్వాత కూడా విడిపోయిన ఈ కుటుంబాల బంధువులు ఇప్పటి వరకు ఒకరినొకరు కలుసుకోలేకపోయారు.

దీనికి గురించి స్థానిక నివాసి మొహమ్మద్ హుస్సేన్ బీబీసీతో మాట్లాడారు. "మా గ్రామాన్ని 1971లో విభజించారు. సగంమంది ఇక్కడే ఉండగా, సగంమంది వెళ్లిపోయారు. మా లావాదేవీలు, మా బంధుత్వాలు అక్కడా ఉన్నాయి, ఇక్కడా ఉన్నాయి. కొంతమంది సోదరులు ఇక్కడున్నారు, తల్లి ఇక్కడ, తండ్రి అక్కడ ఉన్నవారు కూడా ఉన్నారు'' అని ఆయన వివరించారు.

దీనికి ప్రధాన కారణం, ఇక్కడి వారు చాలామంది పేదలు. వీసా ఖర్చులు భరించి వారు మరో దేశానికి ప్రయాణించే పరిస్థితి లేదు.

రెండు ప్రభుత్వాలు వారికి వీసాలు నిరాకరించే సమస్య కూడా ఉంది.

జ్ఞాపకాల మ్యూజియం
ఫొటో క్యాప్షన్, జ్ఞాపకాల మ్యూజియం

మెమరీస్ మ్యూజియం

''కర్తార్‌పూర్ కారిడార్ ప్రారంభంతో మా ఆశలు పెరిగాయి. మా సరిహద్దు మార్గాన్ని కూడా తెరవాలని చాలా కాలంగా డిమాండ్ చేస్తున్నాం. దీనివల్ల రెండు ప్రభుత్వాలకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. రోడ్డు చాలా దగ్గరగా ఉంది. కేవలం పది నిమిషాల ప్రయాణం మాత్రమే'' అని మొహమ్మద్ హుస్సేన్ వివరించారు.

హిండర్‌మాన్‌లో ఉండే మొహమ్మద్ ఇలియాస్ మామ యుద్ధ సమయంలో సరిహద్దుకు అవతలి వైపున ఉన్న గ్రామానికి వెళ్లి తిరిగి రాలేదు.

వీడియో క్యాప్షన్, భారత్-పాకిస్తాన్ విభజన సమయంలో ఈ పచ్చబొట్లే ఎంతో మంది ప్రాణాలు కాపాడాయి

విడిపోయిన వారిని గుర్తుంచుకోవడానికి ఇలియాస్ 'యాదోం కా మ్యూజియం'' (మ్యూజియం ఆఫ్ మెమోరీస్) ని రూపొందించారు.

ఈ విధంగా తాము విడిపోయిన తమ బంధువులను గుర్తుంచుకుంటామని, తమ ఎడబాటు బాధను ప్రపంచానికి తెలియజేస్తామని చెప్పారు.

''ఇది మా మేనమామ ఫొటో. ఆయనను గుర్తుపెట్టుకోవడానికి ఈ ఒక్క ఫోటో మాత్రమే ఉంది'' అని ఒక ఫొటో చూపిస్తూ ఇలియాస్ అన్నారు.

జ్ఞాపకాల మ్యూజియం

ఇబ్బందులు

గ్రామానికి కొద్ది దూరంలోనే పాకిస్తాన్ ప్రాంతం కనిపిస్తుంది. సిల్క్ రోడ్ హిండర్‌మాన్ గ్రామం, కార్గిల్ పట్టణం మధ్య నుంచి వెళుతుంది. ఈ రహదారి ఇప్పటికీ ఉంది. కానీ పాకిస్తాన్ భూభాగం మొదలయ్యే ప్రాంతంలో, భారతదేశంవైపు నుంచి మూసేసి ఉంటుంది.

అక్కడ ఇండియన్ ఆర్మీ కంటోన్మెంట్ ఉంది. కానీ ఆ ప్రాంతం సాధారణంగా ప్రశాంతంగా ఉంటుంది. ఇది మానవతా సమస్య అని స్థానిక నాయకుడు సజ్జాద్ హుస్సేన్ అంటున్నారు.

''లద్ధాఖ్, బాల్టిస్తాన్ మధ్య సుమారు 15,000 కుటుంబాలు ఉన్నాయి. అవి ఇప్పటికీ విడిపోయి ఉన్నాయి. ఇది మానవ విషాదం. మానవతా దృక్పథంతో ఈ సమస్యను పరిష్కరించాలని అనేకసార్లు ప్రభుత్వాలకు విన్నవించుకున్నాం. ఖర్మింగ్, బాల్టిస్తాన్‌లలో కూడా ఇలాంటి ఘర్షణలను చూశాం'' అని హుస్సేన్ బీబీసీతో అన్నారు.

గిల్గిట్-బాల్టిస్తాన్ అసెంబ్లీలో కూడా తీర్మానం చేశారని, దురదృష్టవశాత్తు ఇప్పటి వరకు ఎలాంటి చొరవ తీసుకోలేదని ఆయన అన్నారు.

జ్ఞాపకాల మ్యూజియం
ఫొటో క్యాప్షన్, జ్ఞాపకాల మ్యూజియం గ్యాలరీ

నిశ్శబ్ద గ్రామం

ప్రభుత్వం దారిని తెరవకపోయినా, కనీసం బంధువులు ఒకరినొకరు కలుసుకునే వేదికనైనా ఏర్పాటు చేస్తే బాగుంటుందని సజ్జాద్ హుస్సేన్ అన్నారు.

"ఈ రహదారిని తెరిస్తే, భద్రతా దళాలకు కేంద్రంగా మిగిలిపోయిన ఈ ప్రాంతమంతా శాంతికి నిలయంగా మారవచ్చు" అని ఆయన అన్నారు.

జైనాబ్ బీబీకి వయసు మీద పడింది. ఆమె కళ్లు ఆత్మీయుల కోసం ఎదురు చూసి చూసి విసిగిపోయారు. ఈ గ్రామంలోని కొత్త తరం సరిహద్దులు చెరిగిపోవాలని కోరుకుంటోంది.

కానీ, హిండర్‌మాన్ గ్రామం దాని జ్ఞాపకాలు, బాధతో నిశ్శబ్దంగా ఉంది.

జ్ఞాపకాల మ్యూజియం

కార్గిల్ యుద్ధం

1999లో యుద్ధం జరిగినప్పుడు కార్గిల్ పేరు వెలుగులోకి వచ్చింది.

1999 మే-జూలైలో జరిగిన ఈ యుద్ధానికి భారతదేశం ఆపరేషన్ విజయ్ అని పేరు పెట్టారు.

ఈ పోరాటంలో తమ సైనికులు పాల్గొన్నారని పాకిస్తాన్ ఎప్పుడూ అధికారికంగా అంగీకరించలేదు.

దాదాపు రెండు నెలల పాటు సాగిన పోరాటం తర్వాత, చొరబాటుదారులను తరిమికొట్టామని, తమ భూభాగాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నామని భారత సైన్యం పేర్కొంది.

వీడియో క్యాప్షన్, భారత జైలులో మగ్గిపోతున్న పాకిస్తాన్ మత్స్యకారుల కుటుంబాల దీన స్థితి

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)