కండోమ్ అడగడానికి మగాళ్ళు ఎందుకు సిగ్గుపడతారు, దీన్ని ఎవరు మార్చేశారు?

- రచయిత, జోయా మతీన్, దేవాంగ్ షా
- హోదా, బీబీసీ ప్రతినిధి
కోట్లాది ప్రజలకు కుటుంబ నియంత్రణ గురించి చెప్పాలంటే ఎలా?
కండోమ్ అనే పదం ప్రజల నోళ్లల్లో నానేలా చేయాలి. దాని చుట్టూ ఉన్న అపోహలు, సిగ్గు తొలగిపోవాలి. 18 ఏళ క్రితం ప్రకటనల రచయిత ఆనంద్ సస్పి సరిగ్గా అదే చేశారు.
'కండోమ్ బిందాస్ బోల్' (కండోమ్ అని హాయిగా నోరు తెరిచి చెప్పు) అనే ప్రచారాన్ని మార్కెటింగ్ కమ్యూనికేషన్స్ కంపెనీ లోవ్ లింటాస్‌లో సస్పి బృందం రూపొందించింది.
భారత ప్రభుత్వ సహకారంతో 2006లో ఈ ప్రచారాన్ని మార్కెట్లోకి తీసుకొచ్చారు. ఉత్తర భారతదేశంలోని ఎనిమిది రాష్ట్రాలలో పడిపోతున్న కండోమ్ అమ్మకాలు, వాడకాన్ని అభివృద్ధి చేయడమే ఈ అడ్వర్టైజ్మెంట్స్ లక్ష్యం. అప్పటికి దేశంలో దాదాపు సగం కండోమ్ మార్కెట్ ఈ రాష్ట్రాలలోనే ఉంది.
ఆ యాడ్స్ సరదాగా సాగిపోతాయి. పోలీస్ స్టేషన్‌లో ఓ కానిస్టేబుల్ కండోమ్ అనడానికి సిగ్గుపడుతుంటాడు. అతని చేత గట్టిగా కండోమ్ అని పలికించడానికి పక్కనున్న పోలీసులు ప్రయత్నిస్తారు. చివరికి చెప్పిస్తారు. 'సిగ్గుపడకుండా హాయిగా నోరు తెరిచి కండోమ్ అని చెప్పండి' అంటూ అందరూ 'కండోమ్' అని గట్టిగా అరుస్తారు.
ఇలాగే రైల్వే కూలీలు, కోర్టు బయట లాయర్ల మధ్య జరిగే సంభాషణలతో మరి కొన్ని యాడ్స్ ఉంటాయి. ఈ సిరీస్ చాలా పాపులర్ అయింది. దీనికి ఐరాస అవార్డ్ కూడా వచ్చింది.
దేశంలో కుటుంబ నియంత్రణను ప్రోత్సహించడానికి, కండోమ్ వాడకం పెంచడానికి ఇలాంటి హాస్యభరితమైన యాడ్స్ ఎన్నో వచ్చాయి. సదరాగా నవ్విస్తూ, స్త్రీపురుషులిద్దరికీ సమస్యపై అవగాహన కల్పించే ప్రయత్నం చేశాయి.

'మగవాళ్లు బూతు జోకులు వేసుకుంటారు కానీ, కండోమ్ అడగడానికి సిగ్గుపడతారు'
1950లలో కుటుంబ నియంత్రణ కోసం భారత ప్రభుత్వం ఒక ప్రత్యేక విభాగాన్ని కేటాయించింది. ఇలా చేసిన తొలి దేశం మనదే.
అప్పటి నుంచే ప్రకటనలు ప్రారంభమయ్యాయి. గర్భనిరోధకాలు, కుటుంబ నియంత్రణ ఆపరేషన్లపై విస్తృతంగా అవగాహనా కార్యక్రమాలు నిర్వహించింది.
చూడగానే దృష్టిని ఆకర్షించేలా ఒక వాక్యంలో ప్రకటనలు వెలువడ్డాయి.
'మేమిద్దరం, మాకిద్దరు', 'చిన్న కుటుంబం చింత లేని కుటుంబం'.. లాంటి ప్రకటనలు రేడియో, టీవీలలో మారుమోగిపోయాయి. వీధుల్లో పోస్టర్లు వెలిశాయి. అడ్వర్టైజ్మెంట్‌కు అవకాశమున్న ఏ చోటునూ వదల్లేదు. ఆఖరికి, మారుమూల ప్రాంతాల్లో ఏనుగులపై కూడా కుటుంబ నియంత్రణ యాడ్స్ ఉన్న అంబారీలు వేశారు.
తిరగేసిన ఎరుపు రంగు త్రిభుజాకారం గుర్తు కుటుంబ నియంత్రణకు సూచికగా మారింది.
పై వాక్యాలు కుటుంబ నియంత్రణకు పర్యాపపదాలుగా మారాయి. నేటికీ అవి కనిపిస్తుంటాయి.
గర్భనిరోధకాలు, కుటుంబ నియంత్రణ వంటి సున్నితమైన అంశాలకు సంబంధించి సరికొత్త పదజాలాన్ని సృష్టించేందుకు ఈ ప్రకటనలు ఉపయోగపడ్డాయని నిపుణులు భావిస్తున్నారు. ఈ అంశాలు ఇప్పటికీ కొన్ని ప్రాంతాల్లో నిషిద్ధాలే.
"మగవాళ్లు బూతు జోకులు వేసుకుంటారు. గట్టిగా నవ్వుతారు. కానీ, కండోమ్ అనే మాట వచ్చేసరికి సిగ్గుపడిపోతారు" అంటారు ఆనంద్ సస్పి.
అధ్యయనాలు కూడా ఇదే విషయాన్ని చెబుతున్నాయి. సిగ్గు కారణంగానే సేఫ్ సెక్స్ ప్రాక్టీసుల గురించి భారతీయ పురుషులు మాట్లాడాడనికి జంకుతారని తేలింది.
"బిందాస్ బోల్ ప్రకటన వెనక ఉన్న ఆలోచన అదే.. మొహమాటపడకుండా పురుషులు కండోమ్ అడిగి తీసుకోగలగాలి. మన దేశంలో కండోమ్ అన్నది చెడ్డ మాట. గట్టిగా అనకూడదు. చెవిలో గుసగుసలాడాలి. లేదంటే తప్పుపడతారు. కానీ, కండోమ్ అందరూ వాడాలి. అందులో ఎలాంటి సందేహం లేదు" అని బిందాస్ బోల్ ప్రాజెక్ట్‌లో భాగం పంచుకున్న పబ్లిక్ హెల్త్ నిపుణురాలు శాశ్వతీ బెనర్జీ వివరించారు.
దీన్ని అమలు చేయడానికి 40,000 మంది కండోమ్ అమ్మకపుదారులు, కెమిస్టులతో భాగస్వామ్యం కుదుర్చుకున్నారు.
"నిజానికి ఇక్కడ పనిచేసింది హాస్యం. ప్రకటన చూడగానే ముందు బాగా నవ్వుతారు. తరువాత సందేశం మనసులోకి చొచ్చుకుంటుంది" అని చెప్పారు సస్పి.

ఫొటో సోర్స్, Getty Images
'పురుషుల్లో వేసెక్టమీపై అవగాహన చాలా తక్కువ'
అయితే, ప్రభుత్వం, ప్రైవేట్ సంస్థలు తయారుచేసిన అన్ని ప్రకటనలూ హిట్ కాలేదు. కొన్నింటిపై బాగా విమర్శలు వచ్చాయి కూడా.
కొన్ని ప్రకటనలు కేవలం మహిళల కోసం రూపొందించారు. అవి అంత సమర్థంగా పని చేయలేదని నిపుణులు అభిప్రాయపడ్డారు.
"గర్భనిరోధకాల విషయంలో మహిళలకు ఎలాంటి ఛాయిస్ ఉండేదికాదు" అని బీబీసీ మీడియా యాక్షన్‌లో నేషనల్ క్రియేటివ్ డైరెక్టర్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ అయిన రాధారాణి మిత్రా అన్నారు.
పురుషులే నిర్ణయాలు తీసుకుంటారు. కానీ, భారం మహిళల మీద పడుతుంది. అయితే, పురుషులకు కుటుంబ నియంత్రణ గురించి పెద్దగా అవగాహన ఉండదు.
2019-2021లో కూడా ఈ ట్రెండ్ కొనసాగింది. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే-5 గణాంకాల ప్రకారం, దేశవ్యాప్తంగా 38 శాతం మహిళలు పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేయించుకుంటే, కేవలం 0.3 శాతం పురుషులు కుటుంబ నియంత్రణ (వేసెక్టమీ) ఆపరేషన్ చేయించుకున్నారు.
"ప్రకటనలు, నినాదాలు సంప్రదాయబద్ధంగా వస్తున్న భావనలను అంత సులువుగా బద్దలుగొట్టలేవు" అని పబ్లిక్ హెల్త్ నిపుణుడు ఆనంద్ సిన్హా అభిప్రాయపడ్డారు.
అయితే, ఈ ప్రకటనలు కొంతవరకు సమాజంలో చైతన్యం తీసుకురాగలిగాయి.

'కండోమ్ కండోమ్ కండోమ్' .. రింగ్ టోన్
1975 ఎమర్జెన్సీ సమయంలో, పౌర హక్కులకు అడ్డుకట్ట వేసినప్పుడు దేశంలోని కుటుంబ నియంత్రణ ప్రచారం బాగా కుంటుపడింది. అప్పుడే ప్రభుత్వం బలవంతంగా లక్షలాది మహిళలు, పురుషులు, చిన్న పిల్లలకు సైతం కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయించింది.
"దీనివల్ల ప్రచారానికి చాలా చెడ్డ పేరు వచ్చింది. అందరిలో గర్భనిరోధకాల గురించి భయం పుట్టుకుంది" అని సిన్హా చెప్పారు.
ఆ తరువాత చాలా ఏళ్ల వరకు, కుటుంబ నియంత్రణకు కొత్త రూపం ఇచ్చి, స్నేహపూర్వకంగా దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడం పెద్ద సవాలుగా మారింది.
అదే సమయంలో ప్రైవేట్ సంస్థలు, వయసులో ఉన్న జంటలకు కండోమ్స్ అమ్మేందుకు మరింత సృజనాత్మక మార్గాలను వెతకడం ప్రారంభించాయి. దానివల్ల ప్రకటనలు కొంత శృంగారభరితంగా, జనం కనక్ట్ కాగలిగేలా తయారయ్యాయి.
1980లలో పశ్చిమ దేశాలలో ఎయిడ్స్ వ్యాప్తి ప్రారంభమైనప్పుడు, భారత్ లాంటి అధిక జనాభా ఉన్న దేశాలకు ముప్పు పొంచి ఉందన్న భయం పుట్టుకొచ్చినప్పుడు సేఫ్ సెక్స్ ప్రాక్టీసులకు కొత్త మార్కెటింగ్ ప్రారంభమైంది. దాంతో, గర్భనిరోధకాలకు మార్కెట్ విస్తృతమైందని రాధారాణి మిత్ర వివరించారు.
"అప్పుడే సెక్స్ గురించి, కండోమ్స్ గురించి మరింత బాహాటంగా ప్రచారాలు మొదలుపెట్టారు" అని ఆమె చెప్పారు.
వీటిల్లో చాలామందికి గుర్తుండిపోయేది.. 2008లో వచ్చిన కండోమ్ రింగ్ టోన్.
"కండోమ్ వాడకాన్ని సాధారణీకరించేదుకు" బీబీసీ మీడియా యాక్షన్ నేతృత్వంలో, బిల్ అండ్ మెలిండా గేట్స్ ఫౌండేషన్ నిధులు సమకూర్చిన ప్రచారంలో భాగంగా వెలువడిన రింగ్ టోన్ అది.
భారతదేశంలో సేఫ్ సెక్స్, హెచ్ఐవీ నివారణపై ప్రారంభించిన భారీ ప్రచారంలో పై ప్రాజెక్ట్ కూడా ఉంది.
'కండోమ్ కండోమ్ కండోమ్' అంటూ మంచి బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్‌తో వినిపిస్తుంది ఆ మొబైల్ రింగ్ టోన్. దీనిపై ఒక సరదా యాడ్ కూడా వచ్చింది. ఓ పెళ్లిలో ఒక వ్యక్తి జేబులో సెల్ ఫోన్ మోగుతుంది. 'కండోమ్ కండోమ్' అంటూ రింగ్ టోన్ గట్టిగా వినిపిస్తుంది. దాంతో, అతను గాబరాపడతాడు. ఈ యాడ్ చూడగానే చాలా నవ్వొస్తుంది.
ఈ రింగ్ టోన్ వైరల్ అయిందని, డౌన్‌లోడ్ కోసం దాదాపు 480,000 అభ్యర్థనలు వచ్చాయని మిత్రా చెప్పారు. అమెరికా, జపాన్, ఇండోనేషియా, దక్షిణ అమెరికా, యూరప్‌లలో కూడా పాపులర్ మ్యూజిక్ బ్యాండ్స్ ఈ రింగ్ టోన్ వాయించాయని చెప్పారు.
"ఈ రింగ్ టోన్ ప్రపంచవ్యాప్తంగా వార్తల్లో హెడ్ లైన్ అయింది. పలు అవార్డులు సొంతం చేసుకుంది. అన్నిటికన్నా ముఖ్యంగా, సమాజంపై దాని ప్రభావం కనిపించిందని" మిత్ర చెప్పారు.
సమాజం ప్రవర్తనలో వచ్చే మార్పు అంత సులువుగా కంటికి కనిపించదని, అన్ని వైపుల నుంచి ముక్కలు ఏరుకొచ్చి పేర్చితే తప్ప స్వరూపం బోధపడదని శాశ్వతీ బెనర్జీ అన్నారు.
"ఒక్కోసారి, మామూలు సంభాషణ కూడా ఆలోచనలో, ప్రవర్తనలో మార్పుకు తీసుకురావచ్చు" అన్నారామె.
ఇవి కూడా చదవండి:
- విక్టోరియా: 9 మంది పిల్లల తల్లి అయిన ఈ రాణిపై 7 హత్యాయత్నాలు జరిగాయి, అయినా ఎలా బయటపడ్డారంటే....
- డైనోసార్స్: పెట్రోల్, డీజిల్‌లు ఈ జంతువుల వల్లే పుట్టుకొచ్చాయా?
- జర్మనీ: రూ.1,000 కోట్ల విలువైన సంపదను ఐదుగురు దొంగలు ఎలా కొట్టేశారంటే...
- 30 అడుగుల లోతు నీటిలో 74 రోజులుగా ఈ వ్యక్తి ఎలా జీవిస్తున్నారంటే...
- ఈ బాలీవుడ్ నటిని డ్రగ్స్ స్మగ్లర్‌గా సినీ ఫక్కీలో ఇరికించారు
( బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














