జర్మనీ: రూ.1,000 కోట్ల విలువైన సంపదను ఐదుగురు దొంగలు ఎలా కొట్టేశారంటే...

ఆభరణాలు

ఫొటో సోర్స్, Reuters

    • రచయిత, జెన్నీ హిల్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

మనీ హీస్ట్. నెట్‌ఫ్లిక్స్‌లో రెండు భాగాలుగా విడుదలై ప్రేక్షకుల ఆదరణ పొందిన పాపులర్ వెబ్ సిరీస్. ఆ సిరీస్‌లో ఓ గ్యాంగ్ బ్యాంకును కొల్లగొట్టి, వేలాది కోట్లను దొంగిలిస్తుంది. అలాంటిదే జర్మనీలో జరిగింది.

దగ్గరి బంధువులైన కొందరు కలిసి ఏకంగా మ్యూజియాన్నే దోచేశారు. ఆభరణాలను, వజ్రాలను దొంగిలించారు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా వెయ్యి కోట్ల రూపాయల విలువైన సంపదను ఎత్తుకెళ్లారు.

ఇంతకీ ఆ చోరీ ఎవరు చేశారు? ఎలా చేశారు? ఎప్పుడు చేశారు? వాళ్లను పోలీసులు పట్టుకున్నారా లేదా?

ఇది పక్కా ప్రణాళికతో చేసిన చోరీ. జర్మనీలో డ్రెస్డెన్ నగరంలోని గ్రీన్ వాల్ట్ మ్యూజియంలో జరిగిందీ దొంగతనం.

మ్యూజియాన్ని కొల్లగొట్టడానికి బెర్లిన్‌కు చెందిన గ్యాంగ్ అనేక సార్లు రెక్కీ నిర్వహించింది.

దొంగలు మ్యూజియంలోకి ప్రవేశించడానికి హైడ్రాలిక్ కట్టింగ్ మెషీన్‌తో కిటికీలను కత్తిరించారు. ఆపై వాటిని తిరిగి జాగ్రత్తగా అమర్చారు.

మ్యూజియం ఏరియల్ వ్యూ
ఫొటో క్యాప్షన్, మ్యూజియం ఏరియల్ వ్యూ

వీధి అంతా కరెంట్ కట్ చేసి..

అది 2019 నవంబర్ 25. తెల్లవారుజామున దొంగలు గ్రీన్ వాల్ట్ మ్యూజియం సమీపంలోని సర్క్యూట్ బ్రేకర్ ప్యానెల్‌ ( ఎలక్ట్రిసిటీ జంక్షన్ బాక్స్) కు నిప్పంటించారు.

దీంతో చుట్టుపక్కల వీధుల్లో కరెంటు పోయింది. వీధి అంతా చీకటి కమ్మేయడంతో దొంగల ముఠా మ్యూజియంలోకి ప్రవేశించగలిగింది.

ముసుగు వేసుకున్న దొంగలు చేతిలో గొడ్డలితో గ్రీన్ వాల్ట్ మ్యూజియంలోకి ప్రవేశించారు. ఇదంతా మ్యూజియం సీసీటీవీ ఫుటేజీలో రికార్డయింది.

లోపలికి వెళ్లిన తర్వాత దొంగలు నిధి ఉన్న డిస్‌ప్లే గాజును బద్దలు కొట్టారు. అక్కడున్న విలువైన వస్తువులను తీసేసుకున్నారు.

ఆ తర్వాత తమ ఆనవాళ్లు చెరిపేయడానికి మంటలార్పే సాధనం (ఫోమ్ ఫైర్ ఎక్స్‌టింగ్విషర్‌)ను తీసుకొని గది మొత్తం స్ప్రే చేశారు.

అనంతరం ఆడి కారులో ఎక్కి సమీపంలోని కార్ పార్కింగ్ వద్దకు వెళ్లారు. తర్వాత కారుకు నిప్పంటించి బెర్లిన్‌కు వెళ్లారు. వాళ్లు మ్యూజియం నుంచి దొంగతనం చేసిన సంపద విలువ దాదాపు రూ.1,000 కోట్లకు పైగా ఉంటుంది.

"కొంతమంది వ్యక్తులు కళపై మక్కువతో కళాఖండాలను దొంగిలిస్తారు. కానీ ఈ దొంగతనం అలాంటిది కాదు" అని డ్రెస్డెన్ స్టేట్ ఆర్ట్ కలెక్షన్ జనరల్ డైరెక్టర్ మారియన్ అకెర్‌మాన్ అన్నారు.

"వారు ఏం దొంగిలించారో కూడా వారికి తెలియదు" అని చెప్పారు.

వజ్రాలు పొదిగిన కత్తి

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, వజ్రాలు పొదిగిన కత్తి

విలువైన వస్తువులు మాయం..

కాగా, గతంలో భారీ బంగారు నాణెం దొంగతనానికి గురై దొరకనట్లే, మ్యూజియంలోని నిధి కూడా దొరకదనే భయం తలెత్తింది.

మ్యూజియంలోని ఈ వస్తువులు 18వ శతాబ్దంలో సాక్సోనీ ఎన్నికల అధికారి ఆగస్టస్ ది స్ట్రాంగ్‌ సేకరించిన నిధిలో భాగం.

ఆయన ఈ విలువైన వస్తువులను సేకరించి, వాటిని ప్రదర్శించడానికి గ్రీన్‌వాల్ట్‌ మ్యూజియం రూపొందించారు.

విలువైన వస్తువులు పోగొట్టుకోవడం బాధాకరమని ప్రొఫెసర్ అకెర్‌మాన్ తెలిపారు.

రంగురంగుల రత్నాలను చూసి సందర్శకులు అనుభూతి చెందాలనే ఉద్దేశంతోనే అగస్టస్ మ్యూజియంలో వీటన్నింటిని ప్రదర్శించేలా ఏర్పాటుచేశారని అకెర్‌మాన్ వివరించారు.

మ్యూజియం

ఫొటో సోర్స్, Getty Images

సెక్యూరిటీ వ్యవస్థ పనిచేయలేదా?

ఈ దొంగతనం మొత్తం కళా ప్రపంచాన్ని కుదిపేసింది.

దొంగతనం కోసం ముఠా మ్యూజియంలోకి ప్రవేశించిన తీరుతో మ్యూజియం భద్రతా వ్యవస్థపై కూడా ప్రశ్నలు తలెత్తాయి.

ప్రొఫెసర్ అకెర్‌మాన్ మాట్లాడుతూ మ్యూజియం భద్రత డ్రెస్డెన్ స్టేట్ ఆర్ట్ కలెక్షన్, మరొక ప్రాంతీయ సంస్థల సంయుక్త బాధ్యత అని చెప్పారు.

మ్యూజియం భద్రతా వ్యవస్థ జర్మనీలోనే అత్యుత్తమమైనదని కూడా ఆమె నొక్కి చెప్పారు.

“భద్రతా వ్యవస్థలో చాలా విషయాలు ఉన్నాయి. ఇది భవనం, నిర్వహణ, సాంకేతిక అంశాలను కూడా ఇందులో భాగమని గుర్తించాలి. ఒక చైన్ మాదిరి అన్ని లింక్‌లు పని చేయాలి. అయితే దొంగతనం సమయంలో అలాంటిది జరగలేదు.

మ్యూజియం వెలుపలి గోడలను స్కాన్ చేయడానికి రూపొందించిన వ్యవస్థ పని చేయడంలో విఫలమైంది.

సెక్యూరిటీ సెంట్రల్ రూమ్‌లో కూర్చున్న గార్డులు తమ మానిటర్‌లలో దొంగతనం చూసినా పోలీసులకు సమాచారం ఇవ్వడంలో ఆలస్యం చేశారు'' అని అకెర్‌మాన్ అన్నారు.

ముఖాలు దాచుకున్న దొంగలు

ఫొటో సోర్స్, Getty Images

దొంగలు దొరికారా?

ఘటన తర్వాత మ్యూజియంలోని నలుగురు సెక్యూరిటీ గార్డులను పోలీసులు విచారించారు.

దొంగతనం సమయంలో వాళ్లు ఎందుకు ఆలస్యంగా సమాచారం ఇచ్చారు? వాళ్లు దొంగలకు సాయం చేశారా? అనే కోణంలో విచారణ జరిపారు.

పోలీసులు ఏడాదిపాటు విచారణ జరిపారు. దొంగతనానికి పాల్పడిన ఐదుగురిని పోలీసులు గుర్తించారు. నిందితులను అరెస్టు చేశారు.

మూడేళ్ల తర్వాత ముఠాలోని ముగ్గురు సభ్యులు నేరాన్ని అంగీకరించారు.

శిక్ష తగ్గిస్తామనడంతో దొంగిలించిన వస్తువులను ఎక్కడ దాచారో వెల్లడించడానికి అంగీకరించారు. దీంతో కొన్ని వస్తువులు మ్యూజియంలోకి తిరిగి వచ్చాయి.

కత్తితో సహా పలు ఆభరణాలను పోలీసులు స్వాధీనం చేసుకోగలిగారు.

అయితే వైట్ స్టోన్ ఆఫ్ సాక్సోనీ అనే అరుదైన రత్నంతో సహా కొన్ని వస్తువులు ఇప్పటికీ దొరకలేదు.

వీడియో క్యాప్షన్, వీడియో: ఆధునిక చరిత్రలో కనీవినీ ఎరుగని భారీ దోపిడీ

దొంగలంతా ఒకే వంశస్తులు..

దోషులుగా తేలిన వారందరూ "రెమ్మో వంశం" సభ్యులు. జర్మనీలో ఇలాంటి అనేక వంశాలు ఉన్నాయి.

ఇటీవలి కాలంలో అరబ్ మూలాలు కలిగిన కొన్ని కుటుంబాలకు చెందిన వారు డిపార్ట్‌మెంట్ స్టోర్‌పై దాడి, బ్యాంకు దోపిడీతో సహా పలు నేరాలకు పాల్పడ్డారు.

డ్రెస్డెన్ దొంగల్లో ఒకరు 2017లో బెర్లిన్‌లోని బోడే మ్యూజియం నుంచి 100 కిలోల బరువున్న భారీ బంగారు నాణేన్ని దొంగిలించాడు.

నాణెం ఇప్పటికీ తిరిగి రికవరీ కాలేదు. దాన్ని ముక్కలు చేసి ఉండొచ్చని, లేదంటే కరిగించారని భావిస్తున్నారు.

మ్యూజియం దొంగలకు నాలుగు నుంచి ఆరేళ్ల వరకు శిక్ష విధించే అవకాశం ఉంది.

కిటికీ కడ్డీలను కట్టింగ్ పరికరాల సాయంతో కత్తిరిస్తుండగా పెద్ద శబ్ధం వచ్చిందని, అయినా ఎవరూ గుర్తించలేదని విచారణ సమయంలో దొంగలలో ఒకరు ఆశ్చర్యం వ్యక్తంచేశారు.

ప్రస్తుతం మ్యూజియం భద్రతా వ్యవస్థను కట్టుదిట్టం చేశారు. ఇక మ్యూజియం సిబ్బంది ఆభరణాల తిరిగి చేర్చే ప్రక్రియపై దృష్టి పెట్టారు.

అగస్టస్ సేకరించిన నిధిని త్వరలో ప్రజల కోసం ప్రదర్శించి, ఆ విలువైన వస్తువులకు పూర్వ వైభవాన్ని తీసుకురావొచ్చని నిపుణులు భావిస్తున్నారు.

మరోవైపు విలువైన వస్తువులు పోయినందుకు క్యూరేటర్లు రాజీనామా చేశారు. సమీప భవిష్యత్తులో వాటిని తీసుకురావడం కష్టమని వారు అంగీకరించారు.

ఇవి కూడా చదవండి

( బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)