సిక్కిం రాజు కోటను 30 నిమిషాల్లో భారత సైన్యం ఎలా స్వాధీనం చేసుకుంది?

చోగ్యాల్

ఫొటో సోర్స్, LOC.IN

    • రచయిత, రేహాన్ ఫజల్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

అది 1975, ఏప్రిల్ 6న ఉదయం తన ప్యాలెస్ బయట భారత సైన్యం ట్రక్కుల శబ్దాన్ని సిక్కిం చోగ్యాల్ (రాజు) విన్నారు.

వెంటనే ఆయన గబగబా కిటికీ దగ్గరకు వచ్చారు. అప్పుడే ప్యాలెస్‌ను అన్నివైపులా భారత సైనికులు చుట్టుముట్టారని ఆయనకు అర్థమైంది.

మెషీన్ గన్ల శబ్దం అక్కడ ప్రతిధ్వనించింది. రాజ్‌మహల్ గేటు దగ్గర పనిచేస్తున్న జసంత్ కుమార్ ఛెత్రీపై కాల్పులు జరిగాయి. ప్యాలెస్‌లోని 243 మంది సిబ్బందిని అదుపులోకి తీసుకోవడానికి 5,000 మంది భారత సైనికులకు కనీసం 30 నిమిషాలు కూడా పట్టలేదు.

ఆ రోజు మధ్యాహ్నం 12.45 గంటలకు సిక్కిం ‘‘స్వతంత్ర దేశం కథ’’ ముగిసింది. ఆ విషయాన్ని రేడియోలో చోగ్యాల్ అంగీకరించారు. ఆ తర్వాత ఆయనను గృహ నిర్బంధంలోకి తీసుకున్నారు.

వీడియో క్యాప్షన్, ఇందిరా గాంధీ: జననం నుంచి మరణం దాకా

దిల్లీ మున్సిపల్ కమిషనర్ డీఎస్ దాస్ భోజనం చేస్తుండగా విదేశాంగ కార్యదర్శి కేవల్ సింగ్‌ నుంచి ఒక ఫోన్ వచ్చింది. వెంటనే తనను కలవాలని ఆయన సూచించారు.

ఆ రోజు 1973, ఏప్రిల్ 7. విదేశాంగ కార్యాలయానికి దాస్ వచ్చినప్పుడు కేవల్ సింగ్ ఆయనకు స్వాగతం పలికారు. ‘‘సిక్కిం బాధ్యతలను వెంటనే తీసుకోవడానికి మిమల్ని అక్కడికి పంపిస్తున్నారు. మీకు కేవలం 24 గంటలు మాత్రమే సమయం ఉంది. వేగంగా సిద్ధంకండి’’అని కేవల్ సింగ్ చెప్పారు.

ఇందిరా గాంధీ ప్రిన్సిపల్ సెక్రటరీ పిఎన్ ధర్‌తో చోగ్యాల్
ఫొటో క్యాప్షన్, ఇందిరా గాంధీ ప్రిన్సిపల్ సెక్రటరీ ధర్‌తో చోగ్యాల్

ఆ మరుసటి రోజు హెలికాప్టర్‌లో గ్యాంగ్‌టక్‌కు దాస్ చేరుకున్నారు. ఆయనకు చోగ్యాల్ ప్రత్యర్థి కాజీ లెన్‌డుప్ దోర్జీ ఆహ్వానం పలికారు. సిక్కిం ప్రధాన కార్యదర్శి, పోలీసు కమిషనర్, సైన్యం ప్రతినిధులు అక్కడ ఉన్నారు.

అక్కడి నుంచి యాత్రగా దాస్‌ను అధికారిక నివాసానికి తీసుకెళ్లారు. ఆ మరుసటి రోజు అపాయింట్‌మెంట్ ఇవ్వాలని చోగ్యాల్‌ను దాస్ కోరారు. కానీ, జ్యోతిషులను కలిసిన తర్వాతే తాను అపాయింట్‌మెంట్ ఇవ్వగలనని చోగ్యాల్ అన్నారు.

‘‘అది ఒక సాకు మాత్రమే. నిజానికి నన్ను గానీ, నా హోదాను గానీ ఆయన గుర్తించాలని అనుకోలేదు’’అని దాస్ చెప్పారు.

బీబీసీ స్టూడియోలో దాస్
ఫొటో క్యాప్షన్, బీబీసీ స్టూడియోలో దాస్

‘‘సిక్కిం గోవా కాదు..’’

మరుసటి రోజు చోగ్యాల్‌ను దాస్ కలిశారు. కానీ, వారి మధ్య భేటీ ప్రతికూలంగా మొదలైంది.

‘‘సిక్కిం గోవా కాదు.. మీరు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి’’అంటూ చోగ్యాల్ ఆ సమావేశాన్ని మొదలుపెట్టారు.

సిక్కింను భూటాన్‌తో సమానంగా చెప్పడానికి ఆయన చాలా ప్రయత్నించారు. ‘‘మాది స్వతంత్ర, సార్వభౌమ దేశం. మీరు మా రాజ్యాంగానికి లోబడి పనిచేయాలి. మమ్మల్ని అణచివేయాలని ఎప్పుడూ ప్రయత్నించొద్దు’’అని కూడా ఆయన అన్నారు.

కానీ, సిక్కింను భారత్‌లో విలీనం చేయడానికి దాస్ అక్కడికి వచ్చారు.

ఆ మరుసటి రోజు బీఎస్ దాస్ ‘ఇండియా హౌస్’ చేరుకున్నారు. అక్కడ పనిచేస్తున్న తన స్నేహితుడు శంకర్ వాజ్‌పేయీని ఆయన కలిశారు. ‘‘కేవల్ సింగ్ నన్ను ఏం చేయమన్నారు’’అని దాస్‌ను శంకర్ ప్రశ్నించారు.

‘‘నాకు స్పష్టంగా ఏమీ చెప్పలేదు. సిక్కిం ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడానికి కృషి చేయాలని అన్నారు. ఎప్పటిలానే ఇందిరా గాంధీ ఎలాంటి హామీలు ఇవ్వలేదు. అయితే, ఇక్కడ విలీనం అనే పదాన్ని ఎవరూ ఉపయోగించలేదు’’ అని దాస్ గుర్తుచేసుకున్నారు.

‘‘ప్రైవేటు చర్చల్లోనూ విలీనం అనే పదాన్ని కేవల్ సింగ్ ఉపయోగించలేదు. కానీ, ఆ సమయంలో ఏం చేయాలో నాకు, శంకర్ వాజ్‌పేయీకి బాగా తెలుసు’’అని దాస్ అన్నారు.

చోగ్యాల్

1962 చైనా యుద్ధం..

1962 భారత్-చైనా యుద్ధం తర్వాత, సిక్కింను భారత్‌లో విలీనం చేయాలనే ప్రతిపాదన వచ్చిందని సీనియర్ రాజకీయ విశ్లేషకుడు ఇందర్ మల్హోత్రా వివరించారు.

చైనాకు చెందిన చుంబీ వ్యాలీకి సమీపంలో భారత్‌ను, ఇతర ఈశాన్య రాష్ట్రాలతో అనుసంధానించే భూభాగమైన ‘‘సిలిగుడి నెక్’’ కేవలం 21 మైళ్ల విస్తీర్ణంలో ఉందనే విషయాన్ని అప్పట్లో రాజకీయ విశ్లేషకులు ప్రధానంగా ప్రస్తావించేవారు.

ఆ ప్రాంతంపై దాడిచేస్తే ఒకే ఒక్క దెబ్బతో ఈశాన్య భారత్, మిగతా ప్రాంతాలతో వేరై పోతుందని భావించేవారు.

చోగ్యాల్ అమెరికా మహిళ హోప్ కుక్‌ను పెళ్లిచేసుకున్నారు. పూర్తి స్వాతంత్ర్యాన్ని కోరితే అమెరికా తమకు మద్దతు ఇస్తుందని ఆయన భావించారు. అయితే, ఎట్టిపరిస్థితుల్లోనూ భారత్‌కు ఇది ఆమోదయోగ్యం కాదు.

భార్య హోప్ కుక్‌తో చోగ్యాల్

ఫొటో సోర్స్, SIKKIMARCHIVES.GOV.IN

ఫొటో క్యాప్షన్, భార్య హోప్ కుక్‌తో చోగ్యాల్

అమెరికా భార్య వెళ్లిపోయారు..

చోగ్యాల్ అమెరికా భార్య హోప్ కుక్ వ్యక్తిత్వం అంతుచిక్కుండా ఉండేది.

భారత్‌కు వ్యతిరేకంగా చోగ్యాల్‌ను రెచ్చగొట్టడంలో ఆమె ప్రధాన పాత్ర పోషించేవారు. పిల్లలు చదువుకునే పాఠ్య పుస్తకాల్లో ఆమె మార్పులు చేయించారు. యువ అధికారులతో ప్రతివారం ఆమె సమావేశాలు నిర్వహించేవారు.

రాణికి సంబంధించిన విధులు నిర్వర్తించేటప్పుడు ఆమె సిక్కిం వస్త్రధారణలో కనిపించేవారు. చాలా నెమ్మదిగా, హుందాగా ఆమె మాట్లాడుతూ కనిపించేవారు. అయితే, ఆమె సహనం కోల్పోయి ఆగ్రహం వ్యక్తంచేసిన సందర్భాలు కూడా ఉన్నాయి.

చోగ్యాల్ అతిగా మద్యం తాగేవారు. ఈ విషయంలో వారిద్దరి మధ్య గొడవలు జరుగుతూ ఉండేవి. ఒకసారి కోపంతో రికార్డు ప్లేయర్‌ను కిటికీ లోనుంచి చోగ్యాల్ బయటకు విసిరేశారు.

మొత్తానికి గొడవలు తీవ్రమై సిక్కింను వదిలి హోప్ కుక్ అమెరికా వెళ్లిపోయారు. ఆమెను మళ్లీ వెనక్కి రావాలని చోగ్యాల్ చాలాసార్లు కోరారు. కానీ, ఆయన అభ్యర్థలను ఆమె పట్టించుకోలేదు.

ఆమెను దాస్ కలిశారు. ‘‘దాస్.. నా భర్తను చూసుకోండి. ఇక్కడ నేను చేయడానికి ఏమీ మిగల్లేదు’’అని ఆమె చెప్పారు.

అయితే, ప్యాలెస్‌లోని విలువైన కళాఖండాలు, పెయింటింగ్స్‌ను హోప్ అమెరికాకు తీసుకెళ్లిపోయారని కూడా అప్పట్లో వార్తలు వచ్చాయి.

విదేశాంగ కార్యదర్శి కేవల్ సింగ్ (ఎడమ), చోగ్యాల్

ఫొటో సోర్స్, Alamy

ఫొటో క్యాప్షన్, విదేశాంగ కార్యదర్శి కేవల్ సింగ్ (ఎడమ), చోగ్యాల్

ఒకే సీటు...

విలీన ఒప్పందంపై చోగ్యాల్ సంతకం పెట్టినప్పటికీ, ఆయన మనస్ఫూర్తిగా ఆ పని చేయలేదని దాస్ చెప్పారు. ఆ ఒప్పందానికి వ్యతిరేకంగా కొంత మంది బయటి వ్యక్తుల మద్దతు కూడగట్టేందుకు కూడా ఆయన ప్రయత్నించారని వివరించారు.

ఆ ఒప్పందం సరైనదికాదని వాదించేందుకు ఒక మహిళా న్యాయవాదిని కూడా ఆయన నియమించుకున్నారు. సిక్కింలో ఎన్నికలపై ప్రకటన వెలువడినప్పుడు, దక్షిణ సిక్కింకు వెళ్లాలని చోగ్యాల్ భావించారు. అయితే, అక్కడికి వెళ్లొద్దని ఆయనకు దాస్ సూచించారు.

గతంలో ఈ ప్రాంతాలకు చోగ్యాల్ వెళ్లినప్పుడు లామాలు రోడ్డుకు రెండు వైపులా నిలబడి స్వాగతం పలికేవారు. కానీ, ఆ తర్వాత ఆయన ఫోటోకు చెప్పుల దండలు వేసినట్లుగా కూడా వార్తలు వచ్చాయి.

32 స్థానాలకు జరిగిన ఎన్నికల్లో చోగ్యాల్ మద్దతు ఇచ్చిన నేషనల్ పార్టీ కేవలం ఒకే స్థానంలో విజయం సాధించింది. ఎన్నికల్లో విజయం సాధించిన సభ్యులు చోగ్యాల్ పేరుతో ప్రమాణం చేయబోమని స్పష్టంచేశారు. అంతేకాదు, ఆయన అసెంబ్లీకి వస్తే, తాము సభా కార్యక్రమాల్లో పాలుపంచుకోమని కూడా చెప్పారు.

ఇది దాస్‌కు సంక్షోభం లాంటిది. ఎందుకంటే కొత్త అసెంబ్లీకి స్పీకర్ కూడా ఆయనే. ‘‘అప్పుడే తను రాతపూర్వకంగా నిరసన తెలియజేయడానికి చోగ్యాల్ అంగీకరించారు. కొత్త శాసన సభ్యులు కూడా సిక్కిం పేరు మీద ప్రమాణం చేస్తామని చెప్పారు’’అని దాస్ వివరించారు.

చోగ్యాల్

నేపాల్‌కు చోగ్యాల్

ఈ మధ్యలోనే నేపాల్ రాజు పట్టాభిషేకానికి ప్రత్యేక అతిథిగా చోగ్యాల్ హాజరయ్యారు. అక్కడే ఆయన పాకిస్తానీ అంబాసిడర్‌తోపాటు చైనా డిప్యూటీ ప్రధాని చిన్ సి లీయు లను కలిశారు. తనకు సాయం చేయాలని ఆయన వారిని కోరారు.

అయితే, విదేశీయుల సాయం కోరొద్దని చోగ్యాల్‌కు దాస్ స్పష్టంచేశారు. ‘‘మీ రాజవంశం కొనసాగుతుంది. మీ తర్వాత మీ అబ్బాయిని వారసుడిగా ప్రకటిస్తాం. మీ కుటుంబానికి రక్షణ ఉంటుంది, మీరు మే 8న వచ్చి ఒప్పందానికి అంగీకారం తెలపాలని కోరాం’’అని దాస్ చెప్పారు.

కానీ, దానికి చోగ్యాల్ అంగీకరించలేదు. ‘‘మాది స్వతంత్ర దేశం. నేను దీన్ని వదిలిపెట్టను’’అని ఆయన వ్యాఖ్యలు చేశారు.

ధర్, రామ్‌నాథ్

ఫొటో సోర్స్, PN Dhar

ఫొటో క్యాప్షన్, ధర్, రామ్‌నాథ్

ఇందిరా గాంధీతో సమావేశం..

మొదట ఇందిరా గాంధీ సెక్రటరీ పీఎన్ ధర్‌ను చోగ్యాల్ కలిశారు. చివరగా జూన్ 30, 1974న ఇందిరా గాంధీని కూడా కలిసి తనకు అనుకూలంగా ఆమె మనసు మార్చేందుకు ప్రయత్నించారు.

ఈ విషయాన్ని ‘‘ఇందిరా గాంధీ, ది ఎమర్జెన్సీ అండ్ ఇండియన్ డెమొక్రసీ’’లో పీఎన్ ధర్ రాశారు. ‘‘ఇందిరా గాంధీతో చోగ్యాల్ మాట్లాడే విధానం చూసి నేను ఆశ్చర్యపోయాను. సిక్కింలో భారత్ తిష్టవేసిందని అన్నారు. మీరు మాట్లాడుతున్న రాజకీయ నాయకులెవరూ నమ్మదగినవారుకాదని చెప్పారు’’ అని ధర్ వివరించారు.

‘‘అయితే, నేను మాట్లాడుతోంది ఎన్నికైన ప్రజాప్రతినిధులతోనని ఇందిర అన్నారు. వెంటనే ఏమీ మాట్లాడకుండా అక్కడి నుంచి చోగ్యాల్ వెళ్లిపోయారు’’ అని ధర్ తెలిపారు.

‘‘ప్రతికూల స్పందన వచ్చినప్పుడు మౌనం వహించడంలో చోగ్యాల్ ఆరితేరారు. వింతగా నవ్వి, చేతులు ముడుచుకొని అక్కడి నుంచి చోగ్యాల్ వెళ్లిపోయారు’’అని ధర్ చెప్పారు.

చోగ్యాల్ వ్యక్తిత్వం చాలా భిన్నమైనది. సిక్కిం స్వతంత్రం కోసం చివరివరకూ ఆయన మనసు మారలేదు. ‘‘కేవలం ఒకసారే ఒకటమిని చోగ్యాల్ అంగీకరించారు. అది కూడా రోడ్డు ప్రమాదంలో కొడుకు మరణించినప్పుడు, ఆయన కూడా ఆత్మహత్య చేసుకోవాలని ప్రయత్నించారు’’అని దాస్ చెప్పారు.

మరోవైపు భార్య హోప్ కుక్ వెళ్లిపోయినప్పుడు పిల్లలను చోగ్యాల్ దగ్గరే వదిలిపెట్టారు. వారి బాధ్యతలను చూసుకోవడం చోగ్యాల్‌కు చాలా కష్టమైంది. చివరగా 1982లో క్యాన్సర్‌తో చోగ్యాల్ మరణించారు.

వీడియో క్యాప్షన్, భారత్, చైనా సరిహద్దుల్లోని లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ వద్ద ఇదీ పరిస్థితి..

విలీనంపై వ్యతిరేకత..

సిక్కింను భారత్‌లో కలపాలని ప్రతిపాదన వచ్చినప్పుడు.. చైనా దీన్ని 1968లో చెక్‌స్లోవేకియాపై రష్యా దండెత్తడంతో పోల్చింది.

దీంతో టిబెట్‌పై చైనా దండెత్తడం గురించి ఇందిరా గాంధీ ప్రస్తావించారు. ఈ విషయంలో భూటాన్ మాత్రం సంతోషంగానే ఉండేది. ఎందుకంటే భూటాన్‌తో సిక్కింకి ఎలాంటి సంబంధాలూ లేవు.

అయితే, నేపాల్‌లో కొన్ని నిరసనలు చోటుచేసుకునేవి. ఎందుకంటే సిక్కింలో 75 శాతం నేపాలీ మూలాలు ఉండేవారుంటారు.

అప్పట్లో ‘‘ఎ మెర్జెర్ ఈజ్ ఎరేంజ్డ్’’ అనే పేరుతో సీనియర్ జర్నలిస్టు జార్జి వర్ఘీస్ హిందూస్తాన్ టైమ్స్‌లో ఒక కథనం రాశారు. ‘‘ప్రజాభిప్రాయ సేకరణ చాలా హడావిడిగా చేపట్టారు. మీరు చోగ్యాల్ పదవిని రద్దు చేయాలని భావిస్తున్నారా? భారత్‌లో సిక్కిం విలీనం కావాలని కోరుకుంటున్నారా? అని రెండు ప్రశ్నలు అడిగారు. నిజానికి ఇవి రెండు భిన్నమైన ప్రశ్నలు. ఈ రెండింటికీ ఒకదానితో మరొకటికి సంబంధం లేదు. నెహ్రూ, గాంధీల దేశంలో ఇలాంటి ప్రజాభిప్రాయ సేకరణ ఎలా చేపడతారు?’’ అని ఆయన ప్రశ్నించారు.

వీడియో క్యాప్షన్, లద్దాఖ్‌లోని పాంగాంగ్ సరస్సు ఇప్పుడు ఎలా ఉంది?

‘రా’ కూడా కీలక పాత్ర

భారత్‌లో సిక్కిం విలీనంలో దౌత్యవేత్తలతోపాటు భారత నిఘా సంస్థ ‘రా’ కూడా ప్రధాన పాత్ర పోషంచింది.

‘‘మా కార్యాలయానికి ‘రా’ అధికారులు వచ్చేవారు. ఏం జరుగుతుందో చెప్పాలని నేను వారిని అడిగేవాడిని. కానీ, వారు పెద్దగా ఏమీ చెప్పేవారు కాదు. అయితే, ఒక రోజు మా ఇంటికి ఓ అధికారి వచ్చారు. ఆయనతో మాట్లాడినప్పుడు, సిక్కింలో జరిగే ఏ సంఘటనపైనా సీఈవోతో మాట్లాడొద్దని మాకు స్పష్టమైన ఆదేశాలున్నాయని చెప్పారు. ఎందుకంటే ఆయన చోగ్యాల్ ప్రతినిధి. కావాలంటే ఆయన ఆ విషయాన్ని చోగ్యాల్‌కు చెప్పొచ్చు అన్నారు’’అని దాస్ చెప్పారు.

‘‘నేను ఒక విషయం నిజాయితీగా చెప్పాలని అనుకుంటున్నాను. నిఘా వర్గాల నుంచి చివరివరకూ నాకు ఎలాంటి సమాచారమూ రాలేదు’’అని చెప్పారు.

ఇందిరా గాంధీ పాత్ర..

‘‘అక్కడి పరిణామాలన్నీ ఇందిరాగాంధీకి ఎప్పటికప్పుడు తెలియజేస్తూ ఉండేవారని మేం అనుకునేవాళ్లం. ఎందుకంటే నేను ఆమెతో 11 ఏళ్లు కలిసి పనిచేశాను. ఎవరైనా తనను మోసం చేస్తున్నారని అనిపిస్తే, ఆమె అసలు వదిలిపెట్టరు. చోగ్యాల్‌ను ఎప్పటికీ మార్చలేమని ఇందిర భావించారు. ఈ సిక్కిం ఎపిసోడ్‌లో హీరో ఇందిరనే. మేం ఆమె చేతిలో పావులం మాత్రమే’’అని దాస్ చెప్పారు.

సిక్కింను భారత్‌లో 22వ రాష్ట్రంగా ప్రకటించేందుకు 1975 ఏప్రిల్ 23న తీసుకొచ్చిన సవరణను మొదట లోక్‌సభలో ప్రవేశపెట్టారు. 299/11 ఆధిక్యంతో ఆ బిల్లు ఆమోదం పొందింది.

ఏప్రిల్ 26న ఈ బిల్లుకు రాజ్యసభ ఆమోదం తెలిపింది. ఆ తర్వాత 1975 మే 15న రాష్ట్రపతి ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ బిల్లుపై సంతకం చేశారు. దీంతో సిక్కింలో నామ్‌గ్యాల్ శకానికి తెరపడింది.

ఇవి కూడా చదవండి:

( బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)