కోల్‌కతాలో చైనాటౌన్ ఎలా పుట్టింది, అక్కడి చైనా వాళ్ళంతా ఏమైపోయారు?

కోల్‌కతాలో చైనాటౌన్

ఫొటో సోర్స్, Neil McAllister /Alamy

    • రచయిత, చారుకేశి రామదురై
    • హోదా, బీబీసీ ట్రావెల్

జెనిస్ లీ సెలవులపై చైనాకు వెళ్లినప్పుడు ‘‘ఎంత త్వరగా వెనక్కి వెళ్లిపోతానా’’ అని ఆమెకు అనిపించింది. ‘‘నాకు అక్కడి భాష రావడం లేదు. ఆహారం నచ్చడం లేదు. అసలు ఏదో కోల్పోతున్నట్లు అనిపించేది’’ అని ఆమె గుర్తుచేసుకున్నారు.

విదేశీ సంస్కృతిలో ఇమడలేకపోవడం అనేది మీకు వింతగా అనిపించకపోవచ్చు. కానీ, లీ.. చైనా సంతతి వ్యక్తే. ‘‘వెనక్కి వచ్చిన తర్వాత నా మనసుకు ప్రశాంతంగా అనిపించింది’’ అని ఆమె నాతో చెప్పారు. కోల్‌కతాలోని తన ఇంటి గురించి ఆమె చెబుతున్నారు.

భారతీయ-చైనీస్‌ హక్కా ప్రజల్లో ఐదో తరానికి చెందిన లీ.. ‘‘పో చాంగ్ ఫుడ్స్’’లో పనిచేస్తున్నారు. ఈ సంస్థను ఆమె తాతయ్య 1958లో మొదలుపెట్టారు. చైనా సాస్‌లు, నూడుల్స్‌ను ఇక్కడుండే ప్రజలకు సరఫరా చేయడమే ఈ సంస్థ లక్ష్యం.

కోల్‌కతాలో చైనాటౌన్

ఫొటో సోర్స్, Neil McAllister /Alamy

బ్రిటిష్ రికార్డుల ప్రకారం.. తొలి చైనా వలసదారుడిగా భావించే ‘టాంగ్ హా చ్యూ’ 1778లో భారత్‌లోని కోల్‌కతాకు భారీగా తేయాకును తీసుకొని వచ్చారు. ఆ తర్వాత ఇక్కడే ఆయన చక్కెర పరిశ్రమను పెట్టారు.

అప్పట్లో చైనా, తూర్పు ఆసియా ప్రాంతాల నుంచి వచ్చేవారు భారత్‌లోకి ప్రవేశించేందుకు కోల్‌కతా అత్యంత సమీప మార్గంగా పనిచేసేది. దీంతో ఇక్కడ భారీగా చైనా ప్రజలు స్థిరపడ్డారు.

20వ శతాబ్దం మొదట్లో ఇక్కడ చైనా ప్రజల సంఖ్య 20,000కుపైగా పెరిగింది. అప్పట్లో చైనాలో అంతర్యుద్ధాన్ని తప్పించుకునేందుకు, జపాన్ సేనల చేతికి చిక్కకుండా ఉండేందుకు చాలామంది అక్కడి నుంచి వేరే ప్రాంతాలకు వలస వెళ్లిపోయేవారు. అలా ఇక్కడకు వచ్చిన వారు స్థానికులతో కలిసిపోయారు. ఇక్కడి వారిని పెళ్లి చేసుకుని, హిందీ, బెంగాలీ లాంటి భాషలను కూడా చక్కగా మాట్లాడేవారు.

‘‘చ్యూ’’కు చక్కెరతో ఉండే అనుబంధమే బెంగాలీతోపాటు చాలా భాషల్లో చైనా ప్రజలను ‘‘చీనీ’’ అని పిలవడానికి కారణమని లీ భావిస్తున్నారు. 1950లలో ఈ పదమే ఒక కొత్త నినాదానికీ బాటలు పరిచింది. అదే ‘‘హిందీ చీనీ భాయి భాయీ (భారతీయులు, చైనా ప్రజలు సోదరులు)’’. కోల్‌కతాలోని చైనాటౌన్‌ను ఇప్పటికీ చాలామంది ‘‘చీనాపారా’’ అని పిలుస్తుంటారు.

కోల్‌కతాలో చైనాటౌన్

ఫొటో సోర్స్, Charukesi Ramadurai

ఇప్పుడు ఏమైంది?

అయితే, నేడు కోల్‌కతాలో చైనా సంతతి ప్రజల సంఖ్య 2,000కు పడిపోయింది. అయితే, వారి సంస్కృతీ, సంప్రదాయాలు నేటికీ తీరెట్టా బజార్‌, తాంగ్రా ప్రాంతాలలో కొట్టొచ్చినట్లు కనిపిస్తాయి. వీధుల్లో ఆహార పదార్థాలను అమ్మే విక్రేతల నుంచి తావో దేవాలయాలు, కమ్యూనిటీ క్లబ్బులు, లూనార్ కొత్త సంవత్సర వేడుకల్లో లయన్ డ్యాన్సులు ఇలా చాలా చైనా సంప్రదాయాలను ఇక్కడ మనం చూడొచ్చు.

శాన్‌ఫ్రాన్సిస్కో, లండన్‌ లాంటి ప్రముఖ నగరాల్లో చైనాటౌన్‌ల గురించి చాలా చర్చ జరుగుతుంది. కానీ, కోల్‌కతాలోని చైనాటౌన్ గురించి చాలా మందికి పెద్దగా తెలియదు. అయితే, ఇక్కడ ఒకటి కాదు రెండు చైనాటౌన్‌లు ఉన్నాయి. తీరెట్టా బజార్ 1800ల నుంచీ ఇక్కడ ఉంది. మరోవైపు తాంగ్రా 1900లలో ఏర్పడింది.

అయితే, కాలుష్యకారక పరిశ్రమలను తీరెట్టా బజార్ నుంచి నగర శివార్లలోకి పంపించినప్పుడు, చాలా మంది చైనా సంతతి ప్రజలు కూడా అక్కడకు వెళ్లాల్సి వచ్చిందని కోల్‌కతాా బ్లాగర్ రంగన్ దత్తా చెప్పారు.

‘‘చైనా ప్రజలు మొదట బెంగాలీ టౌన్, యూరోపియన్ టౌన్ మధ్య ప్రాంతాల్లో జీవించేవారు. ఇతర విదేశీయులైన ఆర్మేనియన్లు, గ్రీకులు కూడా ఇక్కడే ఉండేవారు. అంతేకాదు వీరితోపాటు మార్వాడీలు, పార్సీలు కూడా కలిసి జీవించేవారు. వీరంతా వ్యాపారం చేయడానికే ఇక్కడకు వచ్చేవారు’’ అని ఆయన అన్నారు.

కోల్‌కతాలో చైనాటౌన్

ఫొటో సోర్స్, RS Stock Images/Getty Images

అందరితో కలిసి

ఆర్మేనియన్ చర్చిలు, పార్సీ దేవాలయాలు కూడా ఈ ప్రాంతంలో పక్కపక్కనే కనిపిస్తాయి. మరోవైపు చైనా సంతతికి చెందిన ప్రజలంతా కేవలం తీరెట్టా బజార్ ప్రాంతంలోనే లేరని చెఫ్ పీటర్ సెంగ్ చెప్పారు. కోల్‌కతా చైనీస్‌లో మూడో తరానికి చెందిన ఆయన తీరెట్టాకు వెలుపలే పెరిగారు. అయితే, తన బంధువులు అక్కడి నుంచి తన ఇంటికి రావడం ఇప్పటికీ ఆయనకు గుర్తుంది.

తీరెట్టా బజార్‌తోపాటు ఆ చుట్టు పక్కల ప్రాంతాలకు జీవం పోసేందుకు చేపట్టిన కమ్యూనిటీ ఆర్ట్ ప్రాజెక్టుకు కోల్‌కతాకు చెందిన స్వాతి మిశ్ర నేతృత్వం వహించారు. ఆమె మాట్లాడుతూ.. ‘‘ఇతర చైనాటౌన్‌ల తరహాలో తీరెట్టా బజార్ ఏమీ భారీ గోడలతో నాలుగువైపులా మూసివేసిన ప్రాంతం కాదు. ఇక్కడ మొదట్నుంచీ చైనా ప్రజలు ఇతర ప్రజలతో కలిసి జీవించేవారు. వారిలో కొంత మంది నాకంటే మెరుగ్గా బెంగాలీని మాట్లాడగలరు’’ అని ఆమె చెప్పారు. అయితే, ఆ తర్వాత కాలంలో ఏర్పడిన తాంగ్రా ప్రపంచంలోని ఇతర ప్రాంతాల్లోని చౌనాటౌన్‌లను పోలి ఉంటుంది.

ఇక్కడ స్థానికులతో చైనా ప్రజలు కలిసిపోవడంలో ఆహార పదార్థాలు ప్రధాన పాత్ర పోషించేవి. భారత్‌లో తొలి చైనా రెస్టారెంట్లు కోల్‌కతాలోని హక్కా ప్రజలే ఏర్పాటుచేశారు. ఆ తర్వాత కాలంలో చైనా-ఇండియన్ ఆహారం దేశంలోని భిన్న ప్రాంతాలకూ విస్తరించింది. నేటికీ ఆ ఆహార పదార్థాలు వీధుల నుంచి పెద్దపెద్ద రెస్టారెంట్ల వరకూ అన్నీచోట్లా మనకు కనిపిస్తుంటాయి.

కోల్‌కతాలో చైనాటౌన్

ఫొటో సోర్స్, Charukesi Ramadurai

చాలా మార్పులు..

సంప్రదాయ హక్కా ఆహారాన్ని ఇంట్లో తింటూ పెరిగిన సెంగ్.. భారతీయుల అభిరుచులకు తగినట్లుగా ఈ వంటకాల్లో చాలా మార్పులు చేశారని చెప్పారు. ‘‘పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, కొత్తమీర, గరం మసాలా.. ఇలా చాలా పదార్థాలను కొత్తగా కలపడం మొదలుపెట్టారు’’అని వివరించారు.

స్థానికంగా దొరికే మసాలా దినుసులు, సాస్‌లను కలపడంతో చిల్లీ చికెన్, గోబీ మంచూరియన్ లాంటి కొత్త రుచులు కూడా పుట్టుకొచ్చాయి. నిజానికి ఇవి చైనా ప్రధాన భూభాగంలోనూ కనిపించవు. పుదీనా చెట్నీ, బెంగాలీ మస్టర్డ్ సాస్ , చిల్లీ చికెన్ సాస్ లాంటి కొత్త భారతీయ సాస్‌లను కూడా ఇక్కడ తయారుచేయడాన్ని కూడా పో చాంగ్ మొదలుపెట్టింది. వీటిని చైనా సంతతి ప్రజలతోపాటు భారతీయులకు కూడా ఇష్టపడుతుంటారు.

తీరెట్టా బజార్‌లోని సన్-యాట్ సేన్ స్ట్రీట్‌లో ఆదివారం ఉదయం చైనీస్ బ్రేక్‌ఫాస్ట్‌ను చాలా మంది కోల్‌కతావాసులు చాలా ఇష్టపడుతుంటారు. ఇక్కడ తాత్కాలికంగా ఏర్పాటుచేసిన స్టాల్స్‌లో తాజా డంప్లింగ్స్, వొంటన్స్, నూడుల్స్ లాంటివి వేడివేడిగా దొరుకుతాయి. ఉదయం 5.30కే ఇక్కడ స్టాల్స్ సిద్ధంగా ఉంటాయి. పోర్క్ బన్స్, చికెన్ మోమోస్, ఫిష్‌బాల్ సూప్‌లు ఇలా అన్నీ సిద్ధంగా ఉంటాయి. చైనాలో ప్రసిద్ధిగాంచిన బీజింగ్ బార్ అండ్ రెస్టారెంట్, హా లూంగ్, కిమ్ లింగ్, గోల్డెన్ జాయ్ లాంటివి తాంగ్రాలో మనకు చాలా కనిపిస్తాయి.

‘‘కోల్‌కతాా చైనీస్ వంటకాలు ప్రపంచ వ్యాప్తంగా చాలా చోట్ల కనిపిస్తాయి. ఈ వంటకాలను న్యూయార్క్‌లోని ఒక రెస్టారెంట్ కూడా ప్రత్యేకంగా అందిస్తోంది’’ అని లీ చెప్పారు. తాంగ్రాలో లభించే ‘‘చైనీస్ ఇండియన్ స్టైల్’’ ఆహారం గురించి ఆమె చెబుతున్నారు.

కోల్‌కతాలో చైనాటౌన్

ఫొటో సోర్స్, Sudipta Das/Alamy

వేగంగా పడిపోతోంది..

భారత్‌లో శతాబ్దం నుంచీ ఉంటున్నప్పటికీ, నేడు కోల్‌కతాలో చైనా ప్రజల సంఖ్య వేగంగా తగ్గిపోతోంది. భవిష్యత్‌లో వీరు కనుమరుగయ్యే అవకాశం కూడా ఉందని వరల్డ్ మాన్యుమెంట్ ఫండ్ అంచనా వేస్తోంది. ఎందుకు ఇలా జరుగుతోందో లీ మాట్లాడుతూ.. ‘‘నగరం నడిబొడ్డున రియల్ ఎస్టేట్ విలువ భారీగా ఉండే తాము జీవించే ప్రాంతాల్లో భూముల దురాక్రమణ, భూములపై హక్కుల కోసం పోరాటాలు దీనికి కారణం’’ అని చెప్పారు.

1962 భారత్-చైనా యుద్ధం కూడా ఇక్కడి చైనా సంతతి ప్రజలపై చాలా ప్రభావం చూపింది. ఏళ్ల నుంచీ ఇక్కడే జీవిస్తున్నప్పటికీ చాలా మందిని ఇక్కడ స్థానికులు అనుమానంతో చూసేవారు. అంతేకాకుండా, ఎలాంటి ఆధారాలూ లేకుండానే అప్పట్లో రాజస్థాన్‌లో చైనా ప్రజలపై దాడులు, వారిని హింసించడం కూడా మరో కారణంగా చెప్పుకోవాలి. ఆ తర్వాత చాలా మంది అక్కడి నుంచి కోల్‌కతాలోని తమ సొంత ఇంటికి వచ్చేశారు. కొంతమంది విదేశాలకు కూడా వెళ్లిపోయారు.

మరోవైపు ప్రభుత్వ ఆదేశాలపై ఇక్కడి కాలుష్యకారక తోళ్ల పరిశ్రమలు, ఇతర కర్మాగారాలను మూసివేస్తున్నారు. దీంతో చైనా సంతతి ప్రజల ఉపాధిపై ప్రభావం పడింది. ఫలితంగా చాలా మంది ఆస్ట్రేలియా, అమెరికా, కెనడాలకు వెళ్లిపోయారు.

గత కొన్ని దశాబ్దాలుగా భారత-చైనీయులు ఇతర ప్రజలతో కలిసి మెరుగైన విద్యా, ఉపాధి అవకాశాల కోసం ప్రపంచంలోని భిన్న ప్రాంతాలకు తరలి వెళ్లడం మొదలైంది.

వీడియో క్యాప్షన్, మావో జెడాంగ్ మరణం తర్వాత చైనా ఎలా మారింది

తన చిన్నప్పటికి చైనా స్నేహితుల్లో చాలా మంది ఇప్పుడు టొరంటోలో జీవిస్తున్నారని దత్తా గుర్తుచేసుకున్నారు. వ్యాపారాలు బావుండేవారు మాత్రమే ఇప్పుడు కోల్‌కతాలో కనిపిస్తున్నారని, వారికి కూడా విదేశాలకు వెళ్లిపోదామని పిల్లల నుంచి ఒత్తిడి ఎదురవుతోందని సెంగ్ చెప్పారు.

తనకు ఇక్కడ ఎలాంటి కష్టాలు లేదా ఇబ్బందులు ఎదురుకాలేదని, తన జీవితాన్ని ఇక్కడే ప్రశాంతంగా గడపాలని భావిస్తున్నట్లు లీ చెబుతున్నారు. ‘‘మేం తక్కువ మందే ఉండొచ్చు. కానీ, ఇప్పటికీ మా సంప్రదాయాలను అనుసరిస్తున్నాం. చైనా కొత్త సంవత్సరం వేడుకలు లాంటివి ఇక్కడే అందరం కలిసి జరుపుకొంటున్నాం’’ అని ఆమె అన్నారు.

సెంగ్ ప్రస్తుతం చెన్నైలో పనిచేస్తున్నారు. చైనా కొత్త సంవత్సరంనాడు తప్పకుండా కోల్‌కతాలోని తన తల్లిదండ్రుల దగ్గరకు తను వెళ్తుంటారు. ‘‘మా కుటుంబాలు ఇక్కడ ఉన్నంతవరకూ మేం మా సంస్కృతీ, సంప్రదాయాలను వదిలిపెట్టం’’ అని సెంగ్ చెప్పారు.

ఇక్కడ సమాజంలో కలిసిపోవడం అనేది రెండు వైపులా జరిగింది. కొన్ని బెంగాలీ దుకాణాలు ఇక్కడ బోక్ చోయ్, కైలన్, మస్టర్డ్ గ్రీన్స్ లాంటి కూరగాయలను అమ్ముతున్నాయి. కొంతమంది బెంగాలీలు హక్కా కూడా మాట్లాడుతుంటారు. వీటితోపాటు భారత్ తమకు మాతృభూమని, తాము ఇక్కడి ప్రజల్లో భాగమని లీ లాంటి చైనీయులు చెబుతున్నారు.

‘‘నేను మిష్టిదోయి, రసగుల్లా లేకుండా ఉండలేను’’ అని బెంగాలీ స్వీట్ల గురించి నవ్వుతూ చెబుతూ లీ సెలవు తీసుకున్నారు.

వీడియో క్యాప్షన్, చైనాపై దుమ్ము దండయాత్ర

ఇవి కూడా చదవండి:

( బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)