చైనా ఇచ్చిన అప్పులే పాకిస్తాన్‌ను పేదరికంలోకి నెడుతున్నాయా?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, తన్వీర్ మలిక్
- హోదా, జర్నలిస్ట్
చైనా ఇటీవలే 700 మిలియన్ డాలర్ల( సుమారు రూ. 5794 కోట్లు)ను అప్పుగా పాకిస్తాన్‌కు ఇచ్చింది.
ఆర్థికసంక్షోభంలో కూరుకుపోయిన పాకిస్తాన్‌కు ఇది కాస్త ఊరట కలిగించే అంశమే. కానీ పాకిస్తాన్‌లో అప్పుల్లో చైనా వాటా విపరీతంగా పెరిగిపోతోంది.
గత ఎనిమిదే చైనా బ్యాంకుల నుంచి అప్పులు తీసుకోవడం పెరుగుతూ పోతోంది.
ఇలా విదేశాల నుంచి అప్పులు తీసుకొని, వాటిని తిరిగి చెల్లిస్తూ ఉండటం వల్ల పాకిస్తాన్ విదేశీ ద్రవ్య నిల్వలు వేగంగా తరిగి పోతున్నాయనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
ప్రస్తుత ఆర్థికసంక్షోభానికి కారణం విదేశీ అప్పులేననే వాదన కూడా ఉంది.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 8 బిలియన్ డాలర్ల(సుమారు రూ. 66214 కోట్లు ) అప్పును తీర్చాల్సి ఉంది. ఇక రాబోయే రెండేళ్లలో 50 బిలియన్ డాలర్ల ( సుమారు రూ. 414032 కోట్లు ) అప్పులను పాకిస్తాన్ చెల్లించాల్సి ఉంది.
పాకిస్తాన్-చైనా ఎకనామిక్ కారిడార్ వల్ల పాకిస్తాన్‌కు లభించే చైనా రుణాలు పెరిగాయని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. ఈ కారిడార్‌లో భాగంగా విద్యుత్, మౌలిక వసతుల నిర్మాణాలకు చైనా రుణాలు ఇస్తోంది. అలాగే చైనా బ్యాంకుల నుంచి కూడా పాకిస్తాన్‌కు రుణాలు అందుతున్నాయి.
ఇటీవల లభించిన 700 మిలియన్ డాలర్ల ( సుమారు రూ. 5794 కోట్లు) రుణం చైనా డెవలప్‌మెంట్ బ్యాంక్ ఇచ్చిందే. ఈ డబ్బుతో విదేశీ మారకద్రవ్య నిల్వలు పెరుగుతాయిని పాకిస్తాన్ భావిస్తోంది.
వాస్తవానికి అప్పులే పాకిస్తాన్ ఆర్థికవ్యవస్థకు గుదిబండగా మారుతున్నాయా?
పాకిస్తాన్ ప్రభుత్వాన్ని, ఆర్థికశాఖను బీబీసీ ఈ ప్రశ్న అడిగింది. కానీ వారి నుంచి ఎటువంటి స్పందనా రాలేదు.

ఫొటో సోర్స్, Getty Images
చైనాకు పాకిస్తాన్ ఎంత అప్పు ఉంది?
పాకిస్తాన్ అప్పులు ప్రస్తుతం సుమారు 97 బిలియన్ డాలర్ల( సుమారు రూ. 802883 కోట్లు)కు చేరాయి. పారిస్ క్లబ్, ఐఎంఎఫ్, వరల్డ్ బ్యాంక్, ఏసియన్ డెవలప్మెంట్ బ్యాంక్ వంటి సంస్థలతో పాటు విదేశీ ప్రభుత్వాలకు కూడా బాకీలున్నాయి.
2015లో పాకిస్తాన్ జీడీపీలో అప్పుల వాటా 24శాతంగా ఉంది. 2022లో ఇది 40శాతానికి చేరి ఉండొచ్చని భావిస్తున్నారు.
పాకిస్తాన్ అప్పుల మీద ఐఎంఎఫ్ విడుదల చేసిన నివేదిక ప్రకారం పాకిస్తాన్ అప్పుల్లో చైనా వాటా 30శాతం.
ఇప్పటి వరకు చైనా 23 బిలియన్ డాలర్ల (సుమారు రూ. 190374 కోట్లు )ను పాకిస్తాన్‌కు అప్పుగా ఇచ్చింది. చైనా బ్యాంకులు మరొక 7 బిలియన్ డాలర్లను ఇచ్చాయి.
చైనా కమర్షియల్ బ్యాంకులు ఇచ్చిన రుణాలను కూడా చైనా ఇచ్చిన అప్పులుగానే చూడాలని ఆర్థికవేత్త అమర్ హబీబ్ ఖాన్ అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
అప్పు ఎందుకు పెరుగుతోంది?
గత ఆర్థిక సంవత్సరంలో పాకిస్తాన్‌కు వచ్చిన రుణాల్లో అత్యధికం చైనా నుంచే వచ్చాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో చైనాకు వడ్డీతో సహా తిరిగి చెల్లించిన అప్పులు 500 మిలియన్ డాలర్లు( రూ.4,140 కోట్లు ).
ఇదే సమయంలో సౌదీ అరేబియా, జపాన్, కువైట్, ఫ్రాన్స్‌లకు చెల్లించిన లోన్ల విలువ తక్కువగా ఉంది. పాకిస్తాన్ ఎకనామిక్ అఫైర్స్ డివిజన్ గణాంకాలు చూస్తే ఈ విషయం అర్థమవుతోంది.
విదేశీ వాణిజ్య బ్యాంకులకు చెల్లించిన రుణాలు కూడా ఎక్కువగానే ఉన్నాయి. వీటిలో చైనా కమర్షియల్ బ్యాంకుల వాటానే అధికంగా ఉంది.
చైనా మూడు పద్ధతుల్లో రుణాలు ఇస్తుంది. ఒకటి... చైనా-పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్‌లో భాగంగా ప్రాజెక్టులకు ఇచ్చే రుణాలు. రెండు... చైనా వాణిజ్య బ్యాంకులు ఇచ్చే అప్పులు. మూడు... స్టేట్ బ్యాంక్ ఆఫ్ పాకిస్తాన్‌లో చైనా డిపాజిట్ చేయడం.
‘చైనా-పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ ప్రాజెక్టులకు రుణాలు ఇవ్వడం, స్టేట్ బ్యాంక్ ఆఫ్ పాకిస్తాన్‌లో డిపాజిట్‌లు చేయడం వల్ల చైనా అప్పులు పెరిగాయి. అందువల్ల పాకిస్తాన్ అప్పుల్లో చైనా వాటా 25శాతం నుంచి 30శాతానికి పెరిగాయి’ అని జేఎస్ రీసెర్చ్‌లో ఆర్థికవేత్తగా ఉన్న అమ్రీన్ సొరానీ అన్నారు.
చైనా-పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ కింద ప్రాజెక్టుల కోసం తీసుకున్న రుణాలను విదేశీ కరెన్సీలో పాకిస్తాన్ చెల్లించాల్సి ఉంటుంది. అలా చేయడం వల్ల పాకిస్తాన్ రూపాయి మీద ప్రభావం పడుతుందని సీటీబ్యాంక్‌లో పని చేసే యూసుఫ్ నజర్ తెలిపారు.
ప్రపంచబ్యాకు, ఐఎంఎఫ్, ఇతర దేశాలతో పోలిస్తే చైనా బ్యాంకుల నుంచి అధిక వడ్డీలకు పాకిస్తాన్ అప్పులు తీసుకుందని నజర్ వెల్లడించారు.

ఫొటో సోర్స్, Getty Images
చైనా ఏం చేయగలదు?
చైనా నుంచి పాకిస్తాన్ తీసుకున్న అప్పుల్లో చాలా వరకు రానున్న ఏడాది లేదా రెండున్నర ఏళ్లలో తీర్చాల్సి ఉంది.
విదేశీ మారక ద్రవ్య నిల్వలు తక్కువగా ఉన్నా పాకిస్తాన్ వంటి దేశాలకు అది చాలా పెద్ద సమస్య అని ఆర్థికవ్యవహారాల పాత్రికేయుడు షాబాజ్ రాణా అన్నారు. పారిస్ క్లబ్ ఇచ్చే రుణాలను తిరిగి చెల్లించే వ్యవధి 15-20 నుంచి 25-30ఏళ్ల వరకు ఉంటుందని ఆయన తెలిపారు.
అయితే చైనా అప్పులు తీర్చడంలో పాకిస్తాన్ పెద్దగా సమస్యలు ఎదుర్కోదని అమర్ హబీబ్ అన్నారు. ఆ రుణాల చెల్లింపు గడువును పొడిగించే అవకాశం ఉందని తెలిపారు.
పాకిస్తాన్‌ను ఈ ఆర్థికసంక్షోభం నుంచి బయటపడేసేందుకు చైనా తను ఇచ్చిన రుణాలను రోలోవర్ చేయాల్సిన అవసరం ఉందని అమర్ హబీబ్ అన్నారు. రుణాలను చెల్లించే గడువు ముగిసినప్పుడు రెండు పక్షాలు వాటిని రోలవర్ చేస్తాయని అన్నారు.
పాకిస్తాన్‌కు ఇచ్చిన అప్పులను రీస్ట్రక్చర్ చేయకుండా రోలోవర్ చేయాలని ఎకనామిస్ట్ అమ్రిన్ సొరానీ అన్నారు. రీస్ట్రక్చర్ చేసేటప్పుడు కొత్త నిబంధనలు పెడతారని, రోలోవర్‌లో అవి ఉండవని తెలిపారు.
ఇవి కూడా చదవండి:
- ఎండలు బాబోయి ఎండలు... ఫిబ్రవరిలో ఇలా ఉంటే ఇక ముందు ఎలా ఉంటుందో?
- అజయ్ పాల్ సింగ్ బంగా: 'హైదరాబాద్ పబ్లిక్ స్కూల్' విద్యార్ధి నుంచి ప్రపంచ బ్యాంకు వరకు...
- ఆంధ్రప్రదేశ్: వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఇప్పటి వరకూ ఏం జరిగింది?
- ఈపీఎస్: అధిక పెన్షన్ పొందాలంటే ఏం చేయాలి?
- ఆమె ఫొటోలు వాడుకుని ఆన్లైన్ మోసగాళ్లు కోట్లు వసూలు చేశారు
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














