ఆంధ్రప్రదేశ్: పరిమళ్ నత్వానీ, నిరంజన్ రెడ్డి... ఇలా వైసీపీ రాజ్యసభకు పంపించిన రాష్ట్రేతరుల వల్ల ఏపీకి ఏమైనా ప్రయోజనం కలిగిందా?

ఫొటో సోర్స్, Parimal Nathwani
- రచయిత, శంకర్ వడిశెట్టి
- హోదా, బీబీసీ కోసం
పరిమళ్ ధీరజ్ లాల్ నత్వానీ. ఆంధ్రప్రదేశ్ అధికార పార్టీకి చెందిన ఎంపీ.
రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీకి సన్నిహితుడైన పరిమళ్ నత్వానీ, 2020 జూన్ 22న ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభ సభ్యుడు అయ్యారు. ఆయనకు ఎంపీ టికెట్ కోసం అంతకు ముందు ముకేశ్ అంబానీ స్వయంగా తాడేపల్లికి వచ్చి, వైఎస్‌ఆర్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌తో భేటీ అయ్యారు.
రిలయన్స్ ఇండస్ట్రీస్‌లో కీలక స్థానంలో ఉన్న పరిమళ్ నత్వానీ ఎంపిక వల్ల, ఏపీకి చాలా ప్రయోజనాలుంటాయని నాడు ఆ పార్టీ తెలిపింది. రిలయన్స్ ఇండస్ట్రీస్‌లో కార్పొరేట్ అఫైర్స్ డైరెక్టర్‌గా ఉన్న ఆయన అనుభవం రాష్ట్రానికి మేలు చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
రాష్ట్రానికి సంబంధించిన అంశాలపై ప్రజల గొంతు వినిపించేందుకు రాజ్యసభ ఎంపీలను పంపించాల్సి ఉంటుంది. కానీ దేశంలోనే బడా కార్పొరేట్ కంపెనీ ప్రతినిధిని ఏమి ఆశించి ఎంపీ చేశారనేది అనే దానిపై వైఎస్సార్సీపీ ఇప్పటి వరకూ స్పష్టత నివ్వలేదు. సరికదా ఎంపీ గా వారి పనితీరు చూసినా మరింత ప్రశ్నార్థకంగా ఉంది.
మరో ఇద్దరు తెలంగాణ నేతలు కూడా ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. గతంలోనూ కొందరు స్థానికేతరులు ఆంధ్రా నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యారు. మరి వారి వల్ల రాష్ట్రానికి కలిగిన మేలు ఏమిటనే ప్రశ్న కూడా వినిపిస్తోంది.

ఫొటో సోర్స్, Parimal Nathwani/Facebook
మళ్లీ రాలేదు...
2020లో ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభలో నాలుగు సీట్లు ఖాళీ అయ్యాయి. అవన్నీ తన ఖాతాలో వేసుకునే బలం వైఎస్‌ఆర్‌సీపీకి ఉంది. దాంతో అధినేత ఎవరిని ఎంపిక చేస్తే వారికే రాజ్యసభలో అడుగుపెట్టే అవకాశం ఏర్పడింది.
అధికార పార్టీ అభ్యర్థులుగా నాడు మంత్రులుగా ఉన్న పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణలతో పాటు పార్టీ నాయకుడు ఆళ్ల అయోధ్య రామిరెడ్డిని ఎంపిక చేశారు. రామ్‌కీ గ్రూప్ వ్యవస్థాపకుడే అయోధ్య రామిరెడ్డి.
ఇక రాజ్యసభ సీటు కోసం ముకేశ్ అంబానీ స్వయంగా తాడేపల్లి వచ్చి సీఎం జగన్‌కి విన్నవించడంతో పరిమళ్ నత్వానీకి నాలుగో సీటును ఇచ్చారు.
వాస్తవానికి టీడీపీకి గెలిచే స్థాయిలో బలం లేకపోయినా ఆ ఎన్నికల్లో వర్ల రామయ్య నామినేషన్ వేశారు. దాంతో ఎన్నిక జరిగింది. నాలుగు స్థానాలను వైఎస్‌ఆర్‌సీపీ బలపరిచిన అభ్యర్థులు సునాయాసంగా గెలిచారు.
గతంలో రెండేళ్లు జార్ఖండ్ నుంచి రాజ్యసభ సభ్యునిగా పరిమళ్ నత్వానీ ఉన్నారు. అప్పట్లో తనను ఇండిపెండెంట్ సభ్యుడిగా ఆయన చెప్పుకున్నారు. కానీ ప్రస్తుతం వైఎస్సార్ కాంగ్రెస్ సభ్యుడిగానే ఆయన ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభలో ఉన్నారు.
ఆయన ఎంపీగా గెలిచి రాజ్యసభలో అడుగుపెట్టిన తర్వాత ఇప్పటి వరకూ మళ్లీ ఆంధ్రప్రదేశ్ ముఖం చూసిన దాఖలాలు లేవు. కేవలం సీటు కోసం ఓసారి, నామినేషన్ వేసేందుకు ఇంకోసారి, గెలిచిన తర్వాత ధ్రువపత్రం తీసుకుని జగన్‌కు కృతజ్ఞతలు చెప్పేందుకు మరొకసారి మాత్రమే ఆయన అమరావతికి వచ్చి వెళ్లారు.

ఫొటో సోర్స్, Parimal Nathwani/Facebook
రిలయన్స్ పెట్టుబడులు వచ్చాయా?
ఆంధ్రప్రదేశ్ లో పారిశ్రామికాభివృద్ధి మీద భిన్నమైన అభిప్రాయాలున్నాయి. రాష్ట్రంలో సంక్షేమం తప్ప అభివృద్ధిని పట్టించుకోవడం లేదని విపక్షాలు విమర్శిస్తూ ఉంటాయి. రెండేళ్లు కోవిడ్ సహా అనేక కారణాలతో పారిశ్రామిక సంస్థల ఏర్పాటు జాప్యం జరిగిందని, త్వరలోనే మళ్లీ పారిశ్రామికాభివృద్ధిని పట్టాలెక్కిస్తామని ప్రభుత్వం చెబుతోంది.
ఈ మధ్య కాలంలో రాష్ట్రానికి సంబంధించి సీఎం జగన్‌తో అనేక మంది పెట్టుబడిదారులు భేటీ అయ్యారు. జగన్ కూడా దిల్లీ, దావోస్ వెళ్లిన సందర్భాల్లో పెట్టుబడిదారులతో సమావేశాలు నిర్వహించారు. కొన్ని సంస్థలు పెట్టుబడులకు అంగీకరించాయి.
కానీ, రిలయన్స్ ద్వారా రాష్ట్రానికి ఈ కాలంలో అదనంగా పెట్టుబడులు వచ్చిన దాఖలాలు లేవు. కనీసం రిలయన్స్ ప్రతినిధులు రాజ్యసభ ఎన్నికల తర్వాత సీఎంని కలిసింది కూడా లేదు. కేజీ బేసిన్ సహా వివిధ ప్రాంతాల్లో ఉన్న రిలయన్స్ సంస్థల కార్యకలాపాల విస్తరణ ప్రతిపాదనలు గానీ, కొత్త సంస్థల ఏర్పాటు గురించి ప్రకటనలు లేవు.
ఆంధ్రప్రదేశ్‌లో రిలయన్స్ కార్యకలాపాలు విస్తరించేందుకు పరిమళ్ నత్వానీ వల్ల సాయం లభిస్తుందని చెప్పిన మాటలకు భిన్నమైన పరిస్థితి కనిపిస్తోంది.
పార్లమెంట్‌లో అయినా...
ఇక ఆయన పార్లమెంట్ సభ్యుడిగా వివిధ కేటగిరీలలో అనేక ప్రశ్నలు సంధించారు. ఆయన తన సహచర సభ్యులతో కలిసి లేదా ఒంటరిగా మొత్తం 273 ప్రశ్నలు వేసినట్టు రాజ్యసభ రికార్డులు చెబుతున్నాయి.
2023లో ఆయన 15 ప్రశ్నలు వేశారు. కానీ వాటిలో ఒక్కటి కూడా ఏపీకి సంబంధించినవి లేవు. పారిశ్రామిక, ఆర్థిక రంగాలకు సంబంధించిన అంశాలే ఎక్కువగా ఉన్నాయి.
ఇక ఆయన వేసిన మొత్తం ప్రశ్నల్లో 10 శాతం కూడా ఏపీకి సంబంధించిన అంశాలు లేకపోవడం విశేషం. ఏపీకి సంబంధించిన అంశాలను కూడా గుజరాత్‌తో ముడిపెట్టి ఆయన ప్రశ్నలు అడిగారు.
ఉదాహరణకు 2021లో ఆంధ్రప్రదేశ్, గుజరాత్‌కి కేటాయించిన నూతన రైళ్ల ప్రాజెక్టుల గురించి ఆయన ప్రశ్నించారు. 2022లో ఏపీ, గుజరాత్‌తో పాటుగా జార్ఖండ్‌లో జాతీయ రహదారుల అభివృద్ధి గురించి ప్రశ్నించారు.
రెండోసారి రాజ్యసభలో అడుగుపెట్టిన ఆయన ఈ మూడేళ్ల కాలంలో వేసిన మొత్తం ప్రశ్నల్లో పూర్తిగా ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించిన అంశాలు కేవలం 25 లోపు మాత్రమే ఉన్నాయి. దాంతో ఏపీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఆయన ఇక్కడి సమస్యలను పార్లమెంట్ ముందుకు తీసుకురావడంలో కూడా శ్రద్ధ చూపడం లేదనే అభిప్రాయం వినిపిస్తోంది.

ఫొటో సోర్స్, UGC
మరో ఇద్దరు స్థానికేతరులు
పరిమళ్ నత్వానీ తర్వాత రెండేళ్లకు ఆంధ్రప్రదేశ్ నుంచి మరో నాలుగు సీట్లు ఖాళీకాగా గత ఏడాది వాటిని వైస్‌ఆర్‌సీపీ కైవసం చేసుకుంది. ఆ నాలుగు సీట్లలో రెండు సీట్లను తెలంగాణ వ్యక్తులకు ఇచ్చారు. వారిలో బీసీ ఉద్యమ నేత ఆర్ కృష్ణయ్య ఒకరు కాగా మరొకరు గతంలో జగన్ కేసుల్లో వాదించిన తెలంగాణాకి చెందిన న్యాయవాది నిరంజన్ రెడ్డి ఉన్నారు.
ఈ కాలంలో ఆర్ కృష్ణయ్య రాజ్యసభలో 12 ప్రశ్నలు వేశారు. కానీ వాటిలో ఏపీకి సంబంధించిన అంశాలు నాలుగైదు మాత్రమే ఉన్నాయి. వివిధ సందర్భాల్లో కృష్ణయ్య రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. పార్టీ సమావేశాలకు హాజరవుతున్నారు.
ఆయనతో పాటు ఎంపీ అయిన ఎస్.నిరంజన్ రెడ్డి మాత్రం అందుకు భిన్నం. ఆయన వేసిన 38 ప్రశ్నల్లో ఒక్కటి కూడా రాష్ట్రానికి సంబంధించిన అంశం లేకపోవడం గమనార్హం. న్యాయ, చట్టపరమైన అంశాలకు ఆయన ప్రాధాన్యం ఇచ్చారు.
"ఆంధ్రప్రదేశ్ కి సంబంధించిన అనేక సమస్యలున్నప్పటికీ రాష్ట్రం నుంచి గెలిచిన వారు ప్రాధాన్యమిస్తున్న దాఖలాలు లేవు. పేరుకు రాష్ట్రం నుంచి ఎంపీలే గానీ రాష్ట్ర ప్రయోజనాల కన్నా ఇతర అంశాలే వారికి ముఖ్యం అన్నట్టుగా ఉంది. ఫెడరల్ వ్యవస్థలో రాష్ట్రాల హక్కుల సాధనకు రాజ్యసభ కీలకం. కానీ ప్రస్తుతం కార్పొరేట్లు, ఇతరులు వ్యక్తిగత ప్రయోజనాలు ఆశించి ఎంపీలవుతున్నారు. వారికి రాష్ట్రాల గురించి పట్టడం లేదని ఏపీకి చెందిన ఎంపీల అనుభవం చెబుతోంది" అంటూ రాజకీయ శాస్త్ర రిటైర్డ్ ప్రొఫెసర్ ఆర్ లక్ష్మణ్ అన్నారు.
"గెలిచిన తర్వాత అయినా ఏపీ ప్రయోజనాలు పట్టించుకోకపోవడం విచారకరం. ఇలాంటి పరిస్థితి రాష్ట్ర ప్రయోజనాలకు విఘాతం. అధికార పార్టీ దీని గురించి ఆలోచించాలి" అని ఆయన అన్నారు.

ఫొటో సోర్స్, Nirmala Sitharaman/Facebook
గతంలోనూ దాదాపుగా అంతే..
టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో కూడా ప్రస్తుత ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, ఆ తర్వాత మోదీ క్యాబినెట్ లో మంత్రిగా పనిచేసిన సురేష్ ప్రభు కూడా ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహించారు.
వీరు ఏకంగా ప్రభుత్వంలో భాగస్వాములు. కానీ, తాము ప్రాతినిధ్యం వహించిన రాష్ట్రం గురించి పట్టించుకోవడం లేదని విమర్శలు ఎదుర్కొన్నారు. తమను పెద్దల సభకు పంపించినందుకు ప్రతిఫలంగానైనా రాష్ట్ర ప్రయోజనాలు కాపాడేందుకు చొరవ చూపాలని అప్పట్లో పలువురు కోరినా ఖాతరు చేయలేదనే అపవాదు మూటగట్టుకున్నారు.
టీడీపీ, వైఎస్‌ఆర్‌సీపీ పాలనలో కూడా ఇతర రాష్ట్రాలకు చెందిన నాయకులకు రాజ్యసభ సభ్యత్వాలు కట్టబెట్టి పాలకపక్షాలు ఏం సాధించాయన్నది పక్కన పెడితే రాష్ట్రానికి సంబంధించినంత వరకూ న్యాయం జరగడం లేదనే అభిప్రాయం వినిపిస్తోంది.
‘కేంద్రం స్పందిస్తే ఉపయోగం’
విభజన చట్టం ప్రకారం రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు కాబోయే పెట్రో కెమికల్ కారిడార్‌లో పరిమళ్ నత్వాని ద్వారా పరిశ్రమలు ఏర్పాటుకు అవకాశం ఉంటుందని వైఎస్‌ఆర్‌సీపీ అంటోంది. పెట్రో కెమికల్ కారిడార్ ఏర్పాటు విషయంలో కేంద్రం స్పందించకపోవడం వల్ల ఆశించిన ఫలితం రాలేదని లోక్‌సభలో ఆ పార్టీ విప్, రాజమహేంద్రవరం ఎంపీ మార్గాని భరత్ అన్నారు.
"అంబానీ, అదాని వంటి పెద్ద సంస్థల ద్వారా రాష్ట్రానికి పెట్టుబడులు వచ్చే అవకాశం ఉంది. అందుకు పెట్రో కెమికల్స్ రంగం అనువైనది. కానీ కేంద్ర ప్రభుత్వం మాత్రం వయబులిటీ గ్యాప్ పేరుతో తాత్సారం చేస్తోంది. అందుకే ఆశించిన పెట్టుబడులు రాలేదు.
విభజన చట్టం మీద త్వరలోనే పార్లమెంట్‌లో ప్రైవేటు బిల్లు పెడుతున్నాం. చట్టంలో ఇచ్చిన హామీలన్నీ అమలు చేసేలా ఒత్తిడి తెస్తాం. పరిమళ్ నత్వాని కూడా మిగిలిన ఎంపీలతో పాటు రాష్ట్రానికి సంబంధించిన విషయాలపై సహకరిస్తున్నారు’ అంటూ భరత్ బీబీసీకి తెలిపారు.
తమ పార్టీ ఎంపీలంతా ఆంధ్రప్రదేశ్ ప్రత్యేకహోదా, పోలవరం సహా అన్ని సమస్యల పరిష్కారానికి కేంద్రం వద్ద పోరాడుతున్నామని ఆయన అన్నారు.
ఇవి కూడా చదవండి:
- నేతాజీపై జైలులో అకృత్యాలకు పాల్పడ్డ బ్రిటీష్ ఐజీని ఆ ముగ్గురు ఎలా చంపారంటే...
- ఎండలు బాబోయి ఎండలు... ఫిబ్రవరిలో ఇలా ఉంటే ఇక ముందు ఎలా ఉంటుందో?
- అజయ్ పాల్ సింగ్ బంగా: 'హైదరాబాద్ పబ్లిక్ స్కూల్' విద్యార్ధి నుంచి ప్రపంచ బ్యాంకు వరకు...
- హైదరాబాద్: కుక్కల దాడిలో బాలుడు చనిపోవడానికి అధికార యంత్రాంగం వైఫల్యమే కారణమా?
- ఈపీఎస్: అధిక పెన్షన్ పొందాలంటే ఏం చేయాలి?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














