సౌదీ అరేబియా: 'ముకాబ్' మహా నిర్మాణం ప్రపంచంలో మరో అద్భుతం కాబోతోందా?

 'ది ముకాబ్'

ఫొటో సోర్స్, PIF/SAUDI ARABIA

ఫొటో క్యాప్షన్, 'ది ముకాబ్'
    • రచయిత, ఆలమూరు సౌమ్య
    • హోదా, బీబీసీ ప్రతినిధి

తేలే పర్వతాలు, వేరే గ్రహానికి తీసుకెళ్లే శాటిలైట్లు, ఫ్లయింగ్ డ్రాగన్స్.. ఇది హాలీవుడ్ సినిమా కాదు, సౌదీ అరేబియా రాజధాని రియాద్‌లో రూపుదిద్దుకుంటున్న అత్యంత భారీ భవనం 'ది ముకాబ్'.

ఆకాశ హార్మ్యాాలు, జలపాతాలు, విందు, వినోదాలతో ఇది మరో ప్రపంచానికి తలుపులు తెరుస్తుంది అంటోంది సౌదీ ప్రభుత్వం.

సౌదీ రాజు మొహమ్మద్ బిన్ సల్మాన్ బిన్ అబ్దుల్ అజీజ్ ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన 'న్యూ మురబ్బా డెవెలప్మెంట్ కంపెనీ' (ఎన్ఎండీసీ).. రాజధాని రియాద్‌లో సరికొత్త నగరాన్ని నిర్మించేందుకు శ్రీకారం చుట్టింది.

సౌదీ విజన్ 2030కి అనుగుణంగా ఈ నగర నిర్మాణం జరుగుతుందని, 'ముకాబ్' సౌదీకి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా నిలుస్తుందని సౌదీ పబ్లిక్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ (పీఐఎఫ్) తెలిపింది.

ఈ అద్భుత కట్టడానికి సంబంధించిన ప్రచార వీడియోను సౌదీ ప్రభుత్వం గత శుక్రవారం విడుదల చేసింది.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 1
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

పోస్ట్ of X ముగిసింది, 1

ముకాబ్ ఎలా ఉంటుంది?

వినూత్నమైన సాంకేతికత, నైపుణ్యాల కలయికగా ముకాబ్‌ను ఒక ఐకానిక్ ల్యాండ్‌మార్క్‌గా తీర్చిదిద్దనున్నారు. ఈ భారీ నిర్మాణాన్ని 2030కల్లా పూర్తి చేసే ఆలోచనలో ఉన్నట్లు పీఐఎఫ్ తెలిపింది.

సౌదీ ప్రభుత్వం విడుదల చేసిన వీడియోలో బంగారు వర్ణంలో మెరిసిపోతున్న ముకాబ్ 400మీ ఎత్తు, 400మీ వెడల్పు, 400మీ పొడవుతో ప్రపంచంలోని అతి పెద్ద నిర్మాణాలలో ఒకటిగా నిలుస్తుందని చెబుతున్నారు.

ముకాబ్‌లో 20 ఎంపైర్ స్టేట్ బిల్డింగ్స్ పడతాయని చెబుతున్నారు. న్యూయార్క్‌లో ఉన్న ఎంపైర్ స్టేట్ బిల్డింగ్ ప్రపంచంలోని ఎత్తైన నిర్మాణాలలో ఒకటి. దీని పైకప్పు 380 మీటర్ల ఎత్తు ఉంటుంది. దానిపైన ఉన్న యాంటీనాతో కలిపి 443.2 ఎత్తు ఉంటుంది.

క్యూబ్ ఆకారంలో ఉన్న ముకాబ్ నిర్మాణం మక్కాలోని 'కాబా'ను పోలి ఉంది.

ఆధునిక నాజ్ది నిర్మాణ శైలి స్ఫూర్తితో ముకాబ్‌ను నిర్మించనున్నారు. సరికొత్త హోలోగ్రాఫిక్స్‌తో డిజిటల్, వర్చువల్ టెక్నాలజీ ద్వారా అపూర్వమైన అనుభూతిని అందించనున్నట్లు సౌదీ ప్రభుత్వం చెబుతోంది.

ముకాబ్

ఫొటో సోర్స్, PIF/SAUDI ARABIA

దీనిలో స్పైరల్ బేస్ పైన ఒక టవర్ ఉంటుందని, 20 లక్షల చ.మీ స్థలంలో నివాస భవనాలు, హోటల్స్, రెస్టారెంట్లు, షాపులు, వినోద సాధనాలతో సంస్కృతిక, పర్యటక ఆకర్షణగా నిలుస్తుందని అంటున్నారు.

రియాద్‌కు వాయువ్య దిశలో కింగ్ సాల్మన్, కింగ్ ఖలీద్ రోడ్ల కూడలిలో సుమారు 19 చదరపు కి.మీ విస్తీర్ణంలో ఈ నిర్మాణాన్ని చేపట్టనున్నారు.

వేలాదిమంది నివాసితులకు సకల సౌకర్యాలతో ఆరోగ్యకరమైన జీవితాన్ని అందించేందుకు ప్రణాళిక సిద్ధం చేసినట్టు పీఐఎఫ్ తెలిపింది.

ఇందులో ఒక మ్యూజియం, టెక్నాలజీ-డిజైన్ యూనివర్సిటీ, మల్టిపర్పస్ థియేటర్, 80 కంటే ఎక్కువ వినోద, సాంస్కృతిక వేదికలు ఉంటాయి.

అలాగే, 1,04,000 నివాస భవనాలు, 9,000 హోటెల్ గదులు, 9, 80,000 చదరపు మీటర్లలో రీటైల్ దుకాణాలు, 14 లక్షల చ.మీ ఆఫీస్ స్థలం, 6,20,000 చ.మీలలో విశ్రాంతి సౌకర్యాలు, 18 లక్షల చ.మీలలో కమ్యూనిటీ సౌకర్యాలు ఉంటాయి.

ఎయిర్‌పోర్ట్ నుంచి 20 నిమిషాల దూరంలో ఉన్న ఈ నగరంలో సొంత అంతర్గత రవాణా వ్యవస్థ ఉంటుంది.

ముకాబ్

ఫొటో సోర్స్, PIF/SAUDI ARABIA

ఎంత ఖర్చు?

ఎన్ఎండీసీ ప్రోజెక్ట్‌కు ఎంత ఖర్చు అవుతుంది, నిధులు ఎలా సమకూరుతాయన్న దానిపై పీఎఫ్ఐ కచ్చితమైన సమాచారం ఇవ్వలేదు.

కానీ, సౌదీ విజన్ 2030కి అనుగుణంగా ఈ ప్రాజెక్ట్ ఉంటుందని పేర్కొంది. ఇది సౌదీ ప్రభుత్వం చేపట్టిన వ్యూహాత్మక ప్రణాళిక. చమురుపై ఆధారపడడాన్ని తగ్గించి, ఆర్థిక వ్యవస్థలో వైవిధ్యాన్ని తీసుకురావడానికి, ఆరోగ్యం, విద్య, మౌలిక సదుపాయాలు, వినోదం, పర్యటక రంగాలను అభివృద్ధి పరిచేందుకు సౌదీ విజన్ 2030 ప్రణాళికను చేపట్టింది.

ఎన్ఎండీసీ ప్రాజెక్ట్ కూడా కీలక రంగాలలోని సామర్థ్యాలను వెలికితీసేందుకు దోహదపడుతుందని ఆ దేశ ప్రభుత్వం చెబుతోంది.

ప్రైవేట్ సెక్టర్, రియల్ ఎస్టేట్, స్థానిక మౌలిక సదుపాయాల అభివృద్ధికి దోహదపడే విధంగా, దేశానికి వైవిధ్యమైన ఆదాయ వనరులు సమకూర్చేందుకు సహాయపడుతుందని వెల్లడించింది.

ఇది చమురుయేతర ఆర్థిక వ్యవస్థకు సుమారు 50 బిలియన్ డాలర్లను జోడిస్తుందని, 2030 నాటికి 3,34,000 ప్రత్యక్ష, పరోక్ష ఉద్యోగాలను సృష్టిస్తుందని అంచనా వేస్తున్నట్టు పీఐఎఫ్ తెలిపింది.

ఈ ప్రాజెక్ట్ 2030లో పూర్తవుతుంది.

సౌదీ అరేబియా

ఫొటో సోర్స్, PIF/SAUDI ARABIA

సౌదీ భారీ నిర్మాణ కలలు సాకారం అవుతాయా?

ఇస్లాం మతానికి పుట్టినిల్లు అయిన సౌదీ అరేబియా ఇటీవల కాలంలో ఆధునీకరణ వైపు అడుగులు వేస్తోంది.

సౌదీ విజన్ 2030 కింద సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక రంగాల్లో పలు సంస్కరణలు చేపడుతోంది.

మహిళలు వాహనాలు డ్రైవ్ చేయడంపై నిషేధాన్ని ఎత్తివేయడం, బహిరంగ వినోద కార్యక్రమాలకు అనుమతి ఇవ్వడం మొదలైన సామాజిక మార్పులతో పాటు ఆర్థిక వ్యవస్థను చమురుయేతర ఆదాయ వనరుల వైపు మళ్లించే ప్రయత్నం చేస్తోంది.

దేశ ఆర్థికాభివృద్ధికి ఇప్పటికే అయిదు మెగా ప్రాజెక్టులను చేపట్టింది. నియోం స్మార్ట్ సిటీ, రెడ్ సీ ప్రాజెక్ట్, మిడిల్ ఈస్ట్ గ్రీన్ ఇనిషియేటివ్, సౌదా డెవెలప్మెంట్ కంపెనీ, సౌదీ మేడ్.. ఇవన్నీ నిర్మాణంలో ఉన్నాయి.

గత ఏడాది నవంబర్‌లో తాబేలు ఆకారంలో ఉండే, నీటి మీద తేలియాడే 'పాంజియోస్' నగరాన్ని నిర్మించేందుకు సిద్ధమైంది.

"పరిశ్రమలు, ఆవిష్కరణ, విద్య, సేవలు మొదలైన రంగాలలో నగరంలో నిజమైన అభివృద్ధి ప్రారంభమవుతోంది" అని సౌదీ ప్రిన్స్ 2022 అక్టోబర్‌లో జరిన ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్ ఇనిషియేటివ్ సదస్సులో అన్నారు.

అయితే, సౌదీ అరేబియా ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టులు చేపడుతోంది కానీ, అవన్నీ వాస్తవంలో కార్యరూపం దాలుస్తాయా అనే సందేహాలు వినిపిస్తున్నాయి.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 2
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

పోస్ట్ of X ముగిసింది, 2

"సౌదీ అరేబియా భారీ స్థాయిలో చేపడుతున్న ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టులు ఆ దేశం పట్ల ఉన్న సంప్రదాయ అభిప్రాయాలను ధిక్కరిస్తున్నాయి. ఆ ప్రాజెక్టులు అవివేకాన్ని సూచిస్తున్నాయా లేక అవి దూరదృష్టికి నిదర్శనమా? దేశం తప్పుదారి పట్టిందా, సరైన మార్గంలోనే ఉందా అనే సందేహాలు వినిపిస్తున్నాయి. జవాబు ఏదైనా సౌదీ ప్రాజెక్టులను విస్మరించడం అసాధ్యం" అని ప్రముఖ అంతర్జాతీయ ఆర్కిటెక్చరల్, డిజైన్ స్టూడియో 'ఓఎంఏ'లో భాగస్వామి రైనియర్ డే గ్రాఫ్ అరబ్ న్యూస్‌తో అన్నారు.

ముకాబ్ మక్కాలోని కాబా ఆకృతిలో ఉండడం పట్ల ముస్లిం సమాజంలో కొందరు అసహనాన్ని ప్రకటిస్తున్నారు. పవిత్రమైన కాబా నిర్మాణాన్ని పెట్టుబడిదారీ పనుల కోసం వాడుకుంటున్నారనే విమర్శలు వస్తున్నాయి.

దీనిపై అరబ్ న్యూస్‌ ఎడిటర్-ఇన్ చీఫ్ ఫైసల్ జె. అబ్బాస్ స్పందిస్తూ, "క్యూబ్ ఆకృతిలో మూసి ఉన్న భవనం ఇస్లాంకు ముప్పు కాదు. ఇస్లాంకు అతి పెద్ద ముప్పు తలుపులు మూసుకున్న ఆలోచనలు" అన్నారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 3
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

పోస్ట్ of X ముగిసింది, 3

"ఈ ప్రాజెక్టులు ఎంత అసంబద్ధంగా, ఎంత అతిశయంగా ఉన్నాయంటే, వాటి చుట్టూ ఉన్న ప్రపంచం ఎంత దయనీయ స్థితికి చేరుతుందో ఊహించలేకపోతున్నాను" అని అమ్నెస్టీ ఇంటర్నేషనల్‌లో గల్ఫ్ పరిశోధకురాలు దానా ఆహ్మద్ అన్నారు.

మరోపక్క, ముకాబ్ నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయని సౌదీ అధికారులు చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి: