ఏజ్ ఆఫ్ కన్సెంట్: సెక్స్‌కు సమ్మతి తెలపాలంటే కనీస వయసు ఎంత ఉండాలి?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, ఆర్కే
- హోదా, బీబీసీ ప్రతినిధి
సెక్స్‌కు సమ్మతి తెలిపే కనీస వయసు ఏది?
చాలా కాలంగా ఈ ప్రశ్న వినిపిస్తూనే ఉంది. కొన్ని దేశాల్లో అదొక వివాదంగానూ ఉంది.
‘మినిమం ఏజ్ ఆఫ్ సెక్సువల్ కన్సెంట్’ను తగ్గించాలంటూ భారత్‌లో కొందరు కోరుతుంటే పెంచాలంటూ మరికొన్ని దేశాల్లో డిమాండ్లు వినిపిస్తున్నాయి.
సెక్స్‌కు సమ్మతి తెలిపే కనీస వయసును పెంచాలంటూ ఇటీవలే జపాన్ నిర్ణయించడంతో ఆ అంశం మళ్లీ చర్చలోకి వచ్చింది. జపాన్‌లో ‘ఏజ్ ఆఫ్ కన్సెంట్’ ప్రస్తుతం 13ఏళ్లుగా ఉంది. దీన్ని 16ఏళ్లకు పెంచాలని ఆ దేశ న్యాయశాఖ ప్రతిపాదించింది.

‘ఏజ్ ఆఫ్ కన్సెంట్’ అంటే?
యూనిసెఫ్ ప్రకారం... సెక్స్‌లో పాల్గొనే విషయంలో పిల్లలు సొంతగా ఏ వయసులో నిర్ణయం తీసుకోగలరని భావిస్తారో ఆ వయసును ‘మినిమం ఏజ్ ఆఫ్ సెక్సువల్ కన్సెంట్’ అంటారు. అంటే ‘సెక్స్‌కు సమ్మతి తెలుపగల కనీస వయసు’ అని అర్ధం.
దీనినే ‘ఏజ్ ఆఫ్ కన్సెంట్’ అని కూడా పిలుస్తారు.
కనీస వయసు ఎందుకు?
లైంగిక వేధింపులు, లైంగిక దోపిడి వంటి వాటి నుంచి పిల్లలను కాపాడేందుకు ‘మినిమం ఏజ్ ఆఫ్ సెక్సువల్ కన్సెంట్’ను తీసుకొచ్చారు. సెక్స్‌లో పాల్గొనేలా కొందరు పెద్దలు పిల్లలను ప్రలోభ పెట్టడమో లేక ఆశ చూపడమో చేయొచ్చు.
అత్యంత చిన్న వయసులో సెక్స్‌లో పాల్గొనడం వల్ల ఆరోగ్యం మీద చెడు ప్రభావం పడొచ్చు. లైంగిక వ్యాధులు సోకడంతోపాటు అవాంఛిత గర్భాలు రావొచ్చు.
చిన్న వయసులో గర్భం దాల్చడం వల్ల బాలికలు చదువుకునే అవకాశాలను కోల్పోతారు. ఈ కారణాల వల్ల సెక్స్‌కు సమ్మతి తెలిపేందుకు ఒక కనీస వయసును నిర్ణయించారు.
వయసు ఎంత ఉండాలి?
సెక్స్‌లో పాల్గొనేందుకు సమ్మతి తెలిపే కనీస వయసు, ఒక్కో దేశంలో ఒక్కోలా ఉంటుంది. చాలా దేశాల్లో అది 14 నుంచి 16ఏళ్ల మధ్య ఉండగా జపాన్ వంటి దేశాల్లో 14ఏళ్ల కంటే తక్కువగాను భారత్ వంటి దేశాల్లో 16ఏళ్ల కంటే ఎక్కువగాను ఉంది.

ఫొటో సోర్స్, Getty Images
సెక్స్‌లో పాల్గొంటే ఏమవుతుంది?
‘ఏజ్ ఆఫ్ కన్సెంట్’ కంటే తక్కువ వయసు ఉన్న వారితో సెక్స్‌లో పాల్గొనడం ఆయా దేశాల చట్టాల ప్రకారం నేరం అవుతుంది.
లైంగిక హింస కింద దాన్ని పరిగణిస్తారు. కొన్ని దేశాల్లో రేప్‌గా చూస్తారు.
పెళ్లి చేసుకునే కనీస వయసు, ఏజ్ ఆఫ్ కన్సెంట్ ఒకటేనా?
చాలా దేశాల్లో సెక్స్‌లో పాల్గొనడానికి సమ్మతి తెలిపే కనీస వయసు, పెళ్లి చేసుకునే కనీస వయసు వేరువేరుగా ఉన్నాయి.
ఉదాహరణకు భారత్‌లో చట్టప్రకారం అమ్మాయిలకు 18ఏళ్లు, అబ్బాయిలకు 21ఏళ్లు నిండితేనే పెళ్లి చేయాలి. కానీ సెక్స్‌కు సమ్మతి తెలిపే వయసు మాత్రం 18ఏళ్లుగా ఉంది.
అమెరికాలోని చాలా రాష్ట్రాల్లో ‘ఏజ్ ఆఫ్ కన్సెంట్’ 16ఏళ్లుగా ఉండగా పెళ్లి చేసుకోవడానికి కనీస వయసు 18ఏళ్లుగా ఉంది.
‘క్లోజ్ ఇన్ ఏజ్’ మినహాయింపు అంటే?
కొన్ని కేసుల్లో ‘ఏజ్ ఆఫ్ కన్సెంట్’ కంటే తక్కువ వయసు ఉన్న వారితో సెక్స్‌లో పాల్గొన్నా నేరంగా చూడరు. అయితే సెక్స్‌లో పాల్గొన్న ఇద్దరి మధ్య వయసు అంతరం తక్కువగా ఉండాలి.
దీనినే ‘క్లోజ్ ఇన్ ఏజ్’ మినహాయింపు అంటారు. అమెరికా వంటి దేశాల్లో ఇది సుమారు మూడు సంవత్సరాలుగా ఉంది.
అమెరికాలో ‘ఏజ్ ఆఫ్ కన్సెంట్’ 16ఏళ్లుగా ఉంది. 15ఏళ్ల అమ్మాయితో 18ఏళ్ల అబ్బాయి సెక్స్‌లో పాల్గొంటే, అది వారిద్దరికీ పరస్పరం అంగీకారం అయితే దాన్ని నేరంగా పరిగణించరు.
అబార్షన్ చేయించుకోవచ్చా?
భారత్‌లో మైనర్ బాలికలు అబార్షన్ చేయించుకోవడానికి కోర్టులు వీలు కల్పిస్తున్నాయి.

ఫొటో సోర్స్, Getty Images
వివాదం ఎందుకు?
‘ఏజ్ ఆఫ్ కన్సెంట్’ అనేది చాలా కాలంగా వివాదంగా ఉంటూ వస్తోంది. ప్రస్తుతం భారత్‌లో సెక్స్‌కు సమ్మతి తెలిపే కనీస వయసు 18ఏళ్లుగా ఉంది. అయితే ఈ వయసును 16ఏళ్లకు తగ్గించాలనే డిమాండ్లు ఉన్నాయి.
గతంలో ‘ఏజ్ ఆఫ్ కన్సెంట్’ 16ఏళ్లుగా ఉండేది. పిల్లల మీద లైంగిక హింస పెరుగుతోందన్న కారణంతో దాన్ని 2012లో 18ఏళ్లకు పెంచారు.
నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే-5 ప్రకారం దేశంలో 39శాతానికి పైగా మహిళలు 18ఏళ్ల కంటే ముందే సెక్స్‌లో పాల్గొన్నారు. 15ఏళ్లు రాకముందే సెక్స్‌లో పాల్గొన్నట్లు 25-49ఏళ్ల మధ్య ఉన్న వారిలో 10శాతం మంది తెలిపారు.
దేశంలో 18ఏళ్ల లోపే సెక్స్‌లో పాల్గొనే వారి సంఖ్య ఎక్కువగానే ఉందని, అందువల్ల ‘ఏజ్ ఆఫ్ కన్సెంట్’ను 16ఏళ్లకు తగ్గించాలని కొందరు కోరుతున్నారు.
ఇందుకు మరొక కారణం కూడా ఉంది. పరస్పరం అంగీకారంతో టీనేజీ పిల్లలు సెక్స్‌లో పాల్గొన్నప్పటికీ ఒక్కోసారి వారి మీద రేప్ కేసులు పెడుతున్నారు.
అబ్బాయి కులం లేదా మతం వేరుగా ఉన్నప్పుడు, తల్లిదండ్రులకు నచ్చనప్పుడు పోక్సో (POCSO-Protection of Children from Sexual Offences Act, 2012) కింద తప్పుడు కేసులు పెడుతున్నారు.
2016-20 మధ్య పశ్చిమబెంగాల్, అస్సాం, మహారాష్ట్రలలో 7,064 పోస్కో కేసుల్లో అమ్మాయిల వయసు 16 నుంచి 18ఏళ్ల మధ్య ఉన్నట్లు ఎన్‌ఫోల్డ్ ప్రోయాక్టివ్ హెల్త్ ట్రస్ట్ పరిశోధన చెబుతోంది.
వీటిలో 1,715 కేసుల్లో అమ్మాయిలు, అబ్బాయిలు ఇష్టపూర్వకంగానే సెక్స్‌లో పాల్గొన్నట్లు ఆ రిపోర్ట్ తెలిపింది. ఇంటి నుంచి ‘పారిపోయిన’ కేసులు, గర్భం దాల్చిన కేసుల్లో ఇలా రేప్ కేసులు పెడుతున్నారని వెల్లడించింది.
గతంలో సుప్రీం కోర్టు కూడా ‘ఏజ్ ఆఫ్ కన్సెంట్’ను తగ్గించే విషయాన్ని పరిశీలించాలని పార్లమెంట్‌కు సూచించింది. అయితే అలాంటి ప్రతిపాదనలు ఏవీ లేవని 2022 డిసెంబరులో ప్రభుత్వం రాజ్యసభకు తెలిపింది.

ఫొటో సోర్స్, AFP
జపాన్‌లో ఎందుకు పెంచాలనుకుంటున్నారు?
జపాన్‌లో చాలా కాలంగా ‘ఏజ్ ఆఫ్ కన్సెంట్’ 13 ఏళ్లుగా ఉంది. అయితే ఈ వయసు వారికి సంబంధించి ఇటీవల కాలంలో రేప్ కేసులు ఎక్కువగా నమోదు అవుతుండటం మీద అక్కడ ఆందోళనలు పెరుగుతున్నాయి.
చాలా రేప్ కేసుల్లో ‘ఏజ్ ఆఫ్ కన్సెంట్’ కింద నిందితులు నిర్దోషులుగా విడుదలవుతున్నారనే ఆరోపణలున్నాయి. 2019లో తన టీనేజీ కూతురితో సెక్స్‌లో పాల్గొన్న ఒక తండ్రిని కోర్టు నిర్దోషిగా విడుదల చేసింది. ఆ అమ్మాయికి ఇష్టం లేకుండానే అతను సెక్స్‌లో పాల్గొన్నాడని కోర్టు కూడా అంగీకరించింది. కానీ శిక్ష మాత్రం విధించలేదు. ఆ తరువాత పోలీసులు మళ్లీ అప్పీలు చేయడంతో అతనికి శిక్ష విధించారు.
ఈ కేసు జపాన్ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఆ నేపథ్యంలో ‘ఏజ్ ఆఫ్ కన్సెంట్’ను 13ఏళ్ల నుంచి 16ఏళ్లకు పెంచాలని ప్రతిపాదించారు.

ఫొటో సోర్స్, Getty Images
ప్రపంచవ్యాప్తంగా ఇలా...
అమెరికా: ఇక్కడ సెక్స్‌కు సమ్మతి తెలిపే కనీస వయసు 16 నుంచి 18ఏళ్ల మధ్య ఉంది. అమెరికాలోని ఆయా రాష్ట్రాల ఆధారంగా ఇది మారుతూ ఉంటుంది.
కొన్ని రాష్ట్రాల్లో ‘రోమియో అండ్ జూలియట్’ చట్టాలుగా పిలిచే ‘క్లోజ్ ఇన్ ఏజ్’ మినహాయింపులున్నాయి. అంటే ‘ఏజ్ ఆఫ్ కన్సెంట్’ కంటే తక్కువ వయసు ఉన్న వారు పరస్పర అంగీకారంతో సెక్స్‌లో పాల్గొన్నా నేరంగా చూడరు. కాకపోతే వారి మధ్య వయసు అంతరం ఎక్కువ ఉండకూడదు.
కెనడా: ఇక్కడ ‘ఏజ్ ఆఫ్ కన్సెంట్’ 16ఏళ్లు. 14 లేదా 15ఏళ్ల వయసు ఉన్నవారు తమ కంటే పెద్ద వాళ్లతో సెక్స్‌లో పాల్గొన్నా నేరంగా పరిగణించరు. కాకపోతే ఏజ్ గ్యాప్ 5ఏళ్లకు మించకూడదు.
12-13ఏళ్ల వారు కూడా సెక్స్‌కు సమ్మతి తెలపొచ్చు. కాకపోతే వారి పార్టనర్ రెండేళ్ల కంటే పెద్ద ఉండకూడదు.
యూరప్: ఇక్కడ 14 నుంచి 18ఏళ్ల మధ్య ఉంది. బ్రిటన్, రష్యా, నెదర్లాండ్స్, నార్వే, ఫిన్లాండ్, బెల్జియం వంటి దేశాల్లో 16ఏళ్లుగా కాగా జర్మనీ, ఆస్ట్రియా, హంగేరీ, ఇటలీ, పోర్చుగల్ వంటి దేశాల్లో 14ఏళ్లుగా ఉంది.
తుర్కియేలో ‘ఏజ్ ఆఫ్ కన్సెంట్’ 18ఏళ్లుగా ఉంది.
ఆస్ట్రేలియా: ‘ఏజ్ ఆఫ్ కన్సెంట్’ 16 నుంచి 17ఏళ్లు. న్యూజీలాండ్‌లో 16ఏళ్లుగా ఉంది.
ఆసియా: భారత్‌లో 18ఏళ్లుగా ఉండగా చైనాలో 14ఏళ్లుగా ఉంది. దక్షిణకొరియా, ఫిలిప్పిన్స్, హాంకాంగ్‌లలో 16ఏళ్లుగా ఉంది.
మిడిల్ ఈస్ట్: ఇక్కడ ఉన్నవి చాలా వరకు ఇస్లామిక్ దేశాలు. చట్టప్రకారం పెళ్లి అయిన వారి మధ్యనే లైంగిక సంబంధాలు ఉండాలి. పెళ్లి కాకుండా సెక్స్‌లో పాల్గొనడం నేరం. అఫ్గానిస్తాన్, ఇరాన్, కువైట్, సౌదీ అరేబియా, యూఏఈ వంటి దేశాలు ఈ జాబితాలో ఉన్నాయి.
ఆఫ్రికా: దేశాల్లో ఏజ్ ఆఫ్ కన్సెంట్ 14 నుంచి 18ఏళ్ల మధ్య ఉంది. అయితే లిబియా, సుడాన్ వంటి దేశాల్లో పెళ్లి తరువాతనే సెక్స్‌ను అనుమతిస్తున్నారు.
ఇవి కూడా చదవండి:
- జో బైడెన్: ఫోన్లు కూడా లేకుండా 10 గంటల పాటు రైలులో రహస్య ప్రయాణం.. ఇంత సీక్రెట్‌గా ఎలా ఉంచారు?
- ఉమన్ బాడీ బిల్డర్: కష్టాల కడలిలో ఈదుతూ కండలు తీర్చిదిద్దుకున్న మహిళ
- యుక్రెయిన్ యుద్ధం వల్ల తిరిగొచ్చిన మెడిసిన్ విద్యార్థుల పరిస్థితి ఎలా ఉంది? కేసీఆర్ ఇచ్చిన హామీలు ఎందుకు నెరవేరడం లేదు?
- నాగ సాధువులు ఔరంగజేబు సైన్యంతో పోరాడినప్పుడు ఏం జరిగింది?
- రవీంద్ర జడేజా: టెస్టు క్రికెట్లో సూపర్ ఆల్‌రౌండర్‌గా అవతరిస్తున్నాడా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














