ఎస్కే యూనివర్సిటీ: విద్యార్ధులు, ఉద్యోగుల సంక్షేమానికి హోమం, చందా కోసం రిజిస్ట్రార్ సర్క్యులర్ జారీ చేయడంపై విమర్శలు

ఫొటో సోర్స్, UGC
- రచయిత, తులసీప్రసాద్ రెడ్డి నంగా
- హోదా, బీబీసీ కోసం
విద్యార్థులు, ఉద్యోగుల సంక్షేమం కోసం మృత్యుంజయ హోమానికి సన్నాహాలు చేయడం, దానికి ఖర్చుల కోసం టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్ డబ్బులు ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తూ అనంతపురం జిల్లాలోని శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీలో ఏకంగా ఒక సర్కులర్ జారీ చేయడం కలకలం రేపుతోంది.
వర్సిటీ వైస్ చాన్సలర్ సూచనల మేరకు ఈ విజ్ఞప్తి చేస్తున్నట్లు చెబుతూ యూనివర్సిటీ రిజిస్ట్రార్ జారీ చేసిన ఈ సర్కులర్‌లో ఏముందంటే....
“ఎస్కే యూనివర్సిటీలోని విద్యార్థులు, ఉద్యోగులపై భగవంతుడి కృప ఉండేలా..వైస్ చాన్సలర్ ఉత్తర్వుల ప్రకారం ఈ నెల ( ఫిబ్రవరి) 24న ఉదయం 8.30కు ఎస్కే యూనివర్సిటీ క్రీడా వేదిక దగ్గర శ్రీ ధన్వంతరి మహా మృత్యుంజయ శాంతి హోమం నిర్వహిస్తున్నాం. ఈ హోమంలో ఉద్యోగులందరూ స్వచ్ఛందంగా పాల్గొనాలని అభ్యర్థిస్తున్నాం. బోధనా సిబ్బంది రూ.500, బోధనేతర సిబ్బంది రూ.100 హోమం ఖర్చులుల కోసం ఇవ్వగలరు. టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్ దీనికంటే ఎక్కువ మొత్తం కూడా ఇవ్వవచ్చు. ఈ మొత్తాన్ని మేనేజ్‌మెంట్ విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్, డాక్టర్ సి.హెచ్. కృష్ణుడుకి గానీ, నాన్ టీచింగ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ సెక్రటరీ శాంత లింగంకు గానీ ఈ నెల 20 లోపు ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నాం” అని చెప్పారు.
మరోవైపు ఈ విషయం బయటికి రావడంతో కలకలం రేగింది. యూనివర్సిటీలు ఉన్నది విద్యార్థులకు చదువు చెప్పడానికా, హోమాలు చేయడానికా అని పలు విద్యార్థి సంఘాలు ప్రశ్నిస్తున్నారు.

ఫొటో సోర్స్, UGC
ఎస్కేయూలో ఇటీవల కాలంలో దాదాపు 25 మంది వివిధ కారణాలతో చనిపోయారని, అందుకే వర్సిటీ మృత్యుంజయ హోమం నిర్వహించాలని నిర్ణయించిందని, ఖర్చుల కోసం డబ్బులు చెల్లించాలని సర్కులర్ జారీ చేసిందని అనంతపురం ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు కుల్లాయిస్వామి బీబీసీకి చెప్పారు.
యూనివర్సిటీలు ఇలా హోమాలు నిర్వహించడం సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు.
‘‘500, 100 రూపాయలు చెల్లించాలని రిజిస్ట్రార్ ఈ సర్కులర్ జారీ చేశారు. విశ్వవిద్యాలయం కులాలకు మతాలకు అతీతంగా ఉండాల్సింది పోయి ఇలా చేయడం సరైనది కాదు. విశ్వవిద్యాలయంలో ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించకూడదు. విద్యా బుద్ధులు నేర్పించాల్సినచోట ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ విద్యార్థులను ఎటు వైపు తీసుకెళ్తున్నట్లు? ఎంతో చరిత్ర కలిగిన శ్రీకృషదేవరాయ విశ్వవిద్యాలయం ఇప్పటికే విద్యార్థులు లేక మూసివేయాల్సిన పరిస్థితి వచ్చింది. హోమాలు లాంటివి కాకుండా, యూనివర్సిటీకి విద్యార్థులను ఎలా తీసుకురావాలో ఆలోచిస్తే బాగుంటుంది” అని ఆయన అన్నారు.
యూనివర్సిటీలో హోమం చేస్తామంటూ వచ్చిన ఈ సర్కులర్‌పై పలువురు హేతువాదులు కూడా స్పందించారు. హైదరాబాద్‌కు చెందిన హ్యూమనిస్ట్ బాబు గోగినేని సోషల్ మీడియాలో దీనిపై స్పందించారు.
‘‘తమ యూనివర్సిటీలో ఉద్యోగుల అకాల మరణాలు ఆపడానికి జియాలజీలో పీహెచ్‌డీ చేసిన ఉప కులపతీ, ఎలక్ట్రానిక్స్‌లో పీహెచ్‌డీ చేసిన రిజిస్ట్రార్‌తో కలిసి ఇచ్చిన సర్కులర్ చూశారా’’ అంటూ ఒక పత్రికలో వచ్చిన వార్తను పోస్ట్ చేశారు. దీనిపై ఆయన బీబీసీతో మాట్లాడారు.
‘‘భారత దేశ రాజ్యాంగం వైజ్ఞానిక స్పూర్తిని, సమాజ సంస్కరణను, మానవవాదాన్ని పెంపొందించడానికి కృషి చేయడం పౌరుల ప్రాథమిక కర్తవ్యమని చెబుతున్నది. ఈ విషయాన్ని కోర్టులు కూడా నిర్ధారించాయి. క్షుద్ర పూజలు, తాంత్రిక క్రతువుల కారణంగా ప్రజలు నష్టపోతున్నారని ప్రజలలో చైతన్యం తీసుకు రావడానికి పోలీసు శాఖకు కళా జాతాలను గ్రామాలకు తీసుకువెళ్ళి కార్యక్రమాలు చేయడానికి ప్రత్యెక బడ్జెట్ కేటాయింపులు కూడా ఉంటాయి. మన దేశంలో మహారాష్ట్ర మర కొన్ని రాష్ట్రాలలో మూఢ నమ్మకాల నిర్మూలనకు, వాటిని వ్యాప్తి చేసేవారిపై క్రిమినల్ చర్యలు తీసుకునే చట్టాలు కూడా ఉన్నాయి. ఉద్యోగులు అనారోగ్యంతో ఉంటే డాక్టర్లను పిలుస్తారా, పూజారులను, గణాచారులనూ పిలుస్తారా’’అని ఆయన ప్రశ్నించారు.
యూనివర్శిటీ వీసీని, రిజిస్టార్ ని తొలగించాలని బాబు గోగినేని అన్నారు.

ఫొటో సోర్స్, UGC
ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే యూనివర్సిటీ వీసీని రీకాల్ చేయాలని, రిజిస్టార్‌ని ఆ పదవినుంచీ తొలగించాలని ఎస్కే యూనివర్సిటీ రిటైర్డ్ ప్రొఫెసర్ రాచర్ల శివప్రసాద్ అభిప్రాయపడ్డారు. హోమం నిర్వహణ సర్క్యులర్ ఘటనపై ఆయన బీబీసీతో మాట్లాడారు.
‘‘ఇదంతా సనాతన ధర్మానికి సంబంధించింది. యూనివర్శిటీ సెక్యులర్‌గా ఉంటుంది. వీసీ ఆదేశాలతో రిజిస్ట్రార్ సర్కులర్ జారీ చేయడం తప్పు. ఇలాంటివి ఏబీవీపీ లాంటి విద్యార్థి సంఘాలు చేసుకుంటే తప్పులేదు గానీ, ఏకంగా యూనివర్శిటీ సర్కులర్ జారీ చేయడం తప్పు. అందరితో డబ్బులు వసూలు చేయడంలాంటివి చేయకూడదు. అదే డయాస్ ఉపయోగించి రేపు వరే మతాలకు చెందిన వీసీలు వస్తే, వారు వాళ్ల మతాల ప్రార్థనలు చేయించవచ్చు. అలా అయితే యూనివర్శిటీ ఏమవుతుంది? నేను ఆర్ఎస్ఎస్‌లో ఉన్నాను. సనాతన ధర్మాన్ని విశ్వసిస్తాను. కానీ ఈ డయాస్‌పై ఇలాంటి కార్యక్రమాలను అంగీకరించను’’ అన్నారు.

ఫొటో సోర్స్, UGC
ఈ హోమం నిర్వహణపై వివాదం రేగడంతో యూనివర్సిటీ వీసీ స్పందించారు. యూనివర్సిటీ నిధులలో ఒక్క రూపాయి కూడా ఇందుకోసం వాడటం లేదని మీడియా అడిగిన ప్రశ్నలకు సమాధానంగా వీసీ రామకృష్ణా రెడ్డి చెప్పారు.
“నెల రోజుల్లోనే అయిదుగురు చనిపోయారు. ఒక రోజు గ్యాప్ లోనే ఇద్దరు చనిపోయారు. వరుసగా చనిపోతున్నారు. దీనికి రెమిడీ ఏమైనా ఉందా అని అడిగితే మృత్యుంజయ హోమం చేయాలి అన్నారు. దాంతో ఉద్యోగులను కాపాడుకోవడానికి ఏదో ఒకటి చేయాలి, భవిష్యత్తులో ఇంకెవరు చనిపోకూడదని ఈ కార్యక్రమం మొదలుపెట్టాం. దీనికి యూనివర్సిటీ నుంచి ఒక రూపాయి కూడా డబ్బులు వాడటం లేదు. వాళ్లకు ఫలితం దక్కాలంటే వాళ్ల కాంట్రిబ్యూషన్ అంతో ఇంతో ఉండాలి. కాబట్టి వాలంటరీగా టీచింగ్ వాళ్లు కొంత, నాన్ టీచింగ్ వాళ్లు కొంత అమౌంట్ ఇవ్వదల్చుకుంటే ఇవ్వచ్చు, ఇవ్వకపోయినా ఫర్వాలేదు అని చెప్పాం” అన్నారు.
ఏ రాజకీయ పార్టీల తరఫునా తాము ఇది జరపడం లేదని, ఉద్యోగుల సంక్షేమం కోసమే చేస్తున్నామని మీడియా అడిగిన ఒక ప్రశ్నకు సమాధానంగా వీసీ వెల్లడించారు.
“మేము బయటివారిని, బయటి ఉపాధ్యాయులను ఎవర్నీ పిలవడం లేదు. మా స్టాఫ్, మా ఉద్యోగులం మాత్రమే చేస్తున్నాం. వాలంటరీగా ఎవరు వచ్చినా మాకు అభ్యంతరం లేదు. ఎన్నికలకి మాకు ఎలాంటి సంబంధం లేదు. మేం ఏ పార్టీ తరఫున దీన్ని నిర్వహించడం లేదు. మా ఉద్యోగుల సంక్షేమం కోసం చేస్తున్నాం. ఈ సర్క్యులర్ మా ఎంప్లాయిస్‌కు మాత్రమే ఇచ్చాము. మా యూనివర్సిటీ కోసమే చేస్తున్నాము. దీనివల్ల మరణాలు ఆగుతాయి అన్నారు కాబట్టి చేస్తున్నాము. కచ్చితంగా ఆగుతాయని నేను చెప్పలేను” అన్నారు.

ఫొటో సోర్స్, UGC
ఉన్నత చదువులు చదివి విశ్వవిద్యాలయంలో ఆచార్యులుగా పనిచేస్తూ మూఢనమ్మకాలు, మూఢ విశ్వాసాలతో మరణాలను ఆపాలంటూ మృత్యుంజయ హోమమం నిర్వహించడానికి నిర్ణయించడం సిగ్గుచేటని ఏఐఎస్ఎఫ్ విమర్శించింది.
ఈ నిర్ణయాన్ని నిరసిస్తూ యూనివర్శిటీ గేటు ముందు ధర్నాకు దిగిన ఏఐఎస్ఎఫ్ కార్యకర్తలు వీసీని కలిసి వాగ్యువాదానికి దిగారు. హోమం నిర్వహిస్తే దాన్ని అడ్డుకుంటామని ఏఐఎస్ఎఫ్ నేత కుల్లాయి స్వామి హెచ్చరించారు.
“రాజ్యాంగంలోని ఆర్టికల్ 28 ప్రకారం ప్రభుత్వ విద్యా సంస్థలలో మతపరమైన ఎలాంటి కార్యక్రమాలనూ నిర్వహించకూడదు. ఈరోజు మృత్యుంజయ హోమం నిర్వహిస్తారు. రేపు పొద్దున క్షుద్ర పూజలు చేస్తారు. మూడవిశ్వాసాల, మూఢనమ్మకాల పేరిట ఇలాంటి హోమాలు పూజలు చేస్తూ ఉంటే చూస్తూ ఉండం. వైస్ ఛాన్సలర్ ఆదేశాలతో జారీచేసిన ఉత్తర్వులను రిజిస్ట్రార్ తక్షణం వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. లేదంటే ఈ కార్యక్రమాన్ని అడ్డుకుని తీరుతాం” అన్నారు.
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)















