అదానీ గ్రూప్‌, సెబీ చీఫ్‌లపై తీవ్ర ఆరోపణలు చేసిన హిండెన్‌బర్గ్ కథ ఏంటి, దాని వెనుక ఉన్న అండర్సన్ ఎవరు?

నేట్ అండర్సన్

ఫొటో సోర్స్, THE WASHINGTON POST/GETTY

ఫొటో క్యాప్షన్, నేట్ అండర్సన్

గత ఏడాది (2023) అదానీ గ్రూపు కంపెనీలపై తీవ్ర ఆరోపణలు చేస్తూ నివేదికను విడుదల చేసిన హిండెన్‌బర్గ్ రీసర్చ్ సంస్థ, తాజాగా 2024 ఆగస్టు 10న భారత స్టాక్ మార్కెట్ నియంత్రణ సంస్థ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) చైర్‌పర్సన్ మాధవి పూరి బుచ్‌పై ఆరోపణలు చేసింది.

‘‘అదానీ గ్రూప్ ఆర్థిక అవకతవకలతో సంబంధం ఉన్న ఆఫ్‌షోర్ కంపెనీలలో సెబీ చైర్‌పర్సన్ మాధవి పూరికి, ఆమె భర్తకు వాటాలు ఉన్నాయి’’ అని విజిల్‌బ్లోయర్ పత్రాలు చెబుతున్నాయంటూ హిండెన్‌బర్గ్ రిసర్చ్ సంస్థ శనివారం విడుదల చేసిన రిపోర్టులో తెలిపింది.

అయితే, హిండెన్‌బర్గ్‌ చేసిన ఆరోపణలను ఖండిస్తూ సెబీ చైర్‌పర్సన్ మాధవి, ఆమె భర్త ధావల్ బుచ్ సంయుక్త ప్రకటన విడుదల చేశారని రాయిటర్స్ వార్తా సంస్థ తెలిపింది.

‘ఈ ఆరోపణల్లో వాస్తవం లేదు. మా జీవితాలు, మా ఆర్థిక ఖాతాలు తెరిచిన పుస్తకం లాంటివి’’ అని వారు ఆ ప్రకటనలో పేర్కొన్నారు.

వాట్సాప్ చానల్
గౌతమ్ అదానీ, నేట్ అండర్సన్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, గౌతమ్ అదానీ, నేట్ అండర్సన్

2023లో ఏం జరిగింది?

24 జనవరి 2023. భారత పారిశ్రామిక వేత్త గౌతమ్ అదానీ వ్యాపార సామ్రాజ్యం కుదుపునకు లోనైన రోజు అది.

ఆ రోజే అమెరికాకు చెందిన ఫోరెన్సిక్ ఫైనాన్షియల్ రీసర్చ్ కంపెనీ హిండెన్‌బర్గ్ నివేదిక బయటకు వచ్చింది. అదానీ గ్రూపుపై తీవ్రమైన అవినీతి ఆరోపణలు చేసింది ఆ నివేదిక. అంతేకాకుండా తమకు సమాధానం ఇవ్వాలంటూ అదానీ గ్రూప్‌కు 88 ప్రశ్నలను విసిరింది.

అయితే, ఆ నివేదికను అదానీ గ్రూపు కొట్టి పారేసింది. అందులో చేసిన ఆరోపణలను ఖండించింది.

అయితే, అప్పుడు ఆ నివేదిక వెలువడిన తర్వాత అదానీ గ్రూపు కంపెనీల షేర్ల విలువ అమాంతం పడిపోయింది.

మరి, అదానీ సామ్రాజ్యాన్ని కదిలించిన ఈ హిండెన్‌బర్గ్ రిసర్చ్ సంస్థ కథ ఏంటి? దీని వెనుక ఉన్న వ్యక్తి ఎవరు?

హిండెన్‌బర్గ్ ప్రమాద ఘటన

ఫొటో సోర్స్, BRITISHPATHE

ఫొటో క్యాప్షన్, హిండెన్‌బర్గ్ ప్రమాద ఘటన చిత్రం

హిండెన్‌బర్గ్ అనే పేరు ఎక్కడి నుంచి వచ్చింది?

1937లో జర్మనీలో హిట్లర్ పాలన సాగుతోంది. అప్పుడు హిండెన్‌బర్గ్ పేరుతో ఒక ఎయిర్‌షిప్ ఉండేది. హిట్లర్ కన్నా ముందు జర్మనీ ప్రెసిడెంట్‌గా ఉన్న పాల్ వాన్ హిండెన్‌బర్గ్‌ పేరు పెట్టిన ఆ ఎయిర్‌షిప్ వెనుక భాగంలో నాజీలను సూచించే ‘స్వస్తిక్’ గుర్తు ఉండింది.

ఆ నౌకను అమెరికాలోని న్యూజెర్సీలో భూమిపై నుంచి చూస్తున్నవారికి ఒక అసాధారణ దృశ్యం కనిపించింది.

ఒక భారీ పేలుడు సంభవించి ఆకాశంలోని హిండెన్‌బర్గ్ స్పేస్‌షిప్ మంటల్లో చిక్కుకుంది. ప్రజల అరుపులు వినిపించాయి. అంతలోనే ఎయిర్ షిప్ నేలపై పడింది. కేవలం 30 సెకన్లలోపే అంతా ధ్వంసమైంది.

అక్కడున్న వారిని కాపాడేందుకు కొందరు ముందుకొచ్చారు. కొంతమందిని కాపాడారు. అప్పటికే చాలా ఆలస్యం కావడంతో మరికొంతమందిని కాపాడలేకపోయారు.

మండుతున్న అంతరిక్ష నౌక నుంచి వచ్చిన పొగలతో ఆకాశం చీకటిగా మారింది. ఆ నౌక బూడిదగా మారిపోయింది.

అందులో 16 హైడ్రోజన్ గ్యాస్ బెలూన్లు ఉన్నాయి. ప్రమాద సమయంలో దాదాపు 100 మంది అందులో కూర్చుని ఉన్నారు. ఈ దుర్ఘటనలో 35 మంది చనిపోయారు.

హైడ్రోజన్ బెలూన్లతో నడిచే ఇలాంటి ఎయిర్‌షిప్ ప్రమాదాలు గతంలోనూ జరిగాయని, వాటి నుంచి గుణపాఠాలు నేర్చుకుని ఉంటే ఈ ప్రమాదాన్ని జరిగేదే కాదని అందరూ భావించారు.

గౌతమ్ అదానీపై నివేదికను వెలువరించిన పరిశోధన కంపెనీ ‘హిండెన్‌బర్గ్’ పేరు కూడా ప్రమాదానికి గురైన ఈ స్పేస్‌షిప్ స్ఫూర్తితోనే వచ్చింది.

‘‘స్టాక్ మార్కెట్‌లో జరుగుతోన్న అవకతవకలను మేం పర్యవేక్షిస్తాం. వాటిని బట్టబయలు చేసిన నిజానిజాలను బయటకు తీసుకురావడమే మా లక్ష్యం’’ అని ఈ పరిశోధన కంపెనీ చెప్పింది.

హిండెన్‌బర్గ్ ప్రమాదంలో ప్రజలకు హాని కలిగినందున... ఆర్థిక ప్రమాదాలు, స్టాక్ మార్కెట్ మోసాల నుంచి ప్రజలను కాపాడేందుకు తాము పనిచేస్తామని హిండెన్‌బర్గ్ కంపెనీ చెబుతోంది.

వీడియో క్యాప్షన్, హిండెన్‌బర్గ్ కథ ఏంటి?

నివేదికలను ఈ కంపెనీ ఎలా తయారు చేస్తుంది?

కంపెనీ వెబ్‌సైట్‌లో దీనికి సంబంధించిన సమాచారం దొరుకుతుంది. తాము నివేదికను తయారు చేసే ప్రాతిపాదిక చాలా కష్టమైనదని కంపెనీ చెబుతోంది.

నివేదికను కింది ప్రాతిపదికల ప్రకారం తయారుచేస్తామని కంపెనీ తెలిపింది.

  • పెట్టుబడి నిర్ణయాలపై విశ్లేషణ
  • ఇన్వెస్టిగేటివ్ రీసెర్చ్ చేయడం ద్వారా
  • మూలాల నుంచి అందిన రహస్య సమాచారంపై పరిశోధన చేయడం ద్వారా
హిండెన్‌బర్గ్

ఫొటో సోర్స్, NURPHOTO

హిండెన్‌బర్గ్ ఏం చెబుతోంది?

పెట్టుబడుల విషయంలో తమకు దశాబ్దాల అనుభవం ఉందని హిండెన్‌బర్గ్ చెబుతోంది.

హిండెన్‌బర్గ్ రీసెర్చ్ కంపెనీ సమర్పించిన నివేదికలు, ఇతర రకాల చర్యల కారణంగా గతంలో కూడా అనేక కంపెనీల షేర్లు పడిపోయాయని కంపెనీ వెబ్‌సైట్‌లో పేర్కొన్నారు.

అదానీ కంపెనీ కంటే ముందు హిండెన్‌బర్గ్ కంపెనీ, ట్రక్ కంపెనీ అయిన ‘నికోలా’ విషయంలో కూడా ఇలాంటి పరిశోధనే చేసింది.

ఈ వ్యవహారం కోర్టు వరకు చేరింది. కోర్టులో నికోలా ట్రక్ కంపెనీ వ్యవస్థాపకుడు దోషిగా తేలారు.

2020 నుంచి దాదాపు 30 కంపెనీల నివేదికలను హిండెన్‌బర్గ్ బయటపెట్టిందని, నివేదికలు బయటకు వచ్చిన మరుసటి రోజునే ఆయా కంపెనీల షేర్లు 15 శాతం పడిపోయాయని బ్లూమ్‌బర్గ్ నివేదిక చెప్పింది.

తర్వాతి ఆరు నెలల్లో ఈ కంపెనీల షేర్ల విలువ సగటున 26 శాతానికి పైగా పడిపోయిందని బ్లూమ్‌బర్గ్ నివేదిక వెల్లడించింది.

కింది అంశాల ఆధారంగా హిండెన్‌బర్గ్ పరిశోధన చేస్తుంది:

  • అకౌంటింగ్‌లో అక్రమాలు
  • ముఖ్యమైన పదవుల్లో అనర్హులు
  • బహిర్గతం చేయని లావాదేవీలు
  • చట్టవిరుద్ధమైన, అనైతిక వ్యాపారం, అనైతిక ఆర్థిక రిపోర్టింగ్ పద్ధతులు
నేట్ అండర్సన్

ఫొటో సోర్స్, THE WASHINGTON POST/GETTY

ఫొటో క్యాప్షన్, నేట్ అండర్సన్

హిండెన్‌బర్గ్ వెనుక ఎవరున్నారు?

హిండెన్‌బర్గ్ పరిశోధన కంపెనీ అధిపతి నేథన్ అలియాస్ నేట్ అండర్సన్.

2017లో అండర్సన్ ఈ కంపెనీని స్థాపించారు. అమెరికాలోని కనెక్టికట్ యూనివర్సిటీలో అండర్సన్ చదువుకున్నారు.

ఆయన ఇంటర్నేషనల్ బిజినెస్‌ అభ్యసించారు. ‘ప్యాక్ట్ సెట్ రీసెర్చ్ సిస్టమ్స్’ అనే ఒక డేటా కంపెనీలో మొదట ఉద్యోగంలో చేరారు. ఈ కంపెనీ తరఫున ఇన్వెస్ట్‌మెంట్ మేనేజ్‌మెంట్ కంపెనీలతో కలిసి ఆయన పనిచేశారు.

‘‘వీళ్లంతా అతి సాధారణ విశ్లేషణ చేస్తున్నారని నేను గ్రహించాను’’ అని 2020లో వాల్‌స్ట్రీట్ జర్నల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అండర్సన్ అన్నారు.

ఇజ్రాయెల్‌లో అండర్సన్ కొంతకాలం పాటు అంబులెన్స్‌ను కూడా నడిపారని వార్తా సంస్థ రాయిటర్స్ పేర్కొంది.

‘‘అంబులెన్స్ డ్రైవర్‌గా పనిచేస్తున్నప్పుడే ఒత్తిడిలో ఎలా పనిచేయాలో నేర్చుకున్నాను’’ అని ఆయన లింక్డిన్ ప్రొఫైల్‌లో రాసుకున్నారు.

అలాగే ఆయనకు వైద్యరంగంలో 400 గంటల అనుభవం ఉందని కూడా అదే ప్రొఫైల్‌లో రాసి ఉంది.

అమెరికా అకౌంటెంట్ హ్యారీ మోర్కోపోలో తన రోల్ మోడల్ అని అండర్సన్ చాలా ఇంటర్వ్యూల్లో చెప్పారు.

2008లో బెర్నార్డ్ మెడాఫ్ పోంజీ కుంభకోణం గురించి అండర్సన్ రోల్ మోడల్ హ్యారీ ప్రజలకు చెప్పారు.

ఈ మెడాఫ్ గురించి ఇటీవలే నెట్‌ఫ్లిక్స్‌లో ‘ద మాన్‌స్టర్ ఆఫ్ వాల్ స్ట్రీట్’ పేరుతో వెబ్ సిరీస్ విడుదల అయింది.

కానీ, ఇప్పుడు గురువు హ్యారీ కారణంగా కాదు శిష్యుడు అండర్సన్ కారణంగా షేర్ మార్కెట్‌లో కలకలం రేగుతోంది. దాన ప్రభావం నేరుగా గౌతమ్ అదానీపై పడుతోంది.

వీడియో క్యాప్షన్, ఆరేళ్లలో ప్రపంచ సంపన్నుడిగా ఎదిగిన అదానీ

(బీబీసీ తెలుగు కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)