ఆంధ్రప్రదేశ్: ఈ గురుకుల పాఠశాల బాలికలు ఎందుకు కన్నీళ్లు పెట్టుకున్నారు? సమస్యలేమిటి? పరిష్కారాలేమిటి?

- రచయిత, లక్కోజు శ్రీనివాస్
- హోదా, బీబీసీ కోసం
ఆంధ్రప్రదేశ్‌లోని ఒక బీసీ రెసిడెన్షియల్ బాలికల పాఠశాల హాస్టల్‌లో బాలికలు కన్నీళ్లు పెట్టుకున్న వీడియో వైరల్ అయ్యింది.
‘‘మా స్కూల్లో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి.. స్నానానికి బాత్రూంలు కూడా లేవు. తాగటానికి నీళ్లు లేవు. పడుకోవటానికి స్థలం లేదు. చదువు కోవటానికి కూడా అవ్వట్లేదు. మేం పక్కా పల్లెటూర్ల నుంచి వచ్చాం. మా అమ్మానాన్న చాలా కష్టపడ్డారు. మా మీద చాలా హోప్స్ పెట్టుకున్నారు. ఇక్కడ అంతా బాగుందనుకుంటున్నారు. కానీ చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి’’ అంటూ ఆ వీడియోలో పదుల సంఖ్యలో బాలికలు తమ సమస్యలను చెప్పుకొచ్చారు.
అనకాపల్లి జిల్లా ఎస్. రాయవరం మండలం లింగరాజుపాలెంలో ఈ గురుకుల పాఠశాల హాస్టల్ ఉంది. ఆ తర్వాత హాస్టల్‌ను పరిశీలించిన జిల్లా జాయింట్ కలెక్టర్, సమస్యల పరిష్కరంలో విఫలమయ్యారంటూ హాస్టల్ ప్రిన్సిపల్‌ను సస్పెండ్ చేశారు.
ఇంతకూ హాస్టల్ లో ఏం జరిగింది? ప్రస్తుత పరిస్థితి ఎలా ఉంది? అధికారులు, మంత్రి ఏం చెప్పారు?

'తుపాను రక్షిత భవనంలో బాలికల హాస్టల్'
లింగరాజు పాలెం బాలికల గురుకుల పాఠశాల 2019లో ప్రారంభమైంది. దీనికి సొంత భవనం లేదు. దాంతో ప్రపంచ బ్యాంకు నిధులతో నిర్మించిన తుపాను రక్షిత భవనంలో గత మూడేళ్లుగా ఈ పాఠశాలను నడిపిస్తున్నారు. ఇందులో 5 నుంచి 10 తరగతుల వరకూ చదివే 215 మంది బాలికలు ఉంటున్నారు.
లింగరాజు పాలెం గ్రామంతో పాటు మరో నాలుగు గ్రామాలు, వరహనది పక్కనే ఉంటాయి. విపత్తులు సంభవించినప్పుడు గ్రామస్థుల రక్షణ కోసం ప్రపంచ బ్యాంకు నిధులతో 2016లో ఈ భవనం నిర్మించారు. ఇప్పుడు ఈ భవనాన్ని ఎవ్వరికి ఉపయోగం లేకుండా చేశారని గ్రామస్థులు విమర్శిస్తున్నారు.
"అత్యవసర పరిస్థితుల్లో తలదాచుకునేందుకు కనీస సౌకర్యాలతో నిర్మించిన ఈ భవనాన్ని బాలికల హాస్టల్‌గా మార్చారు. ఇది 100 మంది పిల్లలకైతే సరిపోతుంది. కానీ 215 మంది పిల్లలు ఉన్నారు’’ అని లింగరాజుపాలెంకు చెందిన దండు గణపతి రాజు బీబీసీతో చెప్పారు.
‘‘ఇందులో బాత్రూంలు 15 ఉంటాయి. అందులో అన్ని బాగోలేవు. నాకు తెలిసి నాలుగైదు మాత్రమే ఉపయోగపడతాయి. ఈ భవనంలో ఉన్న సౌకర్యాలను బట్టి బాలికలు ఎలాంటి బాధలు పడుతున్నారో మాకు అర్థమవుతోంది’’ అని పేర్కొన్నారు.
‘‘పైగా తుపాను వస్తే బాలికలను ఖాళీ చేయించి, గ్రామస్థులను అందులో ఉంచాలని అధికారులు ఆర్డరు ఇచ్చారు. అప్పుడు బాలికలను ఎక్కడ పెడతారు? అధికారుల అనాలోచిన నిర్ణయం వల్ల ఈ భవనం ఇటు పిల్లలకు ఉపయోగపడక, అటు మాకు ఉపయోగపడకుండా చేశారు" అని ఆయన విమర్శించారు.

'సమస్యలున్నాయి.. దానికి కారణం...'
హాస్టల్ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకురావడంలో విఫలమయ్యారని, విధుల్లో నిర్లక్ష్యం వహించారని చెప్తూ హాస్టల్ ప్రిన్సిపల్ నాగ వేణిని జాయింట్ కలెక్టర్ సస్పెండ్ చేశారు. సస్పెండ్ అయిన ప్రిన్సిపల్ నాగవేణి అంతకు ముందు మీడియాతో మాట్లాడారు. విద్యార్థినిలు చెప్పిన సమస్యలు ఉన్న మాట వాస్తవమేనని, ఈ సమస్యలను తాను అధికారుల దృష్టికి తీసుకెళ్లానని చెప్పారు.
"ఈ హాస్టల్‌లో బాలికలకు సరైన సౌకర్యాలు లేవనే మాట వాస్తవమే. కొన్ని సమస్యలున్నాయి. ప్రధానంగా భవనం చిన్నది. విద్యార్థినులు ఎక్కువ మంది ఉన్నారు. దీంతో బాత్రూంలు, పడుకోవడం, తినడం ఇలా అన్నీ చోట్లా ఇబ్బందులు ఉన్నాయి. కనీసం ఆడుకోడానికి గ్రౌండ్ కూడా లేదు’’ అని ఆమె పేర్కొన్నారు.
‘‘తాగటానికి మంచి నీరు కూడా లేక మినరల్ వాటర్ కొంటున్నాం. అలాగే కొందరు ఉపాధ్యాయులు సరిగా బోధించడం లేదని వారి స్థానంలో కొత్త వారిని తీసుకుని వచ్చాం. బాలికల సమస్యలపై దృష్టి పెట్టి, ఒక్కొక్కటి పరిష్కరిస్తూ వస్తున్నాను. అధికారులకు ఎప్పటికప్పుడు నివేదికలు పంపాను" అని ప్రిన్సిపల్ నాగవేణి మీడియాతో చెప్పారు.
ఈ మాటలు చెప్పిన సమయానికి ప్రిన్సిపల్ నాగవేణి సస్పెండ్ కాలేదు.

'మా పిల్లలకి ఎప్పటికప్పుడు మందులు కొని తెస్తాం'
లింగరాజు పాలెం బాలికల హాస్టల్‌లో ఉంటున్న తమ పిల్లల ఆరోగ్యం పట్ల తల్లిదండ్రులు అందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ సమస్యలు చాలా రోజులుగా ఉన్నాయని, ప్రధానంగా పరిశుభ్రత లేకపోవడంతో చర్మవ్యాధులకు బాలికలు ఎక్కువగా గురవుతున్నారని తల్లిదండ్రులు బీబీసీతో చెప్పారు.
అందుకే వారికి ఎప్పటికప్పుడు మందులు ఇవ్వడం, ఆసుపత్రికి తీసుకుని వెళ్లడం చేస్తుంటామన్నారు. బాలికలు కన్నీళ్లు పెట్టుకున్న వీడియో వైరల్ కావడంతో తమ పిల్లల పరిస్థితిపై అందోళన వ్యక్తం చేస్తూ వివిధ ప్రాంతాల నుంచి తల్లిదండ్రులు హాస్టల్‌కు చేరుకుంటున్నారు.
"మా పాపని చూద్దామని వచ్చాను. చర్మవ్యాధితో బాధపడుతోంది. ప్రతీ 15 రోజులకి ఆయింట్‌మెంట్ తీసుకుని వస్తాను. ఆసుప్రతికి తీసుకుని వెళ్లాను. బట్టలు ఉతుక్కోడానికి కూడా సరైన సౌకర్యం లేకపోవడంతో అనారోగ్యం పాలవుతున్నారు. మా పిల్లల ఆరోగ్యం బాగుంటే చాలు. చదువు సంగతీ తరువాత. ఈ హాస్టల్‌లో చాలా సమస్యలున్నాయి. మా పాప ఎప్పటికప్పుడు నాకు చెప్తుంది" అని నాతవరానికి చెందిన సాబరపు జమిలి బీబీసీతో చెప్పారు.
"బాత్రూంలు బాగుండకపోతే ఎవరికైనా బాధే. ముఖ్యంగా ఆడపిల్లలకు చాలా కష్టం. మా పిల్లలు రాత్రివేళ ఒంటి గంట, రెండు గంటలకి నిద్ర లేచి అప్పుడు స్నానాలు చేస్తున్నారు. బట్టలు ఉతుక్కోడానికి నీటి సౌకర్యం కూడా లేదని చెబుతున్నారు. ఇలాగైతే వాళ్ల ఆరోగ్యం పాడవకుండా ఉంటుందా? చదువు కోసమని దూరమైనా మా పిల్లలని హాస్టల్‌లో ఉంచి చదివిస్తుంటే అనారోగ్యం పాలవుతున్నారు" అని నర్కపల్లికి చెందిన సార్ల కోశమ్మ బీబీసీతో చెప్పారు.

'పదో తరగతి పబ్లిక్ పరీక్షలు పాసవుతామని నమ్మకం లేదు'
బాలికలు కన్నీళ్లు పెట్టుకుంటూ తమ బాధలు చెప్పుకున్న వీడియో, సోషల్ మీడియాలో వైరల్ అయిన వెంటనే ప్రతిపక్ష పార్టీల మహిళా నేతలు, రాష్ట్ర మహిళా కమిషన్ బృందం అంతా లింగరాజు పాలెం హాస్టల్ చేరుకున్నారు. బాలికలతో మాట్లాడారు. తెలుగుదేశం పార్టీ నుంచి వంగలపూడి అనిత హాస్టల్ విద్యార్థినులను కలిసి ధైర్యం చెప్పారు.
"హాస్టల్ విద్యార్థినులు దీపాలు తీసేసి ఆరు బయట స్నానం చేసే దుస్థితి రావడం దురదృష్టకరం. బాత్రూంలు, టాయిలెట్లు తగినన్ని లేవని ఆడపిల్లలు కన్నీళ్లు పెట్టుకున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో తాము చదువుపై మనసు పెట్టలేకపోతున్నామని, రానున్న పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో పాసవుతామని అనుకోవడం లేదని బాలికలు కన్నీళ్లు పెట్టుకున్నారు. తమ తల్లిదండ్రుల ఆశలను తాము తీర్చలేమని, తమ ముఖాలను ఎలా చూపించాలో తెలియడం లేదని ఆవేదన చెందారు. బాలికలకు వెంటనే అవసరమైన సౌకర్యాలు కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం" అని వంగలపూడి అనిత అన్నారు.
రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలు గెడ్డం ఉమ హాస్టల్ ని సందర్శించి పిల్లలతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు.
"సమస్యను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తాం. 2019 ఎన్నికలకు ముందు టీడీపీ ప్రభుత్వం 55 కొత్త బాలికల గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేస్తామని చెప్పింది. దానికి తగిన విధంగా నోటిఫికేషన్ ప్రకారం తుపాను రక్షిత కేంద్రంలో ఈ పాఠశాలను ఏర్పాటు చేశాం. స్థల అన్వేషణ జరుగుతోంది, దొరికిన వెంటనే కొత్త భవనం నిర్మిస్తాం" అని మహిళా కమిషన్ సభ్యురాలు గెడ్డం ఉమ తెలిపారు.

'పాఠశాల నిర్మాణం కోసం రూ. 36 కోట్లు ఇస్తాం'
లింగరాజుపాలెంలో బీసీ బాలికల గురుకుల పాఠశాలను సందర్శించిన బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ బాలికలతో మాట్లాడారు. పాఠశాల స్థలం కోసం లింగరాజుపాలెంతో పాటు చుట్టు పక్కల ఎక్కడైనా ప్రభుత్వ స్థలం ఉందా అని అధికారులను ప్రశ్నించారు. పాఠశాలకు సొంత భవనాలు నిర్మించాలంటే ఐదు ఎకరాల భూమి కావాలని అన్నారు.
"గురుకుల పాఠశాల భవన నిర్మాణానికి అవసరమైన భూమిని రెవెన్యూ శాఖ అధికారులు ఏర్పాటు చేస్తే భవన నిర్మాణాల కోసం రూ. 36 కోట్లు మంజూరు చేస్తాం. ప్రస్తుతం బాలికలు చెప్పిన సమస్యలు పునరావృతం కాకుండా అదనపు సౌకర్యాలు కల్పించాలని అధికారులను ఆదేశించాను’’ అని మంత్రి చెప్పారు.
‘‘ఈ హాస్టల్స్ టీడీపీ హయాంలో వచ్చాయి, వాటి నిర్వహణను గాలికి వదిలేయడంతోనే ఈ సమస్యలు వచ్చాయి. 10:1 నిష్పత్తిలో చూస్తే వసతి గృహంలో ఉన్న బాత్రూమ్‌లు 240 మందికి సరిపోతాయి. అలాగే తక్షణమే ఈ భవనాన్ని ఆధునీకరించడానికి రూ. 6 కోట్లను మంజూరు చేశాం" అని మంత్రి పేర్కొన్నారు.

'ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి: జాయింట్ కలెక్టర్'
తక్షణమే లింగరాజు పాలెం గురుకుల హాస్టల్‌ను తరలించే అవకాశాలను పరిశీలిస్తున్నామని జిల్లా జాయింట్ కలెక్టర్ కల్పనా కుమారి చెప్పారు.
దార్లపూడిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వద్ద ఉన్న నూతనంగా నిర్మించిన బాలికల వసతిగృహాన్ని జేసీ పరిశీలించారు. లింగరాజుపాలెం బీసీ బాలికల గురుకుల పాఠశాలను ఈ వసతిగృహానికి తరలించే విషయాన్ని పరిశీలిస్తున్నామని, అయితే దీనిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని చెప్పారు. కలెక్టర్‌తోపాటు సంబంధిత శాఖ అధికారులతో మాట్లాడి తదుపరి నిర్ణయం తీసుకుంటామన్నారు.
ప్రస్తుతానికి బాలికల పరిస్థితిపై అందోళన వ్యక్తం చేస్తూ వివిధ ప్రాంతాల నుంచి తల్లిదండ్రులు రోజూ హాస్టల్‌కు చేరుకుంటున్నారు. వెంటనే కొత్త ప్రదేశానికి మార్చాలని కోరుతున్నారు. తుపాను రక్షిత భవనాన్ని, ప్రపంచ బ్యాంకు దాని కోసం ఏటా ఇస్తున్న నిధులను వాటి కోసమే వినియోగించాలని లింగరాజు పాలెం గ్రామస్థులు కోరుతున్నారు.

ఇవి కూడా చదవండి:
- నందమూరి తారకరత్న: ఒకే రోజు 9 సినిమాలకు సంతకం చేసిన హీరో కెరీర్ ఆ తర్వాత ఎలా సాగింది?
- జార్జ్ సోరోస్: మోదీ ప్రజాస్వామ్యవాది కాదన్నఈ బిలియనీర్ ఎవరు... ఆయన కామెంట్స్‌పై రియాక్షన్ ఏంటి?
- రష్యా నుంచి చౌకగా వస్తున్న ముడి చమురు భారత్‌ను ఎందుకు కలవరపెడుతోంది?
- బీబీసీ ఇండియా: ‘మమ్మల్ని నేరుగా అడిగిన ప్రతి ప్రశ్నకూ సమాధానం చెప్తాం’
- లాటరీలో 40 లక్షలు... ఒకే వ్యక్తికి వరసగా రెండుసార్లు బంపర్ ప్రైజ్













