తారక రత్న: ఒకే రోజు 9 సినిమాలకు సంతకం చేసిన హీరో కెరీర్ ఆ తర్వాత ఎలా సాగింది?

తారకరత్న

ఫొటో సోర్స్, Nandamuri Tarakarathna/FB

    • రచయిత, బళ్ల సతీశ్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

ఎన్టీఆర్ కుటుంబం నుంచి వచ్చిన యువతరం నటుడు, రాజకీయ నాయకుడు నందమూరి తారకరత్న శనివారం రాత్రి బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆస్పత్రిలో కన్నుమూశారు. జనవరి 27న గుండెపోటుకు గురై 23 రోజులుగా మృత్యువుతో పోరాడిన తారకరత్న వయసు 39 ఏళ్ళు.

సినిమా రంగంలోకి అడుగుపెట్టిన తొలి రోజుల్లోనే ఒకేరోజు 9 సినిమాలపై సంతకం పెట్టి ఒక్కసారిగా వార్తల్లో నిలిచారు తారకరత్న.

అయితే హీరో పాత్రల నుంచి తరువాత రోజుల్లో విలన్ పాత్రల్లోకి దిగారు. ఇటీవల తెలుగుదేశం పార్టీలో చురుగ్గా కనిపించి మళ్లీ వార్తల్లో నిలిచారు.

నందమూరి మోహన కృష్ణ కుమారుడు తారకరత్న. ఆయన 1983 ఫిబ్రవరి 22న జన్మించారు. అలేఖ్య రెడ్డిని వివాహం చేసుకున్నారు. వారికి ఒక కుమార్తె ఉంది. 

తారకరత్న

ఫొటో సోర్స్, Nandamuri Tarakarathna/FB

సినిమా కెరీర్

తారక రత్న సినిమా కెరీర్ సాఫీగా, నిరంతరంగా సాగలేదు. వరుసగా సినిమాలు చేయడం, ఆగడం, మళ్లీ చేయడం ఇలా సాగింది. తన సినిమా కెరీర్‌లో చెప్పుకోదగ్గ బంపర్ హిట్లు కూడా ఆయన సంపాదించలేకపోయారు. 

2002లో ఒకటో నంబర్ కుర్రాడు సినిమాతో హీరోగా పరిచయం అయ్యారు తారక రత్న. ఈ సినిమాకు కె.రాఘవేంద్ర రావు ప్రొడ్యూసర్‌గా, స్క్రీన్ ప్లే రచయితగా వ్యవహరించగా, కీరవాణి సంగీతం అందించారు.

ఆ సినిమా తర్వాత తొమ్మిది సినిమాలకు ఒకేసారి సంతకం చేశారు. వాటిలోనివే యువరత్న, తారక్, భద్రాద్రి రాముడు సినిమాలు .

తారకరత్న

ఫొటో సోర్స్, Nandamuri Tarakarathna/FB

విరామం తరువాత మళ్లీ 2009లో అమరావతి అనే సినిమాలో నెగిటివ్ రోల్ చేశారు తారకరత్న. దానికి నంది అవార్డు కూడా తీసుకున్నారు.

మళ్లీ దాదాపు ఏడేళ్ల విరామం తరువాత 2016లో రాజా చెయ్యి వేస్తే సినిమాలో విలన్‌గా చేశారు. అది నారా రోహిత్ సినిమా. 

మహాభక్త శిరియాళ అనే భక్తి సినిమాలో కూడా తారక రత్న నటించారు.

2022 లో హాట్‌స్టార్‌లో 9 అవర్స్ అనే వెబ్ సిరీస్ లో నటించారు. తాజగా మరికొన్ని ఓటీటీ సంస్థలతో ఆయన ఒప్పందం కుదుర్చుకున్నారు

తారక రత్న భార్య అలేఖ్యా రెడ్డి కొన్ని సినిమాల్లో తారక రత్నకు కాస్ట్యూమ్ డిజైనర్ గా వ్యవహరించారు.

తారకరత్న

ఫొటో సోర్స్, Nandamuri Tarakarathna/FB

రాజకీయాలు

తారక రత్న ముందు నుంచీ తెలుగుదేశం పార్టీకి గట్టి మద్దతుదారు. అవకాశం వచ్చిన ప్రతిసారీ ఆ పార్టీ తరపున ప్రచారం కూడా చేశారు.

ముందు నుంచీ నారా కుటుంబంతో మంచి సంబంధాలు నడుపుతూ వచ్చారు.

కేవలం లోకేశ్ మాత్రమే కాకుండా, చంద్రబాబు సోదరుడి కుమారుడు, హీరో నారా రోహిత్‌తో కూడా తారకరత్నకు మంచి సంబంధాలు ఉన్నాయి.

2018 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగు దేశం పార్టీ తరపున ప్రచారం చేశారు.

కూకట్‌పల్లిలో హరికృష్ణ కుమార్తె సుహాసిని పోటీ చేసినప్పుడు ఆ ప్రచారానికి ఆమె సొంత సోదరులు జూనియర్ ఎన్టీయార్, కల్యాణ్‌రామ్ దూరంగా ఉన్నా, తారకరత్న ఇంటింటికి తిరిగి ప్రచారం చేశారు.

తారకరత్న

ఫొటో సోర్స్, Nandamuri Tarakarathna/FB

రాజకీయాల్లోనూ చాలా గ్యాప్ తరువాత గత ఏడాది డిసెంబరులో గుంటూరు పర్యటనలో రాజకీయంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

గుంటూరు జిల్లా పెదనందిపాడులో ఎన్టీయార్ విగ్రహావిష్కరణకు వచ్చిన ఆయన, వచ్చే ఎన్నికల్లో తాను కూడా బరిలోకి దిగుతానంటూ సంకేతాలిచ్చారు.

ఈ వ్యాఖ్యలతో ఇక తెలుగుదేశంలో పూర్తిస్థాయిలో తారకరత్న పనిచేస్తారన్నది అర్ధమైంది.

వచ్చే ఎన్నికల్లో ఆయన ఏ స్థానం నుంచి పోటీ చేస్తారన్న అంశంపై కూడా చర్చ మొదలైంది.

తారకరత్న

ఫొటో సోర్స్, Nandamuri Tarakarathna/FB

మాచర్లలో తెలుగుదేశం కార్యకర్తలపై దాడి వంటి అంశాలపైనా తారకరత్న మాట్లాడారు. సందర్భం వచ్చినప్పుడు జూనియర్ ఎన్టీయార్‌ కూడా పార్టీలోకి వస్తారని చెప్పారు.

టైగర్ 2024లో బయటకు వస్తుందంటూ ఒక ట్వీట్ చేశారు. ఆ ట్వీట్‌లో టైగర్ అనే పదం ఎవర్ని ఉద్దేశించి అన్నారన్న చర్చ కూడా సాగింది. 

దీనికి కొనసాగింపుగా జనవరిలో నారా లోకేశ్‌ను కలిశారు తారకరత్న. బొట్టు, ట్రిమ్ చేయని గడ్డం, చంద్రబాబు వేసుకునే తరహా రంగు డ్రెస్ వేసుకుని పొలిటికల్ ఎటైర్ లో కనిపించారు.

తారకరత్న, లోకేశ్ సమావేశం తరువాత రాజకీయాల్లో ఆయన చురుగ్గా ఉన్నారు.

ఆ క్రమంలోనే ఆయన కుప్పంలో ప్రారంభమైన లోకేశ్ పాదయాత్రలో పాల్గొన్నారు. అప్పుడే ఆయనకు గుండె సమస్య వచ్చింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)