సార్ సినిమా రివ్యూ : మాస్టారు పాఠం మనసుల్ని గెలిచిందా...లేదా?

ఫొటో సోర్స్, sithara entertainments
- రచయిత, సాహితి
- హోదా, బీబీసీ కోసం...
‘’విద్య అనేది గుడిలో ప్రసాదం...పంచండి. ఫైవ్ స్టార్ హోటల్‌లో డిష్‌లా అమ్మకండి” ఇది ‘సార్’ సినిమాలో వినిపించిన డైలాగ్.
అవును..విద్య అనేది నాన్ ప్రాఫిటబుల్ సర్వీస్. విద్యని అర్థించే వారు విద్యార్ధులు. కానీ ఇప్పుడు విద్య లాభసాటి వ్యాపారం. క్యాలిటీ ఎడ్యుకేషన్ కావాలంటే కాసులు ఉండాల్సిందే. దీని కోసం ఆస్తులు కూడా అమ్ముకునే పరిస్థితి. అయితే ఈ పరిస్థితికి కారణం ఎవరు ?
నాన్ ప్రాఫిటబుల్ సర్వీస్ అయిన విద్య ఇంత పెద్ద వ్యాపారంగా ఎలా మారింది ? క్యాలిటీ ఎడ్యుకేషన్ ని అందరికీ సమానంగా పంచిపెట్టాలని చూసిన ఓ మాస్టర్ కి ఎలాంటి సవాళ్ళు ఎదురయ్యాయి ?
విద్యని ప్రసాదంలా పంచిపెట్టిన సార్ 1990లో ప్రారంభమయ్యే కథ ఇది. బాలగంగాధర్ తిలక్ అలియాస్ బాలు (ధనుష్) త్రిపాఠి విద్య సంస్థలలో ఇంటర్ మ్యాథ్స్ లెక్చరర్.
పేరుకే లెక్చరర్ కానీ బాలుని వార్డెన్ లాంటి పనులకు వాడుతుంటుంది ఆ సంస్థ.
ఎప్పటికైనా సీనియర్ లెక్చరర్ కావాలనేది బాలు కల. కొన్ని పరిస్థితుల వలన గవర్నమెంట్ కాలేజీలని దత్తత తీసుకొని తమ లెక్చరర్స్ ని ఆ కాలేజీలకు పంపించే ఏర్పాటు చేస్తాడు త్రిపాఠి సంస్థల చైర్మెన్ శ్రీనివాస్ త్రిపాఠి (సముద్రఖని).
అక్కడ చక్కగా చదువు చెప్పి మంచి ఫలితాలు తెచ్చిన వారికి సీనియర్ లెక్చరర్ ప్రమోషన్ ఇస్తానని మాటిస్తాడు.

ఫొటో సోర్స్, sithara entertainments
అలా సిరిపురం అనే పల్లెకు వచ్చిన బాలుకు ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి ? ఆ వూర్లో విద్యార్ధులు ఎలాంటి స్థితిలో వున్నారు? త్రిపాఠి అసలు కుట్ర ఏమిటి? విద్యతో అతను ఎలాంటి వ్యాపారం చేస్తున్నాడు? త్రిపాఠి కుట్రని బాలు ఎలా తిప్పికొట్టాడు? విద్యార్ధుల జీవితాలలో ఎలాంటి మార్పులు తీసుకొచ్చాడు? అనేది మిగతా కథ.
విద్యని ప్రసాదంలా పంచిపెట్టాలని భావించిన ఓ లెక్చరర్ కథ ఇది. 46 మంది విద్యార్ధుల జీవితాల్లో వెలుగులు నింపి, అత్యున్నతమైన విద్యని అందించి, పేద బడుగు బలహీన వర్గాల విద్యార్ధులకు ఒక గౌరవం తెచ్చిన లెక్చరర్ కథ ఇది.
కథని ఆసక్తికరంగా మొదలుపెట్టాడు దర్శకుడు. ఒక వీడియో లైబ్రెరీలో దొరికిన వీడియో క్యాసెట్ ఆధారంగా.. బాలు సార్ ని వెదుక్కుంటూ ముగ్గురు విద్యార్ధులు చేసిన ప్రయాణంతో సినిమా మొదలౌతుంది.
ఈ క్రమంలో ఎ.ఎస్. మూర్తి (సుమంత్) బాలు కథని చెప్పడం... త్రీ ఇడియట్స్ టెంప్లేట్ గుర్తుకు తెచ్చినప్పటికీ, బాలు కథ తెలుసుకోవాలనే ఆసక్తి ప్రేక్షకుల్లో కలుగుతుంది.
కథ ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్ళిన తర్వాత ఇందులో కీలకమైన పాయింట్ ఒకటి తెరపైకి వస్తుంది.
మాజీ ప్రధాని పీవీ నరసింహారావు చేసిన ఆర్ధిక సంస్కరణలు తర్వాత వచ్చిన మార్పులు, విద్య వైద్య రంగంలో చోటు చేసుకున్న పరిస్థితులు, కార్పోరేట్ శక్తులు జోక్యం.. ఇవన్నీ ఒక యానిమేట్ వీడియోలో చూపించారు.
మరీ ఎక్కువ లోతులోకి వెళ్ళకుండా అక్కడే దానిని ముగించి..తర్వాత త్రిపాఠి సంస్థలు ప్రభుత్వ కాలేజీలని దత్తత తీసుకునే ఎపిసోడ్ కూడా రాజకీయాలతో ముడిపడిందే కావడంతో దాన్ని మరీ ఎక్కువగా లాగితే లేనిపోనీ చికాకు అనుకున్నారేమో కానీ.. రెండు కీలకమైన సోషల్ అండ్ పొలిటికల్ డెవలప్‌మెంట్స్‌ని పైపైనే చూపించారనే భావన కలుగుతుంది.

ఫొటో సోర్స్, Sithara Entertainments
బాలు సిరిపురం వచ్చిన తర్వాత కథ సినిమాటిక్ టోన్‌లోకి మారుతుంది. కాలేజ్‌లో లైఫ్ సైన్స్ లెక్చరర్ మీనాక్షి (సంయక్త మీనన్)ని కలవడం, హైపర్ ఆదితో కొన్ని నవ్వులు.. కొంత టైం పాస్. ఇది 90లో జరిగే కథ.
చాలా చోట్ల ట్రీట్ మెంట్ కూడా ఆ కాలం నాటిదిగా అనిపిస్తుంది. విద్యార్ధులు ఏవో కారణాల వలన కాలేజీకి రాకపోవడం, సార్ వెళ్లి అందరినీ మోటివేట్ చేసి మళ్ళీ తీసుకురావడం, పాఠాలు చెప్పి అందరికీ ఫస్ట్ క్లాసులు తెప్పించడం రొటీన్ గా అనిపిస్తాయి.
బాలు సిరిపురం వచ్చినపుడే ఈ కథలో సంఘర్షణ త్రిపాఠి పాత్ర రూపంలో వస్తుందని ప్రేక్షకుడిగా అర్ధమౌతుంది. అయితే ఆ పాత్రని ప్రవేశపెట్టడానికి మళ్ళీ ఇంటర్వెల్ వరకూ సాగదీశారనే భావన కలుగుతుంది.
ఇంటర్వెల్ బాంగ్ ఊహించినట్లుగానే వుంటుంది. అప్పటి వరకూ సిరిపురం కాలేజ్ అన్నట్లుగా నడిచిన కథనం.. తర్వాత బాలీవుడ్ సినిమా సూపర్ 30 ని గుర్తుకు తెస్తుంది. సిరిపురం విద్యార్ధులకు ఎంసెట్ లో ఫస్ట్ ర్యాంకులు తెచ్చే మిషన్ ని భుజాన వేసుకుంటాడు బాలు.
అడుగడుగునా సందేశం. ఇదొక సందేశాత్మక చిత్రం. మాటల్లో చేతల్లో అడుగడుగునా సందేశాలు కనిపిస్తుంటాయి.
ఫస్ట్‌హాఫ్‌లో విద్య గొప్పదనం చెప్పడం, విద్యతో గౌరవం మర్యాద దక్కుతుందని చెప్పిన ఎపిసోడ్, కులాల కొట్లాటలు వద్దని చెప్పే ఎపిసోడ్ అర్ధవంతంగా వుంటాయి.
అయితే ఇలాంటి సన్నివేశాలని ఇదివరకరే చాలా సినిమాల్లో చూడటం కారణంగా రొటీన్ అనిపిస్తాయి.

ఫొటో సోర్స్, Sithara Entertainments
సెకండ్ హాఫ్ తర్వాత కథానాయకుడు కాసేపు లక్ష్యాన్ని వదిలివెళ్ళిపోవడంతో కథ కూడా కాసేపు నిర్లక్ష్యంగా అనిపిస్తుంది. అంతకుముందు పాకలో చదువు చెప్పడం, గిట్టని వారు దాన్ని కూల్చడం, బాలు పోలీసులపై చేయి చేసుకోవడం, బాలుని గ్రామ బహిష్కరణ చేయడం.. ఇవన్నీ సినిమా లిబర్టికి మించి వుంటాయి.
అలాగే లక్ష్యానికి దూరంగా వెళ్ళిపోయిన బాలుని మీనాక్షి మళ్ళీ అతని లక్ష్యం గుర్తు చేయడం కూడా అంత ఒరిజినల్ గా వుండదు.
బాలు సిరిపురం నుంచి వెళ్ళిపొతున్నపుడు బోరింగ్ పైపు నుంచి నీళ్లు కాళ్లు తడిపే సన్నివేశం మాత్రం మనసుని హత్తుకునేలా చిత్రీకరించారు.
అయితే, ఒక దశలో ఈ కథలో సంఘర్షణే లోపించినట్లునిపిస్తుంది. త్రిపాఠి, బాలు మధ్య బలమైన వార్ కోరుకుంటాడు ప్రేక్షకుడు. కానీ అది జరగలేదు.
ఏదో కాలేజీలో ఒక లెక్చరర్ కారణంగా విద్యార్ధులకు ఫస్ట్ క్లాసులు వస్తే.. తన సామ్రాజ్యమే కూలిపోతుందని త్రిపాఠి లాంటి బిజినెస్ టైకూన్ హడిలిపోయి బేస్ వాయిస్ తో రియాక్ట్ కావడం ఓవర్ రియాక్షన్ అనే భావన కలుగుతుంది.
అలాగే బాలు మారు వేషాలలో టూరింగ్ టాకీస్ లో వీడియో పాఠాలు చెప్పే సన్నివేశాలు కూడా అంత ప్రభావవంతగా రాలేదు. 90కి అదో సంచలనం అయ్యింటుదేమో కానీ, ఈ రోజు సినిమా చూస్తున్న ప్రేక్షకులు వావ్ అనుకునేలా ఏం వుండదు. బాలీవుడ్ లో వచ్చిన సూపర్ థర్టీతో పాటు కోటా ఫ్యాక్టరీ వెబ్ సిరిస్ కూడా ఎడ్యుకేషన్ నేపధ్యంలో వచ్చినవే.
అందులోనూ సందేశం వుంది. అయితే మాంచి బిగి వున్న కథనంతో వాటిని మలిచారు. సార్ కథనంలో బిగి, వేగం రెండూ కొరవడ్డాయి. అయితే సార్ ఉద్దేశంలో ఒక నిజాయితీ వుంది. ఒక మంచి కారణం వుంది. సందేశం విషయంలో మాత్రం సార్‌ని మెచ్చుకోవాల్సిందే.

ఫొటో సోర్స్, Sithara Entertainments
చివర్లో అసలైన గెలుపు గురించి చెప్పే మాటలు, విద్యార్ధులు, మాస్టర్ మధ్య వచ్చే ఎమోషన్స్ హత్తుకుంటాయి. విద్యతో సమాజంలో గౌరవం, కుల వివక్ష, మహిళా సాధికారత ఇలా చాలా అంశాలని స్పృశించాడు.
మహిళా విద్యార్ధులని కీలకంగా చూపించడం మెచ్చుకోదగ్గ విషయం. ‘ఎవరినో పెళ్లి చేసుకొని అమెరికా వెళ్లను. నా చదువే నన్ను అమెరికా తీసుకువెళ్ళాలి’ అని ఓ విద్యార్ధినితో చెప్పించిన మాటలు మహిళా సాధికారతని చక్కగా చాటాయి.
బాలు సార్‌గా ధనుష్ నటన గురించి ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బాలు పాత్రకి న్యాయం చేశాడు. ఆ పాత్రలో సహజంగా కనిపించాడు. అయితే ఆ పాత్రని తీర్చిదిద్దిన విధానంలో దర్శకుడు తగిన గ్రాఫ్ ని పాటించలేదనిపిస్తుంది.
ఒకసారి హీరోయిక్ గా, మరోసారి సామాన్యుడిగా ఇంకోసారి వైల్డ్ గా కనిపిస్తుందా పాత్ర. దర్శకుడు ఫైట్లని మసాలా యాడ్ చేయడం కోసం పెట్టినట్లు అనిపిస్తుంది. అయితే పాత్ర డిజైన్ లోని లోపాలు కూడా తన పెర్ఫార్మెన్స్ తో నెట్టుకొచ్చేశారు ధనుష్. మీనాక్షి పాత్రలో కనిపించిన సంయుక్త మీనన్ ది రెగ్యులర్ పాత్ర.
లవ్ ట్రాక్ కూడా అంత కొత్తగా వుండదు. బాలుకి లక్ష్యాన్ని గుర్తు చేయడానికి, అతనిలో స్ఫూర్తిని నింపడానికి మీనాక్షి పాత్ర ఓ సన్నివేశంలో ఉపయోగపడింది. అలాగే ఆ పాత్రని చాలా పద్దతిగా చూపించారు. త్రిపాఠి పాత్రలో కనిపించిన సముద్రఖని.. ఆ పాత్రకు సరిగ్గా సరిపోయారు.
ఆయన లుక్ బావుంది. అయితే ఆ పాత్రని ఇంకా బలంగా తీర్చిదిద్దే అవకాశం వుంది. ఎ.ఎస్. మూర్తిగా కనిపించిన సుమంత్ ..బాలు కథని చెప్పే పాత్రలో హుందాగా కనిపించారు. హైపర్ ఆది పాత్ర కొన్ని సింగిల్ లైనర్స్‌తో అలరించింది కానీ ఆ పాత్రని సడన్‌గా కట్ చేశారనే చెప్పాలి.
సిరిపురం ప్రెసిడెంట్ గా కనిపించిన సాయి కుమార్ ఆకట్టుకున్నారు. చివర్లో మార్పు చెందే పాత్ర అది. విద్యార్ధులు గా కనిపించినవారంతా చక్కగా చేశారు. మిగతా పాత్రలు పరిధిమేర వున్నాయి. జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం సార్ కి ప్రధాన ఆకర్షణ.
మాస్టారు మాస్టారు పాట హుషారుగా హాయిగా వుంది. నేపధ్య సంగీతం కూడా ఆకట్టుకుంటుంది. కొన్ని సార్లు సీన్ ని డామినేట్ చేసింది కూడా.
యువరాజ్ కెమరా పనితనం బావుంది కానీ.. అతనకి ఆర్ట్ విభాగం అంతగా కలిసొచ్చినట్లు కనిపించలేదు. 90లో జరిగే కథ ఇది. అయితే చిత్రీకరణలో ఆ వింటేజ్ లుక్ రాలేదు. ప్రస్తుతమే ఏదో పల్లెటూరిలో షూటింగ్ చేశారనే ఫీలింగే చాలా చోట్ల కలుగుతుంది.
ఇంకా డిటేయిల్ ఆర్ట్ వర్క్ చేసివుంటే బావుండేది. “అవసరానికి కులం వుండదు. అవసరం లేని మనిషి వుండడు’ లాంటి మాటలు మెరిశాయి. నిర్మాణ విలువలు కథకు తగ్గట్టుగా వున్నాయి.
దర్శకుడు వెంకీ అట్లూరి మంచి ఉద్దేశంతో నిజాయితీతో కూడిన ఓ సందేశాన్ని చూపించే ప్రయత్నం చేశాడు.
సందేశం పరంగా ఈ సినిమాని అభినదించాల్సిందే. అయితే సినిమా అనేది ప్రేక్షకులకు సరికొత్త అనుభూతి పంచాలి. ఆ కొత్త అనుభూతిని ఇవ్వడంలో సార్ కాస్త నిరాశ పరుస్తారు.

ఇవి కూడా చదవండి:
- హైదరాబాద్: ఫార్ములా ఈ రేస్ ప్రత్యేకత ఏమిటి... తెలంగాణకు అవకాశం ఎలా వచ్చింది
- భూకంపం వచ్చినప్పుడు ఏం చేయాలి?
- అప్పర్ భద్ర: ఈ ప్రాజెక్ట్ పూర్తయితే రాయలసీమకు నీళ్లు అందవా... ఆంధ్రప్రదేశ్ వ్యతిరేకత ఎందుకు
- రాణి రూపమతి: భర్తను ఓడించిన శత్రువును పెళ్లి చేసుకోవడానికి నిరాకరించి విషం తాగిన రాణి
- చాట్‌జీపీటీ: డిగ్రీ కూడా పాసవని సామ్ ఆల్ట్మాన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌లో సంచలనాలు సృష్టిస్తున్నారు.. ఇంతకీ ఎవరీయన?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









