జమున: తెలుగు సినిమా సత్యభామ ఆమె...కాస్టింగ్ కౌచ్ గురించి ఏం చెప్పేవారు?

జమున

ఫొటో సోర్స్, SURESH PRODUCTIONS

ఫొటో క్యాప్షన్, శ్రీకృష్ణతులాభారం లో జమున
    • రచయిత, పి. లలిత
    • హోదా, బీబీసీ కోసం

అందాల నటి జమున ఎనభై ఆరేళ్ల పండు వయసులో ఈరోజు ప్రశాంతంగా మరణించారు.

జమున ఎన్నోవిధాలుగా అదృష్టవంతురాలనే చెప్పాలి. ఆస్పత్రిలో రకరకాల గొట్టాల మధ్య హింస పడలేదు. ఇంట్లోనే వాళ్ళమ్మాయి దగ్గరే మరణించారు.

వ్యక్తిగత జీవితంలోనూ సినిమా జీవితంలోనూ ఇంచుమించుగా ఎటువంటి రాజీలకు తలవొగ్గకుండానే జీవించారు.

జమున కర్ణాటకలోని హంపీలో పుట్టారు. తల్లి కన్నడ మహిళ, తండ్రి తెలుగువాడు.

జమున సినిమాల్లో నటించిన కాలమంతా హీరోయిన్లకు మంచి కాలమే. పోటీ తక్కువ కావటంతో అప్పటి నటీ నటులకు ఎక్కువకాలం సినిమాల్లో కొనసాగే అవకాశం ఉండేది.

అప్పట్లో నటించే సాహసం చేసే అమ్మాయిలే తక్కువ కావటంతో, నిర్మాతలు, దర్శకులు స్త్రీ పాత్రల్లో నటించేవాళ్ళ కోసం వెదుకులాడేవాళ్లు.

కొందరు దర్శకులు, ప్రగతిశీలమైన సినిమాలు తీయాలనుకునేవాళ్లు..గొంతు బాగుండి చక్కగా నటించే వాళ్లను ఏ నాటక ప్రదర్శనలోనో చూసి, వాళ్లు తీయబోయే సినిమాలో వేషం వెయ్యమని బ్రతిమాలేవాళ్లు.

ఇక స్త్రీ పాత్రల సంగతికొస్తే శరీరాన్ని ముప్పయ్యారు ఇరవై నాలుగు కొలతల మధ్య ఇరికించే అవసరం లేదు.

ముక్కూ మొహం చక్కగా అందంగా వుండి, సావిత్రిలాగా నటనతో అలరిస్తే లావు అంత పెద్ద సమస్యేమీ కాదు.

రాష్ట్ర భేదం, భాషా భేదం లేకుండా తెలుగు, తమిళ, కన్నడ సినిమాలన్నిటిలోనూ దక్షిణభారతానికి చెందిన నటులందరూ నటిస్తూ ఉండేవాళ్లు. ఇదీ అప్పటి సినిమా వాతావరణం.

జమున

ఫొటో సోర్స్, @SVC, BBC

ఫొటో క్యాప్షన్, జమున

తెలుగు సినిమాలలో సత్యభామ అంటే జమునే..

అప్పట్లో ఆంధ్ర ప్రజానాట్యమండలి వ్యవస్థాపకుడు, ప్రముఖ దర్శకుడు గరికిపాటి రాజారావు పదహారేళ్ల జమునను మాభూమి నాటకంలో చూసి తను తీయబోయే సినిమాలోకి తీసుకున్నారు.

అలా పుట్టిల్లు (1953) సినిమాతో జమున సినిమా రంగంలోకి అడుగుపెట్టారు.

తన కెరీర్‌లో మొత్తం 198 సినిమాలు నటించి తెలుగు సినిమా శిలా శాసనం మీద తన పేరు పెద్ద అక్షరాలతో రాసేసుకున్నారు జమున.

భారతీయ సినిమాలో మనకంటూ ఒక ప్రత్యేకత సాధించి తెలుగువారిగా మనం గర్వపడదగ్గ స్థాయిలో ఉండేవి మన పౌరాణిక చిత్రాలు. ప్రతి ఒక్క పౌరాణిక పాత్రా గొప్ప శిల్పి చెక్కిన శిల్పంలా ఉంటుంది.

ఇక సత్యభామ వ్యక్తిత్వంలోని కోణాలన్నిటి మీదా వెలుగు ప్రసరిస్తాయి తెలుగు పౌరాణికాలు. ఈ సినిమాల్లో సత్యభామ గొప్ప లవబుల్ క్యారెక్టర్.

వినాయక చవితి సినిమాలో కృష్ణుడి ప్రేమ కోసం తపించి చివరకు పెళ్లాడిన కన్యగా కనిపిస్తుంది. అమాయకత్వం, గాఢమైన ప్రేమ, కృష్ణ ప్రేమ తనకొక్కదానికే సొంతం కావాలన్న పట్టుదల ప్రదర్శిస్తుంది ఇంకా పెళ్లికాని ఆ సత్యభామ.

పెళ్లయిన తర్వాత కృష్ణుడిని ముప్పుతిప్పలు పెట్టే లక్షణం ఆమెలో కనబడుతూనే వుంటుంది.

వినాయక చవితిలో కన్య సత్యభామగా ముద్దుగా నటిస్తుంది జమున. ఆ తరువాత వచ్చిన శ్రీకృష్ణ తులాభారంలో సత్యభామ ప్రౌఢ. కృష్ణుడంటే గాఢమైన ప్రేమ, రుక్మిణి అంటే ఈర్ష్య, భర్త తననే రాణిలాగా చూసుకోవాలనే పంతం, పట్టుదల చిక్కగా వుంటాయి తులాభారం సత్యలో.

ఈ ప్రౌఢ సత్యభామ పాత్రకు తగ్గట్టే ముఖ కవళికలు చకచకా మారుస్తూ హావభావాలతో ఆకట్టుకుంటుంది జమున.

జమున

ఫొటో సోర్స్, VIJAYA VAUHUNI STUDIOS

ఫొటో క్యాప్షన్, మిస్సమ్మ (పాత) సినిమాలో ఓ దృశ్యం

జమున-సావిత్రి

జమున, సావిత్రికి సమవయస్కురాలు. సావిత్రి, జమునల సినిమా కెరీర్ సమాంతరంగానే నడిచింది.

సావిత్రికి నిండైన తెలుగు మహిళ పాత్రలు ఎక్కువగా దొరికాయి. జమున చిలిపిగా అల్లరిగా మొండితనం ప్రదర్శించే పాత్రల్లో ఎక్కువగా కనబడుతుంది.

గుండమ్మ కథ, మిస్సమ్మ లాంటి మల్టీ స్టారర్ సినిమాల్లో సావిత్రి ఆరిందలాగా వుంటే, జమున టీనేజర్ లాగా వుండే పాత్రల్లో వుండేది.

మూగమనసులు, మిస్సమ్మ సినిమాల్లో సావిత్రి నటనలో విశ్వరూపాన్ని ప్రదర్శిస్తూ వుంటే, జమున తనదైన నటనతో తనకు దొరికిన పాత్రలకు న్యాయం చేకూర్చి, సావిత్రి పక్కన నిలబడగలిగింది.

జమున

ఫొటో సోర్స్, VIJAYA VAUHUNI STUDIOS

ఫొటో క్యాప్షన్, మనిదన్ మారవిల్లై (తమిళం) సినిమాలో దృశ్యం

చలాకీతనం, హుందాతనం రెండూ..

జమున నటించిన సినిమాల్లో వినాయక చవితి, శ్రీకృష్ణ తులాభారం, సంపూర్ణ రామాయణం, మూగమనసులు, గుండమ్మ కథ, మిస్సమ్మ, ఇల్లరికం, ఉండమ్మా బొట్టు పెడతా, లేత మనసులు, మట్టిలో మాణిక్యం, తాసిల్దారుగారి అమ్మాయి, పండంటి కాపురం, కలెక్టర్ జానకి, బంగారు తల్లి మొదలైనవి ముఖ్యమైన చిత్రాలు.

వీటిలో బంగారు తల్లి సినిమా మదర్ ఇండియాకు రీమేక్. దీనిలో శోభన్ బాబు, కృష్ణంరాజు ఆమెకు కొడుకులుగా నటించారు.

చాలావరకూ ఆమె నటించిన సినిమాలన్నీ విజయవంతం అయినవే.

గులేబకావళి కథ జానపద సినిమాలో ఎన్టీఆర్‌తో జోడీగా అందంగా కనిపిస్తారు. అక్కినేనితో ఆమె నటించిన పూలరంగడు, మూగనోము సినిమాలు బాగా విజయవంతమైన సినిమాలు.

బాపూ సంపూర్ణ రామాయణంలో కైకేయిగా ఆమె అలక, పద్యాల్లో ఆమె హావభావ ప్రదర్శన గుర్తుంచుకోదగ్గవి.

ప్రేమ, వంచన వల్ల ఏర్పడ్డ పగ, ప్రతీకారం తీర్చుకోవటంలాంటి భావోద్వేగాలు నిండిన నటనను పండంటి కాపురంలో రాణి మాలినీ దేవిగా చూపిస్తే, కలెక్టర్ జానకిగా హుందాతనం ప్రదర్శిస్తుంది జమున.

హుషారైన అమ్మాయి నుంచి పరిణతి చెందిన గృహిణి, ఉద్యోగిని పాత్రల వరకూ అటు సోషల్, ఇటు పౌరాణిక పాత్రలు వేశారు జమున. ఆమె వేసిన పాత్రలకు చాలా రేంజ్ ఉండేది.

జమున

ఫొటో సోర్స్, VIJAYA VAUHUNI STUDIOS

ఫొటో క్యాప్షన్, గుండమ్మ కథ సినిమాలో దృశ్యం

పెద్ద హీరోలతో గొడవ

అప్పటి మల్టీ స్టారర్ సినిమాల్లో జమున ప్రముఖంగానే కనిపించేది. పెద్దపెద్ద కళ్లతో, పన్ను మీద పన్ను మెరుస్తూ వుంటే అమాయకమైన చిలిపి నవ్వులు విసురుతూ ఎన్టీఆర్, ఏయెన్నార్లతో హీరోయిన్‌గా దూసుకుపోతున్న రోజుల్లోనే ఈ హీరోలిద్దరితో ఆమె తగువు పెట్టుకున్నారు.

దానివల్ల కలిగే పర్యవసానం, అంటే వేషాలు దొరక్కుండా అయిపోయే పరిస్థితి వస్తే సినిమా కెరీర్‌ను వదిలిపెట్టటానికి కూడా సిద్ధమయారు జమున.

తనతో అనుచితంగా ఒక హీరో ప్రవర్తించటం వల్ల అలా చెయ్యవలసివచ్చిందని చెప్తారామె.

ఇంత ఆత్మవిశ్వాసం, స్టార్ డమ్‌ను వదులుకునేటంత పట్టుదల చాలా అరుదుగా చూస్తాం.

అయితే ఈ సంఘటన వల్ల అందరూ ఊహించినట్టుగా ఆమె కెరీర్ ఆగిపోలేదు. ఒక మూడేళ్ల పాటు ఆమె మిగతా హీరోలతో నటించారు.

కృష్ణ, హరనాథ్, శోభన్ బాబు, కృష్ణంరాజు, చలం ఇలా ఏ చిన్న హీరోతో అయినా కథాబలం, తన పాత్రకు ప్రాముఖ్యత ఉన్న సినిమాలైతే ఆమె నటించటానికి సందేహించలేదు.

మూగమనసులు సినిమా హిందీలోకి మిలన్‌గాా రీమేక్ అయినప్పుడు ఆమె గౌరి పాత్రను హిందీలో కూడా వేశారు.

హిందీ సినిమా హమ్ రాహీలో రాజేంద్ర కుమార్‌తో నటించారు. ఇవి రెండూ పాతికేసి వారాలు థియేటర్లలో ఆడిన సినిమాలు.

జమున తమ సినిమాలో నటిస్తే అది విజయవంతం అవుతుందని నిర్మాతలూ దర్శకులూ అనుకునేవారేమో మరి, ఆమెకు వేషాలు దొరకటంలో ఎప్పుడూ లోటు లేదు.

సినిమాల్లో నిండైన వేషధారణతో నటించటానికే ఇష్టపడ్డారు. ఆమె నిబంధనలకు ఒప్పుకునే ఆమె పాత్ర చిత్రీకరణ ఉండేదని అనిపిస్తాయి ఆమె సినిమాలు. 

కాంగ్రెస్ పార్టీలో చేరి రాజకీయాల్లో కూడా పనిచేశారు. సినిమాల్లో పని చేసే వృద్ధ కళాకారులకు పెన్షన్ సౌకర్యం కావాలని చాలా కృషి చేశారామె.

జమున

ఆత్మవిశ్వాసం నిండిన వ్యక్తిత్వం

ఈ రోజుల్లో సినిమాల్లో పనిచేసే మహిళలు ఎదుర్కొంటున్న కాస్టింగ్ కౌచ్, కమిట్మెంట్ లాంటి ఇబ్బందికరమైన అంశాల గురించి ఆమె అభిప్రాయాలు సూటిగా ఆమె మనస్తత్వానికి తగినట్టే ఉన్నాయి.

అటువంటి పరిస్థితులకు లొంగకుండా ఉండటమే పరిష్కారం అంటారు. సినిమా వేషాలు లేకపోతే వేరే ఏదయినా ఉద్యోగాలు చేసుకొమ్మని సలహా ఇస్తారు.

సినిమా రంగం ఇలాగే ఉంటుంది, ఇవన్నిటికీ ఒప్పుకుంటేనే వేషాలు దొరుకుతాయనే ముందస్తు ఊహలతో ఈ రంగంలోకి అడుగుపెట్టక్కరలేదు, ఇక్కడా మంచివాళ్లు ఉంటారని ఆమె అభిప్రాయం.

తనకాలంలో ఉన్నన్ని అవకాశాలు ఇప్పటి అమ్మాయిలకు లేవు. సినిమాల్లో కథలూ లేవు, బలమూ లేదు. బొమ్మల్లాంటి హీరోయిన్ల కొరత ఇప్పుడు లేదు.

అలాగే తనంత గట్టిగా హీరోలకు ఎదురునిలిచే స్తోమత, స్థాయి కూడా అందరికీ ఉండదు.

ఏదెలా ఉన్నా తను బ్రతికిన కాలంలో తను విధించుకున్న, విధించిన నిబంధనల ప్రకారమే కెరీర్‌ను విజయవంతంగా మలచుకున్న నటి జమున. దీనికామె అందం, అభినయం, ఆ కాలం అన్నీ కలిసివచ్చాయి.

వీడియో క్యాప్షన్, జనాబాయి జమునగా ఎలా మారారు?

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)