షారుక్ ఖాన్: తొలి రోజే రూ.100 కోట్లను దాటేసిన పఠాన్...విమర్శకులు ఏమన్నారు?

పఠాన్ సినిమా వసూళ్లు

ఫొటో సోర్స్, YRF

బాలీవుడ్ నటుడు షారుక్ ఖాన్ సినిమా ‘పఠాన్’ థియేటర్లలో విడుదలై బాక్సాఫీసు మంచి వసూళ్లు రాబడుతోంది.

షారుక్ అభిమానులు, సినీ విమర్శకులు ఈ సినిమాపై మొదటి నుంచి ఆసక్తిగా ఉన్నారు.

నాలుగేళ్ల తర్వాత షారుఖ్‌ ఖాన్ మళ్లీ వెండి తెరపైకి వచ్చారు. సినిమా విడుదల కాక ముందు నుంచే పఠాన్ సినిమా మీద పెద్ద ఎత్తున చర్చజరిగింది.

బుధవారం థియేటర్లలో విడుదలైన ‘పఠాన్’ సినిమా ఈ ఏడాది అతిపెద్ద విజయంగా మారనుందని సినీ విమర్శకులు అంచనా వేస్తున్నారు.

కొంతమంది ప్రజలు ఈ సినిమాను అనవసరమైనదిగా, హాస్యాస్పదమైనదిగా విమర్శించగా, షారుక్ ఖాన్ వెండితెరపై తనదైన మ్యాజిక్‌‌ చేశారని అభిమానులు అంటున్నారు.

‘‘బాలీవుడ్ మళ్లీ తిరిగొచ్చింది. షారుక్ ఖాన్ మళ్లీ వచ్చేశాడు’’ అంటూ సినీ విమర్శకురాలు సుభద్ర గుప్తా ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌కి రాసిన కథనంలో పేర్కొన్నారు.

పఠాన్ సినిమాలో షారుక్ ఖాన్‌తో పాటు దీపికా పదుకొణె, జాన్ అబ్రహంలు ప్రధాన పాత్రలలో నటించారు.

ఈ సినిమా కథంతా పఠాన్ క్యారెక్టర్ చుట్టూనే తిరుగుతుంది. ఈ పాత్రలో షారుక్ ఖాన్ నటించారు. సినిమాలో పఠాన్ ఒక ఇంటెలిజెంట్ మిషన్‌పై పనిచేస్తూ ఉంటాడు.

తీవ్రవాద గ్రూప్ భారత్‌పై దాడి చేయకుండా అడ్డుకోవడమే అతని పని.

యూట్యూబ్‌లో ఈ సినిమా ట్రైలర్‌ను 5 కోట్ల మందికి పైగా ప్రజలు చూశారు.

ప్రపంచవ్యాప్తంగా 8 వేల స్క్రీన్లపై ఈ సినిమా విడుదలైందని, బాలీవుడ్‌ సినిమాకు ఇది అతిపెద్ద ఓపెనింగ్ అని సినీ విమర్శకుడు తరణ్ ఆదర్శ్ అన్నారు.

భారత్‌లో పఠాన్ తొలి రోజు వసూళ్లు రూ.57 కోట్లుగా ఉన్నాయని ప్రముఖ సినీ విమర్శకుడు కమల్ నహతా ట్వీట్ చేశారు.

‘‘హిందీ సినిమాల్లో ఇదే అతిపెద్ద ఓపెనింగ్. పైగా సినిమా విడుదలైన తొలి రోజు సెలవు లేదు. ఈ సినిమా సీక్వెల్ కూడా కాదు’’ అని ఆయన తన ట్వీట్‌లో పేర్కొన్నారు.

సినిమా చూసిన ప్రేక్షకుల నుంచి మిశ్రమమైన స్పందన వస్తోంది.

‘‘షారుక్ ఖాన్ నటన, సల్మాన్ ఖాన్ ఎంట్రీ, దీపికా పదుకొణె డ్యాన్స్ చాలా బాగున్నాయి. పిల్లల దగ్గర్నుంచి పెద్దల దాగా చూడగలిగిన కుటుంబ తరహా సినిమా ఇది’’ అని ఒక ప్రేక్షకురాలు బీబీసీతో అన్నారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

పోస్ట్ of X ముగిసింది

‘‘సినిమాలో డైలాగ్స్ అన్ని కూడా అద్భుతంగా ఉన్నాయి. చివరిలో సల్మాన్ ఖాన్ సినిమాలో షారుక్ ఖాన్ కనిపించనున్నాడనే సంకేతాన్ని కూడా ఇచ్చారు’’ అని మరో ప్రేక్షకురాలు తెలిపారు.

అయితే, కొంతమంది ప్రేక్షకులు మాత్రం స్క్రిప్ట్, మాటల విషయంలో అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

‘‘ఇది యావరేజ్ ఫిల్మ్. ప్రేక్షకులు దీనిలో ఉన్న నటుల అందాన్ని చూస్తున్నారు. కానీ, ఇదంతా అందంగా లేదు. స్టోరీ, స్క్రీన్‌ప్లే అంత ఆశించిన స్థాయిలో లేవు. సినిమా చాలా వేగంగా సాగిపోతుంది’’ అని మరో ప్రేక్షకుడు అన్నారు.

ఈ సినిమా చూసేందుకు ప్రేక్షకుల నుంచి అనూహ్యమైన స్పందన వస్తుండటంతో, అదనంగా షోలు వేసేందుకు తాము అన్ని ఏర్పాట్లు చేశామని సినిమా థియేటర్ల యజమానులు చెప్పారు.

కరోనా సమయంలో మూసివేసిన ఉత్తర భారతంలో 25 సింగిల్ సిల్వర్ స్క్రీన్ హాళ్లను, పఠాన్ సినిమా వేసేందుకు తిరిగి తెరిచినట్టు షారుక్ ఖాన్ ట్వీట్ చేశారు.

అడ్వాన్స్ బుకింగ్‌లోనూ పఠాన్ రికార్డులను కొల్లగొడుతోంది.

ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి అనూహ్యమైన స్పందన వస్తున్నట్టు మూవీ టిక్కెటింగ్ ప్లాట్‌ఫామ్ బుక్‌మైషో, న్యూస్ ఏజెన్సీ పీటీఐకి తెలిపింది.

సోమవారం వరకు 10 లక్షలకు పైగా టిక్కెట్లు బుక్ అయిపోయినట్టు చెప్పింది. ఇప్పటి వరకైతే సినిమాకు మంచి రివ్యూలు వస్తున్నాయి.

పఠాన్ సినిమా వసూళ్లు

ఫొటో సోర్స్, YRF

సినీ విమర్శకులు ఏం చెబుతున్నారు?

‘‘ఎక్కడా తగ్గకుండా యాక్షన్ సినిమా అవ్వడమే కాకుండా, ఈ సినిమాలో గ్లామరస్ నటులు నటించారు. దేశాన్ని రక్షించే ప్రధాన పాత్రలో హీరో అద్భుతంగా నటించాడు.

ప్రతి సన్నివేశం మీ హార్ట్‌బీట్‌ను పెంచుతుంది. భావోద్వేగ సన్నివేశాలు సైతం ఈ సినిమాలో ఉన్నాయి’’ అని సుభద్ర గుప్తా అన్నారు.

నేటి ఇండియన్ సినీ క్యాంపెయిన్‌లో పఠాన్ హీరోగా మారాడని సినీ విమర్శకురాలు దీపంజన పాల్ అన్నారు. హీరోగా తనదైన మార్కు వేసుకున్నాడని, ఇది పూర్తిగా కొత్తదనంగా, ప్రత్యేక శైలిలో ఉందని చెప్పారు.

రొమాంటిక్ హీరోగా పేరున్న షారుక్ ఖాన్, ఈసారి తనకు అప్పగించిన బాధ్యతలను నెరవేర్చేందుకు పూర్తి పరిపక్వతతో వ్యవహరించారని ఆమె రాసుకొచ్చారు.

సినిమాలో కొన్ని సన్నివేశాలు మాత్రం అర్థం కానివిగా, ఊహించిన విధంగా ఉన్నాయన్నారు.

ఈ గూఢచారి సినిమాలో వినోదం భారీ స్థాయిలో ఉందని మింట్ లాంజ్ న్యూస్‌పేపర్‌లో ఉదయ్ భాటియా పేర్కొన్నారు.

కొన్ని సన్నివేశాల్లో స్టంట్స్ చాలా సాదాసీదాగా, ఊహించే విధంగా ఉన్నాయని సినీ విమర్శకురాలు నందినీ రామనాథ్ అన్నారు. ఇది స్క్రీన్‌ప్లేను పేలవంగా మార్చిందన్నారు.

కానీ, పఠాన్ సినిమాలో యాక్షన్ సన్నివేశాలు వచ్చినప్పుడు, హీరో మాటలు రాసిన స్క్రీన్ ‌రైటర్ అబ్బాస్ టైర్‌వాలా అద్భుతమైన డైలాగ్స్ సమయంలో మళ్లీ మూవీ ట్రాక్‌లోకి వచ్చినట్టు అనిపిస్తుందని ఆమె రాశారు.

పఠాన్ సినిమా వసూళ్లు

ఫొటో సోర్స్, CREDIT - YRF PR

తొలి రోజే రూ.100 కోట్లు దాటేసిన సినిమా

సినీ నిర్మాణ సంస్థ యష్ రాజ్ ఫిల్మ్స్ విడుదల చేసిన వివరాల ప్రకారం, భారత్‌లో హిందీ వెర్షన్‌కు తొలి రోజే రూ.55 కోట్లను, ఇతర భాషల్లో రూ.2 కోట్లను సంపాదించిందీ సినిమా.

మొత్తంగా ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా తొలి రోజే రూ.106 కోట్లను వసూలు చేసి, అన్ని హిందీ సినిమాలను తొలి రోజు వసూళ్లలో వెనక్కి నెట్టింది.

పఠాన్ రూ.100 కోట్లను క్రాస్ చేయడంపై చిత్ర బృందానికి బాలీవుడ్ దర్శక నిర్మాత కరణ్ జోహార్ అభినందనలు తెలియజేశారు.

రాయీస్ సినిమాలో షారుఖ్ ఖాన్‌తో కలిసి పనిచేసిన జీషాన్ నైట్ షోను తాను చూసినట్టు చెప్పారు. జాన్ అబ్రహ్మం తన పాత్రలో అద్భుతంగా నటించాడని, టీమ్ మొత్తానికి శుభాకాంక్షలను తెలిపారు.

పఠాన్‌ సినిమాపై చాలా మంచి రిపోర్టులు వస్తున్నాయని షారుఖ్ ఖాన్‌ను ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశారు కమల్ హాసన్.

పఠాన్ సినిమా విడుదలకు ముందు ఆందోళనలెందుకు?

అయితే, ఈ సినిమా విడుదలకు ముందు నుంచే తీవ్ర చర్చనీయాంశంగా మారింది. కొన్ని రాష్ట్రాల్లో ఈ సినిమా విడుదల సమయంలో ఆందోళనలు, విధ్వంసకర సంఘటనలు జరిగాయి.

ఈ సినిమా విడుదల కాకుండా ఆపేందుకు ప్రయత్నించిన, విధ్వంసానికి దిగిన 30 మందిపై బెంగళూరులోని బెళగావి జిల్లాలో పోలీసులు కేసు పెట్టారు.

హరియాణాలో పోస్టర్లను చించేసిన కొందరిపై కూడా కేసు దాఖలైంది.

పఠాన్ విడుదలకు ముందు కూడా కొన్ని హిందూ సంస్థలు ఆందోళనలు చేశాయి.

బేషరమ్ పాటలో దీపికా పదుకొనే వేసుకున్న కాషాయ రంగు దుస్తులు చర్చనీయాంశంగా మారాయి.

షారుఖ్ ఖాన్ హిందువులను అవమానిస్తున్నారని మితవాదుల సంఘాలు ఆరోపించాయి.

వీడియో క్యాప్షన్, పఠాన్: కశ్మీర్‌లో ఈ హీరోకూ సాధ్యం కానిది షారుఖ్ ఖాన్‌కు ఎలా సాధ్యమైంది?

ఇది కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)