మైఖేల్ సినిమా రివ్యూ: గ్యాంగ్‌స్టర్ సందీప్ కిషన్ బుల్లెట్ దించాడా... లేదా?

ఫొటో సోర్స్, Ranjit Jeyakodi/Facebook
- రచయిత, సాహితి
- హోదా, బీబీసీ కోసం
గ్యాంగ్ స్టర్ కథలంటే... ప్రతీ హీరోకూ మక్కువే.
తుపాకులు, స్టైల్, యాక్షన్... అన్నీ ఉంటాయి. ఓ ష్లాష్ బ్యాక్ తప్పనిసరి. హీరో గతం తవ్వితే ఆ పాత్రపై భయంతో కూడిన జాలి కలుగుతుంది. గ్యాంగ్ స్టర్ నేపథ్యంలో వచ్చిన సినిమాలు తిరగేస్తే, వాటిలో ఇవే కనిపిస్తాయి.
ఓ రకంగా... ఈ సినిమాల్లో విజయశాతం కూడా ఎక్కువే. కన్నడ సీమలో వచ్చిన `కేజీఎఫ్`, తెలుగులో దుమ్ము రేపిన `పుష్ప` గ్యాంగ్ స్టర్ కథలే. జీరో నుంచి హీరోగా ఎదిగిన వైనం ఈ సినిమాల్లో కనిపిస్తుంది.
ఇప్పుడొచ్చిన `మైఖేల్` కూడా ఇదే జాబితాలో చేరే సినిమా. గ్యాంగ్‌స్టర్ సినిమాల కొలతల్ని ఏమాత్రం నిర్లక్షం చేయకుండా, అదే టెంప్లేట్‌లో వచ్చిన `మైఖేల్` ఎలా ఉన్నాడు? ఏం చేశాడు..?

ఫొటో సోర్స్, Aditya Music/Facebook
ముంబయిలో డాన్
మైఖేల్ (సందీప్ కిషన్) చిన్నప్పుడే... ఓ బ్యాగు, అందులో అమ్మ ఫొటో, వాక్‌మెన్.. పట్టుకొని ముంబయిలో అడుగుపెడతాడు. నిర్లక్ష్యమైన చూపులు, తీవ్రమైన ఆశయం... ఇవే మైఖేల్‌లో కనిపించే లక్షణాలు.
ఎవరినీ లెక్క చేయడు. ధైర్యం ఎక్కువ. ముంబైలో గురునాథ్ (గౌతమ్ మీనన్) పెద్ద డాన్. తనకెవరైనా తలొంచాల్సిందే. అలాంటి గురునాథ్‌ని చిన్నప్పుడే కాపాడతాడు మైఖేల్. ఆ ధైర్యం చూసి ఆశ్రయం ఇస్తాడు గురునాథ్.
మైఖేల్‌కి ఓ టాస్క్ అప్పగిస్తాడు గురునాథ్. ఆ టాస్క్ ఏమిటి? అది మైఖేల్ జీవితాన్ని ఎలా మార్చింది? నిజానికి మైఖేల్ ఎవరు? ఎక్కడి నుంచి వచ్చాడు? ఎందుకొచ్చాడు? తన ఆశయం ఏమిటి? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం తెరపై చూసి తెలుసుకోవాలి.

ఫొటో సోర్స్, Aditya Music/Facebook
ఇదో రెగ్యులర్ గ్యాంగ్‌స్టర్ కథ. ఓ అనామకుడు గ్యాంగ్‌స్టర్‌గా ఎదిగే క్రమం ఈ కథలో కనిపిస్తుంది. `నాయకుడు` నుంచి `పుష్ప` వరకూ ప్రతి కథా ఇలాంటిదే. ఇదే కొలతలతో సాగుతుంది. `మైఖేల్` అందుకు మినహాయింపు కాదు.
కేజీఎఫ్ లక్షణాలు ఇందులో పుష్కలంగా కనిపిస్తాయి. కేజీఎఫ్ లాంటి నేరేషన్, స్టైల్, ఎడిటింగ్ కట్... ఇవన్నీ `మైఖేల్`లో అడుగడుగునా దర్శనమిస్తాయి. సడన్‌గా చూస్తే... `కేజీఎఫ్`కి ఇంకో వెర్షన్ చూస్తున్నామా అనే భ్రమ కూడా కలుగుతుంది. కేజీఎఫ్ విజయవంతమైన చిత్రం. అలాంటి సినిమాని స్ఫూర్తి తీసుకొని, అలాంటి సినిమా తీయాలనుకోవడం తప్పు లేదు. కానీ అలాగే తీయాలనుకోవడం తప్పు.
బలమైన కథలోంచి బలమైన పాత్రలూ, వాటి నుంచి శక్తిమంతమైన సన్నివేశాలు పుట్టుకొస్తాయి. ఇక్కడ కథే బలహీనంగా ఉంది. ఇందులో ఎవరు విలన్ అనేది ముందే తెలిసిపోతుంటుంది. కథలో మలుపులున్నా ఆసక్తికరంగా ఉండవు. ఎమోషన్ ఉన్నా అది గుండెలోతుల్లోకి చేరదు.

ఫొటో సోర్స్, Aditya Music/Facebook
మేకింగ్ మీదే ఫోకస్
కథను ప్రారంభించిన విధానంలో ఇంటెన్సిటీ కనిపిస్తుంది. మైఖేల్ అనే ఓ శక్తిమంతమైన పాత్ర చూడబోతున్నాం అనిపిస్తుంది. అయితే, ఆయా సన్నివేశాలలో కేజీఎఫ్‌తో పోలికలు కనిపిస్తాయి. హీరో - హీరోయిన్ల లవ్ ట్రాక్‌కి `అంతం` లాంటి చిత్రాలు రిఫరెన్స్ కావొచ్చు. వీటితో పాటుగా మరికొన్ని గ్యాంగ్ స్టర్ కథలు కళ్ల ముందు కదలాడుతూ ఉంటాయి.
గ్యాంగ్‌స్టర్ సినిమా అంటే అలానే తీయాలన్నది దర్శకుడి ఉద్దేశం కావొచ్చు. కథపై, కథలో రావాల్సిన సంఘర్షణపై దర్శకుడు దృష్టి పెట్టలేదు. కేవలం మేకింగ్‌పై ఫోకస్ పెట్టాడు. అంత వరకూ రాణించాడు కూడా. తెరపై సన్నివేశాల రూపకల్పన చూస్తుంటే, దర్శకుడిలో విషయం ఉన్నట్టే అనిపిస్తుంటుంది.
సాంకేతిక నిపుణుల నైపుణ్యం కూడా కనిపిస్తుంటుంది. అయితే ఇంతా కష్టపడింది రొటీన్ కథ గురించా? అనిపిస్తే.. నిర్మాతలపై జాలి వేస్తుంటుంది.
లవ్ ట్రాక్ ఈ సినిమాకు అత్యంత కీలకం. ఈ ట్రాక్‌ని బాగా రాసుకొని ఉంటే ‘మైఖేల్’ కష్టానికి తగిన ప్రతిఫలం దక్కేది. హీరో హీరోయిన్లు ప్రేమలో పడతారా? పడితే బాగుంటుంది.. అనే ఫీలింగ్ ఎక్కడా ప్రేక్షకుడికి కలగదు. పోనీ.. హీరోయిన్‌ని హీరో కాపాడతాడా? అనే ఆసక్తీ ఉండదు. హీరోయిన్ పాత్రపై సింపతీ కానీ, ప్రేమ గానీ పుట్టదు. దాంతో ఆ పాత్రతో కానీ, లవ్ ట్రాక్‌తో కానీ ప్రయాణం చేయడం కష్టం అవుతుంది.
విజయ్ సేతుపతి పాత్ర సర్‌ప్రైజింగ్‌గా అనిపిస్తుంది. సెకండాఫ్ పూర్తిగా డ్రాప్ అయిపోతున్నప్పుడు ఆ పాత్ర వచ్చి కాస్త కాపు కాస్తుంది.
సినిమాలో మాటలు తక్కువ, బుల్లెట్ల శబ్దాలు ఎక్కువ. రక్తం ఏరులై పారుతుంది. నరుక్కోవడాలూ, చంపుకోవడాలూ. నెగిటీవ్ పాత్రలే ఎక్కువ కనిపిస్తుంటాయి. హీరో లక్ష్యం ఏమిటో అర్థమైపోయినప్పుడు ఈ గ్యాంగ్ స్టర్ కథ కాస్త రివెంజ్ డ్రామాలా మారిపోతుంది. ఎడిటింగ్ ప్యాటర్న్, స్టైలీష్ మేకింగ్... ఇవన్నీ కొత్తగా అనిపించినా.. బీసీల నాటి కథ తీసుకోవడం వల్ల సన్నివేశాలు తేలిపోతుంది.

ఫొటో సోర్స్, Aditya Music/Facebook
వెరైటీ పాత్రలో సందీప్ కిషన్
సందీప్ కిషన్‌కి ఇది కచ్చితంగా కొత్త తరహా పాత్రే. చాలా తక్కువ మాట్లాడతాడు. కొన్ని కొన్ని సీన్లలో అసలు డైలాగులే ఉండవు. అసలు హీరోది మూగ పాత్రేమో అనే డౌటు కూడా వస్తుంటుంది. ఆ సీన్లలో చాలా సటిల్డ్‌గా చేశాడు. యాక్షన్ సన్నివేశాల్లో రెచ్చిపోయాడు.
గౌతమ్ మేనన్ స్టైలీష్ డాన్‌గా కనిపించాడు. ఇంత లెంగ్తీ పాత్ర ఆయన కూడా ఇది వరకు చేయలేదు. విజయ్ సేతుపతి 20 నిమిషాలే తెరపై కనిపిస్తాడు. అందులో యాక్షన్ పార్టే ఎక్కువ. ఆయా సన్నివేశాలు ఆయన అభిమానులకు నచ్చేలా ఉంటాయి.
కథను మలుపు తిప్పే పాత్ర కాదు కానీ.. కథ పడిపోకుండా ఆ పాత్ర అడ్డుకుంటుంది. ఈ సినిమాలో సర్‌ప్రైజింగ్ ప్యాకేజీ.. వరుణ్ సందేశ్. విలనీ టచ్‌తో సాగే పాత్రలో వరుణ్ కొత్తగా కనిపిస్తాడు.
టెక్నికల్‌గా చాలా హై స్టాండర్డ్‌లో ఉంది సినిమా. శ్యామ్ సి.ఎస్ ఇచ్చిన నేపథ్య సంగీతం, బీజియమ్స్... సన్నివేశాల్ని ఎలివేట్ చేశాయి. కొత్త మూడ్ క్రియేట్ చేశాయి. కెమెరా పనితనం కూడా సూపర్బ్‌గా అనిపిస్తుంది. ఆ లైట్, మూడ్.. అన్నీ వేరేలా ఉన్నాయి. డైలాగుల్లో కొన్ని ఆకట్టుకొన్నాయి. ముఖ్యంగా మైఖేల్ పాత్రని పరిచయం చేసేటప్పుడు చెప్పే డైలాగులు బాగున్నాయి. పాటలకు స్కోప్ తక్కువ. సినిమా అంతా యాక్షనే. వాటిపై ఎక్కువ ఫోకస్ చేశారు. గ్యాంగ్‌స్టర్ సినిమా కాబట్టి ఆమాత్రం ఉండాలి.
ఈతరం దర్శకులు టెక్నికల్ విషయాలపై ఎక్కువ దృష్టి పెడుతున్నారు. సినిమా గ్రాండియర్‌గా ఉండాలనుకొంటున్నారు. ఇవన్నీ మంచి విషయాలే. కానీ, వాటితో పాటు కథ మీద కూడా తగినంత దృష్టి పెడితే బాగుంటుందేమో అని మైఖేల్ లాంటి సినిమాలు చూస్తున్నప్పుడు అనిపిస్తుంది.
ఇవి కూడా చూడండి:
- ‘అతడు నన్ను చంపేసుండేవాడు.. ఇద్దరు పిల్లలు పుట్టాక విడిపోయినా హింస కొనసాగింది’
- గౌతమ్ అదానీ: 25 ఏళ్ల క్రితం గుజరాత్లో అదానీని కిడ్నాప్ చేసింది ఎవరు? అప్పుడు ఏం జరిగింది?
- ఆంధ్రప్రదేశ్: పొలాల్లొకి వచ్చే అడవి ఏనుగులను తరిమికొట్టే కుంకీ ఏనుగులు - వీటిని ఎలా పట్టుకుంటారు? ఎలా శిక్షణ ఇస్తారు?
- దళిత గ్రామాలకు రూ.21 లక్షలు ఇచ్చే ఈ పథకం గురించి తెలుసా?
- సున్తీ తర్వాత సెక్స్ సామర్థ్యం పెరుగుతుందా? నాలుగు ప్రశ్నలు, సమాధానాలు
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














