స్వలింగ సంపర్కులను పట్టుకునేందుకు డేటింగ్ యాప్స్‌లో పోలీసుల వేట

ఎల్జీబీటీ

ఫొటో సోర్స్, Reuters

    • రచయిత, అహ్మద్ షిహాబ్-ఎల్డిన్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

ఈజిప్ట్‌లో స్వలింగ సంపర్కం ఓ కళంకం లాంటిది. పోలీసులు ఎల్జీబీటీ వ్యక్తులను ఆన్‌లైన్‌లో వెతుకుతున్నారనే ఆరోపణలు చాలా కాలంగా ఉన్నాయి.

ఎల్జీబీటీ వ్యక్తులను పట్టుకోవడానికి అధికారులు డేటింగ్, సోషల్ మీడియా యాప్‌లను ఎలా ఉపయోగిస్తున్నారనే సమాచారం బీబీసీ న్యూస్ తెలుసుకుంది.

(ఈ కథనంలో బాధితులందరి పేర్లు మార్చాం.)

ఈజిప్ట్‌లో పెరిగిన నాకు, సమాజంలో వ్యాపిస్తున్న స్వలింగ సంపర్కం గురించి తెలుసు.

కానీ, ఇటీవల పరిస్థితులు చాలా దారుణంగా మారాయని, ఎల్జీబీటీ వ్యక్తులను గుర్తించే వ్యూహాలు మరింత అధునాతనంగా ఉన్నాయని అక్కడి స్నేహితులు నాకు చెప్పారు.

ఈజిప్ట్‌లో స్వలింగ సంపర్కానికి వ్యతిరేకంగా స్పష్టమైన చట్టం లేదు. సెక్స్ వర్కర్స్ చట్టం ఎల్జీబీటీ కమ్యూనిటీని నేరంగా పరిగణించడానికి ఉపయోగిస్తున్నట్లు మా పరిశోధనలో తెలిసింది.

ఆన్‌లైన్ డేటింగ్‌లో భాగమైన ఎల్జీబీటీ వ్యక్తులపై మోపిన అభియోగాలు నిరూపించడానికి సాక్ష్యాల కోసం అధికారులు ఆన్‌లైన్‌లో వెతుకుతున్నారు. ఇది పోలీసులు తమ అరెస్టు రిపోర్టులలో సమర్పించిన ట్రాన్‌స్క్రిప్ట్‌ల ద్వారా తెలుస్తోంది.

పోలీసులు చాటింగ్ ఎలా ప్రారంభిస్తారో అవి చెబుతున్నాయి.

మధ్యప్రాచ్యంలో ఈజిప్ట్ అత్యంత వ్యూహాత్మకమైన, ముఖ్యమైన పాశ్చాత్య మిత్రదేశాలలో ఒకటి. ప్రతి సంవత్సరం అమెరికా, యూరప్ మద్దతుతో ఈ దేశం బిలియన్ల డాలర్లను అందుకుంటోంది.

ఏటా సుమారు 50 లక్షల మంది బ్రిటిష్ పర్యాటకులు ఈ దేశాన్ని సందర్శిస్తారు. యూకే ఈజిప్ట్ పోలీసు బలగాలకు ఐక్యరాజ్య సమితి ద్వారా శిక్షణనిస్తోంది.

హూస్‌హియర్ అనే డేటింగ్ యాప్‌లో ఓ పోలీసు అధికారి ఎల్జీబీటీ వ్యక్తితో చాటింగ్ చేశారు. అనంతరం ఆ ఎల్జీబీటీ వ్యక్తిని కలిసి, అదుపులోకి తీసుకున్నారు.

పోలీస్: ఇంతకు ముందు మగవాళ్లతో పడుకున్నావా?

యాప్ యూజర్: అవును.

పోలీస్: ఎలా కలుద్దాం?

యాప్ యూజర్: కానీ, నేను అమ్మ, నాన్నలతో ఉంటున్నా.

పోలీస్: రా డియర్, సిగ్గుపడకు. మనం పబ్లిక్‌గా కలుసుకుని, నా ఫ్లాట్‌కి వెళ్దాం.

ఇలాంటివే మరిన్ని ఉదాహరణలు ఉన్నాయి.

ఎల్జీబీటీ

ఫొటో సోర్స్, Getty Images

యాప్‌లు ఏంటి? ఎలా పట్టుకుంటున్నారు?

ఎల్జీబీటీ వ్యక్తులు ఈజిప్టులో బహిరంగంగా కలుసుకోవడం చాలా కష్టం. కాబట్టి డేటింగ్ యాప్‌ల ద్వారా కలుసుకుంటారు.

శృంగారం చేయకపోయినా యాప్‌లు వాడుతున్నారని, వ్యభిచారానికి ప్రేరేపిస్తున్నారని నైతిక విలువల చట్టాల ఆధారంగా వారిని అరెస్టు చేస్తున్నారు.

అయితే, పోలీసులు కేవలం ఈజిప్షియన్లనే లక్ష్యంగా చేసుకోలేదు. ప్రముఖ గే డేటింగ్ యాప్ అయిన గ్రిండర్‌లో మాట్ అనే విదేశీయుడిని గుర్తించినట్లు ఒక ట్రాన్‌స్క్రిప్ట్‌లో పోలీసులు వివరించారు.

మాట్ తన వక్రబుద్ధిని బయటపెట్టాడని పోలీసుల రిపోర్టులో రాశారు. ఒక పోలీసు ఇన్‌ఫార్మర్ మాట్‌తో చాటింగ్‌లో నిమగ్నమయ్యాడు.

అయితే, ఉచితంగానే వ్యభిచారం చేయడానికి సుముఖత వ్యక్తం చేశాడు. అంతేకాదు తన శరీరం ఫొటోలు కూడా పంపాడు అని రిపోర్టులో తెలిపారు.

మాట్ బీబీసీతో మాట్లాడుతూ తనను అరెస్టు చేశారని, అభియోగాలు మోపి బహిష్కరించారని చెప్పారు.

కొన్ని రిపోర్టులలో పోలీసులు డబ్బు కోసం సెక్స్‌కు అంగీకరించేలా డేటింగ్ లేదా కొత్త స్నేహాలను కోరుకునే వ్యక్తులను ఒత్తిడి చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తోంది.

కోర్టులో కేసు వేయడానికి అవసరమైన సాక్ష్యాల కోసం డబ్బు చేతులు మారినట్లు రుజువు చేయడం లేదా మరేదైనా ఆఫర్ అందించవచ్చని ఈజిప్ట్‌ న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

అరెస్టు చేసి జైల్లో వేస్తున్నారు

పోలీసుల రిపోర్టుల ద్వారా లైత్ అనే స్వలింగ సంపర్కుడిని కనుగొన్నాం. 2018 ఏప్రిల్‌లో తన స్నేహితుడి ఫోన్ నుంచి లైత్‌ను సంప్రదించారు.

లైత్ మాట్లాడుతూ, ''హలో ఎలా ఉన్నారు అంటూ మెసేజ్ వచ్చింది. ఏదైనా డ్రింక్ తాగుదామని రమ్మన్నాడు'' అని తెలిపారు.

ఆ స్నేహితుడిని కలవడానికి లైత్ వెళ్లగా, అతను కనిపించలేదు. పోలీసులు అక్కడికి వచ్చారు. లైత్ ను అరెస్టు చేసి వైస్ స్క్వాడ్‌కు చెందిన సెల్‌లో వేశారు.

ఒక పోలీసు తన చేతిపై కాలుతున్న సిగరెట్‌ను పొడిచినట్లు లైత్ తెలిపారు. మచ్చను చూపిస్తూ, తన జీవితంలో చనిపోవాలని ప్రయత్నించిన ఏకైక క్షణం అదేనని అన్నారు.

హూస్‌ హియర్ యాప్‌లో పోలీసులు నకిలీ ప్రొఫైల్‌ను తయారు చేశారని, ఫోటోలను స్పష్టంగా కనిపించేలా డిజిటల్‌గా మార్చారని ఆయన పేర్కొన్నారు.

అనంతరం శృంగారానికి రెడీ అన్నట్లు చాట్ చేస్తారని తెలిపారు.

ఆయన కాదని చెప్పడానికి మార్పింగ్ చేసిన చిత్రాలు రుజువు అంటున్నారు. ఎందుకంటే ఫొటోలో ఉన్న కాళ్లు తన కాళ్లను పోలి ఉండవు.

ఆయన కాళ్లలో ఒకటి పెద్దగా ఉంది అన్నారు. బీబీసీకి కేవలం గ్రైనీ ఫోటో, పోలీస్ కేస్ ఫైల్‌లకు మాత్రమే యాక్సెస్‌ ఉంది. కనుక ఈ వివరాలను బీబీసీ ధ్రువీకరించలేదు.

ఎల్జీబీటీ
ఫొటో క్యాప్షన్, లలిత్ (కుడివైపున)

ఆన్‌లైన్ నిఘాపై ప్రభుత్వం ప్రకటన

మరో ముగ్గురు వ్యక్తులు కూడా తమను పోలీసులు బలవంతంగా, తప్పుడు వాగ్ధానాలతో అదుపులోకి తీసుకున్నట్లు ఆరోపించారు. వ్యభిచారం ఆరోపణలతో లైత్ కు మూడు నెలల జైలు శిక్ష పడింది. అయితే అతను అప్పీల్ చేయగా దాన్ని నెలకు తగ్గించారు.

తనకు తెలిసిన ఇతర స్వలింగ సంపర్కుల గురించి కూడా పోలీసులు తెలుసుకోవడానికి ప్రయత్నించారని లైత్ స్పష్టంచేశారు.

క్వీర్ ఈజిప్ట్ అండర్ అటాక్ అనే బీబీసీ డాక్యుమెంటరీ కోసం మేం వారి గుర్తింపు బయటపడకుండా వినూత్నమైన ఫేస్-ట్రాకింగ్ 3-డీ మాస్కింగ్‌ ఉపయోగించాం. మారువేషంలో ఉండే సాధారణ బ్లాబింగ్ టెక్నిక్ కంటే ఈ చిత్రానికి మరింత ఆకర్షణీయమైన రూపాన్ని అందించడం దీని లక్ష్యం.

''నాకు పేర్లు చెప్పకపోతే నేను మీ మీద మొత్తం కథను అల్లేయగలను'' అని ఓ పోలీసు బెదిరించినట్లు లైత్ తెలిపారు.

ఈజిప్ట్ ప్రభుత్వం "స్వలింగ సంపర్కులు"గా చెప్పుకునే వారి కోసం ఆన్‌లైన్ నిఘా వాడటంపై బహిరంగంగానూ స్పందించింది.

2020లో ఇంటర్నెట్ క్రైమ్స్, హ్యూమన్ ట్రాఫికింగ్ ఇంటీరియర్ మంత్రి మాజీ అసిస్టెంట్ అహ్మద్ తాహెర్ వార్తాపత్రిక అహ్ల్ మాస్ర్‌తో మాట్లాడారు. "గ్రూప్ సెక్స్ పార్టీలు, స్వలింగ సంపర్కుల సమావేశాలు తెలుసుకునేందుకు మేం వర్చువల్ ప్రపంచంలో పోలీసులను నియమించాం" అని అన్నారు.

అయితే, దర్యాప్తునకు సంబంధించిన కార్యకలాపాలలో ఈజిప్టు పోలీసులకు శిక్షణ ఇవ్వడానికి యూకే నిధులు వెళ్లలేదని బ్రిటన్ ఫారిన్ కామన్వెల్త్ అండ్ డెవలప్‌మెంట్ ఆఫీస్ బీబీసీకి స్పష్టంచేసింది.

ఈజిప్టు వంటి దేశాలలో ఎల్జీబీటీల లైంగికతే వారిపై ప్రయోగించే ఆయుధం కావొచ్చు అని విదేశీ వ్యవహారాల కమిటీ అధ్యక్షురాలు, బ్రిటన్ ఎంపీ అలీసియా కెర్న్స్ అభిప్రాయం వ్యక్తంచేశారు.

ఈ ప్రమాదాల గురించి హెచ్చరించడానికి మరిన్ని చర్యలు తీసుకోవాలని తాను కోరుకుంటున్నట్లు బీబీసీతో అన్నారు.

"వారి లైంగికత ఆధారంగా లక్ష్యంగా చేసుకునే అన్ని కార్యకలాపాలను నిలిపివేయాలని నేను ఈజిప్టు ప్రభుత్వాన్ని కోరుతున్నా" అని అలీసియా తెలిపారు.

దీనిపై ఈజిప్టు ప్రభుత్వాన్ని బీబీసీ సంప్రదించినప్పటికీ అధికారులెవరూ స్పందించలేదు.

ఎల్జీబీటీ

ఫొటో సోర్స్, Getty Images

యాప్‌లు సేఫ్ కాదంటున్న సైబర్ నిపుణులు

బీబీసీ యాక్సెస్‌ ఉన్న దాదాపు ప్రతి పోలీసు ట్రాన్‌స్క్రిప్ట్‌లో హూజ్ హియర్ యాప్ గురించి ప్రస్తావించారు.

హూజ్ హియర్ యాప్ కొన్ని లోపాలు కలిగి ఉందని సైబర్ నిపుణులు ఆరోపించారు. హ్యాకర్లకు యూజర్ల లొకేషన్, డేటా తస్కరించడానికి వీలుంటుందని తెలిపారు.

హూజ్ హియర్ డేటాను సేకరించడం, నిల్వచేయడం బ్రిటన్, యూరప్ గోప్యతా చట్టాలను ఉల్లంఘించడమేనని వారంటున్నారు.

అయితే, బీబీసీ అధికారికంగా హూజ్ హియర్‌ని సంప్రదించిన తర్వాత యాప్ దాని సెట్టింగ్‌లను మార్చింది.

"స్వలింగాన్ని కోరుకునే" ఎంపికను తీసివేసింది. ఇది వ్యక్తులను గుర్తించే ప్రమాదం ఉంది.

బీబీసీ అన్వేషణలను హూజ్ హియర్ స్పందిస్తూ సమస్యలను లేవనెత్తినప్పుడు పరిష్కరించడంలో తమకు బలమైన చరిత్ర ఉందని వాదిస్తోంది.

అయితే, వాళ్లు ఈజిప్ట్‌లోని ఎల్జీబీటీ కమ్యూనిటీ కోసం ఎలాంటి పని చేయలేదు.

గ్రిండర్, ఈజిప్టులో ఎల్జీబీటీ వ్యక్తులను కనుగొనడానికి పోలీసులు, నేరస్థులు ఉపయోగించే యాప్.

గ్రిండర్ ఈ ఘటనలపై స్పందిస్తూ "మేం మా యూజర్లకు ఉత్తమ సేవలందించడానికి ఈజిప్షియన్ ఎల్జీబీటీక్యూ కార్యకర్తలు, అంతర్జాతీయ మానవ హక్కుల న్యాయవాదులు, భద్రత-కేంద్రీకృత సాంకేతిక నిపుణులతో పని చేస్తున్నాం" అని తెలిపింది.

ఎల్జీబీటీ

ఫొటో సోర్స్, FACEBOOK/RAINBOW EGYPT

ఎల్జీబీటీలను బెదిరిస్తున్న క్రిమినల్స్

ఎల్జీబీటీల ఆచూకీ కోసం క్రిమినల్‌ గ్యాంగ్‌లు కూడా పోలీసుల వ్యూహాలనే అనుసరిస్తున్నాయి. వారిపై దాడి చేసి అవమానించి, వీడియోలను ఆన్‌లైన్‌లో పోస్ట్ చేస్తానని బెదిరించి బలవంతంగా వసూళ్లు చేస్తున్నాయి.

కొన్నేళ్ళ క్రితం ఈజిప్టులో వైరల్ అయిన వీడియోలో బాధితులైన లైలా, జమాల్ అనే ఇద్దరు వ్యక్తులను ట్రాక్ చేయగలిగాం. ఫుటేజీలో వారిని కొట్టి దుర్భాషలాడుతూ బలవంతంగా బట్టలు విప్పి డ్యాన్స్ చేయించినట్లు కనిపిస్తోంది.

వారు తమ పూర్తి పేర్లను చెప్పాలని, స్వలింగ సంపర్కులమని ఒప్పుకోవాలని మెడ మీద కత్తి పెట్టి బలవంతం చేసినట్లు వీడియోలో కనిపించింది. వీడియో వెనుక సమాజం నుంచి దూరంగా ఉంటున్న బకర్, యాహియా అనే ఇద్దరు ఉన్నట్లు వారు చెప్పారు.

ఎల్జీబీటీ వ్యక్తులను దోపిడీ చేయడానికి వాట్సాప్, యూట్యూబ్, ఫేస్‌బుక్‌లలో వీడియోలను అప్‌లోడ్ చేయడానికి ముందు బకర్, యాహియా సంభాషణలతో కూడిన ఓ నాలుగు వీడియోలను మేం చూశాం.

ఈ వీడియోలలో ఒకదానిలో 18 ఏళ్ల స్వలింగ సంపర్కుడు (సయీద్) ఉన్నారు. తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలని ఆయనను కలిశాం.

దీనిపై చట్టపరమైన చర్య తీసుకోవాలనుకుంటున్నట్లు సయీద్ చెప్పారు. అయితే, సయీద్ లాయర్ దీనికి వ్యతిరేకంగా సలహా ఇచ్చాడని, ఆయన అనుభవించిన దాడి కంటే ఇది ఎక్కువ లైంగిక నేరంగా భావిస్తారని అన్నారు.

సయీద్ ఇప్పుడు తన కుటుంబానికి దూరమయ్యాడు. తమను బ్లాక్ మెయిల్ చేస్తూ ఆ ముఠా వీడియోను పంపడంతో భయాందోళనకు గురై కత్తితో చేయి కోసుకున్నారు.

“ఈజిప్ట్‌లోని నా స్నేహితులందరికీ వీడియోలు సర్క్యులేట్ కావడంతో నేను ఏం జరిగినా డిప్రెషన్‌లోకి వెళ్లిపోతున్నా. నేను బయటకు వెళ్లను, నా దగ్గర ఫోన్ కూడా లేదు. నా గురించి ఎవ్వరికీ తెలియదు'' అని ఆవేదన వ్యక్తంచేశారు.

మీడియా కవరేజీపై ప్రభుత్వం ఆంక్షలు

ఇలాంటి డజన్ల కొద్దీ దాడుల గురించి మాకు తెలిసింది. వీటిని చాలా గ్యాంగ్‌లు చేశాయి. దాడి చేసిన వారిని అరెస్టు చేసినట్లు కొన్ని రిపోర్టులు మాత్రమే ఉన్నాయి.

విచారణలో ఒక గ్యాంగ్ నాయకుడు యాహియా స్వలింగ సంపర్కుడినని తన వ్యభిచార జీవితం గురించి తరచుగా ఆన్‌లైన్‌లో పోస్ట్ చేయడం షాక్ ఇచ్చింది. బహుశా అది యాహియాను నేరపూరితంగా మార్చవచ్చు. తన లక్ష్యాలు ఎంత హాని కలిగిస్తాయో తనకూ తెలుసు.

యాహియా ఇటీవలి దాడుల్లో పాల్గొన్నట్లు మా వద్ద ఎలాంటి ఆధారాలు లేవు. అంతేకాదు ఏ దాడులలోనూ తన ప్రమేయం లేదని యాహియా వాదిస్తున్నారు.

2017 నుంచి ఈజిప్ట్‌లో ఈ సమస్యలను కవర్ చేయడం నిషేధించారు. ఎల్జీబీటీలపై సుప్రీం కౌన్సిల్ ఫర్ మీడియా రెగ్యులేషన్ మీడియా బ్లాకవుట్‌ను విధించింది. తమ ప్రవర్తన సరికాదనే కోణంలో తెలియజేయడానికి మినహాయింపునిచ్చింది.

ఎల్జీబీటీ కమ్యూనిటీ న్యాయవాదుల్లో చాలా మంది ప్రవాసులే. ఈజిప్టులోని సమస్యలను మీడియాలో హైలైట్ చేయాలా లేదా తెరవెనుక పరిష్కరించాలా అనే దానిపై భిన్నాభిప్రాయాలు ఉన్నాయి.

కానీ లైలా, సయీద్, జమాల్, లైత్‌లు కమ్ముకున్న భయాల నీడల నుంచి బయటపడి నిశ్శబ్దాన్ని ఛేదించడాన్నే ఎంచుకున్నారు.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)