బడ్జెట్ 2023: విశాఖ ప్రత్యేక రైల్వే జోన్ ప్రస్తావన ఏదీ?

- రచయిత, బళ్ల సతీశ్
- హోదా, బీబీసీ ప్రతినిధి
ఆంధ్రప్రదేశ్ ప్రజల ప్రత్యేక రైల్వే జోన్ కల మళ్లీ అటకెక్కింది. ఇవాళ ప్రకటించిన 2023 బడ్జెట్‌లో ఎక్కడా కూడా ప్రత్యేక రైల్వే జోన్ గురించి ప్రస్తావన లేదు.
అటు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల ప్రసంగంలో కానీ, లేదా రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ విలేకర్ల సమావేశంలో కానీ ఆ వివరాలు లేవు.
రైల్వేలకు సంబంధించి, ఆర్థిక శాఖ వెబ్‌సైట్లోని పత్రాల్లో కూడా ఈ కొత్త జోన్ ప్రస్తావన లేదు. దీంతో విశాఖ రైల్వే జోన్ ప్రస్తుతానికి లేనట్టే అని తెలుస్తోంది.
శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లా ప్రాంతాల్లోని రైల్వే వ్యవస్థ భువనేశ్వర్ కేంద్రంగా తూర్పు తీరం రైల్వేలో ఉంది.
దాన్ని విభజించి, ఆంధ్రలోని మిగిలిన రైల్వే డివిజన్లతో కలిపి ఆంధ్ర రాష్ట్రానికి కొత్త రైల్వే జోన్ ఇవ్వాలనే డిమాండ్ ఉండేది.
ముందుగా విజయవాడ జోన్, విశాఖ డివిజన్‌తో సహా అనే డిమాండ్ ఉండేది.
2019లో భారత ప్రభుత్వం ఆంధ్రకు కొత్త జోన్ ప్రకటించింది. కానీ, ఆ జోన్ ప్రకటన విశాఖ వాసులు కోరుకున్నట్టు కాకుండా, అనేక తిరకాసులతో వచ్చిందంటూ విశాఖ వాసులు, ఆంధ్ర రాష్ట్రానికి చెందిన చాలా మంది నాయకులు చెబుతుంటారు.

ఫొటో సోర్స్, Getty Images
విశాఖలో జోన్ ఇచ్చి వాల్తేరు డివిజన్ రద్దు చేయడం అందులో పెద్ద వివాదాస్పద అంశం.
పోనీ ఎలాగోలా జోన్ వచ్చిందా అంటే ఇంకా అదీ లేదు. 2019 ఫిబ్రవరి 27న ఆ జోన్ ప్రకటన వచ్చింది.
2019 మార్చి 8న దక్షిణ తీర రైల్వేకి ఒక అధికారిని కూడా నియమించారు.
అదే ఏడాది అంటే 2019 సెప్టెంబరులో డీపీఆర్ దిల్లీ చేరింది. కానీ ఆ ఓఎస్డీ కార్యాలయం బోర్డు తప్ప ఒక్క ఇటుక కూడా అక్కడ కొత్తగా కదల్లేదు.
ఆఖరికి మొన్న ప్రధాని విశాఖ వచ్చినప్పుడు కూడా ఆ ప్రస్తావన లేదు. విశాఖ రైల్వే స్టేషన్ ఆధునికీకరణ సహా వేల కోట్ల పనులకు శంకుస్థాపనలు చేశారు కానీ అందులో రైల్వే జోన్ లేదు.
అసలు ఈ రైల్వే జోన్ రాకపోతే తాను పదవికి రాజీనామా చేస్తానని వైయస్సార్సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి 2022 సెప్టెంబరు 8న ప్రకటన చేశారు.
ఇలా విశాఖ రైల్వే జోన్ గురించి చాలా మంది ఎంపీలు ప్రకటనలు చేస్తున్నారు తప్ప పనులు కాలేదు. ఆఖరికి ఇవాళ బడ్జెట్లో కూడా ఆ ప్రస్తావన లేకపోవడం ఆందోళనకారులకు నిరాశే మిగిల్చింది.
దీనిపై రైల్వే అధికారులు స్పందించాల్సి ఉంది.

రాష్ట్రాల అంశాలను ప్రస్తావించలేదన్న ఏపీ ఆర్థిక మంత్రి
ఈ బడ్జెట్‌లో రాష్ట్రాలకు సంబంధించిన అంశాలను ప్రస్తావించలేదని ఆంధ్రప్రదేశ్ ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ అన్నారు.
''ఆర్థిక లోటు తగ్గడం మంచి పరిణామం. కొన్ని సెక్టార్లలో తక్కువ కేటాయింపులు చేశారు. ఎరువులు, యూరియా, బియ్యం, గోధుమలు సబ్సిడీకి కేటాయింపులు తగ్గాయి. వ్యవసాయానికి కేటాయింపులు తగ్గించి, రోడ్లు, రైల్వేలకు పెంచారు. 7 రంగాలకు ప్రాధాన్యం ఇస్తూ బడ్జెట్‌ని రూపొందించారు" అని కేంద్ర బడ్జెట్‌పై సంతృప్తి వ్యక్తం చేశారు.
ఆదాయపు పన్ను శ్లాబ్ రేట్లు కొంత ఊరటనిచ్చాయని చెప్పిన మంత్రి, "రాష్ట్రాలతో నిర్వహించిన ప్రీ బడ్జెట్ సమావేశాల్లో మన సూచనలను పరిగణలోకి తీసుకున్నారు. పంప్ స్టోరేజ్ విధానాన్ని అమలు చేయాలని కోరాం. ఏపీ రోల్ మోడల్‌గా ఈ రంగంలో ఉంది. దీనిపై పాలసీ తేవాలని కోరాం. దానిని ప్రకటించారు" అని అన్నారు.

ఫొటో సోర్స్, FB/revanthofficial
తెలంగాణ పట్ల వివక్ష చూపించారన్న రేవంత్ రెడ్డి
తెలంగాణ పట్ల కేంద్రం వివక్ష చూపుతోందని, బడ్జెట్ లో తెలంగాణకు కేంద్రం మొండిచేయి చూపిందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆరోపించారు.
బయ్యారం ఉక్కు కర్మాగారానికి, సాగు నీట ప్రాజెక్టులకు నిధులను మంజూరు చేయలేదన్నారు. బడ్జెట్‌లో తెలంగాణకు జరిగిన అన్యాయానికి బీజేపీ, బీఆర్ఎస్ ఇద్దరూ దోషులేనని మండిపడ్డారు.
కేంద్ర ప్రభుత్వం చేసిన ఈ అన్యాయానికి రాష్ట్రప్రభుత్వం అండగా నిలబడిందన్నారు. మోదీ, కేసీఆర్ ఇద్దరు తోడు దొంగలు తెలంగాణకు అన్యాయం చేశారని, ఇప్పటికైనా తెలంగాణలో సాగునీటి ప్రాజెక్టులకు జాతీయ హోదా ఇవ్వాలని డిమాండ్ చేశారు.
రాష్ట్రంలో ప్రతీ పేదవాడికి ఇళ్లు నిర్మించేందుకు అవసరమైన నిధులను కేంద్రం కేటాయించాలన్నారు. రైల్వే కోచ్ ఫ్యాక్టరీని ప్రారంభించాలని డిమాండ్ చేశారు.
నిధుల కేటాయింపులో గుజరాత్ కు కల్పించిన ప్రాధాన్యతను తెలంగాణకు కల్పించాలని అన్నారు. తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని సవరించాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందన్నారు.
ఫిబ్రవరి 6న తెలంగాణలో ములుగు సమ్మక్క సారక్క జాతర నుంచి హాత్ సే హాత్ జోడో యాత్ర ప్రారంభమవుతుందని ప్రకటించారు.
జాతీయ స్థాయి నాయకత్వం కూడా వివిధ సందర్భాలలో పాల్గొంటుందని తెలిపారు. మొదటి విడతగా 60 రోజులు.. 40 నుంచి 50 నియోజకవర్గాల్లో చేయాలనుకుంటున్నామని చెప్పారు.
ఆ తరువాత కొనసాగించే విషయం పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు.
ఇవి కూడా చదవండి:
- కల్పనా చావ్లా: కొలంబియా స్పేస్ క్రాఫ్ట్ కూలిపోతుందని నాసాకు ముందే తెలుసా... ఆ రోజు ఏం జరిగింది
- అదానీ గ్రూప్: ఎల్ఐసీ పెట్టుబడులపై ప్రశ్నలు ఎందుకు వినిపిస్తున్నాయి
- నిన్న ఆనం, నేడు కోటంరెడ్డి... నెల్లూరు వైసీపీ నేతల్లో అసంతృప్తి పెరుగుతోందా
- దావూద్ ఇబ్రహీం: మాఫియా డాన్ హైదరాబాద్ గుట్కా కంపెనీ కథ ఏమిటి? మాణిక్ చంద్, జేఎం జోషి వివాదంలో దావూద్ పాత్ర ఏమిటి?
- పాకిస్తాన్: కిలో ఉల్లిపాయలు రూ.250... ‘కోయకుండానే కళ్లల్లో నీళ్లు’
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














