ఆంధ్రప్రదేశ్: ‘‘అమ్మఒడి డబ్బు వద్దంటే విద్యార్థులకు ల్యాప్‌టాప్’’ – ప్రెస్‌రివ్యూ

ఫొటో సోర్స్, FACEBOOL/ANDHRAPRADESH/CMO
‘వచ్చే ఏడాది నుంచి 9 నుంచి 12వ తరగతి చదివే, విద్యావసతి పొందే విద్యార్థులు అమ్మఒడి డబ్బు వద్దనుకుంటే ల్యాప్‌టాప్ అందిస్తాం’ అని ముఖ్యమంత్రి జగన్ మోహన్‌రెడ్డి తెలిపారని ఈనాడు ఒక కథనం ప్రచురించింది.
‘‘నెల్లూరులోని శ్రీవేణుగోపాలస్వామి కళాశాల మైదానంలో సోమవారం నిర్వహించిన సభలో జగనన్న అమ్మఒడి రెండో ఏడాది చెల్లింపులను ఆయన ప్రారంభించారు.
కోవిడ్ సమయంలో ఆన్‌లైన్ తరగతులకు పేదింటి పిల్లలు దూరమయ్యారన్నారని, ఆ పరిస్థితులను మార్చాలనే ల్యాప్‌టాప్ ఇస్తున్నామన్నారు.
మార్కెట్‌లో రూ.25-27 వేల మధ్య దొరికే ల్యాప్‌టాప్‌ను ప్రభుత్వ చర్చలతో కొన్ని సంస్థలు రూ.18,500కే ఇచ్చేందుకు ముందుకొస్తున్నాయన్నారు.
టెండర్లు పిలిచి, రివర్స్ టెండరు ద్వారా 4జీబీ ర్యామ్, 500 జీబీ స్టోరేజీ, విండోస్ 10 ఆపరేటింగ్ సిస్టమ్ స్పెసిఫికేషన్‌తో ఇస్తామని తెలిపారు.
వాటికి మూడేళ్ల వారంటీ ఉంటుంది.. పనిచేయకపోతే ఏడు రోజుల్లోనే మరమ్మతులు చేసి ఇచ్చేలా కసరత్తు చేస్తున్నట్లు వివరించార’’ని ఆ కథనంలో పేర్కొన్నారు.

ఫొటో సోర్స్, Facobook/sripad nayak
రోడ్డు ప్రమాదంలో కేంద్రమంత్రికి గాయాలు..ఆయన భార్య, పీఏ మృతి
కేంద్ర మంత్రి శ్రీపాద నాయక్ ప్రయాణిస్తున్న కారు యాక్సిడెంట్‌కు గురైందని వెలుగు దినపత్రిక తెలిపింది.
కర్నాటకలో యల్లాపూర్ నుంచి గోకర్ణ వెళుతుండగా ప్రమాదం జరిగింది. వేగంగా ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి బోల్తా కొట్టింది. రోడ్డు పక్కన పొదల్లోకి దూసుకెళ్లింది.
అంకోలా దగ్గర జరిగిన ఈ ప్రమాదంలో మంత్రికి తీవ్రగాయాలు కాగా, ఆయన భార్య విజయ, అనుచరుడు దీపక్ ప్రాణాలు కోల్పోయారు.
మంత్రి శ్రీపాద నాయక్‌ను మెరుగైన ట్రీట్మెంట్ కోసం గోవా తరలించినట్లు అధికార వర్గాలు తెలిపాయి. గాయాలపాలైన కారు డ్రైవర్ సూరజ్ నాయక్, మంత్రి గన్‌మెన్ తుకారం పాటిల్, సాయికిరణ్ సేథియాలకు ప్రభుత్వ ఆస్పత్రిలో ట్రీట్మెంట్ అందిస్తున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
ఈసారి డిజిటల్ బడ్జెట్
కేంద్ర వార్షిక బడ్జెట్ ప్రతులను పార్లమెంట్ సభ్యులకు ఈసారి డిజిటల్ రూపంలో ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు సాక్షి తెలిపింది.
‘‘కోవిడ్–19 ప్రొటోకాల్ దృష్ట్యా సభ్యులకు ఈసారి ముద్రిత ప్రతుల పంపిణీ ఉండదు. ఏప్రిల్ నుంచి మొదలయ్యే ఆర్థిక సంవత్సరం(2021–22) బడ్జెట్ కాపీలను కోవిడ్–19 వ్యాప్తి ప్రమాదం దృష్ట్యా ముద్రించడానికి బదులు ఎలక్ట్రానిక్ రూపంలో ఇవ్వాలని నిర్ణయించినట్లు అధికార వర్గాలు తెలిపాయి.
ఇలాంటి పరిణామం దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఇదే ప్రథమం. స్వాతంత్య్ర భారతావనిలో మొట్టమొదటి సారిగా దేశ ఆర్థిక వృద్ధి రేటు 7.7% పడిపోయిన నేపథ్యంలో ప్రవేశపెట్టే ఈ బడ్జెట్‌పై అంచనాలు ఎక్కువగానే ఉన్నాయి.
ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కూడా మునుపెన్నడూ లేని విధంగా ఈ సారి బడ్జెట్ ఉంటుందని ఇటీవల ప్రకటించారు. కోవిడ్ మహమ్మారితో అస్తవ్యస్తంగా మారిన ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టడంతోపాటు వృద్ధి రేటును పెంచే చర్యలుంటాయని భావిస్తున్నార’’ని ఆ కథనంలో రాశారు.

ఫొటో సోర్స్, Getty Images
కోవిడ్ సెస్ పేరుతో ప్రత్యేక పన్ను
సంపన్నులపై అదనంగా కోవిడ్ సెస్ లేదా సర్‌చార్జీని విధించాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తున్నట్టుగా ఆంధ్రజ్యోతి తెలిపింది.
కోవిడ్ నేపథ్యంలో ప్రభుత్వ వ్యయం భారీగా పెరిగింది. మరోవైపు కోవిడ్ వ్యాక్సినేషన్ కోసం పెద్ద మొత్తంలో ఖర్చు చేయాల్సిన అవసరం ఏర్పడుతోంది.
గత ఏడాదిలో కోవిడ్ దెబ్బతో జీఎస్టీ వసూళ్లు భారీగా తగ్గాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం రాబడిని పెంచుకోవడానికి మార్గాలను అన్వేషిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇందులో భాగంగా సంపన్నులపై సెస్‌ను విధించడంతోపాటు ఇంధనాలపై అదనపు సెస్, పరోక్ష పన్నుల పెంపు వంటివి ప్రాథమికంగా చర్చకు వచ్చినట్టు మీడియా కథనాల ద్వారా తెలుస్తోంది.
ఒకవేళ ప్రభుత్వం కోవిడ్ సెస్‌ను అమలు చేస్తే ప్రభుత్వ రాబడి పెరిగే అవకాశం ఏర్పడుతుంది. కేంద్ర సెస్ వసూళ్లను రాష్ట్రాలతో పంచుకోవాల్సిన అవసరం ఉండదు. కాబట్టి ఈ దిశగానే ఆలోచనలు చేస్తున్నట్టు తెలుస్తోంది. కాగా కోవిడ్ వల్ల ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ఒత్తిడి ఉందని, ఇలాంటి తరుణంలో కొత్త పన్నులు విధించవద్దని భారత పరిశ్రమ ఇప్పటికే ప్రభుత్వానికి సూచనలు చేసింది.
ఇవి కూడా చదవండి:
- ఇండోనేసియా: ‘శ్రీవిజయ ఎయిర్ విమానం బ్లాక్‌బాక్స్‌లు గుర్తించాం’
- వాట్సాప్: కొత్త ప్రైవసీ పాలసీతో వ్యక్తిగత గోప్యతకు భంగం కలుగుతుందా? అసలు ఆ నిబంధనలు ఏం చెబుతున్నాయి?
- డోనల్డ్ ట్రంప్‌ను అధ్యక్ష పదవిలోంచి తీసేయొచ్చా... 25వ రాజ్యాంగ సవరణ ఏం చెబుతోంది?
- వందల ఏళ్ల పాటు ఆఫ్రికాలో 'కనిపించిన' ఆ పర్వతాలు ఎలా మాయమయ్యాయి?
- దారా షికోహ్: ఈ మొఘల్ యువరాజు సమాధి కోసం మోదీ ప్రభుత్వం ఎందుకు వెతుకుతోంది
- "నన్నెందుకు వదిలేశావు? పురుగుల మందు తాగి చనిపోతున్నా"
- విదేశాల నుంచి ఆయుధాలు కొనుగోలు చేసే భారత్ 'ఆకాశ్' క్షిపణిని ఎలా విక్రయించబోతోంది?
- అయిదేళ్లుగా స్నానం చేయడం మానేసిన డాక్టర్.. అసలు రోజూ స్నానం అవసరమా?
- హోమీ జహంగీర్ భాభా భవిష్యవాణి, బ్రిటన్‌లో నిజం కాబోతోందా
- సునీల్ గావస్కర్ సర్ బ్రాడ్‌మన్ రికార్డును ఎలా బ్రేక్ చేశారు... అప్పుడు అసలేం జరిగింది?
- ఆలయానికి వెళ్లిన మహిళపై గ్యాంగ్ రేప్, హత్య... పూజారే నిందితుడు
- దక్షిణ కొరియాలో ప్రమాద ఘంటికలు, తగ్గిన జననాలు, పెరిగిన మరణాలు
- కడుపు పెరుగుతుంటే కవల పిల్లలనుకున్నారు.. డాక్టర్ చెప్పింది విని ఆశ్చర్యపోయారు
- జాక్ మా: ఈ చైనా బిలియనీర్ రెండు నెలల్లో రూ.80వేల కోట్లు ఎలా కోల్పోయారు?
- మాల మాస్టిన్లు: పొట్టకూటి కోసం ప్రమాదానికి ఎదురెళ్లే ఈ సాహసగాళ్లు ఎవరు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








