బడ్జెట్ 2022: ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ ‘బడ్జెట్‌’ను ఎందుకు ఎర్రని వస్త్రంలో చుట్టి తీసుకుని వస్తారు

బడ్జెట్

ఫొటో సోర్స్, Getty Images

2019లో కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు ముందు ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆర్ధిక మంత్రిత్వ శాఖ భవనం ముందు ఒక ఎర్రని పోర్ట్‌ఫోలియో చేతిలో పట్టుకుని ఫొటోకు పోజ్ ఇచ్చారు. ఆమెతో పాటు ఆర్థిక శాఖ సహాయక మంత్రి అనురాగ్ ఠాకూర్ కూడా ఉన్నారు.

గతంలో ఆర్ధిక శాఖ మంత్రులు పార్లమెంట్‌లో బడ్జెట్ ప్రవేశపెట్టడానికి ముందు జరిగే ఫోటో కార్యక్రమాల్లో ఒక లెథర్ సూట్ కేసు పట్టుకుని కనిపించేవారు.

50 సంవత్సరాల తర్వాత మహిళా ఆర్ధిక మంత్రిగా బాధ్యతలు చేపట్టిన నిర్మలా సీతారామన్ ఈ సూట్ కేసులు పట్టుకునే సంప్రదాయానికి స్వస్తి పలికారు. ఈ సూట్ కేసుల్లో బడ్జెట్ కు సంబంధించిన పత్రాలు ఉంటాయి. అయితే, ఈమె ఒక ఎర్రని వస్త్రంలో సంప్రదాయ తరహాలో చుట్టిన బడ్జెట్ కాగితాలతో కనిపించారు.

పార్లమెంటులో బడ్జెట్ ప్రవేశపెట్టడానికి ముందు కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఇతర సభ్యులతో కలిసి ఉన్న చిత్రం .

ఫొటో సోర్స్, REUTERS

ఫొటో క్యాప్షన్, పార్లమెంటులో బడ్జెట్ ప్రవేశపెట్టడానికి ముందు కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఇతర సభ్యులతో కలిసి ఉన్న చిత్రం .

అకౌంట్ కీపింగ్ బుక్ వెర్సస్ బ్రీఫ్ కేస్

2019 జులైలో ఆర్ధిక మంత్రి చేతిలో కనిపించిన ఎర్రని వస్త్రంతో చుట్టిన బడ్జెట్ పత్రాల గురించి ప్రధాన ఆర్ధిక సలహాదారుడు కృష్ణమూర్తి సుబ్రహ్మణ్యం వివరించారు.

"ముఖ్యమైన పత్రాలను ఎర్రని వస్త్రంలో చుట్టడం భారతీయ సంస్కృతి" అని ఆయన చెప్పారు.

"పాశ్చాత్య దేశాలకు బానిసత్వంగా ఉండే సంస్కృతికి నిర్మలా సీతారామన్ ఉద్దేశపూర్వకంగానే స్వస్తి పలికారు. భారతీయ సంస్కృతిలో దీనిని బడ్జెట్ అనరు. ఖాతావహి అని అంటారు" అని వివరించారు.

2019లో బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత విలేఖరులతో మాట్లాడుతూ సీతారామన్ ఇలా అన్నారు..

"మనం బ్రిటిష్ వారి మత్తులోంచి బయటకు రావాల్సిన అవసరముంది. ఏదైనా భారతీయ శైలిలో చేయాలి. అలాగే, వస్త్రంలో చుట్టిన వాటిని పట్టుకోవడం కూడా సులభం" అని అన్నారు.

సీతారామన్ కంటే ముందు, ఇందిరా గాంధీ కూడా ఆర్ధిక మంత్రిగా ఉన్న సమయంలో బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఆమె అప్పట్లో ప్రధాన మంత్రిగా ఉండేవారు.

బడ్జెట్ బౌగెట్ అనే ఫ్రెంచ్ పదం నుంచి వచ్చింది. బౌగెట్ అంటే 'చిన్న సంచి' అని అర్ధం.

ఒకప్పుడు ప్రభుత్వ ఆర్ధిక వ్యవహారాలు, ఆదాయ ఖర్చులకు సంబంధించిన బడ్జెట్ పత్రాలు, కాగితాలు పెట్టేందుకు ఒక చిన్న సంచి సరిపోయేది.

కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్

ఫొటో సోర్స్, GETTY IMAGES

ఫొటో క్యాప్షన్, కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్

బ్రిటిష్ వారసత్వం

భారతదేశంలో ఆర్ధిక బడ్జెట్ సమర్పించే ప్రక్రియను బ్రిటిష్ పాలన నుంచి అందిపుచ్చుకున్నాం. బడ్జెట్ పత్రాలను సూట్ కేసులో పెట్టుకుని పార్లమెంట్‌కు పట్టుకుని వెళ్లడం అప్పటి నుంచే మొదలయింది.

బ్రిటన్ లో ఆర్ధిక మంత్రులు మారినా కూడా బడ్జెట్ బ్రీఫ్ కేస్ మాత్రం ఒకటే ఉంటుంది. ఆర్ధిక మంత్రులు మారుతున్నప్పుడు బడ్జెట్‌కు వాడే సూట్ కేసును కొత్తగా పదవిలోకి వచ్చే మంత్రికి అందచేస్తారు. అయితే, ఈ సంప్రదాయాన్ని భారత్ అనుసరించలేదు.

భారతదేశంలో ఆర్ధిక మంత్రులు మాత్రం పార్లమెంటులో బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు రకరకాల సూట్ కేసులు తీసుకుని వెళతారు.

రకరకాల ఆకారాల్లో ఉండే బడ్జెట్ బ్రీఫ్ కేసులు

భారతదేశంలో బడ్జెట్ బ్రీఫ్ కేసు రకం, ఆకారం ఎప్పటికప్పుడు ఆర్ధిక మంత్రులతో పాటు మారుతూ వస్తున్నాయి.

స్వతంత్ర భారతదేశంలో తొలిసారి బడ్జెట్‌ను ఆర్ధిక మంత్రి ఆర్ కే షణ్ముఖం చెట్టి 1947లో ప్రవేశపెట్టారు. అప్పుడాయన ఒక లెథర్ పోర్ట్‌ఫోలియో సంచిని పట్టుకుని వెళ్లారు.

70లనుంచి ఆర్ధిక మంత్రులు అటాచీ కేస్ తరహా బ్రీఫ్ కేసును వాడటం మొదలుపెట్టారు.

బ్రిటన్ లో బడ్జెట్ ప్రవేశపెట్టడానికి ముందు ఎర్రని బ్రీఫ్ కేసును పట్టుకున్న ఛాన్సెలర్ రిషి సూనక్

ఫొటో సోర్స్, REUTERS

ఫొటో క్యాప్షన్, బ్రిటన్ లో బడ్జెట్ ప్రవేశపెట్టడానికి ముందు ఎర్రని బ్రీఫ్ కేసును పట్టుకున్న ఛాన్సెలర్ రిషి సూనక్

రకరకాల బ్రీఫ్ కేసులు

ఆర్ధిక మంత్రి యశ్వంత్ సిన్హా బడ్జెట్ బ్రీఫ్ కేసు బకిల్, స్ట్రాప్‌లతో కూడుకుని ఉండేది.

మన్మోహన్ సింగ్ ఆర్ధిక మంత్రిగా ఉన్నప్పుడు నల్లని బ్రీఫ్‌కేసును వాడేవారు. ఇలాంటి బ్రీఫ్‌కేసునే మాజీ బ్రిటిష్ ప్రధాని విలియం ఎవర్ట్ గ్లాడ్ స్టోన్ కూడా వాడేవారు.

ప్రణబ్ ముఖర్జీ వాడిన ఎర్రని వెల్వెట్ బ్రీఫ్‌కేసు మాత్రం ప్రధాన ఆకర్షణగా ఉండేది. బ్రిటన్‌లోని ఆర్ధిక మంత్రులు కూడా అదే తరహా బ్రీఫ్‌కేసులు వాడేవారు.

వీడియో క్యాప్షన్, యూట్యూబ్‌ ఫ్యాషన్ సెన్సేషన్ కిరాక్ అభిజ్ఞ

రహస్యానికి సంకేతం, కానీ, లక్ష్యం వేరు

బ్రిటిష్‌వారి తరహాలో బడ్జెట్ పత్రాలను బ్రీఫ్‌కేసుల్లో తీసుకుని వెళ్లడం బహుశా రహస్యానికి సంకేతంగా ఉండి ఉండవచ్చు.

ఒక దేశ ఆర్ధిక భవిష్యత్తును నిర్ణయించే ఆర్ధిక పత్రాలను పార్లమెంటులో ప్రవేశపెట్టే వరకు రహస్యంగా బ్రీఫ్‌కేసులో పెట్టేవారు.

అయితే, విలియం ఎవర్ట్ గ్లాడ్ స్టోన్ బ్రీఫ్ కేసును తనతో పాటు తీసుకుని వెళ్లేందుకు కారణాలు వేరు. ఆయన సుమారు 5 గంటల పాటు సుదీర్ఘమైన బడ్జెట్ ప్రసంగాన్ని చేసేవారు.

ఆయన ప్రసంగాలకు సంబంధించిన పత్రాలను బడ్జెట్ బ్రీఫ్ కేసులో పెట్టుకునేవారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)