బడ్జెట్: మీ కోసం నిర్మల సీతారామన్ ఏం చేయగలరు

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, నిఖిల్ ఇనాందార్
- హోదా, బీబీసీ ప్రతినిధి
కేంద్రంలోని ప్రస్తుత ప్రభుత్వం చివరి బడ్జెట్ ప్రవేశపెట్టబోతోంది.
2024లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. ఈ చివరి బడ్జెట్‌లో నరేంద్ర మోదీ ప్రభుత్వం ప్రజాదరణ పథకాలను పక్కనబెట్టి ఆర్థిక క్రమశిక్షణకు పెద్ద పీట వేయవచ్చని భావిస్తున్నారు.
అయితే, కరోనా మహమ్మారితో పోరాటం తరువాత సమాజంలో పలు వర్గాలకు ప్రభుత్వ సహాయం అవసరమని నిపుణులు అంటున్నారు.
రెండేళ్ల కోవిడ్ పోరాటం తరువాత ప్రపంచంలో మూడవ వంతు దేశాలు మాంద్యం అంచున కొట్టుమిట్టాడుతున్నాయి. కానీ, 2023లో భారత ఆర్థికపరిస్థితి సాపేక్షంగా మెరుగ్గానే ఉంది.
ఈ ఆర్థిక సంవత్సరం జీడీపీ లక్ష్యాలను కాస్త నియంత్రించారు. వచ్చే ఏడాది కూడా భారత్ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా కొనసాగుతుందని భావిస్తున్నారు.
ఆర్థిక వృద్ధి 6 నుంచి 6.5 శాతం నమోదు అవుతుందని అంచనా. ఏ కొలమానాల ప్రకారం చూసినా ఇది మంచి వృద్ధే.
అంతే కాకుండా, ద్రవ్యోల్బణం తగ్గుతోంది. ఇంధన ధరలు తగ్గుముఖం పట్టాయి. దేశంలోకి భారీ పెట్టుబడులు వస్తున్నాయి. వినియోగదారుల వ్యయం క్రమంగా పెరుగుతోంది.
గ్లోబల్ మాన్యుఫ్యాక్చరింగ్‌లో 'చైనా ప్లస్ వన్' వ్యూహం వల్ల భారత్ లాభపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. యాపిల్ సంస్థ దేశంలో తమ సామర్థ్యాన్ని పెంపుచేసే ఆలోచనలో ఉంది. చైనాలో మాత్రమే కాకుండా ఇతర దేశాలకు సరఫరా గొలుసులను విస్తరించాలని యోచిస్తోంది.
ఈ నేపథ్యంలో, ఆర్థిక విస్తరణ, విస్తృతి ఆధారంగా కేంద్రం బడ్జెట్‌ను రూపొందించాల్సి ఉంటుందని నిపుణులు అంటున్నారు.

ఫొటో సోర్స్, EPA
అసమానతలు పెరిగిపోయాయి
ఇటీవల దావోస్‌లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫారం సదస్సులో అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థలో ప్రధాన ఆర్థకవేత్త రాజకీయ నాయకులకు ఒకటే సందేశం ఇచ్చారు.
"సమాజంలో అత్యంత బలహీనమైన వర్గాలకు ఆర్థిక సహాయం అందించేందుకు అనుగుణంగా ఆర్థిక విధానాలను రూపొందించాలి."
దేశంలో జీడీపీ అంచనాలు ఆకట్టుకునేలా ఉన్నా, నిరుద్యోగం చాలా ఎక్కువగా ఉంది.
నగరాల్లో నిరుద్యోగం 10 శాతం పైనే ఉందని సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ (సీఎంఐఈ) 2022 డిసెంబర్ డాటా చెబుతోంది.
అసమానతలు అనూహ్యంగా పెరిగిపోయాయి.
భారతదేశపు సంపదలో 40 శాతం, పై స్థాయిలలో ఉన్న 1 శాతం వద్దే ఉందని ఇటీవల ఆక్స్‌ఫామ్ నివేదిక వెల్లడించింది. దీనిపై చాలా విమర్శలు వచ్చాయి. ఆక్స్‌ఫామ్ గణన పద్ధతిలో లోపాలు ఉన్నాయని ఆరోపించారు.
అయితే, ఇతర ప్రమాణాలను పరిశీలిస్తే కరోనా మహమ్మారి తరువాత ధనికులు మరింత ధనికులుగాను, పేదలు మరింత పేదలుగానూ మారినట్టు తెలుస్తోంది.
సరసరమైన ధరలకు లభించే గృహాలకు డిమాండ్ తగ్గిపోవడం, టూ వీలర్లకు డిమాండ్ తగ్గి, ఖరీదైన కార్లకు డిమాండ్ బాగా పెరగడం, చౌకైన ప్రత్యామ్నాయాలను పక్కకుబెట్టి విలాసవంతమైన వస్తువులకు డిమాండ్ పెరగడం మొదలైనవి చూస్తే కరోనా తరువాత రికవరీ K ఆకారంలో ఉన్నట్టు తెలుస్తోంది. అంటే ధనవంతుల సంపద మరింత పెరిగిపోయి, పేదలు మరింత పేదరికంలోకి దిగజారిపోతున్నారు.
దేశంలోని మారుమూల గ్రామీణ ప్రాంతాల్లో దుర్భర పరిస్థితులు కళ్లకు కనిపిస్తున్నాయి.

ఫొటో సోర్స్, Getty Images
వేతనాల్లో ఆలస్యం
పశ్చిమ బెంగాల్‌లోని పురూలియా జిల్లాలో బీబీసీ బృందం పర్యటించింది. అక్కడి ప్రజలు కేంద్రం, రాష్ట్రం మధ్య రాజకీయలలో చిక్కుకున్నారు.
ఫలితంగా, ప్రభుత్వ గ్రామీణ ఉద్యోగాల హామీ పథకం కింద సుమారు రు.2,688 కోట్లు వేతనాలు ఏడాదికి పైగా ఆలస్యం అయ్యాయని అధికారిక డాటా చెబుతోంది.
ఈ పథకం కింద సుందర, ఆదిత్య సర్దార్‌లకు వారి గ్రామానికి వెలుపల ఒక చెరువు తవ్వే పని దొరికింది. నాలుగు నెలల పాటు చెరువు తవ్వారు. కానీ, వారికి జీతాలు అందలేదు. దాంతో, అప్పు చేసి కడుపు నింపుకోవాల్సిన పరిస్థితి వచ్చిందని, పిల్లలను చదువు మాన్పించేశామని వారు బీబీసీతో చెప్పారు.
ఆదివాసీ ప్రాంతాల్లోనూ ఇవే కథలు విన్నాం.
"పశ్చిమ బెంగాల్‌లో ఒక కోటి మంది కార్మికులకు ఏడాదికి పైగా వేతనాలను కేంద్ర ప్రభుత్వం నిలిపివేసింది. ఆర్థిక సంక్షోభం, అధిక నిరుద్యోగం ఉన్న పరిస్థితుల్లో ఇది అమానవీయం. ఇది వెట్టి చాకిరీ అని సుప్రీంకోర్టు కూడా చెప్పింది" అన్నారు యాక్టివిస్ట్ నిఖిల్ డే.
అయితే, వేతనాల్లో ఆలస్యం పశ్చిమ బెంగాల్‌కే పరిమితం కాదు. దేశవ్యాప్యంగా MGNREGA పథకం కింద ప్రభుత్వం నుంచి సుమారు రూ. 4,075 కోట్ల వేతనాలు పెండింగ్‌లో ఉన్నాయి.
సామాజిక భద్రత అందించే పథకాల్లో కేంద్రం ఉద్దేశపూర్వకంగా వ్యయాన్ని నియంత్రిస్తోందని, అందుకే ఈ పరిస్థితి ఏర్పడిందని ప్రముఖ ఆర్థికవేత్త జాన్ ద్రెజ్ ఆరోపించారు.
"ఒక సమయంలో ఉద్యోగ హామీ పథకాల పైన వ్యయం జీడీపీలో 1 శాతానికి చేరుకుంది. ఇప్పుడు అది 0.5 శాతం కూడా లేదు. ఈ బడ్జెట్‌లో అది మళ్లీ 1 శాతానికి వస్తే చాలా సంతోషం. అలాగే, ఈ పథకాల్లో అవినీతిని నిరోధించే విధానాలను కూడా రూపొందించాలి" అని జాన్ ద్రెజ్ అన్నారు.
గత సంవత్సరంలో గ్రామీణ ఉద్యోగాల పథకంపై ఖర్చులు కుదించారు. ఆహారం, ఎరువుల సబ్సిడీలపై బడ్జెట్ తగ్గించారు.
అయితే, కోవిడ్ సమయంలో అత్యవసర పరిస్థితిని ఎదుర్కోవడానికి, సహాయం అందించడానికి, ప్రపంచ భౌగోళిక రాజకీయ షాక్స్ తట్టుకోవడానికి అదనపు బడ్జెట్ కేటాయించారు.

ఫొటో సోర్స్, Getty Images
నిర్మలా సీతారామన్ ఏం చేయగలరు?
ప్రస్తుతం మోదీ ప్రభుత్వం ఎదుర్కొంటున్న ఆర్థిక అనిశ్చితి దృష్ట్యా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు కత్తి మీద సాము చేయాల్సి రావచ్చు.
ఒకవైపు అణగారిన వర్గాలకు ఆర్థిక సాయం, ఆర్థికాభివృద్ధికి అనుగుణమైన పెట్టుబడులకు చేయూతనివ్వడం, మరో వైపు బడ్జెట్ లోటు పూడ్చడం .. ఇవన్నీ బ్యాలన్స్ చేయాలి.
ప్రస్తుతం కేంద్ర ఆర్థిక బడ్జెట్ లోటు 6.4 శాతం వద్ద ఉంది. గత దశాబ్దంలో ఇది సగటున 4 నుంచి 4.5 శాతం వరకు నమోదైంది.
గత నాలుగేళ్లల్లో ప్రభుత్వం రుణభారం రెట్టింపు కావడంతో , ఆహారం, ఎరువులపై సబ్సిడీలను పావువంతు తగ్గించవచ్చని రాయిటర్స్ నిర్వహించిన ఒక పోల్‌లో తేలింది.
ఇప్పటికే కోవిడ్ సమయంలో ప్రారంభించిన ఉచిత ఆహార పథకాన్ని ప్రభుత్వం నిలిపివేసింది.
కరంట్ ఖాతా లోటు (ఎగుమతులు, దిగుమతుల మధ్య వ్యత్యాసం) కూడా పెరుగుతోంది. ఇది కూడా పెద్ద సమస్యగా పరిణమించింది.
"బయట దేశాల నుంచి వచ్చే డిమాండ్, గ్లోబల్ పెట్టుబాడిదారుల సెంటిమెంట్, అంతర్గత వాణిజ్యంలో డైనమిక్స్.. ఇవీ భారత ఆర్థికవ్యవస్థని ప్రభావితం చేసే అంశాలు. ఇవేవీ కూడా ప్రస్తుతం గ్రీన్ సిగ్నల్ ఇవ్వట్లేదు" అని డీబీఎస్ గ్రూపు రిసెర్చ్‌లోని డాటా అనలిటిక్స్ విభాగంలో చీఫ్ ఎకానమిస్ట్ తైమూర్ బేగ్, డైసీ శర్మ ఇటీవల ఒక నివేదికలో తెలిపారు.
పశ్చిమ దేశాలు ఆర్థిక మాంద్యం అంచున ఉన్నందున, భారతదేశ ఎగుమతులకు డిమాండ్ తగ్గిపోవచ్చు.
అదే సమయంలో అంతర్గత ఆర్థిక పరిస్థితులు దేశీయ డిమాండ్‌ను ప్రోత్సహించేలా లేవు.
భారతీయ రిజర్వ్ బ్యాంకు ఫిబ్రవరిలో స్థూలంగా రేట్లను పెంచుతుందని అంచనా.
అంతర్జాతీయ వేదికపై భారత ఆర్థికవ్యవస్థ ప్రకాశవంతంగా కనిపిస్తున్నా, దేశంలో ఆర్థిక సవాళ్లు మిగిలే ఉన్నాయి.
డబ్బు కొరతను అధిగమించి మెరుగైన రీతిలో ఆర్థిక వ్యవస్థను ముందుకు నడిపించాలంటే, కేవలం బడ్జెట్ ప్రకటనలే కాక నిర్మాణాత్మక సంస్కరణలు చేపట్టాల్సి ఉంటుంది.
ఇవి కూడా చదవండి:
- పర్సనల్ ఫైనాన్స్: ఒక ఏడాదిలో ఫైనాన్షియల్ ప్లానింగ్ ఎలా ఉండాలి?
- పాకిస్తాన్: కిలో ఉల్లిపాయలు రూ.250... ‘కోయకుండానే కళ్లల్లో నీళ్లు’
- ఆవు తేన్పులు పర్యావరణానికి ప్రమాదమా? వీటి ఆహారంలో మార్పుల కోసం బిల్ గేట్స్ ఎందుకు పెట్టుబడులు పెట్టారు?
- ఆంధ్రప్రదేశ్: ప్రభుత్వ ఉద్యోగులను జగన్ సర్కారు ‘కేర్’ చేయటం లేదా?
- మహారాష్ట్ర: మహిళల కోసం మహిళలే నడిపే బ్యాంక్
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














