కేంద్ర బడ్జెట్ 2023: గత ఏడాది బడ్జెట్ హామీలు ఏమయ్యాయి?

ముంబై దగ్గర టన్నెల్ పనులు చేస్తున్న సిబ్బంది

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, హైవేల నిర్మాణం ఈ ఏడాది నెమ్మదించింది
    • రచయిత, శృతి మీనన్, షాదాబ్ నజ్మీ
    • హోదా, బీబీసీ రియాలిటీ చెక్

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం.. 2024 సాధారణ ఎన్నికలకు ముందు వచ్చే నెలలో తన చివరి పూర్తి స్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది.

ఏడాది కిందట బడ్జెట్ ప్రకటించినప్పటి నుంచీ ఇప్పటి వరకూ సాధించిన ప్రగతిని తెలుసుకోవటానికి అధికారిక సమాచారాన్ని మేం పరిశీలించాం.

ఆర్థికాభివృద్ధి – వ్యయం హామీలు

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారతదేశ ఆర్థిక వృద్ధి ‘9.2 శాతంగా ఉంటుందని అంచనా’ వేసినట్టు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తన 2022 బడ్జెట్‌లో చెప్పారు. అది అన్ని పెద్ద ఆర్థికవ్యవస్థల్లో కెల్లా ఇది అత్యధిక వృద్ధి రేటుగా ఉంటుందని చెప్పారు.

కానీ ప్రపంచ మాంద్యం భయాలు, యుక్రెయిన్‌లో యుద్ధం మొదలయ్యాక ఇంధన ధరల పెరుగుదల నేపథ్యంలో.. ఈ ఏడాది వృద్ధి అంచనాలను రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా గత డిసెంబర్‌లో సవరించింది. వృద్ధి రేటు 6.8 శాతంగా ఉంటుందని చెప్పింది.

నిర్మలా సీతారామన్

ఫొటో సోర్స్, Getty Images

వృద్ధి అంచనా తగ్గినా కూడా.. ప్రపంచంలో ఏడు అతి పెద్ద అభివృద్ధి చెందుతున్న ఆర్థికవ్యవస్థల్లో భారతదేశం ‘అతి వేగంగా వృద్ధి చెందుతున్న ఆర్థికవ్యవస్థ’గా నిలుస్తుందని అంచనా వేస్తున్నట్లు ప్రపంచ బ్యాంక్ పేర్కొంది.

భారతదేశం.. ప్రపంచ సగటుకన్నా మెరుగుగా వృద్ధి చెందుతోందని అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ (ఐఎంఎఫ్) మేనేజింగ్ డైరెక్టర్ క్రిస్టాలినా జార్జియేవా ఈ నెలలో చెప్పారు.

కేంద్ర గణాంకాల శాఖ ప్రకారం.. ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో భారత జీడీపీ వృద్ధి 13.5 శాతంగా ఉంది.

కానీ రెండో త్రైమాసికంలో అది 6.3 శాతానికి పడిపోయింది. ముడి సరకులు, ఇంధన ధరలు పెరిగిపోవటంతో తయారీ రంగం నెమ్మదించటం దీనికి కారణమని పేర్కొంది.

అలాగే ద్రవ్యలోటు (ప్రభుత్వ మొత్తం వ్యయానికి, ఆదాయానికి మధ్య తేడా) లక్ష్యం జీడీపీలో 6.4 శాతంగా ఉంటుందని కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఇప్పటివరకూ ఈ స్థాయిలోనే ఉన్నట్లు ఆర్‌బీఐ గణాంకాలు చెప్తున్నాయి.

జీడీపీలో ద్రవ్యలోటు లక్ష్యం ఇలా
ఫొటో క్యాప్షన్, జీడీపీలో ద్రవ్యలోటు లక్ష్యం ఇలా

2020లో 9.1 శాతంగాను, 2021లో 6.7 శాతంగాను ఉన్న ద్రవ్యలోటు స్థాయిని.. 2022 సంవత్సరంలో తక్కువగా నిర్దేశించుకున్నారు. ప్రభుత్వం మీద కోవిడ్ సంబంధిత ఒత్తిళ్లు తగ్గటం దీనికి కారణం.

అయితే.. వ్యయాన్ని 39.45 ట్రిలియన్ రూపాయలకు పరిమితం చేయాలన్న ప్రభుత్వ లక్ష్యం దాటిపోనుందని.. దిగుమతి ధరలతో పాటు ఆహారం, ఇంధనం, ఎరువులపై సబ్సిడీలు పెరగటం దీనికి కారణమని ఆర్‌‌బీఐ లెక్కలు చెప్తున్నాయి.

సంక్షేమ హామీల్లో వెనుకబాటు

నరేంద్రమోదీ ప్రభుత్వం 2015లో ప్రారంభించిన ప్రధానమంత్రి ఆవాస్ యోజన.. ఒక ప్రధాన సంక్షేమ పథకం.

పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో 2022-23 సంవత్సరంలో ఈ పథకం కింద అర్హులైన లబ్ధిదారులకు 80 లక్షల ఇళ్లు నిర్మిస్తామన్న హామీతో గత బడ్జెట్‌లో 480 బిలియన్ రూపాయలు కేటాయించారు.

గ్రామీణ, పట్టణ ప్రాంత గృహాలకు కేటాయింపులు ఇందులో కలిపి ఉన్నప్పటికీ.. వాటిని వేర్వేరు మంత్రిత్వశాఖలు అమలు చేస్తాయి.

పట్టణ ప్రాంతాల్లో పీఎంఏవై పథకం అమలును గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వశాఖ పర్యవేక్షిస్తుంది.

తన లక్ష్యాన్ని ఇంకా చేరుకోలేదని, గడువును పొడిగించాలని, కేంద్రం నుంచి మరింత ఆర్థిక సాయం కావాలని గత ఆగస్టులో ఈ శాఖ కోరింది.

దీంతో తుది గడువును 2024 డిసెంబర్ వరకూ పొడిగించారు.

గృహ నిర్మాణం
ఫొటో క్యాప్షన్, గృహనిర్మాణ పథకం లక్ష్యంలో సగం దూరాన్ని కూడా చేరుకోలేదు

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2022 ఏప్రిల్ 1 నుంచి 2023 జనవరి 23 వరకూ.. పట్టణ ప్రాంతాల్లో 12 లక్షల ఇళ్లు పూర్తయ్యాయని, గ్రామీణ ప్రాంతాల్లో 26 లక్షల ఇళ్లు పూర్తయ్యాయని సంబంధిత మంత్రిత్వశాఖల గణాంకాలు చెప్తున్నాయి.

అంటే ప్రభుత్వం ఇంకా తన లక్ష్యం చేరుకోవటానికి 42 లక్షల ఇళ్లు పూర్తి చేయాల్సి ఉంటుంది.

నీటి కుళాయిల అనుసంధానం చార్ట్
ఫొటో క్యాప్షన్, నీటి కుళాయిల అనుసంధానం లక్ష్యం కూడా సగమే పూర్తయింది

అలాగే 2022-23 సంవత్సరంలో 3.8 కోట్ల ఇళ్లకు పైపుల ద్వారా నీటి సరఫరా కనెక్షన్లు ఇవ్వటం లక్ష్యంగా 600 బిలియన్ రూపాయలను ఆర్థిక మంత్రి కేటాయించారు.

జలవనరుల మంత్రిత్వశాఖ గణాంకాల ప్రకారం.. ఈ ఏడాదిలో ఇప్పటివరకూ 1.7 కోట్ల ఇళ్లకు పైపు నీటి కనెక్షన్లు ఇచ్చారు. ఇది నిర్దేశించిన లక్ష్యంలో సగం కన్నా ఇంకా తక్కువే.

ఈ పథకాన్ని 2019 ఆగస్టులో ప్రారంభించారు. అప్పటి నుంచీ 7.7 కోట్ల ఇళ్లకు పైపులతో నీటి సరఫరా అందుతోంది.

కలకత్తా ఫ్లైఓవర్

ఫొటో సోర్స్, Reuters

నెమ్మదించిన రోడ్ల నిర్మాణం

జాతీయ హైవేల వ్యవస్థను 2022-23లో 25,000 కిలోమీటర్ల మేర విస్తరిస్తామని కూడా ఆర్థికమంత్రి గత ఏడాది ప్రకటించారు.

ఆ 25,000 కిలోమీటర్లలో కొత్త రోడ్ల నిర్మాణాలు, ఇప్పటికే ఉన్న రోడ్ల అభివృద్ధి, రాష్ట్ర హైవేలను జాతీయ హైవేలుగా ప్రకటించటం అన్నీ కలిసి ఉన్నాయి.

ఇందులో ఈ ఆర్థిక సంవత్సరంలో 12,000 కిలోమీటర్ల మేర రోడ్లు నిర్మించాలని రోడ్డు రవాణా, హైవేల మంత్రిత్వశాఖ లక్ష్యంగా నిర్దేశించుకుంది.

ఈ మంత్రిత్వశాఖ ప్రచురించిన తాజా గణాంకాల ప్రకారం.. 2022 సంవత్సరంలో ఏప్రిల్ నుంచి డిసెంబర్ మధ్య 5,774 కిలోమీటర్ల జాతీయ హైవేల నిర్మాణం జరిగింది. ఈ ఏడాది జనవరి నెలకు సంబంధించిన లెక్కలు ఇంకా తెలియరాలేదు.

వీడియో క్యాప్షన్, బడ్జెట్-2021: నిర్మలా సీతారామన్ పద్దుపై మోదీ ప్రశంసలేంటి... రాహుల్ విమర్శలేంటి?

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)