బడ్జెట్ 2021: ఆ నాలుగు రాష్ట్రాలకే నిధులు ఎందుకు? ఆంధ్రా, బిహార్‌లకు ఎందుకు ఇవ్వలేదు? - కాంగ్రెస్ ప్రశ్న

రహదారులు, మౌలిక సదుపాయాల నిర్మాణం కోసం తమిళనాడుకు రూ.1.03 లక్షల కోట్లు, కేరళకు రూ.65 వేల కోట్లు, పశ్చిమ బెంగాల్‌కు రూ.25 వేల కోట్లు, అసోంకు 19 వేల కోట్ల రూపాయలను నిర్మలా సీతారామన్ ప్రకటించారు.

లైవ్ కవరేజీ

  1. ఆ నాలుగు రాష్ట్రాలకే నిధులు ఎందుకు? ఆంధ్రా, బిహార్‌లకు ఎందుకు ఇవ్వలేదు? - కాంగ్రెస్ ప్రశ్న

    నిర్మలా సీతారామన్

    ఫొటో సోర్స్, Getty Images

    తమిళనాడు, కేరళ, పశ్చిమ బెంగాల్, అసోం రాష్ట్రాలకు మాత్రమే నిధులు ఎందుకు ఇచ్చారని కేంద్ర ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీ ప్రశ్నించింది.

    ఆ నాలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్నాయనే నిధులు ఇచ్చారని ఆరోపించింది.

    ఎన్నికలు జరగడం లేదు కాబట్టే ఆంధ్రప్రదేశ్, బిహార్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ వంటి రాష్ట్రాలకు నిధులు ఇవ్వలేదని పేర్కొంది.

    రహదారులు, మౌలిక సదుపాయాల నిర్మాణం కోసం తమిళనాడుకు రూ.1.03 లక్షల కోట్లు, కేరళకు రూ.65 వేల కోట్లు, పశ్చిమ బెంగాల్‌కు రూ.25 వేల కోట్లు, అసోంకు 19 వేల కోట్ల రూపాయలను నిర్మలా సీతారామన్ ప్రకటించారు.

  2. సామాన్యుడిపై పన్నుల భారం మోపలేదు - బడ్జెట్‌పై ప్రధాని మోదీ

    ప్రధాని మోదీ

    ఫొటో సోర్స్, ANI

    "నేటి బడ్జెట్ భారతదేశ ఆత్మవిశ్వాసానికి ప్రతీకగా నిలిచింది. ప్రపంచానికి మన ధైర్యాన్ని చాటి చెబుతోంది. వ్యవస్థలోని అన్ని విభాగాలనూ కలుపుకుంటూ ఈ బడ్జెట్ స్వావలంబనే లక్ష్యంగా సాగింది" అని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు.

    "రైతుల ఆదాయం పెంచడంపై దృష్టి సారిస్తూ, ఈ దిశలో అనేక చర్యలను తీసుకున్నారు. రైతులకు సులువుగా రుణాలు అందనున్నాయి. వ్యవసాయ రంగంలో మౌలిక సదుపాయాల కొరకు కేటాయించిన నిధుల సహాయంతో ఏపీఎంసీ మార్కెట్లను బలోపేతం చేయడానికి ఏర్పాట్లు చేశారు. సామాన్యుడిపై పన్నుల భారం మోపుతామని అనేకమంది ఊహాగానాలు చేసారు. కానీ మేము పారదర్శక బడ్జెట్‌పైనే దృష్టి సారించాం" అని మోదీ తెలిపారు.

  3. 2020-21లో ద్రవ్యలోటు 9.5 శాతం, వ్యక్తిగత ఆదాయ పన్నులో మార్పేమీ లేదు

    నిర్మలా సీతారామన్

    ఫొటో సోర్స్, ANI

    2020-21 ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యలోటు జీడీపీలో 9.5 శాతంగా అంచనా వేసినట్లు ఆర్థికమంత్రి చెప్పారు. ‘‘ఇంకా 80,000 కోట్లు అవసరం. ఈ నిధులను ఈ రెండు నెలల్లో మార్కెట్ నుంచి సేకరిస్తాం’’ అని నిర్మలా సీతారామన్ తెలిపారు. 2021-22 ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యలోటు జీడీపీలో 6.8 శాతంగా ఉంటుందన్నారు.

    వ్యక్తిగత ఆదాయ పన్ను యధాతథం: ఈసారి ఆర్థిక మంత్రి వ్యక్తిగత ఆదాయ పన్ను చెల్లింపుదారులకు ఎలాంటి ఊరట ప్రకటించలేదు. పన్నుల శ్లాబులలో ఎలాంటి మార్పులు చేయలేదు.

    ఒకే దేశం, ఒకే రేషన్ కార్డు: దేశంలోని 32 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ‘ఒకే దేశం, ఒకే రేషన్ కార్డు’ విధానం అమలవుతుందని ఆర్థిక మంత్రి తెలిపారు. తద్వారా 69 కోట్ల మంది లబ్ధిదారులకు దేశంలో ఎక్కడైనా రేషన్ తీసుకునేందుకు వీలవుతుందని అన్నారు.

    100 సైనిక్ స్కూల్స్: ఎన్‌జీఓలు, ప్రైవేటు స్కూళ్లు, రాష్ట్రాల భాగస్వామ్యంతో కొత్తగా 100 సైనిక్ స్కూళ్లను ఏర్పాటు చేస్తామని నిర్మలా సీతారామన్ ప్రకటించారు. భారత ఉన్నత విద్యా కమిషన్‌ను ఏర్పాటు చేయటానికి ఈ ఏడాది చట్టం చేస్తామని తెలిపారు.

    లేహ్‌లో సెంట్రల్ యూనివర్సిటీ: లద్దాక్‌ ప్రజలకు ఉన్నత విద్యను అందుబాటులో తేవటానికి లేహ్‌లోో సెంట్రల్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తామని ప్రకటించారు.

    రాష్ట్రాలకు రెవెన్యూ లోటు గ్రాంటు: 17 రాష్ట్రాలకు ‘రెవెన్యూ లోటు గ్రాంటు’ కింద రూ. 1.18 లక్షల కోట్లు కేటాయిస్తున్నట్లు ఆర్థికమంత్రి తెలిపారు. 15వ ఫైనాన్స్ కమిషన్ సిఫారసుల ప్రకారం పన్నుల్లో 41 శాతం వాటాను రాష్ట్రాలు పొందుతాయని నిర్మలా సీతారామన్ చెప్పారు.

  4. బడ్జెట్ ప్రకటనతో సెన్సెక్స్ జోరు

    బాంబే స్టాక్ ఎక్చేంజ్

    ఫొటో సోర్స్, PTI

    ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ 2021-22 ప్రవేశపెట్టిన తర్వాత బీఎస్ఐ బెంచ్‌మార్క్ సెన్సెక్స్‌లో సోమవారం మధ్యాహ్నం దాదాపు వెయ్యి పాయింట్లు వృద్ధి కనిపించింది.

    30 షేర్ల సెన్సెక్స్ 929.54 పాయింట్స్ లేదా 2.01 శాతం వృద్ధితో 47,215.31 పాయింట్ల దగ్గర ట్రేడ్ అవుతుండగా, అటు నిఫ్టీ 260.05 పాయింట్లు లేదా 1.91 శాతం వృద్ధితో 13,894.65 పాయింట్ల దగ్గర ట్రేడ్ అవుతోంది.

    సెన్సెక్స్‌లో ఇండస్ఇండ్ బ్యాంక్, ఐసీఐసీఐ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, బజాజ్ ఫిన్‌సర్వ్, ఎంఅండ్ఎం, ఎస్‌బీఐ షేర్లలో జోరు కనిపించగా, అటు డాక్టర్ రెడ్డీస్, టెక్ మహీంద్రా, టీసీఎస్, హెచ్‌సీఎల్ టెక్‌లో పతనం నమోదైంది.

    మౌలిక సదుపాయాల నిర్మాణం ద్వారా అభివృద్ధిని పెంచడానికి 2020-21లో మూలధన వ్యయాన్ని 34.5 శాతం పెంచి 5.55 కోట్లకు చేర్చాలని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రతిపాదించారు. అదే సమయంలో ప్రభుత్వం పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో 20 వేల కోట్ల రూపాయల ఖర్చు చేస్తుందని తెలిపారు.

  5. బడ్జెట్ 2021
  6. తొలి డిజిటల్ జనాభా లెక్కల సేకరణ కోసం రూ. 3,768 కోట్లు

    రాబోయే జనాభా లెక్కల సేకరణ భారతదేశ చరిత్రలో తొలి డిజిటల్ జనాభా లెక్కల సేకరణ అవుతుందని నిర్మలా సీతారామన్ చెప్పారు. ఈ భారీ కార్యక్రమం కోసం 2021-22 సంవత్సరంలో రూ.. 3,768 కోట్లు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు.

  7. సీనియర్ సిటిజెన్లకు రిటర్నుల మినహాయింపు

    పెన్షన్, వడ్డీ మాత్రమే ఆదాయంగా గల వారికి ‘రిటర్నుల’ మినహాయింపు సీనియర్ సిటిజన్లపై టాక్స్ కంప్లయన్స్ భారం తగ్గించాలని ఆర్థికమంత్రి పేర్కొన్నారు.

    కేవలం పెన్షన్, వడ్డీ మాత్రమే ఆదాయంగా ఉన్న 75 సంవత్సరాలు, అంతకుమించిన వయసు గల వారికి ఆదాయ పన్ను రిటర్నులు దాఖలు చేయటం నుంచి మినహాయింపు ఇవ్వాలని ప్రతిపాదిస్తున్నట్లు నిర్మలా సీతారామన్ ప్రకటించారు.

  8. అసంఘటిత కార్మికుల కోసం ప్రత్యేక పోర్టల్

    అసంఘటిత కార్మికుల సమాచారణ సేకరణకు పోర్టల్ అసంఘటిత రంగ కార్మిక శక్తి కోసం రోజువారీ కూలీలు, నిర్మాణ రంగ కార్మికులు తదితరుల సమాచారాన్ని సేకరించటానికి ఒక పోర్టల్ ప్రారంభిస్తామని నిర్మలా సీతారామన్ చెప్పారు.

    ఇది వలస కూలీల కోసం ఆరోగ్యం, గృహనిర్మాణం, నైపుణ్యం, బీమా, రుణం, ఆహార పథకాలను రూపొందించటానికి దోహదపడుతుందని పేర్కొన్నారు.

  9. మూడేళ్లలో 7 టెక్స్‌టైల్స్ పార్కుల ఏర్పాటు

    భారత వస్త్ర పరిశ్రమను ప్రపంచస్థాయిలో పోటీలో నిలపడానికి పీఎల్ఐ పథకం కింద 'మెగా ఇన్వెస్టిమెంట్ టెక్స్‌టైల్ పార్క్' పథకం ప్రారంభిస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి చెప్పారు.

    మూడేళ్లలో ఏడు టెక్స్‌టైల్ పార్కులు ఏర్పాటు చేస్తామని అన్నారు.

  10. త్వరలో హైడ్రోజన్ ఎనర్జీ మిషన్ ప్రారంభం

    2021-22లో ఒక హైడ్రోజన్ ఎనర్జీ మిషన్ ప్రారంభించాలని తీర్మానించామని కేంద్ర ఆర్థిక మంత్రి చెప్పారు. దీని కింద గ్రీన్ పవర్ వనరుల నుంచి హైడ్రోజన్ ఉత్పత్తి చేస్తారు.

    బడ్జెట్ 2021

    ఫొటో సోర్స్, LSTV

  11. ఎల్ఐసీ పబ్లిక్ ఇష్యూ ఈ ఏడాదిలోనే...

    ఈ ఏడాది ఎల్ఐసీ ఐపీఓ ఎల్ఐసీ ఈ ఏడాది ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్ (ఐపీఓ)తో వస్తుందని ఆర్థిక మంత్రి చెప్పారు.

    'బీమా రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులపై పరిమితిని ప్రస్తుతమున్న 49 శాతం నుంచి 74 శాతానికి పెంచుతాం. ఇందుకోసం బీమా చట్టానికి సవరణ చేస్తాం. ఉజ్వల పథకాన్ని మరో కోటి మంది లబ్ధిదారులకు విస్తరిస్తాం' అని నిర్మలా సీతారామన్ అన్నారు.

    జమ్మూకశ్మీర్ రాష్ట్రానికి గ్యాస్ పైప్ లైన్ ప్రాజెక్టు, మరో 100 నగరాలకు కూడా గ్యాస్ పైప్‌ లైన్ల విస్తరణ, వాయు కాలుష్యంతో పోరాడటానికి 42 పట్టణ ప్రాంతాలకు రూ. 2,217 కోట్ల కేటాయింపు, పాత వాహనాలను తొలగించటానికి కొత్త రద్దు విధానం, పీపీఏ పద్ధతిలో రూ. 2,000 కోట్లకు పైగా ఖర్చుతో కొత్తగా ఏడు పోర్టు ప్రాజెక్టులు చేపడతామని ఆమె అన్నారు.

  12. ప్రభుత్వం రైతుల ఆదాయం రెట్టింపు చేస్తుంది- నిర్మలా సీతారామన్

    ప్రభుత్వం 2022 నాటికి రైతుల ఆదాయం రెట్టింపు చేయాలని భావిస్తోందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు.

    2013-14లో ధాన్యం కొనుగోళ్లపై 63 వేల కోట్ల రూపాయల వ్యయం చేశారు. దానిని ఒక లక్షా 45 వేల కోట్లకు పెంచాం. ఈ ఏడాది ఆ మొత్తం 72 వేల కోట్లకు చేరుతుంది. దీనివల్ల గత ఏడాది 1.2 కోట్ల మంది రైతులకు లబ్ధి చేకూరింది. ఈ ఏడాది దీనివల్ల 1.5 కోట్ల మంది రైతులకు లబ్ధి చేకూరుతుంది అన్నారు.

    గోధుమలపై ప్రభుత్వం 2013-14లో 33 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసింది. 2019లో అది 63 వేల కోట్ల రూపాయలైతే, ఇప్పుడు అది 75 వేల కోట్ల రూపాయలకు చేరింది. 2020-21లో 43 లక్షల మంది రైతులకు దీనివల్ల లబ్ధి చేకూరుతుందని తెలిపారు.

  13. బీమా కంపెనీల్లో విదేశీ పెట్టుబడులు 74 శాతానికి పెంపు- నిర్మలా సీతారామన్

    ఆర్థిక మంత్రి తన బడ్జెట్ ప్రసంగంలో బీమా కంపెనీల్లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను 49 శాతం నుంచి 74 శాతానికి పెంచుతామని చెప్పారు.

    ఉజ్వల స్కీమ్‌లో మరో కోటి మంది లబ్ధిదారులను చేర్చనున్నట్లు కూడా నిర్మలా సీతారామన్ చెప్పారు.

  14. ‘పీఎం ఆత్మనిర్భర్ స్వస్థ భారత్ యోజన’

    వైద్య వ్యవస్థల బలోపేతానికి ‘పీఎం ఆత్మనిర్భర్ స్వస్థ భారత్ యోజన’ దేశంలో వైద్య వ్యవస్థల బలోపేతానికి కొత్తగా పీఎం ఆత్మనిర్భర్ స్వస్థ భారత్ యోజన ప్రారంభిస్తాం.

    ఇందుకోసం ఆరేళ్లలో రూ. 64,180 కోట్లు కేటాయిస్తాం. కోవిడ్ వ్యాక్సీన్ల కోసం వచ్చే ఆర్థిక సంవత్సరంలో రూ. 35,400 కోట్లు కోటాయింపు. తయారీ రంగానికి ఐదేళ్లలో రూ. 1.97 ట్రిలియన్ కేటాయింపు.

    మూడేళ్లలో ఏడు టెక్స్‌ టైల్ పార్కుల ఏర్పాటు. రూ. 20,000 కోట్లతో కొత్త డెవలప్‌మెంట్ ఫైనాన్షియల్ ఇన్‌స్టిట్యూట్ ఏర్పాటు. పశ్చిమ బెంగాల్‌లో హైవేల అభివృద్ధికి రూ. 25,000 కోట్లు.

    మౌలిక సదుపాయాల అభివృద్ధికి రూ. 5.54 లక్షల కేపిటల్ వ్యయం ప్రతిపాదన. భారత రైల్వే విభాగానికి 1.1 లక్షల కోట్లు కేటాయింపు. పట్టణ ప్రాంతాల్లో ప్రజా రవాణా అభివృద్ధి కోసం రూ. 18,000 కోట్లు.

  15. 2021-2022లో ఎల్ఐసీ ఐపీఓ వస్తుంది- నిర్మలా సీతారామన్

    2021-2022 సంవత్సరంలో జీవిత బీమా కార్పొరేషన్ ఐపీఓ తీసుకుని వస్తామని నిర్మలా సీతారామన్ చెప్పారు. దానికోసం మేం ఇదే సెషన్‌లో అవసరమైన సవరణలు చేస్తున్నామని తెలిపారు.

  16. హెల్త్ సెక్టార్‌లో 2.23 లక్షల కోట్ల రూపాయల ఖర్చు చేస్తాం

    2021-2022 ఆర్థిక సంవత్సరంలో ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం కోసం 2,23,846 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తామని ఆర్థిక మంత్రి చెప్పారు.

    దీనితోపాటూ ఈ ఆర్థిక సంవత్సరంలో కరోనా వ్యాక్సీన్ కోసం 35 వేల కోట్ల రూపాయలు అందించామని, అవసరమైతే ఇక ముంద కూడా నిధులు అందిస్తామని చెప్పారు.

  17. పశ్చిమ బెంగాల్లో రహదారుల నిర్మాణానికి 25 వేల కోట్ల రూపాయల వ్యయం

    పశ్చిమ బెంగాల్లో 25 వేల కోట్ల రూపాయల వ్యయంతో 675 కిలోమీటర్ల జాతీయ రహదారులు నిర్మిస్తామని నిర్మలా సీతారామన్ చెప్పారు.

  18. ‘ఆత్మ నిర్భర్ స్వస్థ్ భారత్’ పథకంపై 64,180 కోట్లు వ్యయం- ఆర్థిక మంత్రి

    "కేంద్రం కొత్తగా ‘ప్రధానమంత్రి ఆత్మనిర్భర్ స్వస్థ్ భారత్’ పథకాన్ని ప్రారంభిస్తుంది. ఈ పథకం కింద ఆరేళ్లలో దాదాపు 64,180 కోట్లు ఖర్చు చేస్తాం" అని నిర్మలా సీతారామన్ చెప్పారు.

  19. కొత్త బడ్జెట్ ఆరు మూల స్తంభాలపై ఆధారపడింది

    "2021-2022 బడ్జెట్ ఆరు స్తంభాలపై ఆధారపడింది. మొదటి స్తంభం ఆరోగ్యం, సంక్షేమం. రెండోది భౌతిక, ఆర్థిక మూలధనం, మౌలిక సదుపాయాలు. మూడోది ఆకాంక్షల భారతదేశ సమగ్రాభివృద్ధి, నాలుగోది మానవ మూలధన పునరుజ్జీవం, ఐదోది ఆవిష్కరణ, పరిశోధన. ఆరోది కనిష్ట ప్రభుత్వం, గరిష్ట పాలన" అని నిర్మలా సీతారామన్ అన్నారు.