నరేంద్ర మోదీ ప్రభుత్వం.. ప్రభుత్వ బ్యాంకులను ఎందుకు ప్రైవేటీకరిస్తోంది? ఉద్యోగ సంఘాలు ఎందుకు సమ్మె చేస్తున్నాయి?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, ఆలోక్ జోషి
- హోదా, బిజినెస్ జర్నలిస్ట్
భారతదేశంలోని అన్ని ప్రభుత్వ బ్యాంకులు సోమ, మంగళవారాల్లో సమ్మెకు దిగనున్నాయి. దేశంలో అతిపెద్ద బ్యాంక్ ఉద్యోగుల సంఘం 'యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్' ఈ సమ్మెకు పిలుపునిచ్చింది. ఈ ఫోరంలో భారత్‌లోని బ్యాంకు ఉద్యోగులు, అధికారులకు చెందిన 9 సంఘాలు ఉన్నాయి.
ఐడీబీఐతోపాటూ మరో రెండు ప్రభుత్వ బ్యాంకులను ప్రైవేటీకరించబోతున్నట్లు కేంద్రం ప్రకటించడం సమ్మెకు ప్రధాన కారణంగా నిలిచింది.
బ్యాంకుల ప్రైవేటీకరణను బ్యాంక్ యూనియన్లు వ్యతిరేకిస్తున్నాయి. ప్రభుత్వ బ్యాంకులను బలోపేతం చేసి ఆర్థికవ్యవస్థను వేగవంతం చేసే బాధ్యతలు అప్పగించాల్సిన సమయంలో ప్రభుత్వం పూర్తిగా భిన్నంగా వ్యవహరిస్తోందని ఆరోపిస్తున్నాయి.
ఈ ఏడాది రెండు ప్రభుత్వ బ్యాంకులను, ఒక జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీని ప్రైవేటీకరణ చేస్తామని ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్‌లో చెప్పారు.
ఐడీబీఐ బ్యాంకును అమ్మే ప్రయత్నాలు అంతకు ముందు నుంచే నడుస్తున్నాయి. ఎల్ఐసీలో వాటాను అమ్మాలనుకుంటున్నట్లు గత ఏడాది బడ్జెట్లోనే చెప్పారు.
కానీ, ఇప్పటివరకూ ఏయే బ్యాంకుల్లో తమ వాటాను పూర్తిగా లేదా కొంత బాగాన్ని అమ్మాలనుకుంటోందో ప్రభుత్వం ఇంకా చెప్పలేదు.
కానీ, నాలుగు బ్యాంకులను అమ్మడానికి ప్రభుత్వం సన్నాహాలు చేస్తోందని, వాటిలో బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ ఓవర్‌సీస్ బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉన్నాయని వార్తలు వినిపిస్తున్నాయి.
వీటిని ఇంకా అధికారికంగా ధ్రువీకరించలేదు. కానీ, ఈ నాలుగు బ్యాంకుల్లో పనిచేసే దాదాపు లక్షా 30 వేల మంది సిబ్బందితోపాటూ మిగతా ప్రభుత్వ బ్యాంకుల్లో కూడా ఈ చర్చతో కలకలం రేగింది.

ఫొటో సోర్స్, Getty Images
1969లో ఇందిరాగాంధీ ప్రభుత్వం 14 బ్యాంకులను జాతీయం చేసింది. దేశంలోని అన్ని ప్రాంతాలను ముందుకు తీసుకెళ్లడంలో ఈ బ్యాంకులు తమ సామాజిక బాధ్యతను నిర్వహించడం లేదని, కేవలం తమ యాజమాన్యాల చేతుల్లో కీలుబొమ్మలుగా మారాయని ఆరోపించారు.
అయితే, అంతకు ముందు 1955లోనే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను కేంద్రం తన చేతుల్లోకి తీసుకుంది. ఆ తర్వాత 1980లో మొరార్జీ దేశాయ్ జనతా పార్టీ సర్కారు మరో ఆరు బ్యాంకులను జాతీయం చేసింది. కానీ బ్యాంకుల జాతీయీకరణ జరిగిన 52 సంవత్సరాల తర్వాత ప్రస్తుత ప్రభుత్వం ఆ చక్రాన్ని వెనక్కు తిప్పుతోంది.
నిజానికి 1991 ఆర్థిక సవరణల తర్వాత నుంచి వ్యాపారం చేయడం తమ పని కాదని కేంద్రం పదే పదే చెబుతూ వస్తోంది.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా, ఇటీవల అదే మాటను పునరుద్ఘాటించారు.
అన్ని రంగాల్లో భారీ స్థాయి ప్రైవేటీకరణ అంటే ప్రభుత్వ కంపెనీలను విక్రయించే పనిని కేంద్రం జోరుగా చేస్తోందనేది సుస్పష్టం. వ్యూహాత్మకంగా కీలక రంగాల్లో, అంటే స్ట్రాటజిక్ సెక్టార్లలోని కంపెనీలను కూడా తమ దగ్గర ఉంచుకోవాలనే ఉద్దేశం తమకు లేదని అదిప్పుడు చెప్పేసింది.
బ్యాంకుల విషయంలో ఒక పెద్ద సమస్య కూడా ఉంది. గత ప్రభుత్వాలన్నీ ప్రజలను ఊరించడానికి, ఓట్లు రాబట్టడానికి రకరకాల ప్రకటనలు చేస్తూ వచ్చాయి. ఆ భారమంతా ప్రభుత్వ బ్యాంకులు మోయాల్సొచ్చింది. రుణమాఫీలు దీనికి ఒక ఉదాహరణ. ఆ తర్వాత బ్యాంకుల పరిస్థితి అంతకంతకూ దిగజారింది. ప్రభుత్వం ఈ బ్యాంకులకు నిధులు ఇచ్చి మరీ, వాటిని తిరిగి నిలబెట్టాల్సి వస్తోంది.

ఫొటో సోర్స్, Getty Images
బ్యాంకుల జాతీయీకరణ తర్వాత, అన్ని రకాల సవరణలు, ప్రభుత్వం తరఫున చాలాసార్లు మూలధనం పెట్టిన తర్వాత కూడా ఈ ప్రభుత్వ బ్యాంకుల సమస్యలు పూర్తిగా ముగిసిపోలేదు.
డిపాజిట్, క్రెడిట్ విషయంలో ప్రైవేటు బ్యాంకులు, విదేశీ బ్యాంకులతో పోలిస్తే ఇవి వెనకబడినట్టు కూడా కనిపిస్తున్నాయి. ఇక స్ట్రెస్డ్ అసెట్స్ విషయానికి వస్తే ప్రభుత్వ బ్యాంకులు ముందున్నాయి.
గత మూడేళ్లలోనే కేంద్రం ప్రభుత్వ బ్యాంకుల్లో లక్షన్నర కోట్ల రూపాయల మూలధనం పెట్టింది. రీకాపిటలైజేషన్ బాండ్ ద్వారా లక్ష కోట్లకు పైగా మొత్తాన్ని కూడా ఇచ్చింది.
ఇప్పుడు ప్రభుత్వం ఉద్దేశం సుస్పష్టం. అది ఒక సుదీర్ఘ ప్రణాళికపై పనిచేస్తోంది. దాని ప్రకారం గత కొన్నేళ్లలో ప్రభుత్వ బ్యాంకుల సంఖ్యను 28 కంటే తగ్గించి 12కు చేయాలనుకుంటోంది. వాటిని కూడా ఇంకా తగ్గించాలనుకుంటోంది. బలహీనంగా ఉన్న కొన్ని బ్యాంకులను మిగతా పెద్ద బ్యాంకులతో కలిపేయాలి. మిగతా వాటిని అమ్మేయాలి. వారి ఫార్ములా ఇదే.
దీనివల్ల పదే పదే బ్యాంకులకు మూలధనం పెట్టి, వాటిని నిలబెట్టాలనే ఆందోళన నుంచి ప్రభుత్వానికి విముక్తి లభిస్తుంది.
ఈ ఆలోచన రావడం ఇది మొదటిసారి కాదు. గత 20 ఏళ్లలో దీనిపై చాలాసార్లు చర్చ జరిగింది. కానీ అధికార, విపక్షాల వాదనల మధ్య నిలిచిపోయింది.
"బ్యాంకుల జాతీయీకరణ రాజకీయ నిర్ణయం, అందుకే వాటి ప్రైవేటీకరణ నిర్ణయం కూడా రాజకీయంగానే తీసుకోవాలి" అని రిజర్వ్ బ్యాంక్ మాజీ గవర్నర్ వైవీ రెడ్డి అన్నారు. అందుకే, ఇప్పుడు రాజకీయ నిర్ణయం తీసుకున్నట్టే ఉంది
భారత్‌లో ప్రైవేట్, ప్రభుత్వ బ్యాంకుల వృద్ధి రేటును పోల్చిచూస్తే ప్రైవేటు బ్యాంకులు దాదాపు ప్రతి అంశంలో ప్రభుత్వ బ్యాంకులను దాటేశాయనేది స్పష్టంగా కనిపిస్తుంది. దానికి ఆ బ్యాంకుల లోపల, బ్యాంకులతో ప్రభుత్వ సంబంధాల్లో కారణం చూడవచ్చు.
బ్యాంకుల ప్రైవేటీకరణ వల్ల కష్టంగానే ఉంటుంది. అయితే, అలా చేయడం వల్ల ఈ బ్యాంకులు తమ సొంత నిబంధనలపై పనిచేయగలిగే స్వేచ్ఛను కూడా పొందుతాయి.

ఫొటో సోర్స్, Getty Images
కానీ, బ్యాంక్ ఉద్యోగులు, అధికారులు ఈ వాదనలు పూర్తిగా నిరాధారం అంటున్నారు.
ప్రైవేట్ బ్యాంకులు దేశ ప్రయోజనాలకోసం కాకుండా తమ యాజమాన్యం ప్రయోజనాలే చూస్తాయని బ్యాంకుల జాతీయీకరణ సమయంలో స్పష్టమైంది. అందుకే ఈ నిర్ణయం కేవలం సిబ్బందికే కాకుండా, మొత్తం దేశానికే ప్రమాదకరం. గత కొన్నేళ్లుగా ఐసీఐసీఐ బ్యాంక్, యస్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, లక్ష్మీవిలాస్ బ్యాంకుల్లో బయటపడిన అవకతవకలతో ప్రైవేటు బ్యాంకులు మెరుగ్గా పనిచేస్తాయనే వాదన కూడా బలహీనపడింది.
ఏదైనా ఒక బ్యాంక్ పూర్తిగా మునిగిపోయే స్థితికి చేరుకున్నప్పుడు ప్రభుత్వమే ముందుకు వచ్చి దానిని ఆదుకోవాల్సి ఉంటుంది. అప్పుడు ఆ బాధ్యతను ఏదో ఒక ప్రభుత్వ బ్యాంకు నెత్తిన రుద్దుతారు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత భారత్‌లో ఇప్పటివరకూ రీషెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్ ఏదీ మునిగిపోకుండా ఉండడానికి అదే కారణం అంటున్నారు.
ప్రైవేటీకరణ నిర్ణయాన్ని బ్యాంక్ యూనియన్లు చాలాకాలంగా ప్రతిఘటిస్తున్నాయి. ఎగవేత రుణాల వసూళ్లకు కఠిన చట్టపరమైన చర్యలు చేపట్టడానికి బదులు, ఐబీసీ లాంటి చట్టాన్ని ఏర్పాటు చేయడం కూడా ఒక పెద్ద కుట్ర అని అవి ఆరోపిస్తున్నాయి. ఎందుకంటే, దానిద్వారా ప్రభుత్వ బ్యాంకులు చివరికి తమ రుణాలను 'హెయిర్ కట్' పేరుతో, అంటే అసలు కంటే తక్కువ మొత్తం తీసుకుని, లావాదేవీలు పరిష్కరించుకునేలా రాజీ పడాల్సి వస్తోంది.
యునైటెడ్ ఫోరంలో ఉన్న అన్ని యూనియన్ల సిబ్బంది, అధికారులు సోమవారం, మంగళవారం సమ్మెలో ఉంటారు. దీనికి ముందు శుక్రవారం మహాశివరాత్రి, రెండో శనివారం, ఆదివారం సెలవు వచ్చింది. అంటే మొత్తం ఐదు రోజులు బ్యాంకుల్లో కార్యకలాపాలు ఆగిపోతాయి.
అయితే ప్రైవేటు బ్యాంకుల్లో ఈ సమ్మె ప్రభావం ఉండదు. కానీ మొత్తం బ్యాంకింగ్ బిజినెస్‌లో మూడింట ఒకవంతు మాత్రమే వాటి దగ్గర ఉంది. అంటే మూడింట రెండు వంతుల బ్యాంకుల కార్యకలాపాలపై ఈ సమ్మె ప్రభావం పడుతుంది.
అందులో కూడా డబ్బు జమ చేయడం, తీయడమే కాకుండా, ముఖ్యంగా చెక్కుల క్లియరెన్స్, కొత్త అకౌంట్లు తెరవడం, డ్రాఫ్ట్ తీసుకోవడం, లోన్ ఎంక్వైరీ లాంటి వాటిపై ప్రభావం పడవచ్చు.
అయితే ఏటీఎంలకు ఎలాంటి అంతరాయం ఉండదు. స్టేట్ బ్యాంక్ మాత్రం తమ శాఖల్లో కార్యకలాపాలు కొనసాగేలా తగిన ఏర్పాట్లు చేశామని, కానీ, అక్కడక్కడా సమ్మె ప్రభావం కనిపించవచ్చని చెప్పింది.
ఇవి కూడా చదవండి:
- మోదీ ప్రభుత్వం పెట్టుబడుల ఉపసంహరణ లక్ష్యాలను ఎందుకు చేరుకోలేకపోతోంది?
- మోదీ జాబ్ దో, మోదీ రోజ్గార్ దో... ట్విటర్‌లో మార్మోగిపోతున్న హ్యాష్ట్యాగులు
- పెట్రోల్, గ్యాస్ ధరల వల్ల మీ జేబుపై ఎంత భారం పడుతుంది
- మోదీ చెబుతున్నట్లు పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడానికి నిజంగా గత ప్రభుత్వాలే కారణమా?
- శాంతియుత నిరసనలు హింసాత్మకంగా ఎందుకు మారతాయి? పోలీసులతో జనం ఎందుకు ఘర్షణకు దిగుతారు?
- చింతల వెంకటరెడ్డి: మట్టితో ఈ రైతు చేసిన ప్రయోగాలు సేంద్రియ వ్యవసాయాన్ని కొత్త పుంతలు తొక్కిస్తాయా?
- ఆంధ్రప్రదేశ్: గాడిద మాంసం తింటే సెక్స్ సామర్థ్యం పెరుగుతుందా.. ఏపీలో ఎందుకంత గిరాకీ పెరుగుతోంది
- మీ 'టేక్ హోమ్ సాలరీ' రాబోయే రోజుల్లో తగ్గిపోనుందా... ఎందుకని?
- తెలంగాణలో కుల అహంకార హత్య: ప్రేమించి గర్భం దాల్చిన కూతురిని చంపేసిన తల్లిదండ్రులు
- పులి, మేకల మధ్య స్నేహ బంధం ఎలా సాధ్యం? వైరి జంతువుల మధ్య మితృత్వం వెనుక రహస్యం ఏమిటి?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)








