బిల్ గేట్స్: ఆవు తేన్పులు పర్యావరణహితంగా ఉండాలని ఆయన ఎందుకు కోరుకుంటున్నారు

ఫొటో సోర్స్, Getty Images
ఆవులు, గొర్రెలు వంటి జంతువుల తేన్పుల వల్ల పర్యావరణానికి కలిగే నష్టాన్ని తగ్గించేందుకు అనేక కంపెనీలు పని చేస్తున్నాయి.
ఆస్ట్రేలియాకు చెందిన ఇలాంటి ఒక స్టార్టప్‌లో మైక్రోసాఫ్ట్ సహవ్యవస్థాపకులు బిల్ గేట్స్ పెట్టుబడి పెట్టారు.
బ్రేక్ థ్రూ ఎనర్జీ వెంచర్స్ నుంచి 12 మిలియన్ డాలర్లు అంటే సుమారు 97 కోట్ల రూపాయలు సమీకరించినట్లు రుమిన్8 అనే స్టార్టప్ తెలిపింది.
2015లో బ్రేక్ థ్రూ ఎనర్జీ వెంచర్స్‌ను బిల్ గేట్స్ స్థాపించారు.
పెర్త్‌కు చెందిన రుమిన్8లో అమెజాన్ ఫౌండర్ జెఫ్ బెజోస్, చైనా పారిశ్రామికవేత్త జాక్ మా కూడా పెట్టుబడులు పెట్టారు.
ఆవులు, మేకలు, గొర్రెలు వంటివి తినే ఆహారంలో మార్పులు చేయడం ద్వారా మీథేన్ ఉద్గారాలను తగ్గించాలని ఆ స్టార్టప్ ప్రయత్నిస్తోంది.

ఫొటో సోర్స్, Getty Images
ఆవుకు పర్యావరణానికి సంబంధం ఏంటి?
ఆవులు తేన్చినప్పుడు, మూత్రవిసర్జన చేసినప్పుడు మీథెన్, నైట్రస్ ఆక్సైడ్ వంటి గ్రీన్ హౌస్ వాయువులు విడుదల అవుతాయి. పర్యావరణ మార్పులకు కారణమవుతున్న వాటిలో గ్రీన్ హౌస్ వాయువులు కూడా ఉన్నాయి.
ఆవు తేన్చినప్పుడు మీథెన్ వాయువు విడుదల అవుతోంది కాబట్టి దాని మీద పన్ను వేస్తామని న్యూజీలాండ్ గతంలో ప్రకటించింది. దీంతో పాటు ఇతర పశువులు, గొర్రెల మీద కూడా పన్ను వేస్తామని తెలిపింది.
ఆవులు, గొర్రెలు, మేకల ద్వారా సుమారు 14శాతం గ్రీన్ హౌస్ వాయువులు విడుదల అవుతున్నాయి.
సూర్యుడి నుంచి విడుదలయ్యే వేడిని 20 రెట్లు ఎక్కువగా మీథెన్ పట్టి ఉంచుతుంది. సీఓ2 కంటే కూడ ఇది చూపే ప్రభావం ఎక్కువ. వేడి వాతావరణంలోనే ఉండి పోవడం వల్ల భూమి వేడి ఎక్కుతుంది. అది చివరకు గ్లోబల్ వార్మింగ్‌కు దారి తీస్తుంది. భూమి మీద మీథెన్ విడుదలకు పశువులు కూడా ప్రధాన కారణం అవుతున్నాయి.

ఆవు జీర్ణాశయంలో నాలుగు అరలు ఉంటాయి.
తొలి అరను రూమెన్ అంటారు. ఇందులో గడ్డి వంటి ఆహారం పాక్షికంగా జీర్ణం అవుతుంది. ఇక్కడే అసలు సమస్య ఉంది. రూమెన్‌లో ఉండే బ్యాక్టీరియా ఫెర్మెంటేషన్ ప్రక్రియ ద్వారా ఆహారాన్ని జీర్ణం చేసే క్రమంలో మీథెన్ వాయువు విడుదల అవుతుంది.
ఆవులు తేన్చినప్పుడు లేదా అపాన వాయువును విడుదల చేసినప్పుడు మీథెన్ బయటకు విడుదల అవుతుంది. ఒక పెద్ద ఆవు రోజుకు 500 లీటర్ల వరకు మీథెన్‌ను విడుదల చేస్తుంది.
భూమి మీద సుమారు 140 కోట్ల ఆవులు ఉన్నట్లు అంచనా. ఈ లెక్కన చూస్తే గ్రీన్ హౌస్ వాయువుల విడుదలలో ఆవుల వాటా సుమారు 3.7శాతం అని ఐక్యరాజ్యసమితి చెబుతోంది. మీథెన్ అనేది వాతావరణంలో ఉంటుంది. కానీ మానవుని చర్యల వలన అది మరింత ఎక్కువగా విడుదల అయ్యి పరిమితికి మించి పోతోంది.

ఫొటో సోర్స్, UNIVERSITY OF SUNSHINE COAS
ఆవులు విడుదల చేసే మీథెన్ వాయువుల స్థాయి తగ్గాలంటే అవి తీసుకునే ఆహారంలో చేయాల్సిన మార్పులపై పరిశోధనలు జరుగుతున్నాయి.
ఇందులో భాగంగా 2014లో ఆస్ట్రేలియా శాస్త్రవేత్తలు 'పింక్ సీవిడ్'ను గుర్తించారు. ఆహారంలో పింక్ సీవిడ్‌ను కలిసి ఇచ్చినప్పుడు ఆవుల్లో మీథెన్ వాయువు విడుదల 99శాతం తగ్గినట్లు ఆస్ట్రేలియా నేషనల్ సైన్స్ ఏజెన్సీ తెలిపింది.
ఆవులను పర్యావరణ అనుకూలంగా మార్చేందుకు ఇలాంటి పరిశోధనలు అనేకం కొనసాగుతున్నాయి.
ఇవి కూడా చదవండి:
- 8 ఏళ్ల వయసులోనే సన్యాసినిగా మారిన వజ్రాల వ్యాపారి కూతురు...ఈ నిర్ణయంపై ఎవరేమన్నారు?
- క్రైస్తవం: జెరూసలేంలో మొదటి మహిళా పాస్టర్ నియామకం
- స్టీవెన్ స్మిత్: ఒక బాల్కి 16 పరుగులు, ఇది ఎలా సాధ్యమైంది?
- మథుర కారిడార్: ఇక్కడ ఆలయాలను కూలగొడతారా... బృందావన వాసులు ‘రక్తం’తో లేఖలు ఎందుకు రాస్తున్నారు
- నాగోబా జాతర: కొత్త కోడళ్లను నాగేంద్రునికి పరిచయం చేసే ఈ జాతర ఎలా జరుగుతుందంటే...
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














