బడ్జెట్ 2023: ఆదాయపు పన్ను మినహాయింపులు ఉంటాయా... మధ్యతరగతి కోరికలు నెరవేరుతాయా?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, దీపక్ మండల్
- హోదా, బీబీసీ ప్రతినిధి
కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం ఈ రోజు(ఫిబ్రవరి 1) పార్లమెంటులో బడ్జెట్ ప్రవేశపెడుతోంది.
2023లో దేశంలోని 9 రాష్ట్రాలలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. షెడ్యూల్ ప్రకారం 2024లో లోక్‌సభ ఎన్నికలూ జరగనున్నాయి.
లోక్‌సభ ఎన్నికలకు ముందు ప్రవేశపెడుతున్న చివరి పూర్తిస్థాయి బడ్జెట్ కావడంతో దీనిపై ప్రజల్లో అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ బడ్జెట్‌లో కచ్చితంగా ప్రజలకు కానుకలు ఉంటాయని భావిస్తున్నారు.
ముఖ్యంగా ఆదాయ పన్ను పరిధిలో ఉండే వేతన ఉద్యోగులు ఈ బడ్జెట్‌పై భారీ ఆశలు పెట్టుకున్నారు. పన్ను మినహాయింపులు కల్పించిన తమపై భారం తగ్గిస్తారని వారు ఆశిస్తున్నారు.
మధ్యతరగతి వేతన ఉద్యోగులతో పాటు అధిక ఆదాయ గ్రూపుల పరిధిలోకి వచ్చేవారూ పన్ను శ్లాబులలో మార్పులను ఆశిస్తున్నారు.
సుమారు 136 కోట్ల జనాభా ఉన్న భారతదేశంలో దాదాపు 8 కోట్ల మంది మాత్రమే ఆదాయ పన్ను చెల్లిస్తున్నారు.
అదేసమయంలో జీఎస్టీ, కొన్ని రకాల సర్‌చార్జీల రూపంలో కేంద్ర ప్రభుత్వం ప్రజల నుంచి పరోక్ష పన్నులను వసూలు చేస్తుంది. ప్రభుత్వానికి ప్రధాన ఆదాయవనరు ఈ పరోక్ష పన్నులే.
ఓవైపు ఆదాయ పన్ను చెల్లిస్తూనే మరోవైపు పరోక్ష పన్నులూ కడుతుండడంతో తమపై రెట్టింపు భారం పడుతోందన్నది వేతన జీవుల వాదన.
ప్రతిసారీ బడ్జెట్ సమయంలో మధ్యతరగతి పన్ను చెల్లింపుదారులు కొన్ని మినహాయింపులు, ఉపశమనాలు ఆశిస్తున్నారు. ఈసారీ బడ్జెట్ నేపథ్యంలో కేంద్రంపై అలాంటి ఆశలే పెట్టుకున్నారు.
అయితే, మోదీ ప్రభుత్వం వారి ఆశలు తీరుస్తుందా? అసలు దేశ ఆర్థిక వ్యవస్థ అలాంటి పరిస్థితులలో ఉందా?

ఫొటో సోర్స్, Getty Images
బడ్జెట్‌లో మినహాయింపులు ఉంటా లేవా అనేది అంచనాలు వేసుకునేముందు దేశ ఆర్థిక వ్యవస్థ ఎలా ఉందో చూద్దాం.
గత రెండుమూడేళ్లుగా భారత ఆర్థిక వ్యవస్థ కష్టాల్లో ఉంది. కోవిడ్ కారణంగా ఆర్థిక కార్యకలాపాలకు అంతరాయాలు ఏర్పడి పెద్దసంఖ్యలో ప్రజలు నిరుద్యోగులయ్యారు.
వేతనాలపై ఆధారపడేవారి ఆదాయాలు తగ్గాయి. ద్రవ్యోల్బణం కారణంగా ప్రజలు తమ ఆదాయంలో ఖర్చు చేయదగ్గ భాగం తగ్గిపోయింది.
ద్రవ్యోల్బణాన్ని నియంత్రించేందుకు రిజర్వ్ బ్యాంక్ వడ్డీరేట్లను నిరంతరం పెంచుకుంటూపోతోంది. దీంతో రుణాలు తీసుకునేవారు నెలనెలా చెల్లించే ఈఎంల మొత్తం పెరుగుతోంది.
అన్నీ పెరుగుతున్నాఉద్యోగుల జీతాల్లో మాత్రం పెరుగుదల లేదు.

ఫొటో సోర్స్, ANI
భారత ఆర్థిక వ్యవస్థ ఎదుర్కొంటున్న సవాళ్లు
ఆర్థిక విశ్లేషకుడు, కాలమిస్ట్ స్వామినాథన్ ఎస్. అంక్లేసరియా అయ్యర్ ప్రస్తుత దేశ ఆర్థిక స్థితి గురించి మాట్లాడుతూ.. ‘ప్రపంచంలో మాంద్యం పరిస్థితులు నెలకొన్న సమయంలో ఉపశమనాలు ఇవ్వడం కంటే కూడా ఈ మాంద్యాన్ని ఎలా ఎదుర్కోవాలన్నదే ప్రస్తుతం భారత ఆర్థిక వ్యవస్థ ముందు ఉన్న సవాల్’ అన్నారు.
‘ముందుముందు వడ్డీ రేట్లు ఎంతలా పెరుగుతాయో తెలియదు. మాంద్యం తీవ్రత ఎలా ఉంటుందో తెలియదు. యుక్రెయిన్, రష్యా యుద్ధం ఎలాంటి మలుపు తిరుగుతుందో తెలియదు. ఇవన్నీ దేశ ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేసేవే’ అన్నారు స్వామినాథన్.
‘భారత ఆర్థిక వ్యవస్థ పుంజుకోవడం అనేది కేవలం దేశంలోని విషయాలపై ఆధారపడే అంశం కాదు. ఇది ప్రపంచ ఆర్థిక వ్యవస్థపైనా ఆధారపడుతుంది’ అన్నారు స్వామినాథన్. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వృద్ధిరేటు 6.8 శాతంతో పోల్చితే 2023-24లో వృద్ధిరేటు 5.5 శాతానికి తగ్గుతుందని అంచనా’ అని స్వామినాథన్ విశ్లేషించారు.
‘ప్రస్తుతం దేశ ఆర్థిక వ్యవస్థకు ఊతమివ్వడం కంటే ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో క్షీణత ప్రభావంతో కలిగే కుదుపులను తట్టుకోవడమే ప్రస్తుతం భారత ఆర్థిక వ్యవస్థ ముందు ఉన్న ప్రధాన సవాల్’ అని స్వామినాథన్ అన్నారు.
స్వామినాథన్ వాదన సహేతుకంగానే ఉంది. భారత దేశ దిగుమతులు, ఎగుమతులు రెండూ తగ్గినప్పటికీ ఎగుమతులలో క్షీణత మరింతగా ఉంది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ నుంచి డిమాండ్ తగ్గుతోందని, ప్రపంచం మాంద్యం వైపు పయనిస్తోందని ఈ పరిస్థితి స్పష్టం చేస్తోంది.

ఫొటో సోర్స్, Getty Images
ద్రవ్యోల్బణ ఒత్తిడి
‘ప్రపచంలోని ఇతర ఆర్థిక వ్యవస్థలను పోల్చినప్పుడు భారత ఆర్థిక వ్యవస్థను ప్రకాశవంతమైనదిగానే అభివర్ణించొచ్చు. కానీ, స్థూల ఆర్థిక వ్యవస్థగా చూసినప్పుడు పరిస్థితి ఏమంత బాగులేదు.
ద్రవ్యోల్బణం కారణంగా ఎదురవుతున్న ఒత్తిడి దేశ ఆర్థిక వ్యవస్థపై కనిపిస్తోంది. కోవిడ్ ప్రభావాన్ని తగ్గించడానికి, పేదలకు ఉపశమనం కలిగించడానికి ప్రభుత్వం తీసుకున్న అప్పులు గత నాలుగేళ్లలో రెండింతలు పెరిగాయి. అదేసమయంలో ఉద్యోగ, ఉపాధి కల్పన వేగం నెమ్మదించింది.
ప్రభుత్వానికి పన్నుల ఆదాయం పెరిగినప్పటికీ వచ్చే ఆర్థిక సంవత్సరంలో రూ. 16 లక్షల కోట్ల రుణం కూడా తీసుకోనుంది.
ఈ రుణం ద్వారా సమకూరుతున్న ధనాన్ని మోదీ ప్రభుత్వం మౌలిక వసతుల కల్పనపై ఖర్చు చేయనుంది.
మోడీ ప్రభుత్వం ఈ డబ్బును మౌలిక సదుపాయాల కోసం ఖర్చు చేయనుంది. దీంతో పాటు ద్రవ్యలోటును అదుపులో ఉంచడమూ ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ లక్ష్యంగా కనిపిస్తోంది.
ఇలాంటి పరిస్థితిలో ఆమె పన్నులు మినహాయింపులు ఇచ్చి ఆదాయాన్ని తగ్గించుకునే రిస్క్ చేయకపోవచ్చు’ అన్నారు స్వామినాథన్.

ఫొటో సోర్స్, Reuters
పన్ను మినహాయింపు ఆశలు నెరవేరేనా?
లోక్‌సభ ఎన్నికలకు ముందు ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో ప్రజలను ఆకట్టుకునే చర్యలు ఉంటాయనేది చాలామందికి ఉన్న భావన. కానీ, ప్రజల జ్ఞాపకశక్తి తక్కువని నమ్మే కొందరు విశ్లేషకులు మాత్రం లోక్‌సభ ఎన్నికలకు ఇంకా 15 నెలల సమయం ఉన్న పరిస్థితుల్లో ప్రభుత్వం ఇలాంటి నిర్ణయం తీసుకోకపోవచ్చని అంటున్నారు.
ప్రస్తుత బడ్జెట్‌లో కల్పించే ఉపశమనాలను ఎన్నికల నాటికి ప్రజలు మర్చిపోతారని అంటున్నారు.
టాక్స్ ఎక్స్‌పర్ట్ సత్యేంద్ర జైన్ ‘బీబీసీ’తో మాట్లాడుతూ.. ‘ఇప్పటివరకు ఈ ప్రభుత్వం ఎలాంటి పన్ను మినహాయింపులు ఇవ్వలేదు. ఒకవేళ ఈసారి పన్ను మినహాయింపులో, ఇంకేవైనా ఉపశమనాలో కల్పించాలని అనుకున్నా ఇప్పుడు ప్రకటించకపోవచ్చే. సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో ఇచ్చే అవకాశాలుంటాయి’ అన్నారు.
‘ఇప్పుడు బడ్జెట్‌లో ప్రకటించకపోయినా తరువాత నెలల్లో నోటిఫికేషన్ జారీ చేసి ఇలాంటి నిర్ణయాన్ని ప్రకటించొచ్చు. ఇప్పుడు పన్ను మినహాయింపుల కంటే సంక్షేమ పథకాలకు చేసే ఖర్చును పెంచాలని ప్రభుత్వం అనుకోవచ్చు’ అన్నారాయాన.
‘ద్రవ్యోల్బణ ప్రభావాన్ని తగ్గించాల్సిన సమయంలో ఆదాయపు పన్ను మినహాయింపు కల్పించడం సరైన చర్య కాదు. మినహాయింపులు కల్పిస్తే ప్రజల వద్ద డబ్బు మిగిలి అది మార్కట్లోకి వస్తుంది, దానివల్ల ద్రవ్యోల్బణం మరింత పెరుగుతుంది. ఆర్బీఐ ఇప్పుడు ద్రవ్బోల్బణం నివారించడంపైనే దృష్టి పెడుతుంది. కాబట్టి పన్ను మినహాయింపులు ఉండకపోవచ్చు. దానికి బదులు సంక్షేమ పథకాలపై పెట్టబోయే ఖర్చు పెంచి ప్రజలను ఆకట్టుకోవచ్చు’ అన్నారు సత్యేంద్ర జైన్.
పన్ను పరిధిలోకి వచ్చే అవధిని పెంచాలని, ఇన్‌కమ్ ట్యాక్స్ సెక్షన్ 80సీ కింద మినహాయింపు మొత్తం పెంచాలని, వైద్య ఖర్చుల మినహాయింపు పరిమితి పెంచాలని, గృహరుణం వడ్డీపై మినహాయింపు పరిమితీ పెంచాలని పన్ను చెల్లింపుదారులు కోరుతున్నారు.
దీంతోపాటు ఆదాయ పన్ను సెక్షన్ 80టీటీ, 80 టీటేఏ కింద దీర్ఘకాలిక మూలధన లాభంపై పన్ను మినహాయింపు, కోత పరిమితి పెంచాలనీ కోరుతున్నారు.
ఏం కోరుతున్నారంటే..
- బేసిక్ ఎగ్జంప్షన్ రూ. 2.5 లక్షల నుంచి రూ. 5 లక్షలకు పెంచాలి
- స్టాండర్డ్ డిడక్షన్ పరిమితి రూ. 50 వేలుగా ఉంది. దీన్ని పెంచాలి.
- సెక్షన్ 80సీ పరిమితి రూ. 1.5 లక్షల నుంచి రూ. 2 లక్షలకు పెంచాలి.
- వైద్య ఖర్చుల పరిమితి రూ. 50 వేలుగా ఉంది. ఇది పెంచాలి.
- గృహ రుణం తిరిగి చెల్లించడంపై లభిస్తున్న పన్ను మినహాయింపును మరింత పెంచాలి.
- పొదుపు ఖాతాలు, ఫిక్స్‌డ్ డిపాజిట్ల వడ్డీపై మినహాయింపు పరిమితి పెంచాలి.
- దీర్ఘకాలిక మూలధన పన్ను లాభంపై మినహాయింపు పరిమితి పెంచాలి

ఫొటో సోర్స్, Getty Images
apnapaisa.com సీఎఫ్ఓ, టాక్స్ ఎక్స్‌పర్ట్ బల్వంత్ జైన్ బీబీసీతో మాట్లాడుతూ.. ప్రజల ఆదాయానికి సంబంధించిన డాటా సేకరించడం ద్వారా పాలసీలు రూపొందించడానికి గాను ప్రభుత్వం ప్రస్తుత బేసిక్ ఎగ్జంప్షన్ పరిమితి నిర్ణయించిందని.. దీన్ని రూ. 5 లక్షలకు పెంచే అవకాశం లేదని, రూ. 3 లక్షలకు పెంచే అవకాశం ఉందని చెప్పార.
అయితే, 80 సీ కింద ఇచ్చే మినహాయింపులను పెంచాలన్న డిమాండ్‌కు సత్యేంద్ర జైన్ మద్దతుగా ఉన్నారు.
‘2014లో 80సీ మినహాయింపు పరిమితిని రూ. లక్ష నుంచి రూ. 1.5 లక్షలకు పెంచారు. అయితే, కొన్నేళ్లుగా ఎన్‌పీఎస్ పెట్టుబడులు, చిన్నమొత్తాల పొదుపు పథకాలు, పిల్లల ట్యూషన్ ఫీజులు వంటివీ దీనిలో చేర్చారు. ఇన్ని అంశాలు చేర్చిన తరువాత రూ. 1.5 లక్షల పరిమితి తక్కువే కాబట్టి రూ. 3 లక్షలకు పెంచాలి’ అన్నారు సత్యేంద్ర జైన్.
గృహ రుణాల చెల్లింపులు..
కొన్నేళ్లుగా ఇళ్ల కొనుగోలు ఖరీదైన వ్యవహారంగా మారడంతో ప్రభుత్వం గృహరుణాల చెల్లింపులపై ప్రత్యేక మినహాయింపు ఇవ్వాలని సత్యేంద్ర జైన్ అభిప్రాయపడ్డారు.
80సీలో అనేక అంశాలు ఉన్నందున గృహ రుణాల కోసం ప్రత్యేక మినహాయింపు తేవాలని ఆయన అన్నారు.
బడ్జెట్ సందర్భంలో ప్రతిసారీ ఆదాయ పన్ను మినహాయింపులపై అంచనాలుంటాయని, కానీ, ఆర్థిక మంత్రి ఏం చేస్తారో ఊహించడం కష్టమని సత్యేంద్ర జైన్ అన్నారు.
ఇవి కూడా చదవండి:
- ముస్లిం ఫండ్ పేరుతో ప్రజల నుంచి కోట్ల రూపాయలు కొల్లగొట్టిన అబ్దుల్ రజాక్
- మల్టీ లెవెల్ మార్కెటింగ్ మోసాలు: 'బంబుల్, టిండర్ వంటి యాప్స్‌తో నేను మగాళ్ళను ఎందుకు ఆకర్షించాలి?'
- ఫిన్లాండ్: పరీక్షలు, ర్యాంకులు లేని అక్కడి చదువుల గురించి ఇండియాలో ఎందుకు చర్చ జరుగుతోంది?
- జహాన్ ఆరా: విలాసవంతమైన మసీదులు, సత్రాలు కట్టించిన అందాల మొఘల్ రాణి
- థైరాయిడ్ సమస్య: మందులు వాడుతున్నా తగ్గకపోతే ఏం చేయాలి?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














