తెలంగాణ: కరెంటు బిల్లులో ఏసీడీ చార్జీల వివాదం ఏంటి, సిబ్బంది నిర్బంధాలు ఎందుకు? అవి కట్టాల్సింది ఇంటి యజమానా లేక కిరాయిదారా?

- రచయిత, ప్రవీణ్ శుభం
- హోదా, బీబీసీ కోసం
ఉత్తర తెలంగాణ జిల్లాల్లో నలుగురు కలిసిన చోటల్లా ‘ఏసీడీ చార్జీల’ చుట్టూ చర్చ సాగుతోంది. గృహావసరాలకు వాడిన అసలు విద్యుత్ కంటే బిల్లులో కొసరుగా వేసి పంపుతున్న ఏసీడీ చార్జీలే ఎక్కువగా ఉన్నాయన్న మాటలు సర్వ సాధారణంగా వినిపిస్తున్నాయి.
ఏసీడీ చార్జీలు 500 నుండి 5 వేల రూపాయల వరకు పడుతున్నాయి.
ఏసీడీ చార్జీలను వ్యతిరేకిస్తూ నిరసనలు, విద్యుత్ సిబ్బందితో ఘర్షణలు, వారి నిర్బంధాలు ఉత్తర తెలంగాణ జిల్లాల్లో కనిపిస్తున్నాయి.
ప్రజల ఆందోళనకు ప్రతిపక్షాలు మద్దతు ఇస్తూ ఆందోళనలకు దిగుతున్నాయి.
ఈ ఏసీడీ చార్జీలు ఏంటి? వాటిని ఎందుకు వసూలు చేస్తున్నారు? అనే ప్రశ్నలతో పాటూ అద్దె ఇళ్ల విషయంలో అవి ఎవరు కట్టాలన్న అంశంపై ప్రస్తుతం అయోమయం నెలకొంది.
TSNPDCL - ది నార్తర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపనీ ఆఫ్ తెలంగాణ లిమిటెట్
విద్యుత్ సంస్థల నష్టాలను తగ్గించడం, ఉత్తర తెలంగాణ జిల్లాలకు నాణ్యమైన విద్యుత్ సరఫరా అందించాలనే ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎలక్ట్రిసిటీ బోర్డ్ (APSEB) నుండి వేరుపరిచి వరంగల్ కేంద్రంగా 2000లో ఎన్‌పీడీసీఎల్ ఏర్పాటు చేశారు.
ఉత్తర తెలంగాణ ప్రాంతంలోని మొత్తం 17 జిల్లాల్లో దీని కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. సుమారు కోటిన్నర మంది ప్రజలకు సేవలు అందుతున్నాయి.
ఎన్‌పీడీసీఎల్ పరిధిలోని విద్యుత్ వినియోగదారుల నుండి ప్రస్తుతం ఏసీడీ చార్జీల వసూలుకు అధికారులు సిద్ధం అయ్యారు.
గత జనవరి నెలలో పంపిన బిల్లుల్లో ఏసీడీ బకాయిలను చూపారు. ఈ బకాయిలను ఫిబ్రవరి మాసంలో రెగ్యులర్ బిల్లుతో పాటూ చెల్లించాలని అధికారులు అంటున్నారు.
అయితే, గతంలో అదనపు చార్జీలు, సర్దుబాటు చార్జీలు, సెక్యూరిటీ డిపాజిట్లు , డెవలప్మెంట్ చార్జీల పేరిట చేసిన అదనపు వసూళ్లపై కొద్దిమేర అవగాహన ఉన్న వినియోగదారులు భారీ మొత్తంలో వస్తున్న ఏసీడీ బిల్లుల విషయంలో అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
ఇంతకూ ఏసీడీ అనేది బిల్లా లేక డిపాజిటా అన్న అంశంలో అనేక అపోహలు నెలకొన్నాయి.

ఫొటో సోర్స్, NPDCL
ఏసీడీ (అడీషనల్ కంజమ్షన్ డిపాజిట్)
వినియోగదారుడి సంవత్సర విద్యుత్ వినియోగంలో రెండు నెలల సరాసరి బిల్లును ఏసీడీ చార్జీగా పేర్కొంటూ ఎన్‌పీడీసీఎల్ వసూలుకు సిద్దం అయింది.
ప్రతి రెండు నెలలకు (బైమంత్లీ) బిల్లులు వసూలు చేసే ప్రాంతాల్లో మూడు నెలల సరాసరి బిల్లును ఏసీడీగా వసూలు చేయాలని నిర్ణయించింది.
ఇంకా సులువుగా చెప్పాలంటే, ఒక సంవత్సంరలోని 12 నెలల్లో మీ మొత్తం బిల్లు 12 వేలు అనుకుంటే, అందులో యావరేజ్‌గా రెండు నెలల బిల్లు అంటే 2 వేల రూపాయలు ఏసీడీగా ఎన్‌పీడీసీఎల్‌కు ఇకపై చెల్లించాలి.
మోస్తరు విద్యుత్ వినియోగం ఉన్న గృహాల్లో ఈ ఏసీడీ చార్జీలు వేలల్లో వస్తున్నాయి. నెల బిల్లుతో పాటూ ఏసీడీ చార్జీలను కలుపుకుంటే అయ్యే మొత్తం భారీగా ఉంటోంది. దీనిపై అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి.
అద్దె ఇళ్లలో ఉండే వారికి అదనపు భారం
ఇప్పుడు ఏసీడీ చార్జీలు అద్దె ఇంటి యజమానులు, కిరాయిదార్లకు మధ్య చిచ్చు పెట్టాయి. ఏసిడీ డ్యూస్ ఎవరు కట్టాలన్న అంశంలో ఏకాభిప్రాయం కుదరడం లేదు.
విద్యుత్ వాడుకున్నది కిరాయిదార్లే కాబట్టి వాళ్లే ఏసీడీలను కట్టాలని ఇంటి యజమానులు అంటుంటే, ప్రతి నెల బిల్లు ఎలాగూ కడుతున్నాం కదా ఇంకా ఈ అదనపు వడ్డింపు ఏంటని కిరాయిదార్ల నుండి ప్రశ్నలు ఎదురవుతున్నాయి.
"జనవరి నెలలో మేం వినియోగించిన కరెంట్‌కు వచ్చిన బిల్లు రూ. 436. ఏసీడీ డ్యూస్ పేరుతో అదనంగా మరో రూ. 1522 కలిపి బిల్లు వచ్చింది. ఇది అన్యాయం. రెండేళ్ల కిందట కరోనాకు ముందు కాలంతో పోలిస్తే, ఇంటి నెలవారి బడ్జెట్ ఊహించనంత పెరిగింది. జీతాలు మాత్రం పెరగలేదు. స్కూలు, కాలేజీ ఫీజులకు తోడు కిరాయి ఇళ్లలో ఉండే మాకు వేలల్లో విద్యుత్ బిల్లులు వస్తే బతికేదేలా?" అని కరీంనగర్ భగత్ నగర్‌కు చెందిన గృహిణి పూదరి ప్రమీల ఆవేదన వ్యక్తం చేశారు.
"ఈ నెల (జనవరి) బిల్లులో ఏసీడీ డ్యూ అని వచ్చింది. ఏసీడీ అంటే ఏంటో నాకు తెలియదు. ఇప్పుడే బిల్లులో చూస్తున్నాను. నేను కిరాయి ఇంట్లో ఉంటాను. సొంతిల్లు వారిది (యజమాని) కదా, మేము ఎందుకు కడతాం?" అని కరీంనగర్‌కు చెందిన గంగాధర సుమన్ అన్నారు.

ఫొటో సోర్స్, P.Prameela
విద్యుత్ సిబ్బంది నిర్బంధాలు
ఏసీడీ చార్జీలను క్లియర్ చేస్తేనే విద్యుత్ బిల్లులు తీసుకుంటామని సిబ్బంది చెబుతుండటంతో పల్లెల్లో ఘర్షణ వాతావరణం నెలకొంది. ఉత్తర తెలంగాణ వ్యాప్తంగా ఈ పరిస్థితి కనిపిస్తోంది.
ఇటీవల ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలం కాప్రిలో గ్రామస్తులు విద్యుత్ సిబ్బందిని పంచాయతీ ఆఫీసులో నిర్బంధించారు. ఏసీడీ చార్జీలను రద్దు చేస్తేనే కరెంట్ బిల్లులు కడతామని జగిత్యాల జిల్లా జగ్గాసాగర్ గ్రామస్తులు తీర్మానించారు. కోరుట్ల నియోజకవర్గంలో ఏసిడీ చార్జీలను నిరసిస్తూ పోస్ట్ కార్డ్‌ల ఉద్యమం చేపట్టారు.
ఆదిలాబాద్, కరీంనగర్, జగిత్యాల, కామారెడ్డి, నిర్మల్, వరంగల్, ఖమ్మం, పెద్దపల్లి ఇలా మరికొన్ని జిల్లాల్లో ఇప్పటికే విద్యుత్ సిబ్బందితో ప్రజలు వాగ్వాదాలకు దిగడం, నిరసనలు తెలపడం జరిగాయి.
"ఏసీడీ చార్జీలు ఎందుకు వేశారని ప్రశ్నించాం. సరైన సమాధానం ఇవ్వకపోవడంతో, వసూళ్లకు వచ్చిన సిబ్బందిని గ్రామపంచాయతీ ఆఫీసులో నిర్బంధించాం. వారిని విడిపించేందుకు విద్యుత్ శాఖ ఏఈ వచ్చి ఏసీడీ కట్టాల్సిందే తప్పదు అన్నారు. ఆయనను సైతం నిర్బంధించాం. ఆ తర్వాత మరో పై ఆఫీసర్ పోలీసులతో వచ్చారు. ఏసీడీ అంటే డిపాజిట్ అని వివరించే ప్రయత్నం చేశారు. మాకు ఏమీ అర్థం కాలేదు. సిబ్బందిని నిర్బంధించారని మా గ్రామస్తుడు ఒకరిపై పోలీసులు కేసు పెట్టారు. ఇది గ్రామం సమస్య. పెడితే గ్రామస్తులందరిపై కేసులు పెట్టాలని పోలీస్ స్టేషన్ ముందు ఆందోళన చేశాం. ఇప్పుడు 42 మంది పై కేసులు పెడుతున్నట్టు తెలిసింది. పోలీసులు గ్రామస్తుల ఆధార్ కార్డులు, ఫోటోలు తీసుకుని వెళ్లారు" అని కాప్రి గ్రామానికి చెందిన రైతు సామ లింగారెడ్డి బీబీసీకి తెలిపారు.
ఏసీడీలు తప్పదని, తమ చేతుల్లో ఏమీ లేదని, ప్రభుత్వం నుండి వచ్చిన ఆర్డర్ అని విద్యుత్ సిబ్బంది చెబుతున్నారు.
"తప్పు ఎవరిది, రైతు బంధు పేరుతో ఇలా ఇచ్చి అలా తీసుకుంటున్నారని మేం రైతులం అనుకుంటున్నాం. మాకు ఏం లాభం లేదు" అని రైతు లింగారెడ్డి అన్నారు.
రోజురోజుకు ప్రజల నుండి నిరసనలు పెరుగుతుండటం, ఘర్షణ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో బిల్లు వసూళ్లకు వచ్చిన ఎన్‌పీడీసీఎల్ సిబ్బంది వెనుదిరుగుతున్నారు.
ప్రజల నిరసనలకు పలు చోట్ల కాంగ్రేస్, బీజేపీలతో పాటు ప్రతిపక్షాలు మద్దతుగా విద్యుత్ సబ్ స్టేషన్‌ల ముట్టడి చేపడుతున్నాయి.

ఎన్‌పీడీసీఎల్ ఏం చెబుతోంది?
ప్రజా ఆందోళనల నేపథ్యంలో ఏసీడీ వసూళ్లపై వివరణ ఇచ్చే ప్రయత్నం చేసింది ఎన్‌పీడీసీఎల్. మరోవైపు తెలంగాణ విద్యుత్ నియంత్రణ మండళి కూడా ఏసీడీ పై క్లారిటీ ఇచ్చేందుకు అవగాహన కార్యక్రమాలకు సిద్ధం అవుతోంది.
"ఎలక్ట్రిసిటీ యాక్ట్ సెక్షన్ 47 ప్రకారం 2004లో ఏపీ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ రెగ్యులేషన్ నంబర్ 6/2004 ప్రకారం డిస్కం సంస్థలు (పంపిణీ) వినియోగదారుల నుండి ఏసీడీ కలెక్ట్ చేసుకునే అధికారం ఉంది. 12 నెలలు వాడిన విద్యుత్ సరాసరిగా బేస్ చేసుకుని రెండు నెలల డిపాజిట్‌ను పంపిణీ సంస్థలు వారి దగ్గర ఉంచుకోవచ్చు. ఇది డిపాజిట్‌గా మాత్రమే పంపిణీ సంస్థ దగ్గర ఉంటుంది తప్ప దీన్ని వాడటానికి ఆ సంస్థకు ఎలాంటి హక్కు లేదు. ఈ డిపాజిట్‌పై బ్యాంకు రేట్ ప్రకారం వచ్చే వడ్డీ ప్రతి ఏప్రిల్‌లో వినియోగదారుని బిల్లులో సర్దుబాటు చేస్తారు. వినియోగదారుడు ఏమాత్రం ఆందోళన చెందాల్సిన అవసరం లేదు" అని తెలంగాణ విద్యుత్ నియంత్రణ మండలి చైర్మన్ తన్నీరు శ్రీరంగారావు తెలిపారు.
"ఏసీడీ వినియోగదారుని సర్వీస్ నంబర్‌పై డిపాజిట్‌గా ఉంటుంది. విద్యుత్ కనెక్షన్ రద్దు చేసుకున్నప్పుడు డిపాజిట్ తిరిగి చెల్లిస్తాం. ఇది కిరాయి దారుడు చెల్లించాలా లేక ఇంటి ఓనర్ చెల్లించాలా అన్న సందేహం వ్యక్తం చేస్తున్నారు. ఏసీడీలు డిపాజిట్ రూపంలో ఉంటాయి కాబట్టి ఇంటి యజమానులు చెల్లించడమే న్యాయం. ప్రజలు సహకరించి మెరుగైన, నాణ్యమైన విద్యుత్ సేవలను పొందాలని కోరుతున్నాం" అని ఎన్‌పీడీసీఎల్ చైర్మన్, ఎండీ అన్నమనేని గోపాల్ రావ్ పత్రికా ప్రకటనలో కోరారు.

ఫొటో సోర్స్, Praveen Shubham/BBC
గతంలో లేని ఏసీడీ చార్జీలు ఇప్పుడు ఎందుకు?
గత కొన్నేళ్లుగా ఏసీడీ చార్జీలు కమర్షియల్, ఇండస్ట్రియల్ సర్వీస్లకే పరిమితం అయ్యాయి. ఆ తర్వాత గృహ వినియోగదారుల నుండి వసూలు చేయాలని నిర్ణయించారు. ఇప్పటిదాకా 300 యూనిట్ల దాకా వినియోగం ఉన్నవారి నుంచి మాత్రమే ఏసీడీ చార్జీలను వసూలు చేయగా తాజాగా అన్నిరకాల వినియోగదారుల నుంచి యూనిట్లతో సంబంధం లేకుండా ఏసీడీ బిల్లులు వసూలు చేయాలని నిర్ణయించారు.
ప్రస్తుతం ఎన్‌పీడీసీఎల్ డిస్కం పరిధిలో వసూలు చేస్తున్నామని, రాబోయే రోజుల్లో తెలంగాణ వ్యాప్తంగా అన్ని డిస్కంల పరిధిలో వసూలు చేస్తామని, మొండి బకాయిలకు చెక్ పెట్టి తద్వారా నష్టాలను నివారించేందుకే ఏసీడీల వసూలు అని విద్యుత్ శాఖ అధికారులు అంటున్నారు.
"ఎన్‌పీడీసీఎల్ పరిధిలో 7.16 లక్షల మంది బిల్లులు చెల్లించకపోవడం వల్ల 305 కోట్లు బకాయిలు ఉన్నాయి. వీరి కనెక్షన్లు డిస్కనెక్ట్ చేశాం. ఇలాంటి కనెక్షన్ల ముందస్తు డిపాజిట్లు ఉండి ఉంటే కంపనీ ఈ 305 కోట్లు రాబట్టుకునే అవకాశం ఉండేది. సకాలంలో డిపాజిట్లు తీసుకోకపోవడం వల్ల ఇలా లాస్ జరిగింది. ఈ నష్టం ప్రతి నెల బిల్లులు కట్టే నిజాయితీగల వినియోగదారులపైన పడుతుంది" అని తెలంగాణ విద్యుత్ నియంత్రణ మండలి (ఈఆర్సీ) చైర్మన్ తన్నీరు శ్రీరంగా రావ్ వివరించారు.
కొత్త విద్యుత్ మీటర్ కనెక్షన్ తీసుకున్నప్పుడు కిలోవాట్‌కు 200 రూపాయలు సెక్యురిటీ డిపాజిట్ రూపంలో ఎన్‌పీడీసీఎల్ వసూలు చేస్తోంది. అయితే విద్యుత్ ఆధారిత గృహోపకరణాలు అంటే ఫ్రిజ్‌లు, వాషింగ్ మిషన్‌ల వాడకం పెరిగే సందర్భంలో విద్యుత్ వినియోగం పెరగడంతో , కనెక్షన్ కెపాసిటీ పెంచాల్సి ఉంటుంది. వినియోగం పెరిగినప్పుడు రెండు నెలల డిపాజిట్ కంపనీల వద్ద ఉండాలి. అదే ఏసీడీ అని విద్యుత్ శాఖ అధికారులు చెబుతున్నారు.
విద్యుత్ పంపిణీ సంస్థలు విద్యుత్ ఉత్పత్తి చేయవు. బహిరంగ మార్కెట్ నుండి కొని సరఫరా చేస్తాయి. ఇవి ప్రభుత్వ రంగంలో నడుస్తున్న వ్యాపార సంస్థలు. ఓవైపు ప్రజా ప్రయోజనాలు దృష్టిలో ఉంచుకుంటూనే, పంపిణీ సంస్థల ఆర్థిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకునే విద్యుత్ నియంత్రణ మండలి బిల్లులను నియంత్రిస్తుంది. డిపాజిట్ చెల్లించకపోతే పంపిణీ సంస్థకు విద్యుత్ కనెక్షన్ తొలగించే అధికారం ఉంది. పంపిణీ సంస్థల ఆర్థిక పరిస్థితిని కాపాడాల్సిన బాధ్యత, ఆర్థికంగా నిలుదొక్కుకునేలా చూడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిది అని శ్రీరంగా రావ్ అన్నారు.
ప్రీ పెయిడ్ స్మార్ట్ మీటర్లు అమర్చాక ఈ ఏసీడీ చార్జీల వసూలు ఉండదని ఆయన తెలిపారు.

ఫొటో సోర్స్, Praveen Shubham/BBC
ఉచిత విద్యుత్ భారం సామాన్యులపై మోపుతున్నారా?
ఏసీడీ డిపాజిట్ల సేకరణ అసంబద్ధంగా ఉందని, పంపిణీ సంస్థలు ప్రమాణాలు పెంచుకుని నష్టాలను తగ్గించుకోవడంలో శ్రద్ద లేదని ప్రజా సంఘాలు ఆరోపిస్తున్నాయి. ప్రభుత్వ సంస్థలు, కార్యాలయాలు చెల్లించాల్సిన వేల కోట్ల బకాయిల సంగతేంటని ప్రశ్నిస్తున్నాయి.
"గతంలో తక్కువ డిపాజిట్ తీసుకున్నాం. ఇప్పుడు లోడింగ్ ఎక్కువవడం వల్ల ఏసీడీల రూపంలో డిపాజిట్ మాత్రమే తీసుకుంటున్నాం తప్ప ఇవి కరెంట్ బిల్లులు కాదంటున్నారు. అయితే అవి విద్యుత్ చార్జీలే. డిస్కమ్ లకు రాష్ట్ర ప్రభుత్వం 60 వేల కోట్లు బాకీ పడింది. నష్టాలను పూడ్చుకోవడానికి ఏసీడీ వంటి చార్జీలను తెర పైకి తెస్తున్నారు. ఇప్పటికే స్లాబ్ చార్జీలను పెంచారు’’ అని ఫోరం ఫర్ బెటర్ వరంగల్ అద్యక్షుడు పుల్లూరి సుధాకర్ అన్నారు.
"వినియోగదారుల విద్యుత్ లోడ్ ఎంత ఉన్నా కాల్చిన యూనిట్ల మేరకు ప్రతి నెల బిల్లు వసూలు చేస్తూనే ఉన్నారు కదా. మీటర్ క్యాన్సిల్ చేసుకుంటే ఏసీడీ డిపాజిట్ వెనక్కి ఇస్తామంటున్నారు. అలా ఎవరైనా విద్యుత్ కనెక్షన్ క్యాన్సల్ చేసుకునే వారు ఉంటారా?" అని పుల్లూరి సుధాకర్ ప్రశ్నించారు.
"ఉచిత విద్యుత్‌కు ఎన్ని యూనిట్లు ఖర్చవుతోందనే లెక్కలు లేవు. ఆ లాస్‌ను ప్రజల మీద వేస్తున్నారని మేము అభిప్రాయపడుతున్నాం. ఎనర్జీ ఆడిట్ కోసం లెక్క ఉండాల్సిన అవసరం లేదా? సబ్సిడీ అమౌంట్‌లు, గవర్నమెంట్ ఆఫీస్ బకాయిల రూపంలో ప్రభుత్వం వద్దే వేల కోట్ల బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. వీటిని కవర్ చేసేందుకే ఏసిడీ తీసుకొచ్చారు. డిస్కంల నష్టాలు భరించడానికి ఉచిత విద్యుత్ భారం అంతా గృహ వినియోగదారుల మీద వేస్తున్నారు" అని పుల్లూరి సుధాకర్ ఆరోపించారు.

ఫొటో సోర్స్, UGC
డిపాజిట్లు సరే, నాణ్యమైన విద్యుత్ సంగతేంటి?
డిస్కం సంస్థలు ఆర్థికంగా నిలదొక్కుకునేందుకని చెబుతున్న అదనపు వసూళ్ల పైన టీఎస్ఈఆర్‌సీ (తెలంగాణ రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి)కి ఉన్న శ్రద్ద నాణ్యమైన విద్యుత్ సరఫరా అంశంపై లేదని, ప్రజా సంక్షేమం కోణంలో ఉండాల్సిన ఈఆర్‌సీ ప్రభుత్వం వైపు మొగ్గుచూపుతోందన్న విమర్శలు ఉన్నాయి.
అదే సందర్భంలో తమ సామర్థ్యం పెంచుకోకుండా, నష్టాలు పూడ్చుకోవడానికి భారం అంతా వ్యవసాయ విద్యుత్‌పై నెడుతున్న విద్యుత్ పంపిణీ సంస్థలు ఆమేరకు ప్రభుత్వం నుండి సబ్సిడీలు పొందుతున్నాయి అన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
మరోవైపు, దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (ఎస్‌పీడీసీఎల్) నష్టాలను ఎన్‌పీడీసీఎల్ పై వేస్తున్నారన్న విమర్శలు కూడా ఉన్నాయి.
"బిల్లుల వసూలు పై హైదరాబాద్‌లో పబ్లిక్ ఇంటరాక్షన్ కార్యక్రమాలను నిర్వహించాం. తెలంగాణ వ్యాప్తంగా ఈ తరహా కార్యక్రమాలు నిర్వహించి వినియోగదారుల హక్కులతో పాటూ బాధ్యతలు కూడా తెలియజేస్తాం.
ఇక విద్యుత్ సంస్థలు పాటించాల్సిన ప్రమాణాలను ఈఆర్‌సీగా నిర్దేశిస్తున్నాం. విద్యుత్ సంస్థలు సాంకేతిక ప్రమాణాలు, సామర్థ్యం పెంచుకోవాల్సిన బాధ్యత ఉంది. లేదంటే పెనాల్టీలు విధిస్తామని స్పష్టం చేశాం.
అంతర్గత సామర్థ్యం పెంచుకునేందుకు వ్యవసాయ ట్రాన్స్ ఫార్మర్‌ల దగ్గర మీటర్లు పెట్టాలని సూచించాం. దాని కార్యాచరణ ఎంతవరకు వచ్చిందన్న అంశంపై ఆయా డిస్కంల సీఎండ లతో రెగ్యులర్ గా మాట్లాడుతున్నాం" అని తెలంగాణ విద్యుత్ నియంత్రణ మండలి చైర్మన్ శ్రీరంగా రావ్ తెలిపారు.
‘‘తెలంగాణలో 27 లక్షల వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు, 6 లక్షల డీటీఆర్‌సీలు (ట్రాన్స్ ఫార్మర్లు) ఉన్నాయి. వీటి వద్ద విద్యుత్ వినియోగంపై అంచనాకు రావటానికి మీటర్లు పెట్టాలనే ఆర్డర్స్ ఇచ్చాం. అదే సందర్భంలో గోదావరి, కృష్ణా నదులపై ఎత్తిపోతల పథకాల రూపంలో 4 వేల మెగావాట్ల విద్యుత్ వినియోగం జరుగుతోంది’’ అని శ్రీరంగా రావ్ తెలిపారు.
ఇవి కూడా చదవండి:
- UPSC: సివిల్ సర్వీస్ పరీక్షల్లో విజయం సాధించడం ఎలా?
- పర్సనల్ ఫైనాన్స్: ఒక ఏడాదిలో ఫైనాన్షియల్ ప్లానింగ్ ఎలా ఉండాలి?
- పాకిస్తాన్: కిలో ఉల్లిపాయలు రూ.250... ‘కోయకుండానే కళ్లల్లో నీళ్లు’
- హైదరాబాద్: 200 ఏళ్ల నాటి హెరిటేజ్ బిల్డింగ్ పునరుద్ధరణ, ఈ భవనం మీకు తెలుసా?
- మల్టీ లెవెల్ మార్కెటింగ్ మోసాలు: 'బంబుల్, టిండర్ వంటి యాప్స్‌తో నేను మగాళ్ళను ఎందుకు ఆకర్షించాలి?'














