తెలంగాణ: పేకాట చుట్టూ తిరుగుతున్న పీర్జాదిగూడ మునిసిపల్ కార్పొరేషన్ రాజకీయం

ఫొటో సోర్స్, UGC
- రచయిత, బళ్ల సతీశ్
- హోదా, బీబీసీ ప్రతినిధి
హైదరాబాద్ శివార్లలో పేకాట వ్యవహారం రాజకీయ వివాదంగా మారిపోయింది. మేడ్చల్ జిల్లా మేడిపల్లి పరిధిలోని పీర్జాదిగూడ మునిసిపల్ కార్పోరేషన్ రాజకీయం ఇప్పుడు పేకాట చుట్టూ తిరుగుతోంది.
పీర్జాదిగూడ మునిసిపాలిటీలో జగదీశ్వర రెడ్డి కోఆప్షన్ సభ్యునిగా ఉన్నారు. పీర్జాదిగూడ సాయి ప్రియ సర్కిల్ దగ్గర ఉన్న ఆయన కార్యాలయంలో నిన్న కొందరు కార్పొరేటర్లు, ఇతర నాయకులు కలిశారు.
వారిలో ఆ మునిసిపాలిటీ డిప్యూటీ మేయర్ శివకుమార్ గౌడ్ కూడా ఉన్నారు. ఒక ప్రైవేటు కార్యక్రమానికి హాజరైన వీళ్లు తిరిగి వచ్చాక ఆ కార్యాలయంలో కలిశారు.
కలవడం వరకూ ఓకే, అయితే వారు అక్కడ పేకాట ఆడటానికే కలిశారని కొందరికి అనుమానం వచ్చింది. వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే అక్కడకు ఎస్‌ఓటీ పోలీసులు ఎంట్రీ ఇచ్చి రైడ్ చేశారు.
పేకాట ఆడుతున్న సుమారు 10 మంది బీఆర్ఎస్ నాయకులన్న చోటును తమ అదుపులోకి తీసుకున్నారు.
పోలీసులు వచ్చిన సమయానికి అక్కడ ముగ్గురు కార్పొరేటర్లు, ముగ్గురు కార్పొరేటర్ల భర్తలు, నలుగురు బిల్డర్లు ఉన్నట్టు పేరు చెప్పడానికి ఇష్టపడని స్థానికుడు ఒకరు బీబీసీతో చెప్పారు.
కాగా, మేడిపల్లి స్టేషన్ పరిధిలో ఎస్‌ఓటీ పోలీసుల తనిఖీలో పేకాట శిబిరంలో నలుగురుని అరెస్టు చేశారు.
షేక్ జహంగీర్ (వ్యాపారి), గొరెలి వీరేశం (ప్రైవేట్ ఉద్యోగి), ఎంపల సత్తిరెడ్డి (ప్రైవేటు ఉద్యోగి), పిట్టల కార్తీక్ (కారు డ్రైవర్). వీరితో పాటూ రూ. 1,62,000 నగదు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

ఫొటో సోర్స్, UGC
పోలీసులు రాగానే కరంట్ పోయింది
అయితే పోలీసులు సీన్‌లోకి ఎంటర్ అయ్యాక కథ మొత్తం తారుమారు అయింది.
ఏం జరిగిందో, ఎవరు చేశారో తెలియదు కానీ, అనూహ్యంగా అక్కడ నాలుగు గంటల పాటూ పవర్ కట్ అయింది. ఆ ఒక్క భవనమే కాదు. ఆ కాలనీ మొత్తం పవర్ పోయింది.
ఆ చీకట్లో అక్కడ వార్తల కోసం జర్నలిస్టులు వెళ్తే, వారిపై దాడి జరిగింది. కొందరు కెమెరాలు లాక్కుని కొట్లాటకు దిగారు. ఆ క్రమంలో లక్ష్మణ్, రాజు, రాజశేఖర్ అనే ముగ్గురు మీడియా ప్రతినిధులకు గాయాలు కూడా అయ్యాయి.
రాత్రి 9 గంటలకు పవర్ పోతే అర్థరాత్రి దాటక సుమారు 2.30 గంటల వరకూ కరెంట్ రాలేదు.
మళ్లీ కరెంటు వచ్చేసరికి అక్కడంతా సాఫ్.
అంతకుముందు కనిపించిన కార్పొరేటర్లు, పెద్ద నాయకులు ఎవరూ లేరని చెబుతున్నారు స్థానికులు.
పోలీసులు కొందర్ని అరెస్టు చేశారు. వారికి స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించారు.
అయితే, అసలు పేకాట ఆడుతూ కనిపించిన వారిని అరెస్టు చేయలేదని స్థానిక బీజేపీ, కాంగ్రెస్ నాయకులు ఆరోపిస్తున్నారు.
మరోవైపు జర్నలిస్టులకు మద్దతుగా కూడా వారు ఆందోళన చేశారు.
‘‘ఇదంతా సినిమా స్టైల్లో జరిగింది. పోలీసులు రాగానే అలర్టయిన వాళ్లు పవర్ కట్ చేసి, మీడియాపై దాడి చేసి, తప్పించుకున్నారు. వారి అనుచరులు, డ్రైవర్లను పోలీసులకు అప్పగించారు. అలా దొరికిన ఒక ముగ్గుర్ని మాత్రం స్టేషన్‌కి తీసుకెళ్లారు.’’ అని బీబీసీ తో చెప్పారు ఒక స్థానిక మీడియా ప్రతినిధి.

ఫొటో సోర్స్, UGC
అసమ్మతి మంటలా?
ఇలా కొందరు కార్పొరేటర్లు పేకాట ఆడుతూన్న విషయాన్ని కావాలనే ఒక వర్గం పోలీసులకు లీక్ చేసి పట్టించారనే ఆరోపణలు వస్తున్నాయి.
ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా వివిధ మునిసిపాలిటీల్లో మేయర్, ఛైర్మన్ పదవులపై అసమ్మతి రాగాలు వినిపిస్తున్నాయి.
ఆ క్రమంలో తనపై అసమ్మతి పెట్టే అవకాశం ఉందన్న అనుమానంతో ఒక అధికార పార్టీ నాయకుడే వీరిని పోలీసులకు పట్టించారని ఆరోపణలు వస్తున్నాయి.
ఇవి కూడా చదవండి:
- పర్సనల్ ఫైనాన్స్: ఒక ఏడాదిలో ఫైనాన్షియల్ ప్లానింగ్ ఎలా ఉండాలి?
- హైదరాబాద్: 200 ఏళ్ల నాటి హెరిటేజ్ బిల్డింగ్ పునరుద్ధరణ, ఈ భవనం మీకు తెలుసా?
- జగన్ విశాఖ టూర్ : సీఎం వస్తున్నారని చెట్లు నరికేశారు, నిబంధనలను పట్టించుకోరా?
- ఫిన్లాండ్: పరీక్షలు, ర్యాంకులు లేని అక్కడి చదువుల గురించి ఇండియాలో ఎందుకు చర్చ జరుగుతోంది?
- అండర్-19 మహిళల టీ20 ప్రపంచ కప్ విజేత భారత్, ఫైనల్లో సత్తా చాటిన తెలుగమ్మాయి గొంగడి త్రిష
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














