మెన్సా: ఈ ఎలైట్ క్లబ్‌లో చేరాలంటే మీ దేశం, మతం, జాతి, వృత్తి, వయసు, డబ్బుతో నిమిత్తం లేదు.. కానీ మనుషుల్లో ‘టాప్ 2’ పర్సంట్‌లో ఉండాలి

ఆ క్లబ్ పేరు మెన్సా. ప్రపంచం నలుమూలలా 1,40,000 మందికి పైగా సభ్యులున్నారు. వారిలో తాజాగా చేరిన సభ్యుడు.. మూడేళ్ల బ్రిటిష్ బుడతడు టెడ్డీ హాబ్స్.
మెన్సాలో చేరటానికి వయసు సమస్య కాదు. ఏ దేశం, ఏ మతం, ఏ జాతి, ఏ వృత్తి, ఆర్థిక పరిస్థితి ఏమిటి, రాజకీయ వైఖరి ఎలాంటిది అనే వాటితో నిమిత్తమే లేదు. ఇందులో చేరటానికి ఒకే ఒక్క అర్హత ఉండాలి. ఆ అర్హతను మెజారిటీ మనుషులు సాధించలేరు.
అదేమిటంటే.. ఇంటెలిజెన్స్ టెస్ట్‌లో 98 శాతం మార్కులు పొందటం. మూడేళ్ల బాలుడు టెడ్డీ హాబ్స్ ఆ అర్హతతోనే ఇందులో చేరాడు. అతడు రెండేళ్ల వయసులోనే తనకు తానుగా చదవటం నేర్చేసుకున్నాడు మరి.
ప్రపంచంలో అద్భుత ప్రతిభ గల వారితో ఏర్పడిన అతి పెద్ద అంతర్జాతీయ సంస్థ మెన్సా అని దీని వ్యవస్థాపకులు చెప్తారు. ఇందులోని సభ్యులకు ఉత్సాహాన్నందించే సామాజిక, మేధోపరమైన వాతావరణం కల్పించటానికి దీనిని ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

ఫొటో సోర్స్, Getty Images
రోలండ్ బెరిల్ అనే న్యాయవాది, లాన్స్ వేర్ అనే న్యాయవాద శాస్త్రవేత్త కలిసి 1946లో బ్రిటన్‌లో ఈ సంఘాన్ని స్థాపించారు. వారిద్దరూ ఒక రైలు ప్రయాణంలో కలిశారు. వెంటనే వారి మేధస్సులు కలిశాయి.
ఈ సంస్థను తొలుత ‘ది హై ఐక్యూ క్లబ్’ అని పిలిచేవారు. కానీ చివరికి లాటిన్ పదం ‘మెన్సా’ను ఖరారు చేశారు. ఆ పదానికి ‘టేబుల్’ అని అర్థం. ఈ సంస్థ సభ్యులంతా టేబుల్ చుట్టూ సమానులుగా కూర్చుంటారనే భావాన్ని ప్రతిబింబించేలా ఆ పదాన్ని ఖాయం చేసినట్లు వారు వివరించారు.
అధిక ఐక్యూ (ఇంటెలిజెన్స్ కొషెంట్) కలిగిన చిన్నారులకు మద్దతు అందిస్తుంది. ప్రజ్ఞావంతులైన పిల్లల మేథస్సును గుర్తించటానికి, ప్రేరణను అందించటానికి అవసరమైన సాధన సంపత్తి వారి కుటుంబాల దగ్గర, వారి ఉపాధ్యాయుల దగ్గర ఎల్లప్పుడూ ఉండకపోవచ్చు. ఆ పరిస్థితుల్లో మెన్సా తోడ్పాటునందిస్తుంది.
కష్టమైన జీవితం
నిజానికి అద్భుతమైన ప్రజ్ఞాపాటవాలు వరంగా లభించిన చిన్నారుల జీవితాలు.. చిన్నతనంలోనే అసంతృప్తిగా మారే అవకాశముందని మెన్సా స్పెయిన్ విభాగం చైర్మన్ జేవియర్ గొంజాలెజ్ రెక్యూయెంకో బీబీసీ ముండోతో చెప్పారు.
స్కూలులో మిగతావారికన్నా భిన్నంగా ఉన్నందుకు తనను వేధించే వారని జేవియర్ తెలిపారు. ఈ విషయం తన తల్లిదండ్రులకు తెలియదన్నారు.
‘‘మన తల్లిదండ్రులకు ఏమీ తెలియదనే భావన మనకు కలుగుతుంది. స్కూల్లో నా మార్కులను మా అమ్మానాన్నకు చూపేవాడిని. వాళ్లు సంతోషంగా నా నుదుటి మీద ఒక ముద్దు పెట్టేవారు. అంతే. నాకు వెళ్లి బస్సు కింద పడిపోవాలని అనిపించేది’’ అని ఆయన వివరించారు.
చిన్నప్పుడు బాధలుపడ్డ అద్భుత మేధస్సు గల చిన్నారుల్లో మెన్సా వ్యవస్థాపకుల్లో ఒకరైన బెరిల్ కూడా ఉన్నారు. ఆయన తన ఒక అనుభవాన్ని వెల్లడించారు.
బెరిల్‌కు ఫ్రెనాలజీ – అంటే కపాల విజ్ఞానం – మీద ఆసక్తి ఉండేది. ఒక వ్యక్తి మేధస్సు స్థాయిని ఆ వ్యక్తి కపాలం లేదా పుర్రె ఆకారం నిర్ణయించగలదనే నకిలీ సైన్స్ సిద్ధాంత అధ్యయనం ఇది.
అప్పటికే ఐక్యూ టెస్ట్‌లను రూపొందిస్తున్న వేడ్.. ఈ విషయంలో బెరిల్‌తో విభేదించారు. బెరిల్‌కు ఒక ఐక్యూ టెస్ట్ పెట్టారు. వేడ్ అధ్యయనం చేసిన వారిలో అగ్రస్థాయి 1 శాతం మందిలో బెరిల్ ఉన్నట్లు ఈ టెస్ట్‌లో తేలింది. దీంతో బెరిల్ కన్నీటిపర్యంతమయ్యారు. ఎందుకంటే.. ఆయనకు ఏ విషయంలోనైనా తెలివితేటలు ఉన్నాయని ఎవరైనా చెప్పటం అదే మొదటిసారి.

అధిక సామర్థ్యాలు గల వ్యక్తుల్లో కొందరికి సామాజికంగా కలసిపోవటం కష్టంగా ఉంటుంది. అలాంటపుడు ఒక బృందంలో భాగస్వాములుగా ఉన్నామనే భావన తమ ఆత్మగౌరవానికి చాలా ముఖ్యమని మెన్సా సభ్యులు చాలా మంది చెప్తారు.
మెన్సా సభ్యుల కోసం సదస్సులు, చర్చలు నిర్వహిస్తుంటుంది. అలాగే సభ్యుల ఆసక్తుల రీత్యా వారు కనెక్ట్ అవటానికి ఒక వేదికగా కూడా పనిచేస్తుంది. ఏరోనాటిక్స్, కామిక్స్, డైవింగ్, ఈజిప్టాలజీ వంటి విభిన్న రంగాలు, ఆసక్తుల వారీగా వీరికి గ్రూపులు ఉన్నాయి.
ఈ సంఘంలో వేర్వేరు దేశాల గ్రూపులు కూడా ఉన్నాయి. ఇందులో భాగం కావాలంటే ఒక ఇంటెలిజెన్స్ టెస్ట్ రాయాల్సి ఉంటుంది. జనంలో అగ్రస్థాయి 2 శాతం మందిలో మీ ఐక్యూ ఉందని ఆ పరీక్షలో చాటాల్సి ఉంటుంది.
ఈ అర్హత ఉదాహరణకు.. వెష్లర్ స్కేలులో 131, అంతకు మించిన ఐక్యూ, స్టాన్‌ఫర్డ్-బైనెట్ స్కేలులో 133 ఐక్యూ, కాటెల్ స్కేలులో 149 ఐక్యూలతో సమానంగా ఉంటుంది.

అన్ని నేషనల్ క్లబ్స్‌లో పిల్లలను చేర్చుకోరు. స్పానిష్ క్లబ్ వంటి కొన్ని నేషనల్ క్లబ్స్‌లో కనీస వయసును నిర్ణయించారు. బ్రిటిష్ క్లబ్‌లో అలా కాదు. అందులో తాజాగా మూడేళ్ల వయసు బాలుడిని చేర్చుకున్నారు. అతడు రెండేళ్ల వయసుకే తను సొంతంగా చదవటం నేర్చుకున్నాడు. ఆరు భాషల్లో 1 నుంచి 100 వరకూ లెక్కపెడతాడు కూడా.
చాలా చిన్న వయసులోనే చదవటం నేర్చుకోవటం, అలాగే అసాధారణ జ్ఞాపకశక్తి కలిగి ఉండటం, లేదంటే అసాధారణ అలవాట్లు, ఆసక్తులు ఉండటం.. అధిక సమర్థతలు గల పిల్లల ప్రవర్తనల్లో కనిపించే కొన్ని లక్షణాలని మెన్సా వివరిస్తోంది.
ఇలాంటి అసాధారణ ప్రతిభావంతులైన పిల్లలను గుర్తించటానికి ఇతర లక్షణాలు కూడా కొన్ని ఉన్నాయి.

ఫొటో సోర్స్, Getty Images
పెద్దవాళ్లతో సమయం గడపటానికి ఇష్టపడటం, ఒంటరిగా పనులు చేయటానికి ఆసక్తి చూపటం, హాస్యచతురత అభివృద్ధి చెందటం, అనేక ప్రశ్నలు అడుగుతుండటం, ఎల్లప్పుడూ నియంత్రించాల్సిన అవసరం రావటం, లేదంటే ఆటలకు కొత్త నిబంధనలను కనిపెడుతుండటం వంటివి కూడా ఆ పిల్లల మేధస్సు అసాధారణమని చెప్పటానికి లక్షణాలు కావచ్చు.
అయితే.. మెన్సాలో చేరిన అతి పిన్న వయస్కుడు టెడ్డీ హాబ్స్ కాదు. గత ఏడాది జూలై నెలలో అమెరికాలోని కెంటకీ రాష్ట్రానికి చెందిన రెండున్నరేళ్ల బాలిక ఇస్లా మెక్‌నాబ్.. మెన్సా అమెరికా క్లబ్‌లో చేరింది.
మెన్సాలో సభ్యులందరూ ప్రపంచానికి తెలియకపోయినప్పటికీ.. ఈ క్లబ్ రికార్డుల్లో సైన్స్ ఫిక్షన్ రైటర్ ఇస్సాక్ అసిమోవ్, అమెరికా నటి జీనా డేవిస్ వంటి కొందరు సెలబ్రిటీలు కూడా ఉన్నారు.
ఇవి కూడా చదవండి:
- ముస్లిం ఫండ్ పేరుతో ప్రజల నుంచి కోట్ల రూపాయలు కొల్లగొట్టిన అబ్దుల్ రజాక్
- మల్టీ లెవెల్ మార్కెటింగ్ మోసాలు: 'బంబుల్, టిండర్ వంటి యాప్స్‌తో నేను మగాళ్ళను ఎందుకు ఆకర్షించాలి?'
- ఫిన్లాండ్: పరీక్షలు, ర్యాంకులు లేని అక్కడి చదువుల గురించి ఇండియాలో ఎందుకు చర్చ జరుగుతోంది?
- జహాన్ ఆరా: విలాసవంతమైన మసీదులు, సత్రాలు కట్టించిన అందాల మొఘల్ రాణి
- థైరాయిడ్ సమస్య: మందులు వాడుతున్నా తగ్గకపోతే ఏం చేయాలి?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)















