ఈ పిల్లలు బడికి వెళ్లరు, ఇంట్లోనే చదువుకుంటారు

- రచయిత, నియాస్ అహ్మద్
- హోదా, బీబీసీ ప్రతినిధి
చదువు నేర్చుకోవాలంటే స్కూళ్లకూ.. కాలేజీలకూ వెళ్లాల్సిందేనా? అది తప్పనిసరేం కాదంటోంది కేరళకు చెందిన ఓ కుటుంబం. చదువంటే పుస్తకాలను వల్లెవేయడం మాత్రమే కాదనీ, మన చుట్టూ ఉన్న సమస్యలకు పరిష్కారం కనిపెట్టడమే చదువు అంటున్నారు ఈ కుంటుంబ సభ్యులు.
కేరళలోని అట్టపాడి అడవి మధ్యలో తన కుటుంబంతో కలిసి ఉంటున్న గౌతమ్‌ను అతని తల్లిదండ్రులు బడికి పంపలేదు. బడికి పంపకపోవడానికి కారణం.. వాళ్లకు చదువు పట్ల ఆసక్తి లేక కాదు. ప్రస్తుత విద్యా విధానం నచ్చక, తమ కుమారుడికి ఇంట్లోనే విద్యాబుద్ధులు నేర్పించుకున్నారు.
అందరిలా బడికెళ్లి చదువుకోకున్నా, గౌతమ్ ఐదు భాషల్లో అనర్గళంగా మాట్లాడగలరు. వెబ్‌సైట్లను రూపొందించడం కూడా నేర్చుకున్నారు.
సంప్రదాయ విద్యావిధానం పట్ల గౌతమ్‌ది కూడా తన తల్లిదండ్రుల అభిప్రాయమే.
స్కూళ్లు, కాలేజీల్లో పాఠ్యాంశాలు ప్రస్తుత ప్రపంచానికి అనుగుణంగా ఉండటం లేదని గౌతమ్ అంటున్నారు. అందుకే, తన ముగ్గురు పిల్లలకు కూడా ఆయన ఇంట్లోనే చదువు చెబుతున్నారు.
"ఆధునిక విద్య తీరుతెన్నులను చూస్తుంటే... పిల్లలను కేవలం వినియోగదారులుగా మాత్రమే మార్చుతున్నట్లు అనిపిస్తోంది. అలా కాకుండా వారిని మానవతా విలువలు తెలిసినవారిగా తయారయ్యేలా, వారిలో ప్రకృతి పరిరక్షణ, సుస్థిరత, ప్రజాస్వామ్యం వంటి భావనలు పెరిగేలా చేస్తే బాగుంటుంది" అని ఆయన అభిప్రాయపడ్డారు.

గౌతమ్ తల్లిదండ్రులిద్దరూ గతంలో ప్రభుత్వ ఉపాధ్యాయులుగా పనిచేసేవారు. అయితే, ప్రస్తుత విద్యా విధానం కేవలం వస్తు వినిమయవాదాన్ని మాత్రమే నేర్పిస్తుందని వారు భావించారు. అందుకే ఉద్యోగాలను వదిలేసి కొండ ప్రాంతంలోకి వచ్చి నివాసం ఏర్పాటు చేసుకున్నారు.
అట్టపాడి ప్రాంతంలో నీటి సమస్యకు పరిష్కారం కనిపెట్టేందుకు వారు కృషి చేశారు.
"మా అమ్మానాన్నలు ఇద్దరూ అట్టపాడి ప్రాంతానికి గతంలో ప్రభుత్వ ఉపాధ్యాయులుగా పనిచేసేందుకు వచ్చారు. వారు వచ్చిన సమయంలో ఇక్కడ నీటి ఎద్దడి అధికంగా ఉండేది. భూమి కోతకు గురవ్వడం పెద్ద సమస్యగా ఉండేది. దాంతో, భూమి కోత, తాగు నీటికొరత, అడవుల నరికివేత వంటి సమస్యలకు పరిష్కారం కనిపెట్టేందుకు వారు ప్రయత్నించారు" అని గౌతమ్ చెప్పారు.
ఇప్పుడు ఈ కుటుంబం ఉండే ప్రాంతమంతా పచ్చదనంతో కళకళలాడుతోంది.
ఇవి కూడా చదవండి:
- అవునా.. 1975కు ముందువారితో పోలిస్తే మన తెలివి తక్కువేనా?
- ప్రపంచ కప్ జట్టులో ధోనీ 'బెర్త్'పై ఇక ఎలాంటి డౌట్ లేదు
- ఈ మహిళలు చైనాలో లైవ్ సెక్స్‌క్యామ్ రాకెట్ కోరల నుంచి ఎలా తప్పించుకున్నారంటే..
- యెమెన్ సంక్షోభం: 'నాకూ ఇతర అమ్మాయిల్లా బతకాలనుంది'
- చంద్రుని మీద మొలకెత్తిన చైనా పత్తి విత్తనం
- రాయలసీమ కరవు: అంత్యక్రియలకు అన్ని ఏర్పాట్లు చేసుకుని ఆత్మహత్య చేసుకున్న రైతు కథ
- అబద్ధాలు ఎక్కువగా ఎవరు చెబుతారు.. అమ్మాయా, అబ్బాయా
- 'అనాథ' పాపకు పాలిచ్చి కాపాడిన మహిళా కానిస్టేబుల్
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









