'ప్రపంచకప్ జట్టులో ధోనీ 'బెర్త్'పై ఇక ఎలాంటి డౌట్ లేదు': అభిప్రాయం

ఫొటో సోర్స్, AFP/getty images
- రచయిత, సి. వెంకటేష్
- హోదా, బీబీసీ కోసం
ఆస్ట్రేలియాతో జరిగిన వన్‌డే సీరీస్‌లో టీమిండియా గెలవడం ఒక డబుల్ ధమాకా లాంటిది. ఎందుకంటే తొలిసారి ద్వైపాక్షిక వన్‌డే సీరీస్‌లో ఆసీస్‌ను ఓడించామన్న రికార్డుతో పాటు కొంతకాలంగా జట్టు కూర్పు విషయంలో వేధిస్తున్న సందేహాలకు సమాధానం దొరకడం మన ఆనందాన్ని రెట్టిపు చేసింది.
ఇదే జట్టును రెండు మూడు మార్పులతో ప్రపంచ కప్‌కు పంపవచ్చునన్న నమ్మకం కూడా మనకు కలుగుతోంది. అలాగే బ్యాటింగ్ ఆర్డర్‌లో ఎవరిని ఏ స్థానంలో ఆడించాలన్న విషయంలో కూడా చాలా స్పష్టత వచ్చిందనే చెప్పాలి. మరి ప్రపంచ కప్‌కు ముందు ఇంకా పట్టుమని పది వన్డేలే మిగిలి ఉన్న నేపథ్యంలో ఇలాంటి క్లారిటీ రావడం ఓ పెద్ద రిలీఫ్.
ఇటీవలి కాలంలో మన జట్టును వేధిస్తున్న ప్రధాన సమస్య - మిడిలార్డర్ బ్యాటింగ్ తాలూకు డొల్లతనం. టాప్ త్రీ స్థానాల్లో ఆడే రోహిత్, శిఖర్, విరాట్ రాణిస్తేనే గెలుస్తూ వచ్చామే తప్ప, ఆ ముగ్గురూ విఫలమైతే ఓటమి తప్పని పరిస్థితి కనిపించింది. మిడిలార్డర్‌లో పాతకాపులు సురేశ్ రైనా, యువరాజ్ మొదలుకొని మనీష్ పాండే, శ్రేయస్ అయ్యర్, రిషబ్ పంత్ లాంటి కుర్రాళ్ళ వరకు దాదాపు పదిహేనుమందిని ఆడించి చూశారు. కానీ, ఎవరూ కూడా కుదురుకోలేదు. కానీ ఇటీవలి వెస్టిండీస్ సీరీస్, ఇప్పటి ఆస్ట్రేలియా సీరీస్ తర్వాత ఈ సమస్యకు పరిష్కారం దొరికినట్టే కనిపిస్తోంది. ధోనీ, దినేశ్ కార్తిక్, కేదార్ జాదవ్, అంబటి రాయుడు మన ప్రపంచ కప్ టీమ్‌లో మిడిలార్డర్ స్థానాలు సమర్ధంతంగా భర్తీ చేయగలరన్న స్పష్టత వచ్చింది.

ఫొటో సోర్స్, AFP/GETTY IMAGES
ఆస్ట్రేలియా సీరీస్‌కు ముందు ప్రపంచ కప్ జట్టులో వికెట్ కీపర్ స్థానంపై కొంత గందరగోళం నెలకొన్న మాట వాస్తవం. ధోనీయే అందుకు సరైనోడు అని సెలెక్టర్లు, కోచ్, కెప్టెన్ నమ్ముతున్నా కూడా ఫ్యాన్స్, చాలామంది మాజీలు మాత్రం పెదవి విరుస్తూ వచ్చారు.
ధోనీని పక్కనబెట్టి రిషబ్ పంత్ లేదా కార్తీక్‌కు కీపింగ్ గ్లోవ్స్ అప్పగించాలని చర్చ జరుగుతూ వచ్చింది. అయితే, ఆస్ట్రేలియా సీరీస్‌లోని మూడు వన్‌డేల్లో మూడు హాఫ్ సెంచరీలు చేసి ఆ చర్చకు ఫుల్‌స్టాప్ పెట్టాడు ధోనీ.
గతంలో లాగా ధనాధన్ స్టైల్లో కాకుండా స్లో అండ్ స్టెడీగా ఫినిషింగ్ టచ్ ఇచ్చాడు. కీపర్, బ్యాట్స్‌మన్‌గానే కాదు తన విశేషానుభవంతో ధోనీ అందించే 'ఇన్‌పుట్స్' కెప్టెన్ కోహ్లీకి, బౌలర్లకి చాలా అవసరం. మొత్తం మీద ధోనీ కొనసాగింపుపై ఇక డౌట్స్ ఏవీ లేనట్టే.

ఫొటో సోర్స్, Getty Images
ఇక బౌలింగ్ విషయంలో మనకు పెద్దగా సమస్యలు లేవు. భువి, బుమ్రాకు తోడుగా మూడో పేస్ బౌలర్ ఎవరన్న ప్రశ్నకు సమాధానం మహమ్మద్ షమీయేనని ఆస్ట్రేలియా వన్‌డే సీరీస్‌తో తేలిపోయింది. టెస్ట్ సీరీస్‌లో చూపిన సూపర్ ఫామ్‌ని షమీ వన్‌డేల్లో కూడా కొనసాగించాడు.
అంతేకాక, కొత్త కుర్రాళ్ళు ఖలీల్, సిరాజ్ ఇంకా రాటుదేలాల్సి ఉందని కూడా ఈ సీరీస్ ద్వారా స్పష్టమయింది. ఇక స్పిన్నర్ల గురించి తడుముకునే పనే లేదు. కులదీప్, చాహల్, జడేజా లకు ప్రపంచ కప్ బెర్తులు ఖరారైనట్టే.

ఫొటో సోర్స్, AFP/GETTY IMAGES
ఇక మిగిలిన రెండు స్థానాలు - ఆల్‌రౌండర్, మూడో ఓపెనింగ్ బ్యాట్స్‌మన్. ఈ రెండు స్థానాలను భర్తీ చేయగల హార్దిక్ పాండ్యా, కె.ఎల్.రాహుల్ ప్రస్తుతం వివాదంలో ఇరుక్కుని టీమ్‌కి దూరమయ్యారు. అయితే నిషేధం నుంచి బయటపడ్డాక పాండ్యా జట్టులోకి కచ్చితంగా వస్తాడనడంలో సందేహం లేదు. కానీ, ఫామ్‌లో లేని రాహుల్‌కు ప్రపంచ కప్ జట్టులో స్థానం దక్కడం కష్టమే. శుభమన్ గిల్ లేదా మయాంక్ అగర్వాల్ ఈ మూడో ఓపెనర్ రేసులో ఉన్నారు.
ప్రపంచ కప్ జట్టును ఇంత ముందుగానే ఊహించడం కరెక్టు కాకపోవచ్చు. కానీ, ఆస్ట్రేలియా వన్‌డే సీరీస్ తర్వాత వచ్చిన క్లారిటీ వల్ల జట్టు ఇలా ఉండే అవకాశముందని చెప్పడానికి సాహసించవచ్చు:
కోహ్లీ (కెప్టెన్), రోహిత్, ధవన్, ధోనీ, దినేశ్ కార్తిక్, కేదార్ జాదవ్, అంబటి రాయుడు, హార్దిక్ పాండ్యా, శుభమన్ గిల్/మయాంక్/రాహుల్, భువనేశ్వర్, బుమ్రా, షమీ, జడేజా, కులదీప్, చాహల్.
ఇవి కూడా చదవండి:
- సచిన్ తెండూల్కర్ కోచ్ అచ్రేకర్ అంత్యక్రియలు: క్రికెట్ బ్యాట్లతో నివాళి
- కిట్ కొనడానికి కష్టపడ్డ మిథాలీ.. ఇప్పుడు పారితోషికంలో టాప్
- ఈ మహిళలు చైనాలో లైవ్ సెక్స్‌క్యామ్ రాకెట్ కోరల నుంచి ఎలా తప్పించుకున్నారంటే..
- యెమెన్ సంక్షోభం: 'నాకూ ఇతర అమ్మాయిల్లా బతకాలనుంది'
- "సౌదీ అరేబియా నుంచి నేను ఎందుకు పారిపోయానంటే..."
- అబద్ధాలు ఎక్కువగా ఎవరు చెబుతారు.. అమ్మాయా, అబ్బాయా
- 'ఫుడ్ అనేది ఒక పోర్న్ అయితే... నేను పోర్న్ స్టార్‌ని'
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








