పంచాయత్: ఈ హిందీ వెబ్ సిరీస్ ఎందుకంత సూపర్ హిట్?

పంచాయత్‌లో అభిషేక్ త్రిపాఠీ పాత్రలో జితేంద్ర కుమార్

ఫొటో సోర్స్, GAUTAM LALWANI

ఫొటో క్యాప్షన్, పంచాయత్‌లో అభిషేక్ త్రిపాఠీ పాత్రలో జితేంద్ర కుమార్
    • రచయిత, గీతా పాండే
    • హోదా, బీబీసీ న్యూస్, దిల్లీ

సిటీలో పుట్టిపెరిగిన ఓ కుర్రాడు మారుమూల గ్రామానికి వచ్చి చేసే హడానిడి నేపథ్యంగా రూపొందించిన డ్రామా గత ఏడాది అత్యధిక ప్రజాదరణ పొందిన హిందీ వెబ్ షోగా గుర్తింపు తెచ్చుకుంది.

పంచాయత్ వెబ్ షో రెండో సీజన్ కూడా ఎక్కువ మంది చూసిన షోగా మూడో స్థానంలో నిలిచింది. ‘రుద్ర: ది ఎడ్జ్ ఆఫ్ డార్క్‌నెస్’, ఆశ్రమ్ మూడో సీజన్ మొదటి రెండు స్థానాలలో ఉన్నాయి.

పంచాయత్ రెండో సీజన్‌ను 3 కోట్ల కంటే ఎక్కువ మంది చూశారు. అంతేకాదు హౌస్ ఆఫ్ ద డ్రాగన్స్, స్ట్రేంజర్ థింగ్స్ సీజన్‌-4లను దాటి 8.9 ఐఎండీబీ రేటింగ్ సాధించింది ఈ షో.

ఇంతకీ కోట్ల మంది భారతీయులకు నచ్చిన ఈ పంచాయత్‌లో ఏముంది?

సరైన ఉద్యోగం లేని ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్ అభిషేక్ త్రిపాఠీ ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఫులేరా అనే ఊరిలో చిన్నపాటి ప్రభుత్వ ఉద్యోగంలో చేరుతాడు. అభిషేక్ త్రిపాఠీ పాత్రను జితేంద్ర కుమార్ పోషించారు.

పంచాయత్‌లో ఒక సన్నివేశం

ఫొటో సోర్స్, GAUTAM LALWANI

ఫొటో క్యాప్షన్, పంచాయత్‌లో ఒక సన్నివేశం

తక్కువ జీతానికి పనిచేస్తూ మూడు గదులున్న పంచాయతీ ఆఫీసులో అభిషేక్ త్రిపాఠీ ఉద్యోగం. దుమ్ముధూళితో ఉండే ఆ గదుల్లోనే నివాసముంటాడాయన.

ఊళ్లో ఆయన సహోద్యోగులు కూడా పెద్దగా చదువుకోనివారే ఉంటారు.

గ్రామ కౌన్సిల్ సభ్యుల సహాయంతో త్రిపాఠీ ఆ ఊరి ప్రజల సమస్యలను పరిష్కరించే ప్రయత్నం చేస్తుంటాడు.

ఆఫీసు అయిపోయిన తరువాత అక్కడే రాత్రిళ్లు కరెంటు లేక చీకటిగా మారిన గదుల్లో ఒంటరిగా గడుపుతుంటాడాయాన. అప్పుడప్పుడు పాములు కూడా వస్తుంటాయి.

ఎలాగైనా ఆ చిరుద్యోగం నుంచి ఆ ఊరి నుంచి బయటపడాలన్న తాపత్రయంలో త్రిపాఠీ రాత్రిళ్లు చదువు మొదలుపెడతాడు. అంతకంటే పెద్ద ఉద్యోగం కోసం ఓ పరీక్షకు సిద్ధమవుతుంటాడు. వేరే పెద్ద ఉద్యోగం సంపాదిస్తేనే అక్కడి నుంచి బయటపడగలనన్నది త్రిపాఠీ నమ్మకం.

వారాలు, నెలలు గడిచేకొద్దీ ఆయనలో పట్టుదల తగ్గుతుంది. స్థానికంగా ఆయనకు ఫ్రెండ్స్ పెరుగుతారు. రొమాన్స్‌కూ అవకాశం ఏర్పడుతుంది.

గ్రామీణ ప్రాంతాలు, పట్టణ ప్రాంతాల మధ్య స్పష్టమైన విభజన కనిపించే దేశంలో అమెజాన్ ప్రైమ్‌లో ప్రసారమయ్యే ఈ ‘పంచాయత్’ గ్రామీణ ప్రాంతాల గురించి పెద్దగా తెలియని పట్టణ సబ్‌స్క్రైబర్లను ఆకట్టుకుంది.

ఈ కుర్ర ఉద్యోగి, ఆయన స్నేహితులు పండించే హాస్యం, వారి మధ్య బంధాలు ప్రేక్షకులను కట్టిపడేస్తాయి.

చండీగఢ్‌కు చెందిన రిటైర్డ్ ఇంగ్లిష్ లెక్చరర్, రచయిత నీల్ కమల్ పురీ ఈ షో తాను కరోనా మహమ్మారి సమయంలో చూశానని.. చాలా బాగుందని చెప్పారు.

‘పంచాయత్ అద్భుతమైన షో. ఇందులో అందరి పర్ఫార్మెన్స్ అద్భుతంగా ఉంటుంది’ అన్నారు.

‘ఇది చాలా బ్యాలన్స్‌డ్ షో. గ్రామీణ జీవితాన్ని మరీ అందంగా చూపించదు, అలా అని వెగటుగానూ చూపించదు.

చక్కని హాస్యం పలికిస్తూనే ఆ ఊరికి సంబంధించిన తీవ్రమైన సమస్యలను చూపిస్తుంది.

పంచాయత్‌లో సన్నివేశం

ఫొటో సోర్స్, GAUTAM LALWANI

‘వాస్తవికంగా ఉండడం, కనెక్ట్ కావడం వల్ల చాలామందికి ఇది నచ్చింది’ అని రచయిత, సినీ విశ్లేషకుడు సైబల్ చటర్జీ చెప్పారు.

సాధారణ ప్రజలు, వారి సమస్యల గురించి చెప్పే మామూలు కథే ఇందులో ఉందని.. 1980లు, 90లలో ఇలాంటివి ఎక్కువగా వచ్చేవని, అనంతర కాలంలో ఫ్యామిలీ, యాక్షన్ డ్రామాలు ఎక్కువై ఇలాంటి కథలు తగ్గాయని ఆయన చెప్పారు.

ఇప్పుడు చాలావరకు గూఢచారులు, అండవరల్డ్‌కు సంబంధించిన కథలు ఎక్కువగా వస్తున్నాయి. అలాంటివాటి మధ్య అసలైన మనుషులకు సంబంధించిన కథగా పంచాయత్ రావడంతో అందరినీ ఆకట్టుకుందని ఆయన విశ్లేషించారు.

‘సీరియస్ విషయాల గురించి సరదాగా చెప్పే శైలి ఇది. చూస్తున్నంతసేపు నవ్వు పుట్టిస్తుంది కానీ ఒక సీరియస్ విషయాన్ని ప్రేక్షకుల దృష్టికి తీసుకొస్తుంది’ అన్నారాయన.

ఫులేరాలో సర్పంచ్ మహిళ అయినప్పటికీ ఆమె భర్త అధికారాన్ని చెలాయించడం.. విద్యుత్ కనెక్షన్లు ఎక్కడెక్కడ అవసరం అనేది కాకుండా పలుకుబడి ఉన్నవారు ఎక్కడెక్కడ ఉన్నారో చూసి అక్కడ కనెక్షన్లు ఇవ్వడం.. పంచాయతీ అధికారులు భూస్వాములు అయినప్పటికీ భోజనం కూడా కొనలేని పరిస్థితిలో ఉండడం వంటివన్నీ ఇందులో ఉంటాయి.

పంచాయత్‌లో సన్నివేశం

ఫొటో సోర్స్, GAUTAM LALWANI

‘పంచాయత్’కి స్క్రిప్ట్ రాసిన చందన్ కుమార్ మాట్లాడుతూ.. గ్రామీణ జీవితం గురించి ప్రేక్షకులను చెప్పాలనుకున్నానని.. కానీ, బోధనల్లా కాకుండా సరదాగా చెప్పాలనుకున్నానని అన్నారు.

‘ఇప్పుడంతా వినోదం కోరుకుంటున్నారు. అందుకే వినోదాత్మకంగానే సమస్యలను చూపించాను’ అన్నారు.

వాస్తవ జీవితంలో ఎవరినో చూసి ఈ పాత్రలు రూపొందించలేదని, కేవలం పరిస్థితులను మాత్రమే ఇందులో ప్రతిబింబింపజేశామని చెప్పారు చందన్ కుమార్.

కాగా పంచాయత్ మూడో సీజన్ ఎప్పుడొస్తుందా అని ఎదురుచూస్తున్నానని నీలమ్ పురి చెప్పారు.

అయితే, చందన్ కుమార్ మాత్రం ఈ కథ మరికొన్ని సీజన్లు ఉంటుందని చెబుతున్నా మూడో సీజన్ ఎప్పుడు వస్తుందన్నది ఇంకా చెప్పలేదు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)