బడ్జెట్ 2023: ఇకపై ఆదాయపన్ను ఎంత కట్టాలి... రూ. 3 లక్షలు అయితే ఎంత? 30 లక్షలు అయితే ఎంత?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, అభినవ్ గోయల్
- హోదా, బీబీసీ ప్రతినిధి
ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ బుధవారం పార్లమెంటులో తన అయిదవ బడ్జెట్ ప్రవేశపెట్టారు. మోదీ ప్రభుత్వం 2024 ఎన్నికలకు ముందు ప్రవేశపెట్టిన చివరి పూర్తిస్థాయి బడ్జెట్ ఇది.
ఈ బడ్జెట్‌లో ఆదాయపన్ను చెల్లించేవారి మీద ప్రత్యేక శ్రద్ధ చూపించారు. పన్ను చెల్లింపుదారులకు కొంత ఉపశమనం కల్పించే ప్రయత్నం చేశారు.
ప్రస్తుతం వార్షికాదాయం 5 లక్షల రూపాయల వరకు ఉన్న వ్యక్తి ఏమాత్రం పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. ఈ పరిమితిని కొత్త బడ్జెట్‌లో రూ. 7 లక్షలకు పెంచారు.
అయితే, ఇది కొత్త పన్ను విధానానికి సంబంధించిన పరిమితి. గతంతో పోల్చితే ఇప్పుడు ఒక వ్యక్తి ఎంత ఆదాయ పన్ను ఎంత చెల్లించాలి?
ట్యాక్స్ నిపుణులు, చార్టర్డ్ అకౌంటెంట్ సీఏ డీకే మిశ్రా ఏమంటున్నారో చూడండి.

కొత్త పన్ను విధానం అంటే ఏంటి?
జవాబు: ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ 2020లో రెండో బడ్జెట్ ప్రవేశపెడుతూ కొత్త పన్ను విధానం అనేది ఆప్షనల్ అని, కావాలనుకున్న వాళ్ళే ఎంచుకోవచ్చని చెప్పారు. వద్దనుకున్న వాళ్ళు పన్ను తగ్గింపులు, రాయితీలతో కూడిన పాత విధానాన్నే అనుసరించవచ్చని సూచించారు.
పాత పన్ను విధానంలో 80సి కింద రూ. 1.5 లక్షల మినహాయింపు పొందవచ్చు. 80డి కింద 25 వేల రూపాయల మినహాయింపు పొందవచ్చు. ఇలా చాలా మార్గాల్లో కొన్ని మినహాయింపులను పన్ను చెల్లించే వ్యక్తి ఉపయోగించుకోవచ్చు.
అయితే, కొత్త పన్ను విధానంలో మీరు ఎలాంటి మినహాయింపులు పొందలేరు అని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ విధానంలో ఆదాయ పన్ను పరిమితి మొత్తం ఎక్కువగా ఉంటుంది. ఆ మేరకు పన్ను తక్కువగా పడుతుంది.
ఇప్పుడు కూడా పాత విధానం కొనసాగుతోంది. ఇప్పుడు కూడా మీకు ఏది లాభదాయకంగా ఉందనుకుంటే ఆ విధానాన్ని ఎంచుకోవచ్చు.
పాత విధానంలో పన్ను రాయితీలను పొందడం ఎంచుకోవచ్చు. లేదంటే ఎలాంటి మినహాయింపులు లేని కొత్త పన్ను విధానాన్ని ఎంచుకోవచ్చు.
కొత్త పన్ను విధానం (2020) ప్రకారం ఎంత పన్ను కట్టాలి?
జవాబు: 2020లో అమల్లోకి వచ్చిన కొత్తపన్ను విధానం ప్రకారం ఏడు టాక్స్ శ్లాబ్స్ ఉన్నాయి:
0 నుంచి 2.5 లక్షలు: పన్ను లేదు
2.5 నుంచి 5 లక్షలు: 5 శాతం
5 లక్షలు నుంచి 7.5 లక్షలు: 10 శాతం
7.5 లక్షలు నుంచి 10 లక్షలు: 15 శాతం
10 లక్షలు నుంచి 12.5 లక్షలు: 20 శాతం
12.5 లక్షలు నుంచి 15 లక్షలు: 25 శాతం
15 లక్షలు ఆ పైన: 30 శాతం
కొత్త పన్ను విధానంలో ఇప్పుడు వచ్చిన మార్పేంటి?
కొత్త పన్ను విధానంలో ఇప్పుడు 7 శ్లాబ్స్‌కు బదులు 6 శ్లాబ్సే ఉంటాయి.

నాకు ఏడాదికి 7 లక్షల రూపాయల ఆదాయం ఉంటే నేను ఎంత టాక్స్ కట్టాలి?
జవాబు: ఈ బడ్జెట్‌లో రెండు విధానాలకూ ప్రత్యేక ప్రాధాన్యం కల్పించారు.
ఒక వ్యక్తి ఏడాదికి రూ. 7 లక్షల ఆదాయం సంపాదించారనుకుందాం. అలాగే, ఒక ఉద్యోగి ఏడాదికి రూ. 7.5 లక్షలు సంపాదించారునుకుందాం.
ఈ పరిమితిలోకి వచ్చే వారెవరూ ఎలాంటి పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు.
ఇక, రెండో వర్గీకరణలో మీకు ఏడు లక్షలు లేదా అంతకన్నా ఎక్కువ ఆదాయం వస్తుందనుకుందాం. లేదంటే జీతం రూపంలో మీరుు ఏడున్నర లక్షలు ఏటా ఆర్జిస్తున్నారనుకుందాం. అప్పుడు మీరు కొత్త పన్ను విధానంలోని శ్లాబ్స్ ప్రకారం పన్ను చెల్లించాల్సి ఉంటుంది.
నా వార్షికాదాయం రూ. 9 లక్షలు అయితే, నేను ఎంత పన్ను కట్టాలి?
జవాబు: మీ వార్షిక ఆదాయం కనుక రూ. 7 లక్షలు దాటిందంటే మీరు టాక్స్ శ్లాబ్స్ పరిధిలోకి వచ్చేస్తారు.
అప్పుడు మీరు మొదటి 3 లక్షలకు ఎలాంటి పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు.
ఆ తరువాత 3 నుంచి 6 లక్షల వరకు (పన్ను పరిధిలోకి వచ్చే ఆదాయం 3 లక్షలు) ఆదాయం ఉంటే 5 శాతం అంటే రూ. 15 వేలు పన్ను చెల్లించాలి.
ఆరు లక్షల నుంచి 9 లక్షల ఆదాయం ఉంటే, రూ. 3 లక్షల మీద 10 శాతం చొప్పున రూ. 30 వేలు పన్ను చెల్లించాలి.
అంటే, 9 లక్షల ఆదాయం మీద రూ. 45,000 పన్నుతో పాటు 4 శాతం సెస్ రూ. 800 కలిపి చెల్లించాలి.

ఫొటో సోర్స్, Getty Images
నేను కొత్త విధానం ప్రకారం పన్ను చెల్లిస్తే నాకు ఏడాదికి ఎంత మిగులుతుంది?
జవాబు: మీ ఆదాయం ఏడాదికి రూ. 9 లక్షలు అయితే, మీరు కొత్త పన్ను విధానం ద్వారా రూ. 15,000 ఆదా చేసుకోగలుగుతారు.
కొత్త పన్ను విధానంలోని పాత శ్లాబ్స్ ప్రకారమైతే మీరు రూ. 60,000 పన్నుగా చెల్లించాల్సి వస్తుంది. మారిన శ్లాబ్స్ ప్రకారం మీకు రూ. 15,000 ఆదా అవుతుంది.
నాకు ఏడాదికి 12 లక్షల ఆదాయం ఉంటే ఎంత పన్ను కట్టాలి?
జవాబు: ఇంతకుముందు లాగే మొదటి మూడు లక్షల మీద ఏ పన్నూ ఉండదు. ఆ తరువాతి మూడు లక్షల మీద రూ. 15,000, ఆపైన 3 లక్షల మీద 10 శాతం చొప్పును రూ. 30,000, చివరి మూడు లక్షల మీద 15 శాతం చొప్పున రూ. 45,000 చెల్లించాల్సి ఉంటుంది.
అంటే, మొత్తంగా రూ. 90,000 పన్ను చెల్లించాలి. 4 శాతం సెస్ కింద మరో 3,600 కూడా జమ చేయాలి.
మొత్తంగా రూ. 12 లక్షల వార్షికాదాయం మీద రూ. 93,600 ఆదాయ పన్ను చెల్లించాలి.
నా ఆదాయం ఏటా రూ. 15 లక్షలు అయితే ఎంత పన్ను కట్టాలి?
జవాబు: మీ ఆదాయం రూ. 15 లక్షలు అయితే మీరు అయిదో శ్లాబ్, అంటే రూ. 12-15 లక్షల పరిధిలోకి వస్తారు.
అప్పుడు మీరు 20 శాతం పన్ను చెల్లించాలి. అలాగని, మొత్తం ఆదాయం మీద 20 శాతం చెల్లించాల్సిన అవసరం లేదు. రూ. 12 లక్షల మీద మీకు వచ్చిన ఆదాయం మీదే 20 శాతం పన్ను చెల్లించాలి.
పైన చెప్పినట్లు 12 లక్షల వరకు 90,000 రూపాయలు, ఆపైన ఉన్న 3 లక్షల మీద 20 శాతం చొప్పున 60,000 అంటే మొత్తం 1,50,000 పన్ను కట్టాల్సి ఉంటుంది.
నా ఆదాయం ఏడాదికి రూ. 30 లక్షలు అయితే...
జవాబు: మొదటి 15 లక్షల మీద రూ. 1.5 లక్షలు, మిగతా 15 లక్షల మీద 30 శాతం చొప్పున రూ. 4,5 లక్షలు పన్ను కట్టాలి. అంటే, మొత్తంగా రూ. 6 లక్షలు పన్ను చెల్లించాలి.








