‘అతడు నన్ను చంపేసుండేవాడు.. ఇద్దరు పిల్లలు పుట్టాక విడిపోయినా హింస కొనసాగింది’

ఫొటో సోర్స్, Visage
- రచయిత, దివ్య ఆర్య
- హోదా, బీబీసీ ప్రతినిధి
ప్రేమకు బదులుగా హింసను అనుభవించే రిలేషన్‌షిప్‌ల నుంచి మహిళలు ఎందుకు బయటకు రాలేకపోతున్నారు? ఎందుకు వారు హింసను భరిస్తున్నారు? హింసించే వారితోనే కలిసి జీవిస్తున్నారు?
దిల్లీలో శ్రద్ధా వాల్కర్ దారుణ హత్య అనంతరం ఈ ప్రశ్నలు ప్రధాన మీడియాతో పాటు సోషల్ మీడియాలోనూ కనిపించాయి.
‘‘శ్రద్ధ చాలా కాలంపాటు ఆ గృహ హింసను భరించారు. చివరగా ఆమెతో సహజీవనం చేసిన వ్యక్తే ఆమెను హత్యచేసి, మృతదేహాన్ని 35 ముక్కలుగా కోసి, దిల్లీలోని భిన్న ప్రాంతాల్లో విసిరేశారు’’ అని పోలీసులు వెల్లడించారు.
బాగా చదువుకున్న, స్వతంత్రంగా జీవించే మహిళలకు కూడా రిలేషన్‌షిప్‌లలో గౌరవం ఎందుకు దక్కడం లేదు? వారు ఎందుకు హింసను ఎదుర్కోవాల్సి వస్తోంది?
దీపిక కూడా ఇలానే వేధింపులను ఎదుర్కొన్నారు. వీటి నుంచి బయట పడేందుకు ఆమెకు ఏడేళ్లు పట్టింది. మొదట చెంప దెబ్బ నుంచి విడిపోయేవరకు ఆమె ఎందుకు అంత సమయాన్ని తీసుకున్నారు? చివరగా ఆమెకు ఎవరు సాయం చేశారు? మొత్తంగా ఎలా బయటపడ్డారు? లాంటి ప్రశ్నలకు ఆమె సమాధానాలు చెప్పారు. ఆ వివరాలు ఆమె మాటల్లోనే..
(హెచ్చరిక: కథనంలో ఆమె ఎదుర్కొన్న మానసిక, శారీరక వేధింపుల వివరాలు మిమ్మల్ని కలచివేయొచ్చు.)

ఫొటో సోర్స్, ImagesBazaar
అతడు నన్ను చంపేసుండేవాడు. అదృష్టవశాత్తు ముందే ఆ రిలేషన్‌షిప్ నుంచి నేను బయటపడ్డాను.
వివాహం, పెళ్లి, సంబంధాలకు ప్రాధాన్యమిచ్చే కుటుంబంలో మేం పెరిగాం. దేన్నైనా భరించాలని, సహనంతో పరిస్థితులు చక్కబడతాయని మాకు ఇంట్లో చెప్పేవారు.
నేను కూడా ఈ విషయాలను బలంగా నమ్మేదాన్ని.
మొదటిసారి నా భర్త కొట్టినప్పుడు, ఆయన ఒత్తిడిలో ఉన్నారని సర్దుకుపోయాను. అదే కేవలం కోపమే, తగ్గిపోతుందిలే అనుకున్నాను.
అప్పటికి మాకు పెళ్లై రెండేళ్లు గడిచాయి. ఒకసారి నాకు గర్భస్రావమైంది. ఆ తర్వాత ఒక పాపకు నేను జన్మనిచ్చాను.
గర్భధారణ సమయంలో కొన్ని సమస్యల వల్ల ప్రసవానికి నాలుగు నెలల ముందు కాస్త ఎక్కువ విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు. దీంతో నేను పుట్టింటికి వచ్చాను. అది ఆయనకు అసలు ఇష్టం లేదు.
మా అమ్మాయి ఏడున్నర నెలలకే పుట్టింది. ఆమె బరువు అప్పుడు కేవలం 1.5 కేజీలు మాత్రమే ఉంది. దీంతో మా కుటుంబం చాలా ఆందోళనకు గురైంది.
ఆపరేషన్ గది నుంచి వేరే గదికి తీసుకెళ్లిన కొద్దిసేపటికి నాకు కాస్త తెలివి వచ్చింది. మా అమ్మానాన్నలపై కోపంగా ఉండే నా భర్త అప్పుడే లోపలకు వచ్చారు. ఆయన గట్టిగా అరిచారు. చుట్టుపక్కల వస్తువులు విసిరేయడం మొదలుపెట్టారు. వెంటనే ఆయనను ప్రశాంతంగా ఉండాలని నర్సులు సూచించారు.
మా అమ్మా, నాన్నలను ఆయన గట్టిగా తిట్టారు. అక్కడి నుంచి వెళ్లిపోవాలని అరిచారు. ‘‘అయితే, వారైనా ఉండాలి లేదా నేనైనా ఉండాలి’’ అని ఆయన అన్నారు.
అదే కోపంలో ఆయన అక్కడి నుంచి వెళ్లిపోయారు. కానీ, నా పాపకు నాన్న అవసరం కూడా ఉంటుంది. అందుకే ఆయన వెనక్కి రావాలని నేను బతిమాలాను.
ఆయన వెనక్కి వచ్చారు. కానీ, ఒక షరతు పెట్టారు. ‘‘నేను ఇంటిలో ఉండేటప్పుడు మీ ఇంట్లో ఎవరూ అక్కడ ఉండకూడదు’’ అని అన్నారు.

ఫొటో సోర్స్, ImagesBazaar
మొదటి చెంపదెబ్బ
అయన ఒక దెయ్యంలా మారిపోతున్నట్లుగా నాకు అనిపించేది. మా కుటుంబాన్ని దారుణంగా తిట్టేవారు.
ఇవన్నీ ఒక రకమైన మానసిక వేధింపులే. నాకు అప్పట్లో అర్థమయ్యేవి కాదు. అది 2005. దీని గురించి పెద్దగా బయట చర్చ కూడా జరిగేది కాదు.
ఒక రోజు ఈ వేధింపులు శారీరక వేధింపుల వరకు వెళ్లాయి. మొదటిసారి ఆయన నన్ను చెంపదెబ్బ కొట్టారు.
అయితే, కొద్దిసేపటికే నా కాళ్లపై పడి క్షమాపణలు చెప్పారు. నా కోసం చెయ్యి కోసుకున్నానని చెప్పారు. పువ్వులు కూడా తీసుకొచ్చారు.
నేను కూడా ఇది ఒక చెంప దెబ్బే కదా, అది కూడా కోపంలో కొట్టారు, ఇకపై అలా జరగదని సర్దిచెప్పుకున్నాను. నేను ఆయన్ను క్షమించాను. ఆ తర్వాత మేం సైకాలజిస్టు దగ్గరకు వెళ్లాం.
కోపం అదుపులో పెట్టుకునేందుకు మొదటగా ఆయనకు వైద్యులు మందులు ఇచ్చారు. కానీ, ఆయన మూడు రోజులు మాత్రమే వేసుకున్నారు.
పరిస్థితులు మళ్లీ మొదటికి వచ్చాయి. ఆయన చెప్పే అన్నింటికీ సరేనంటేనే ఆయన శాంతించేవారు.
దీనికి పరిష్కారం కనిపించేది కాదు. ఒకరోజు నేను ఆయన మాటకు ఎదురుచెప్పాను. వెంటనే ఆయన మళ్లీ కొట్టారు.

ఫొటో సోర్స్, Suprabhat Dutta
మొహంపై చేతి గుర్తులు..
నేను మళ్లీ గర్భం దాల్చాను. ఈ సారి బాబు పుట్టాడు. కానీ, హింస మాత్రం కొనసాగేది. ఈ సారి నా భర్త కొట్టినప్పుడు, మొహంపై గుర్తులు కూడా పడ్డాయి.
వాటిని కప్పిపుచ్చేందుకు నేను చాలా ప్రయత్నించాను. నేను స్కూలులో టీచర్‌గా పనిచేస్తుంటాను. దీంతో అక్కడ దెబ్బ తగిలిందని అబద్ధం చెప్పాను.
ఇద్దరు పిల్లలను పెట్టుకొని ఆయన నుంచి విడిగా బతకడం చాలా కష్టమని నేను భావించేదాన్ని.
అయితే, మళ్లీ అంతా మొదటికే వచ్చేది. ఆయన కొట్టేవారు, క్షమాపణలు చెప్పేవారు. ఒక్కోసారి ఒత్తిడిలో కొట్టేశానని, మరోసారి నీ వల్లే కొట్టానని చెప్పేవారు. ఒక్కోసారి ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించేవారు. ఒక గదిలోకి వెళ్లి గడియ పెట్టేసుకునేవారు.
ఆ తర్వాత మేం మరొక కౌన్సెలర్ దగ్గరకు వెళ్లాం. ‘‘దాదాపు అన్ని పెళ్లిళ్లలోనూ ఇలాంటివి సహజం. ఇదేమీ గృహహింస కాదు. ఎందుకంటే ఆయన రోజూ కొట్టడం లేదు కదా. ఇంటికి వెళ్లి హాయిగా జీవించండి’’అని ఆ కౌన్సెలర్ చెప్పారు.
మొత్తంగా నేను ముగ్గురు కౌన్సెలర్ల దగ్గరకు వెళ్లాను. కానీ, ఎవరూ నా సమస్యను పరిష్కరించే సలహాలు, సూచనలు ఇవ్వలేదు. నన్ను తప్పుదోవ పట్టించే సూచనలే వచ్చేవి.
హింస మాత్రం తగ్గలేదు. ఒకసారి నా రెండేళ్ల కొడుకు నా ఒళ్లో కూర్చున్నప్పుడే, నా భర్త నన్ను కొట్టారు.
వెంటనే మా అబ్బాయికి దెబ్బ తగలకుండా ఉండేందుకు ప్రయత్నించాను. కానీ, కిందపడటంతో తలకు దెబ్బ తగిలింది.

ఫొటో సోర్స్, Evgeniia Siiankovskaia
చివరగా, నేను పిల్లలను పట్టుకొని పుట్టింటికి వెళ్లిపోయాను. అప్పటికి నేను ఆర్థికంగా స్వతంత్రంగా ఉండేదాన్ని. మాకు ఒక వన్-బెడ్‌రూమ్ ఫ్లాట్ ఉంది. అక్కడకు వెళ్లి ఉండేదాన్ని.
నన్ను నా భర్త కొడుతున్నారని మా అమ్మానాన్నలకు నేను చెప్పలేదు. మాకు గొడవలు అవుతున్నాయని మాత్రమే చెప్పేదాన్ని.
ఒకవేళ ఆయన కొడుతున్నారని మా అమ్మానాన్నలకు చెబితే, వారి మధ్య దూరం మరింత పెరుగుతుంది. ఆయన కోపం మరింత ఎక్కువవుతుంది. ఫలితంగా వేధింపులు మరింత ఎక్కువ అవుతాయి.
అప్పటికీ నేను వివాహ బంధం చాలా గొప్పదని నమ్మేదాన్ని. మా వైవాహిక జీవితంలో ప్రేమ స్థానాన్ని భయం ఆక్రమించిందని ఒప్పుకోవడానికి నేను అంగీకరించేదాన్ని కాదు.
రిలేషన్‌షిప్‌లో ఒక వ్యక్తి హింసకు పాల్పడుతున్నాడంటే, అతడు మనల్ని గౌరవించట్లేదని అర్థం. మొదటి చెంపదెబ్బకు కూడా అవకాశం ఇవ్వకూడదు. కానీ, మనమే అన్నింటినీ భరిస్తాం. అలానే ఉండాలని మనకు నేర్పిస్తారు కూడా.
తప్పు నాదేనని అనుకునేదాన్ని. నా నిర్ణయాలనే తప్పు పట్టుకునేదాన్ని. అన్ని సమస్యలనూ నేను పరిష్కరించగలనని అనుకునేదాన్ని.
మరోవైపు నా భర్త కూడా క్షమించాలని పదేపదే అడిగేవారు. అన్నీ మరచిపోయి సంతోషంగా జీవిద్దామని చెప్పేవారు. దీంతో నాలో కూడా కొత్త ఆశలు చిగురించేవి.
అసలు ఏం జరిగుతోందో నేను ఆలోచించలేకపోదాన్ని. దీంతో మళ్లీ ఆయనతో కొత్తగా జీవితం మొదలుపెడదామని మూడు నెలల తర్వాత పిల్లలతో ఆయన దగ్గరకు వచ్చాను.

ఫొటో సోర్స్, Dua Aftab / EyeEm
మళ్లీ అదే కథ
ఆ తర్వాత కొన్ని రోజులకే మా అబ్బాయికి మూడో సంవత్సరం వచ్చింది. అయితే, మళ్లీ గొడవ జరిగింది. ఈ సారి నా బుర్రను గోడకేసి మా ఆయన కొట్టారు.
దెబ్బలు బాగా తగలడంతో మోకాలుకు కూడా గాయమైంది. దీంతో డాక్టర్ దగ్గరకు వెళ్లి కట్టు కట్టించుకున్నాను. వచ్చిన తర్వాత, నువ్వు మరీ నాటకాలు ఆడుతున్నావని ఆయన అన్నారు. మళ్లీ కొట్టారు.
చాలా భయంగా అనిపించింది. ఎలాగోలా ధైర్యం కూడగట్టుకొని జరిగిందంతా మా అమ్మానాన్నలకు చెప్పాను. వారు నన్ను పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు.
మరోసారి నేను ఇంటి నుంచి బయటకు వచ్చేశాను. ఈ సారి నేను, నా పిల్లలు చాలా కష్టపడ్డాం.
మా మావయ్య, బావగారు పదేపదే ఫోన్ చేసేవారు. పిల్లలను తీసుకొని ఇంటికి రావాలని వారు పిలిచేవారు.
నిజానికి ఇది నా రెండో పెళ్లి. ఎలాగైనా దీన్ని గాడినపెట్టుకోవాలని నేను అనుకునేదాన్ని.
మొదటిది ప్రేమ వివాహం. 20 ఏళ్ల వయసులో ఎలాంటి వ్యక్తిని ఎంచుకోవాలో తెలియక తప్పుచేశాను. సంవత్సరంలోనే నేను విడాకులు తీసుకున్నాను.
ఆ తర్వాత 16 ఏళ్లు పెళ్లి గురించి ఆలోచించలేదు. నేను ఆర్థికంగా స్వతంత్రంగా ఉన్నానని సంతోషంగా ఉండేదాన్ని. స్కూళ్లో టీచర్‌గా పనిచేస్తూ నాకు నచ్చినట్లుగా జీవించేదాన్ని.

ఫొటో సోర్స్, Lucy Lambriex
అయితే, ఒక డేటింగ్ వెబ్‌సైట్‌లో ప్రొఫైల్ క్రియేట్ చేయాలని మా అమ్మానాన్న ఒత్తిడి చేశారు. అలా నా రెండో భర్తను కలిశాను. ఆయన నన్ను మొదట్లో బాగా చూసుకునేవారు. నా కోసం మా ఊరికి వచ్చారు. పెళ్లికి తొందర పెట్టారు.
మేం కలిసిన ఏడు నెలల్లోనే పెళ్లి చేసుకున్నాం. మా ఇద్దరికీ కాస్త వయసు ఎక్కువే. అందుకే త్వరగా పిల్లలను కనాలని అనుకున్నాం. వెంటనే నేను గర్భం దాల్చాను. కానీ, ప్రమాదవశాత్తు గర్భస్రావమైంది. ఆ తర్వాత ఇద్దరు పిల్లలు పుట్టారు.
మానసిక, శారీరక వేధింపుల తర్వాత వెనక్కి చూసుకుంటే అంతా మారినట్లు కనిపించేది. ఆయనకు చాలా త్వరగా కోపం వచ్చేసేది. నన్ను నా ఆప్తుల నుంచి ఆయన విడదీసేవారు.
అయితే, ‘‘కొత్త పెళ్లిలో ఇలాంటివి సహజం’’ అని అందరూ చెప్పేవారు.
మొదట్లో ఆయన కొట్టేవారు కాదు. నాపైకి వస్తువులను విసిరేవారు, కప్పులు, ప్లేట్లు పగులకొట్టేవారు. మా ఇంట్లో ఎప్పుడూ ఉద్రిక్త వాతావరణమే ఉండేది. అది కూడా ఒకరమైన హింసే. కానీ, దెబ్బలు తిన్న తర్వాతే, పరిస్థితి అర్థం కావడం మొదలైంది.
కానీ, సమాజం ఏం అనుకుంటుందోనని నేను భయపడేదాన్ని. ఎలాగైనా ఈ పెళ్లిని కాపాడుకోవలనే తపన కూడా నాకు సంకెళ్లు వేసేది. నాపై నేను దృష్టిపెట్టకుండా, నా భర్త మారుతారని ఎదురుచూసేదాన్ని.
ఈ ఆశలే మోకాళ్లకు కట్టు కట్టుకుని ఇంటి నుంచి వెళ్లిపోయిన నన్ను మళ్లీ తిరిగి వచ్చేలా చేశాయి. అప్పుడే నా వివాహానికి ఇదే చివరి అవకాశంగా అనుకున్నాను.

ఫొటో సోర్స్, fizkes
మా నాన్నను కొట్టారు..
దాదాపు ఏడాది వరకు పరిస్థితి మామూలుగానే ఉండేది. అయితే, అప్పుడే నా భర్త ఉద్యోగం ఊడిపోయింది. కొన్ని రోజులకు మా మావయ్య గారు కూడా మరణించారు.
జీవితంలో ఒత్తిడి మరింత ఎక్కువైంది, దీంతో కొట్టడం కూడా ఆయన మళ్లీ మొదలుపెట్టారు. ఈ సారి తరచూ కొడుతుండేవారు. వారంలో ఒకటి రెండు సార్లైనా నేను దెబ్బలు తినేదాన్ని.
తండ్రి చనిపోయిన బాధలో ఉన్నారని నేను ఈ విషయాన్ని ఎవరికీ చెప్పేదాన్ని కాదు. ఆయనను వదిలి వెళ్లలేకపోయేదాన్ని, ఎవరికీ చెప్పుకోలేకపోయాన్ని.
ఒక రోజు కోపంలో ఇంట్లో వస్తువులు నాపైకి విసిరేయడం మొదలుపెట్టారు. బాటిళ్లు, కుర్చీలు ఇలా చాలా విసిరారు. పీక పిసికి చంపేస్తానని కూడా బెదిరించారు.
ఇవన్నీ నా ఐదేళ్ల కొడుకు, ఏడేళ్ల కూతురు ముందే జరిగాయి. మా ఇంటి తలుపులు కూడా తెరిచే ఉన్నాయి. ఇరుగుపొరుగు వారు కూడా అన్నీ చూశారు.
కానీ, ఆ రోజు పోలీస్ స్టేషన్‌కు వెళ్లే ధైర్యాన్ని నేను చేయలేకపోయాను. నాకు చాలా భయమేసింది. మా పిల్లలు కూడా చాలా భయపడ్డారు.
రెండో రోజుల తర్వాత, నా ఇద్దరు పిల్లలను తీసుకుని మా నాన్నతోపాటు కారులో కూర్చుకున్నాను. వెంటనే నా భర్త వచ్చి బోనెట్‌పైకి ఎక్కారు. కారు ముందుకు వెళ్లకుండా అడ్డుకున్నారు.
ఆ రోజు మేం ఊహించని ఘటన ఒకటి జరిగింది. మా 78 ఏళ్ల తండ్రిపైనా నా భర్త చేయి చేసుకున్నారు. మా నాన్నకు ముక్కు, నోటి నుంచి రక్తం కారింది.
వెంటనే ఆయన్ను హాస్పిటల్‌కు తీసుకెళ్లాం. అక్కడి నుంచి నేరుగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లాం. అక్కడితో నా భర్త హద్దులన్నీ మీరారు. నా ఆశలన్నీ ఆవిరి అయ్యాయి.
మొదటి చెంపదెబ్బ తిన్న ఏడేళ్ల తర్వాత, 2012లో మేం విడిపోయాం.
మాకు విడాకులు రావడానికి మరో నాలుగేళ్లు పట్టింది. మా ఫ్లాట్‌లో నా వాటాను నా భర్తకు ఇచ్చేస్తానని, పిల్లలను నాకు వదిలిపెట్టేయాలని చెప్పాను.
మొత్తానికి నా పెళ్లి కథ ముగిసింది. కానీ, హింస మాత్రం కొనసాగేది.

ఫొటో సోర్స్, dragana991
విడాకుల తర్వాత హింస
అయితే, నా భర్తపై గృహహింస కేసు పెట్టొద్దని మా లాయర్ నన్ను ఒప్పించారు. దీంతో విడాకుల తర్వాత కూడా వారంలో రెండుసార్లు పిల్లలను చూడటానికి ఆయన వచ్చేవారు.
ఒక రోజు పోలీస్ స్టేషన్‌కు వెళ్లి పిల్లల భద్రత విషయంలో భయమేస్తుందని చెప్పాను. కానీ, ‘‘వారు నీ భర్తకు కూడా వారు పిల్లలే కదా, భయం ఎందుకు?’’అని వారు అన్నారు.
కానీ, నా భయమే నిజమైంది.
ఒక రోజు మా అమ్మాయి నా దగ్గరకు వచ్చి నాన్న అసభ్యకరంగా తాకుతున్నారని చెప్పింది. ఆయన బాత్‌రూమ్‌లోకి తీసుకెళ్లి, తన బట్టల్లోపల చేయి పెట్టారని చెప్పింది. అప్పటికి ఆమె వయసు ఏడేళ్లు మాత్రమే.
ఇక నాలో సహనం చచ్చిపోయింది. ఇప్పుడు సొంత తండ్రి నుంచే నా బిడ్డను కాపాడుకోవాల్సిన పరిస్థితి వచ్చింది.
వెంటనే స్టేషన్‌కు వెళ్లి పోస్కో చట్టం కింద కేసు నమోదు చేయించాను. అయితే, ఆయన తిరిగి నాపై పిల్లలను సరిగా చూసుకోలేదని మూడు కేసులు పెట్టారు.
అయితే, ఆధారాలు లేకపోవడంతో నా భర్తను దోషిగా నిరూపించలేకపోయాం. మా అమ్మాయి చేసినవి కేవలం ఆరోపణలేనని, వాటిపై ఆయన్ను దోషిగా నిరూపించలేమని కోర్టు చెప్పింది. కానీ, మా అమ్మాయితో ఆయన సంబంధాలు పూర్తిగా దెబ్బతిన్నాయి.
మరోవైపు నాపై ఆయన మోసిన కేసులు కూడా రుజువు కాలేదు.
ఇప్పుడు నేను కొత్త లాయర్లను నియమించుకున్నాను. వారు గృహహింస కేసు పెట్టాలని నాకు సూచించారు.
నిజానికి ఈ కేసు నేను ఎప్పుడో పెట్టుండాల్సింది. జీవితంలో నేను షాక్‌లు చూశాను. మా అబ్బాయి స్కూళ్లో ఆడుకుంటూ పడిపోయి మరణించాడు. అప్పటికి తన వయసు పదేళ్లు మాత్రమే.
నా శక్తి అంతా మట్టిలో కలిసిపోయినట్లు అనిపించింది.
నేను చాలా పోరాడాను. ఇక ఆపేయాలని కూడా అనిపించింది.
ఆ తర్వాత నేను కొత్త కౌన్సెలర్‌ను కలిశాను. మొదట నాపై నేను దృష్టిపెట్టాలని ఆమె సూచించారు. నేను అన్ని విధాలా సిద్ధంగా ఉన్నప్పుడే నిర్ణయాలు తీసుకోవాలని చెప్పారు.
ఇప్పుడు మా అమ్మాయి కూడా పోరాడతానని అంటోంది. తను పెద్దయ్యాక, వాళ్ల నాన్నపై పెట్టిన లైంగిక వేధింపుల కేసును మళ్లీ తెరిపిస్తానని, న్యాయం జరిగేవరకు ఊరుకోనని అంటోంది.
నేను అందరికీ క్షమించేశాను. చాలా పోరాడాను, ఇప్పుడు ప్రశాంతంగా జీవించాలని భావిస్తున్నాను. జీవితం చాలా చిన్నది. మిగతా జీవితాన్ని కోపం, ద్వేషాలతో నేను జీవించలేను.
అన్నింటికంటే ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఈ హింసాత్మక పోరాటంలో నేను ప్రాణాలు కోల్పోలేదు. దీని నుంచి బయటపడేందుకు, నాకు కాస్త సమయం పట్టింది, దెబ్బలు కూడా తిన్నాను. కానీ, ఇప్పుడు నేను, మా అమ్మాయి స్వేచ్ఛగా జీవిస్తున్నాం.
(బాధితుల పేర్లను మార్చాం)
మీరు ఏదైనా హింసను ఎదుర్కొంటే జాతీయ మహిళా కమిషన్ +91 782717017కు ఫోన్ చేయండి.
మీరు ఎదుర్కొంటున్న హింస నుంచి బయటపడేందుకు సాయం కోసం Aks Crisis Line - +91 8793088814ను కూడా సంప్రదించొచ్చు.
ఇవి కూడా చదవండి:
- కల్పనా చావ్లా: కొలంబియా స్పేస్ క్రాఫ్ట్ కూలిపోతుందని నాసాకు ముందే తెలుసా... ఆ రోజు ఏం జరిగింది
- అదానీ గ్రూప్: ఎల్ఐసీ పెట్టుబడులపై ప్రశ్నలు ఎందుకు వినిపిస్తున్నాయి
- నిన్న ఆనం, నేడు కోటంరెడ్డి... నెల్లూరు వైసీపీ నేతల్లో అసంతృప్తి పెరుగుతోందా
- దావూద్ ఇబ్రహీం: మాఫియా డాన్ హైదరాబాద్ గుట్కా కంపెనీ కథ ఏమిటి? మాణిక్ చంద్, జేఎం జోషి వివాదంలో దావూద్ పాత్ర ఏమిటి?
- పాకిస్తాన్: కిలో ఉల్లిపాయలు రూ.250... ‘కోయకుండానే కళ్లల్లో నీళ్లు’
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)
















