అఫ్గానిస్తాన్: బాలికల విద్య కోసం పోరాడుతున్న ప్రొఫెసర్ అరెస్ట్

 ప్రొఫెసర్ ఇస్మాయిల్ మషాల్
    • రచయిత, టిఫినీ వెర్దిమర్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

అఫ్గానిస్తాన్‌లో బాలికల విద్యను సమర్థించిన ఒక ప్రొఫెసర్‌ను తాలిబాన్లు అరెస్ట్ చేశారు.

కాబూల్‌లోని ఒక యూనివర్సిటీ చెందిన ప్రొఫెసర్ తాలిబాన్ల విధానాలను బహిరంగంగా విమర్శించారు. మహిళ, బాలికల విద్యపై నిషేధం విధించడాన్ని తప్పుబట్టారు.

గత గురువారం ప్రొఫెసర్ ఇస్మాయిల్ మషాల్ ఉచితంగా పుస్తకాలు పంచుతుండగా తాలిబాన్లు ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు.

మహిళలు, బాలికల యూనివర్సిటీ, మాధ్యమిక విద్యపై తాలిబాన్లు నిషేధం విధించడాన్ని నిరసిస్తూ ఒక టీవీ ప్రోగ్రాంలో తన అకడమిక్ సర్టిఫికెట్లను చించివేశారు ప్రొఫెసర్ ఇస్మాయిల్. అప్పటి నుంచి ఆయన పేరు వార్తల్లోకెక్కింది.

37 ఏళ్ల ప్రొఫెసర్ మషాల్ "రెచ్చగొట్టే చర్యలకు పాల్పడ్డారని" తాలిబాన్ ప్రభుత్వం ఆరోపించింది.

 ప్రొఫెసర్ ఇస్మాయిల్ మషాల్

ఫొటో సోర్స్, Ismail Mashal

ఫొటో క్యాప్షన్, వీధుల్లో పుస్తకాలు పంచుతున్న ప్రొఫెసర్ మషాల్

'హాని తలపెట్టే చర్యలు'

ప్రొఫెసర్ మషాల్ రోడ్డుపై జర్నలిస్టులను కూడదీసి "గందరగోళం" సృష్టించడానికి ప్రయత్నించారని, తద్వారా తాలిబాన్ ప్రభుత్వానికి హాని తలపెట్టే చర్యలకు పూనుకున్నారని తాలిబాన్ సమాచార మంత్రిత్వ శాఖ అధికారి అబ్దుల్ హక్ హమ్మద్ ట్విట్టర్‌లో పేర్కొన్నారు.

ప్రొఫెసర్‌ను చెంపదెబ్బలు కొట్టారని, తన్నారని ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. కానీ, ఆయన్ను అదుపులోకి తీసుకున్నప్పుడు గౌరవంగానే వ్యవహరించామని తాలిబాన్ అధికారులు చెబుతున్నారు.

గతంలో జర్నలిస్ట్‌గా పనిచేసిన ప్రొఫెసర్ మషాల్ కాబూల్‌లో ఒక ప్రైవేట్ యూనివర్సిటీ నడిపేవారు. అందులో జర్నలిజం, ఇంజినీరింగ్, ఎకనామిక్స్, కంప్యూటర్ సైన్సెస్ చదివే 450 మంది మహిళా విద్యార్థులు ఉండేవారు.

ఈ కోర్సులు మహిళలకు బోధించకూడదని తాలిబాన్ విద్యా మంత్రి ఆదేశించారు. మహిళలు ఈ సబ్జెక్టులు చదువుకోవడం ఇస్లాంకు, అఫ్గాన్ సంస్కృతికి వ్యతిరేకమని తాలిబాన్లు భావిస్తున్నారు.

డిసెంబర్‌లో మహిళా విద్యార్థులకు యూనివర్సిటీ ప్రవేశాన్ని నిషేధించినప్పుడు, ప్రొఫెసర్ మషాల్ తన యూనివర్సిటీని పూర్తిగా మూసివేశారు.

"విద్య అందరికీ సమానంగా అందాలి, లేదా ఎవరికీ అందకూడదు" అని చెబుతూ యూనివర్సిటీని మూసివేస్తున్నట్లు ప్రకటించారు.

 ప్రొఫెసర్ ఇస్మాయిల్ మషాల్

చంపేస్తామని బెదిరింపులు

అయితే, ఈ అంశంలో మౌనంగా ఉండాలనుకోలేదు ప్రొఫెసర్ మషాల్. తన ప్రాణాలను పణంగా పెట్టయినా సరే, మహిళల విద్య కోసం పోరాడాలనుకున్నారు.

టీవీలో ఆయన సొంత సర్టిఫికెట్లను చింపేసిన వీడియో వైరల్ అయింది.

అప్పటినుంచీ ఆయనకు బెదిరింపులు వస్తున్నాయి. అయినప్పటికీ, ఆయన వెనకడుగు వేయలేదు. రోజూ స్థానిక మీడియాలో కనిపిస్తూనే ఉన్నారు. నిరసనలు తెలుపుతూనే ఉన్నారు.

వీధుల్లో తిరుగుతూ ఉచితంగా పుస్తకాలు పంచారు.

"నాకున్న ఒకే ఒక్క బలం నా కలం. నన్ను చంపినా సరే, ముక్కలు ముక్కలు చేసినా సరే నేను మౌనంగా ఉండను" అని ప్రొఫెసర్ మషాల్ బీబీసీతో అన్నారు.

మహిళా విద్యపై నిషేధానికి వ్యతిరేకంగా పురుషులు కదలి రావాలని అన్నారు.

ప్రొఫెసర్ మషాల్‌కు ఇద్దరు బిడ్డలు. అఫ్గాన్ మహిళలను, బాలికలను యూనివర్సిటీల్లోకి, పాఠశాలలోకి అనుమతించేవరకు తన పోరాటం కొనసాగుతుందని ఆయన చెప్పారు. తనను అరెస్ట్ చేస్తారని, చంపుతారని భయం లేదన్నారు.

తాలిబాన్లు తనను అణచివేయడానికి శాయశక్తులా ప్రయత్నిస్తారని, అందుకు తాను చెల్లించాల్సిన మూల్యం గురించి తనకు భయం లేదని ప్రొఫెసర్ మషాల్ అంటున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)