భారత్‌లో ఇంటర్నెట్ వృద్ధి రేటు ఎందుకు తగ్గిపోయింది?

ఇంటర్నెట్ వృద్ధి

ఫొటో సోర్స్, AFP

    • రచయిత, సౌతిక్ బిశ్వాస్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

భారత్ వంద కోట్లకు పైగా యూజర్లతో ప్రపంచంలోనే రెండో అతిపెద్ద మొబైల్ ఫోన్ మార్కెట్‌గా అవతరించింది. అయినప్పటికీ, ఈ అతిపెద్ద మార్కెట్‌లో ఇంటర్నెట్ వృద్ధిరేటు తగ్గిపోయింది.

అక్టోబర్ 2022లో మొబైల్ ఫోన్లలో ఇంటర్నెట్ పొందే వైర్‌లెస్ బ్రాడ్‌బ్యాండ్ వినియోగదారులు 79 కోట్ల మంది ఉన్నట్టు దేశీయ టెలికాం నియంత్రణ సంస్థ అంచనా వేసింది.

ఈ సబ్‌స్క్రైబర్లు ఆగస్టు 2021లో నమోదైన దాని కంటే 10 లక్షలు మాత్రమే ఎక్కువగా ఉన్నారు. 2016 నుంచి 2020 మధ్య కాలంలో రెండంకెల వృద్ధిని నమోదు చేసిన మొబైల్ ఇంటర్నెట్ సబ్‌స్క్రైబర్ల వృద్ధి ప్రస్తుతం సింగిల్ డిజిట్‌కి పడిపోయింది.

ప్రజలు ఆన్‌లైన్‌లోకి వచ్చేందుకు స్మార్ట్‌ఫోన్లు మాత్రమే ప్రధాన మాధ్యమంగా ఉంటున్నాయి. కానీ వీటి వృద్ధి నెమ్మదించడంతో, ఇంటర్నెట్ వృద్ధి కూడా తగ్గిపోయింది.

భారత్‌లో ప్రస్తుతం 65 కోట్ల మంది స్మార్ట్‌ఫోన్ యూజర్లున్నారు. కానీ, వీటి వృద్ధి మాత్రం నెమ్మదించింది.

గత ఏడాది భారత్‌లో మొబైల్ ఫోన్ అమ్మకాలు 15.1 కోట్ల యూనిట్లకు పడిపోయాయి.

2021లో నమోదైన 16.8 కోట్ల నుంచి ఈ అమ్మకాలు 15.1 కోట్లకు తగ్గినట్టు మార్కెట్ రీసెర్చ్ సంస్థ కౌంటర్ పాయింట్ తెలిపింది.

ఈ అమ్మకాలు ఈ ఏడాది కేవలం ఒక అంకె వృద్ధిని మాత్రమే నమోదు చేస్తాయని ఈ మార్కెట్ రీసెర్చ్ సంస్థ అంచనావేసింది.

మరో మార్కెట్ రీసెర్చ్ సంస్థ ఐడీసీ ప్రకారం మూడేళ్ల క్రితం వరకు ప్రతి 14 నెలల నుంచి 16 నెలలకు ఒకసారి ప్రజలు కొత్త స్మార్ట్‌ఫోన్‌ను కొనేవారు. కానీ, ఇప్పుడు 22 నెలలకు లేదా అంతకంటే ఎక్కువ సమయం తర్వాతనే తమ స్మార్ట్‌ఫోన్‌ను అప్‌గ్రేడ్ చేసుకోవాలని చూస్తున్నారు.

దీనికి ఒక కారణం కరోనా మహమ్మారి తర్వాత నుంచి స్మార్ట్‌ఫోన్ ధరలు బాగా పెరిగిపోవడం. అలాగే, కాంపోనెంట్ ఖర్చులు కూడా పెరగడమే కాకుండా ఇదే సమయంలో రూపాయి విలువ బలహీనపడింది. ప్రపంచంలో అతిపెద్ద స్మార్ట్‌ఫోన్ తయారీదారీ అయిన చైనాలో సరఫరా సమస్యలు తలెత్తడంతో కరోనా తర్వాత నుంచి స్మార్ట్‌ఫోన్ ధరలు బాగా పెరిగాయి.

భారత్‌లో రూపొందించే స్మార్ట్‌ఫోన్లకు అవసరమయ్యే 300కి పైగా పరికరాలలో సుమారు 90 శాతం ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సిందే.

ఇంటర్నెట్ వృద్ధి

ఫొటో సోర్స్, AFP

ఉద్యోగాలు పోతుండడంతో ఆదాయాలపై ప్రభావం

ఆర్థిక వ్యవస్థ కూడా నెమ్మదించింది. చాలా మందికి ఉద్యోగాలు పోతున్నాయి. దీంతో ఆదాయాల మార్గాలు మూసుకుపోతూ, ప్రజల జేబుల్లో తక్కువ మనీ ఉంటుంది. ఇవన్నీ కొత్త ఫోన్ కొనుగోళ్లపై ప్రభావం చూపుతున్నాయి.

‘‘ఇంటర్నెట్ వృద్ధి మందగించడమన్న దాన్ని దేశ ఆర్థిక పరిస్థితికి ఒక సంకేతంగా చూడాలి’’ అని డిజిటల్ రైట్స్ క్యాంపెయినర్ నిఖిల్ పాహ్వా చెప్పారు.

రెండేళ్ల క్రితం వరకు సగటు స్మార్ట్‌ఫోన్ ధర రూ.15 వేలుగా ఉంటే, ఇది ఇప్పుడు రూ.22 వేలకు పెరిగినట్టు ఐడీసీ నవ్‌కేందర్ సింగ్ తెలిపారు.

భారత్ మార్కెట్ ఎక్కువగా ధరపై ఆధారపడి ఉంటుందన్నారు. ఇక్కడ అమ్ముడుపోయే 80 శాతం డివైజ్‌ల ధరలు రూ.20 వేల కంటే తక్కువగా ఉంటాయని చెప్పారు.

‘‘ఇదే అసలైన కారణం. ప్రపంచంలో రెండో అతిపెద్ద మొబైల్ ఫోన్ మార్కెట్ అయిన భారత్ స్మార్ట్‌ఫోన్ వాడకం ప్రస్తుతం చైనాకు దగ్గర్లో ఉంది. స్మార్ట్‌ఫోన్ వాడకంలో చైనాదే అతిపెద్ద మార్కెట్‌’’ అని సింగ్ తెలిపారు.

భారత స్మార్ట్‌ఫోన్ మార్కెట్ బఫర్ అయిందా? అని ఆశ్చర్యంగా ఉందని ప్లగ్ అండ్ ప్లే ఎంటర్‌టైన్‌మెంట్ ఫౌండర్ అనూజ్ గాంధీ అన్నారు.

చాలా మంది ప్రజలు పేదరికంలో నివసిస్తుంటే వృద్ధి ఎక్కడ్నుంచి వస్తుందని ప్రశ్నించారు.

భారత్‌లో 35 కోట్లకు పైగా ప్రజలు వద్ద ‘‘డంబ్‌ఫోన్లు’’ అంటే బేసిక్ హ్యాండ్‌సెట్లు లేదా ఫీచర్ ఫోన్లు ఉన్నాయి.

ఒకవేళ స్మార్ట్‌ఫోన్లు కొనగలిగే స్థాయిలో ఉంటే, వీరు వాటిలోకి మారతారు. వీరిలో సగం మంది ప్రజలు రూ.1,500 కంటే తక్కువ ధర ఉన్న డివైజ్‌లనే వాడుతున్నారు.

డివైజ్‌ల ధర, డేటా ఛార్జీలు అత్యధికంగా ఉండటంతో 2022లో కేవలం 3.5 కోట్ల భారతీయులు మాత్రమే ఫీచర్ ఫోన్ల నుంచి స్మార్ట్‌ఫోన్లలోకి అప్‌గ్రేడ్ అయినట్టు కౌంటర్‌పాయింట్‌కి చెందిన తరుణ్ పాఠక్ చెప్పారు.

కరోనా ముందు వరకు 6 కోట్ల మంది ఫీచర్ ఫోన్ యూజర్లు స్మార్ట్‌ఫోన్‌లోకి మారేవారని తెలిపారు. ఫీచర్ ఫోన్ నుంచి స్మార్ట్‌ఫోన్‌లోకి మారే సంఖ్య చాలా నెమ్మదించిందని చెప్పారు.

లెక్కల్లోకి తీసుకోని అనధికారిక సెకండ్ హ్యాండ్ మార్కెట్ వృద్ధి సాధిస్తోంది. ఈ మార్కెట్ చౌక స్మార్ట్‌ఫోన్ల అవసరాన్ని నెరవేరుస్తుంది. స్మార్ట్‌ఫోన్ డిమాండ్‌లో కొంత మేర సెకండ్ హ్యాండ్ మార్కెట్ భర్తీ చేస్తుందని సింగ్ తెలిపారు.

ఇంటర్నెట్ వృద్ధి

ఫొటో సోర్స్, Getty Images

ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజలకు చేరడం కష్టమే

ఇంటర్నెట్ వృద్ధి నెమ్మదించడమన్నది భారత్‌కు అంత మంచి వార్త కాదు. స్మార్ట్‌ఫోన్ లేకపోతే, ప్రభుత్వ సంక్షేమ పథకాలు పొందేందుకు, రేషన్లు, వ్యాక్సీన్లు వంటివి చేరేందుకు కష్టతరమవుతుంది.

ప్రభుత్వానికి చెందిన రియల్ టైమ్ నగదురహిత లావాదేవీల వేదిక అయిన యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్(యూపీఐ) ద్వారానే ఈ నెలలో ప్రతి రోజూ 25 కోట్లకు పైగా లావాదేవీలు నమోదయ్యాయి.

మొబైల్ యాప్‌లను వాడుతూనే ఈ లావాదేవీలను చేసుకునేందుకు వీలుంటుంది.

2025 నాటికి తక్కువ నగదు, తక్కువ కార్డు సమాజాన్ని చేరుకోవాలని ఆర్‌బీఐ భావిస్తోంది.

 ఫోన్లు, ఇంటర్నెట్‌ల భవిష్యత్ వృద్ధికి చెందిన అంతరాయాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. గ్రామాల్లో వైర్‌లెస్ బ్రాడ్‌బ్యాండ్ సబ్‌స్క్రయిబర్ల సంఖ్య తగ్గిపోయింది. యాక్టివ్ ఇంటర్నెట్ వాడక వృద్ధి రేటు కూడా తగ్గింది.

‘‘గత కొన్నేళ్ల నుంచి ఇది తగ్గుతూ వస్తుంది. 2020లో గత నాలుగేళ్లలో కనిష్ట స్థాయిలను నమోదు చేసింది’’ అని డేటా అనలిటిక్స్ కంపెనీ కాంటర్, ఇంటర్నెట్ అండ్ మొబైల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా(ఐఏఎంఏఐ)ల అధ్యయనం తెలిపింది.

అమ్మాయిలతో పోలిస్తే అబ్బాయిలే ఎక్కువగా స్మార్ట్‌ఫోన్లను వాడుతూ, ఇంటర్నెట్‌ను ఉపయోగిస్తున్నారు.

గ్రామాల్లోని ప్రజలు ఇప్పటికీ తమ ఇళ్లలో ఒకటే డివైజ్‌ను వాడుతున్నారు.

ఇంటర్నెట్ వృద్ధి నెమ్మదించడానికి కేవలం స్మార్ట్‌ఫోన్ ధరలు పెరగడం మాత్రమే కాదని పాహ్వా అన్నారు.

గ్రామీణ భారతంలో భాష, అక్షరాస్యత మధ్యనున్న అంతరాయాలను చాలా యాప్‌లు, సర్వీసులు పరిష్కరించాల్సి ఉంది.

చాలా వరకు ఇంటర్నెట్ సేవలు ఇంగ్లీష్‌లోనే లభిస్తున్నాయి. కొన్ని మాత్రమే భారతీయ భాషల్లో అందుబాటులో ఉంటున్నాయని పాహ్వా చెప్పారు

పేటీఎం సౌండ్‌బాక్స్ మాదిరి మరిన్ని నూతనావిష్కరణలు రావాల్సినవసరం ఉంది. ఈ పేమెంట్ యాప్ ద్వారా స్వీకరించే ప్రతి పేమెంట్‌కి 11 భాషల్లో అమ్మకందారులకు ఆడియో ద్వారా లావాదేవీ పూర్తయినట్టు తెలుస్తుంది.

గ్రామీణ భారతంలో ఇంటర్నెట్ వృద్ధి కోసం మరిన్ని నూతన ఆవిష్కరణలు రావాల్సి ఉందని పాహ్వా అన్నారు. కానీ, దీని కంటే ముందే స్మార్ట్‌ఫోన్ అమ్మకాలు పెరగాల్సి ఉంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)