Made in India iPhone: చైనా నుంచి భారత్‌కు మారిన కొత్త ఐఫోన్ల తయారీ.. యాపిల్ ప్రకటన

ఫొటో సోర్స్, APPLE
- రచయిత, అరుణోదయ ముఖర్జీ, మోనియా మిల్లర్
- హోదా, బీబీసీ ప్రతినిధులు
తమ ఉత్పత్తుల సరఫరా వ్యవస్థను చైనా వెలుపల కూడా విస్తరించే కార్యక్రమంలో భాగంగా ఐఫోన్ 14 తయారీని భారతదేశంలో ప్రారంభించినట్లు యాపిల్ సంస్థ తెలిపింది.
యాపిల్ సంస్థ తన ఉత్పత్తుల్లో చాలావాటిని చైనాలోనే తయారు చేస్తుంటుంది. అయితే, అమెరికా, చైనా దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో ఈ అమెరికా కంపెనీ కొన్ని ఉత్పత్తుల తయారీని చైనా వెలుపలకు మారుస్తోంది.
కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు చైనా జీరో కోవిడ్ విధానాన్ని అనుసరిస్తోంది. దీంతో దేశవ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో విస్తృతంగా లాక్‌డౌన్లను అమలు చేస్తోంది. దీనివల్ల చాలా వ్యాపారాలు దెబ్బతిన్నాయి.
యాపిల్ సంస్థ తన సరికొత్త ఐఫోన్‌ను ఈ నెలలోనే ప్రకటించింది.
''సరికొత్త ఐఫోన్ 14లో అత్యాధునిక సాంకేతికతలు, కీలకమైన భద్రతా సామర్థ్యాలు ఉంటాయి. ఇలాంటి ఫోన్‌ను భారత్‌లో తయారు చేయడం మాకెంతో సంతోషంగా ఉంది'' అని యాపిల్ సంస్థ ఒక ప్రకటనలో పేర్కొంది.
తైవాన్‌కు చెందిన ఫాక్స్‌కాన్ సంస్థ భారతదేశంలో తమిళనాడు రాష్ట్రంలో 2017 నుంచి యాపిల్ ఫోన్లను తయారు చేస్తోంది. అయితే, పాతతరం ఐఫోన్లనే ఇక్కడ తయారు చేసేవారు.
ఇప్పుడు కొత్తగా మార్కెట్లోకి రానున్న ఫోన్లను కూడా భారతదేశంలోనే తయారు చేయాలని యాపిల్ సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది.
భారతదేశంలో ఐఫోన్ల తయారీ అనే నిర్ణయాన్ని యాపిల్ తీసుకోవడానికి దేశంలో తన ఉత్పత్తుల విక్రయాలను పెంచుకునేందుకు చేస్తున్న ప్రయత్నంగా కూడా చూడొచ్చు. ఎందుకంటే గతేడాది గణాంకాల ప్రకారం భారతదేశంలో స్మార్ట్ ఫోన్ల విక్రయాల్లో యాపిల్ వాటా కేవలం 4 శాతం.
అమెరికా దిగ్గజ సంస్థ అయిన యాపిల్ భారతదేశంలో చాలా తక్కువ ధరల్లోనే స్మార్ట్ ఫోన్లు అందిస్తున్న దక్షిణ కొరియా, చైనా కంపెనీలతో పోటీపడలేకపోతోంది. ప్రస్తుతం భారత మార్కెట్‌లో దక్షిణ కొరియా, చైనా దేశాల కంపెనీలదే పైచేయిగా ఉంది.
ఐఫోన్ల ధరలు తగ్గుతాయా?
భారతదేశంలో తయారు చేస్తున్నంత మాత్రాన ఐఫోన్ల ధరలు తగ్గే అవకాశాలు లేవు. ఎందుకంటే ఐఫోన్ల విడిభాగాలను దిగుమతి చేసుకోవాల్సి ఉంటుంది. వాటిపై అధిక మొత్తంలో సుంకాలు, ఇతర పన్నులు ఉంటాయి.
తాము వినియోగించే ఐఫోన్లపై 'మేడిన్ ఇండియా' అన్న ముద్రను భారతీయులు చూడొచ్చు. కానీ, వాటిని సొంతం చేసుకునేందుకు మాత్రం ఎప్పట్లాగే ఎక్కువ ఖర్చు చేయాల్సి ఉంటుంది.
అయితే, ఐఫోన్ తన ఉత్పత్తులను భారతదేశంలో తయారు చేస్తామంటూ చేసిన ప్రకటన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వానికి విజయం.
భారతదేశంలో ఉత్పత్తి, ఎగుమతిని ప్రోత్సహించేందుకు ఎనిమిదేళ్ల కిందట మోదీ ప్రభుత్వం 'మేకిన్ ఇండియా' కార్యక్రమాన్ని ప్రారంభించింది.
కాగా, యాపిల్ సంస్థ తాజా ప్రకటనను చైనా, అమెరికా దేశాల మధ్య తైవాన్, వాణిజ్య సంబంధాల విషయంలో పెరుగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో చూడాల్సి ఉంటుంది. ఈ ఉద్రిక్తతల కారణంగా తమ ఉత్పత్తుల సరఫరా వ్యవస్థలు దెబ్బతినకుండా చూసేందుకు యాపిల్ సంస్థ ఈ నిర్ణయం తీసుకుంది.
ఈనెల మొదట్లో జేపీ మోర్గాన్ పెట్టుబడి బ్యాంకులోని అనలిస్టులు కొందరు యాపిల్ సంస్థ దాదాపు 5 శాతం ఐఫోన్ల తయారీని భారతదేశానికి తరలించే అవకాశం ఉందని చెప్పారు.
2025 నాటికి ఐఫోన్ల తయారీలో పావు వంతు భారతదేశంలోనే జరగొచ్చని కూడా జేపీ మోర్గాన్ నివేదిక అంచనా వేసింది.
ఇవి కూడా చదవండి:
- ఇరాన్: యాభైఏళ్ల కిందటే అత్యాధునిక జీవితాన్ని చూసిన మహిళల జీవితాలు తర్వాత ఎలా మారిపోయాయి?
- పోల్‌పాట్ క్రూర పాలన: 20 లక్షలమందిని చంపిన కేసుల్లో నిందితులు ఎందరు, ట్రిబ్యునల్ ఏం సాధించింది
- నరేంద్ర మోదీ వరల్డ్ లీడర్ అయ్యారా, భారత్ అంతర్జాతీయ శక్తిగా మారిందా...
- ఆంధ్రప్రదేశ్: పొలంలో దిగి, వరి నాట్లు వేసిన కలెక్టర్లు... గట్టు మీదే భోజనాలు
- మక్కా: కాబాలోని ‘పవిత్ర నల్లని రాయి’ని తాకడంపై నిషేధం తొలగింపు.. ఈ పురాతన బ్లాక్ స్టోన్ కథ ఏంటి?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)
















