ఐఫోన్ల పనితీరును యాపిల్ కంపెనీ కావాలనే తగ్గిస్తోందన్న ఆరోపణలపై ఫ్రాన్స్ దర్యాప్తు!

ఫొటో సోర్స్, Reuters
ఒక వస్తువు జీవితకాలాన్ని ఉద్దేశపూర్వకంగా తగ్గించడం ఫ్రాన్స్‌లో నేరం. వినియోగదారులు ఆ వస్తువును మళ్లీ కొనేలా చేయాలన్న లక్ష్యంతో కంపెనీలు ఇలాంటి చర్యలకు పాల్పడితే ప్రభుత్వం చర్యలు తీసుకోవచ్చు.
పాత ఐఫోన్ల పనితీరును యాపిల్ కంపెనీ కావాలనే తగ్గించిందన్న ఆరోపణలు వచ్చాయి.
ఈ విషయాన్ని గత డిసెంబర్‌లో యాపిల్ కంపెనీ కూడా అంగీకరించింది.
ఫోన్ల బ్యాటరీ జీవితకాలం క్రమంగా తగ్గుతుందని, దానిపై అధిక ఒత్తిడి పడకుండా ఐఫోన్ల పనితీరును తగ్గించినట్లు యాపిల్ ప్రకటించింది.
ఈ అంశంపై ఫ్రాన్స్ వినియోగదారుల వేదిక 'స్టాప్ ప్లాన్డ్ అబ్సోలెన్సెస్'-హెచ్‌ఓపీ ఫిర్యాదు చేసింది.
దీంతో ఫ్రాన్స్ వినియోగదారుల రక్షణ ఏజెన్సీ, ఆర్ధిక శాఖ ఈ వివాదంపై దర్యాప్తు చేపట్టాయి.

ఫొటో సోర్స్, Getty Images
నేరం రుజువైతే యాపిల్ టర్నోవర్‌లో 5శాతం వరకు జరిమానా
ఐఫోన్ల పనితీరుపై దర్యాప్తు చేపట్టిన మూడో దేశం ఫ్రాన్స్. ఇదివరకే ఈ అంశంపై ఇజ్రాయెల్, అమెరికా విచారణ చేస్తున్నాయి.
కానీ ఫోన్ల పనితీరును ఉద్దేశపూర్వకంగా తగ్గించడాన్ని ఫ్రాన్స్‌లో నేరంగా పరిగణిస్తారు.
అలా చేసినట్లు రుజువైతే కంపెనీ మొత్తం టర్నోవర్‌లో 5శాతం వరకు జరిమానా విధిస్తారు. జైలు శిక్ష కూడా విధించొచ్చు.
ఐఫోన్ల పనితీరును యాపిల్ కావాలనే తగ్గించిందని ఫ్రాన్స్ వినియోగదారుల వేదిక హెచ్‌ఓపీ చెబుతోంది.
ఐఫోన్ 8 మోడల్ విడుదల చేసిన సమయంలోనే పాత ఐఫోన్ల పనితీరును సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ ద్వారా యాపిల్ తగ్గించిందని హెచ్‌ఓపీ వాదిస్తోంది.
వినియోగదారులు కొత్త ఫోన్ కొనాలనే ఉద్దేశంతోనే యాపిల్ ఇలా చేసిందని హెచ్‌ఓపీ ఆరోపిస్తోంది.
ప్రింటర్ కాట్రిడ్జ్‌ల జీవితకాలం తగ్గిస్తున్నారంటూ గతంలో ఎప్సన్, కెనన్, హెచ్‌పీ కంపెనీలపై హెచ్‌ఓపీ ఫిర్యాదు చేసింది.

ఫొటో సోర్స్, AFP
మరింత పారదర్శకంగా ఉంటాం: యాపిల్
ఐఫోన్‌ల పనితీరు క్రమంగా తగ్గుతోందని చాలాకాలంగా వినియోగదారులు చెబుతున్నారు.
తాజా పరిణామాల నేపథ్యంలో తమ సొంత ఐఫోన్లను లోతుగా పరీక్షించి, వాటి ఫలితాలను సోషల్ మీడియాలో పోస్టు చేశారు.
దీంతో వినియోగదారులకు యాపిల్ బహిరంగంగా క్షమాపణలు చెప్పింది.
హైస్పీడ్ ఆపరేషన్లకు సరిపడా శక్తిని అందించే సామర్థ్యం పాత బ్యాటరీలకు ఉండదని యాపిల్ చెబుతోంది. పాత ఫోన్ల జీవితకాలం మరింత పెంచేందుకే సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ విడుదల చేశామని వివరించింది.
వినియోగదారుల ఆగ్రహంతో బ్యాటరీ ధరలను యాపిల్ కంపెనీ భారీగా తగ్గించింది.
ఫోన్ల పనితీరు మెరుగు పరిచేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపింది.
భవిష్యత్‌లో మరింత పారదర్శకంగా ఉంటామని యాపిల్ హామీ ఇచ్చింది.
ఇవి కూడా చదవండి:
- #BBCSpecial ఇంటర్వ్యూ: హెబ్బార్స్ కిచెన్ సృష్టికర్త ఈవిడే
- ‘ఆడపిల్ల చదువుకు అంత ఖర్చు దేనికి?’.. ఈ ప్రశ్నకు కారణాలేంటి?
- హెచ్-1బీ: 'గ్రీన్ కార్డు రావాలంటే మరో 108 ఏళ్లు ఆగాలి'
- గూగుల్‌లో మీ వ్యక్తిగత సమాచారాన్ని ఇలా డిలీట్ చెయ్యండి!
- ఓల్డ్‌మాంక్ సృష్టికర్త మృతి
- గూగుల్‌లో మగవారిపై వివక్ష!
- ఏనుగులతో సెల్ఫీలు.. గాలిలో ప్రాణాలు!
- ఉత్తర కొరియా అధ్యక్షుడి భార్య ఎవరు?
బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.








