బీబీసీ ఇండియా: ‘మమ్మల్ని నేరుగా అడిగిన ప్రతి ప్రశ్నకూ సమాధానం చెప్తాం’

ఫొటో సోర్స్, REUTERS/Altaf Hussain
ఒక 'ప్రముఖ అంతర్జాతీయ మీడియా కంపెనీ కార్యాలయాల్లో' నిర్వహించిన సర్వే తరువాత అవకతవకలను గుర్తించినట్లు చెప్తూ ఇన్‌కం ట్యాక్స్(ఐటీ) విభాగం ఒక ప్రకటన జారీ చేసింది.
సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ (సీబీడీటీ) విడుదల చేసిన ఒక పేజీ ప్రకటనలో ఎక్కడా బీబీసీ పేరును ప్రస్తావించలేదు. కేంద్ర ఆర్థికశాఖ పరిధిలో సీబీడీటీ పని చేస్తుంది.
ఐటీ విభాగం చేసిన ఆరోపణలను సెంట్రల్ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో కూడా ప్రచురించింది. బీబీసీ కార్యాలయాల్లో చేపట్టిన సర్వేకు సంబంధించి ఐటీ విభాగం ఈ ప్రకటన జారీ చేసినట్లుగా కనిపిస్తోంది.
ఈ విషయంలో తమ సహకారాన్ని కొనసాగిస్తామని, ఐటీ విభాగం నుంచి తమకు నేరుగా అధికారికంగా ఎలాంటి సమాచారం అందినా దానికి అనుగుణంగా తాము స్పందిస్తామని బీబీసీ తెలిపింది.

ఫొటో సోర్స్, EPA
ఆదాయ పన్ను శాఖ శుక్రవారం నాడు జారీ చేసిన ప్రకటన బీబీసీ కార్యాలయాల్లో విచారణ గురించి చేసిన ప్రకటనగా భావిస్తున్నారు. ఈ ప్రకటనను ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (పీఐబీ) విడుదల చేసింది.
‘‘హిందీ, ఇంగ్లిష్, వివిధ ఇతర భారతీయ భాషల్లో కంటెంట్ కార్యకలాపాలు నిర్వహించే ఒక ప్రముఖ అంతర్జాతీయ మీడియా కంపెనీ’’కి చెందిన దిల్లీ, ముంబై కార్యాలయాల్లో ‘‘సర్వే’’ నిర్వహించామని ఆ ప్రకటనలో పేర్కొన్నారు.
ఆ సంస్థ విభాగాలు వెల్లడించిన ఆదాయం, లాభాలు (వివరాలు).. ‘‘భారతదేశంలో కార్యకలాపాల విస్తృతికి అనుగుణంగా లేవ’’న్నారు.
దిల్లీ, ముంబయి నగరాల్లోని బీబీసీ కార్యాలయాల్లో ఐటీ అధికారులు మంగళవారం మధ్యాహ్నం నుండి గురువారం రాత్రి వరకూ ‘సర్వే’ నిర్వహించారు. వివిధ రకాల డాక్యుమెంట్లను పరిశీలించారు. కొందరు బీబీసీ ఉద్యోగులను వారు ప్రశ్నించారు.
మీడియా/చానల్ కార్యకలాపాలకు ఎలాంటి ఆటంకం కలిగించని విధంగా సర్వే ఆపరేషన్ కొనసాగిందని ఐటీ అధికారులు ఈ ప్రకటనలో తెలిపారు.
అయితే, సర్వే జరుగుతున్న సమయంలో బీబీసీ జర్నలిస్టులకు కొన్ని గంటల పాటు పని చేసుకునేందుకు అనుమతి ఇవ్వలేదని బీబీసీ తెలిపింది.
"ఆదాయ పన్ను శాఖ అధికారులు, పోలీసులు చాలా మంది జర్నలిస్టులతో అనుచితంగా ప్రవర్తించారు. జర్నలిస్టుల కంప్యూటర్లను సెర్చ్ చేశారు. ఫోన్లను పక్కన పెట్టాలని ఆదేశించారు. వారు పని చేసే పద్ధతి ఏమిటని అడిగారు. అంతేకాకుండా, ఈ సర్వే గురించి ఏమ రాయకూడదని దిల్లీ ఆఫీసులోని జర్నలిస్టులను అడ్డుకున్నారు. సీనియర్ జర్నలిస్టులను ప్రశ్నించిన తరువాతే పని చేసుకోవడానికి అనుమతి ఇచ్చినప్పటికీ, హిందీ, ఇంగ్లిష్ జర్నలిస్టులను మాత్రం చాలా సేపు ఆగమని చెప్పారు.ఈ రెండు భాషల జర్నలిస్టులను బ్రాడ్‌కాస్టింగ్ టైమ్ బాగా దగ్గర పడిన తరువాత కానీ పని చేసుకోవడానికి అనుమతించలేదు" అని బీబీసీ తెలిపింది.
‘‘అధికారులకు మేం పూర్తిగా సహకరిస్తూనే ఉంటాం. ఈ అంశం త్వరలోనే పరిష్కారమవుతుందని ఆశిస్తున్నాం’’ అని బీబీసీ సర్వే ముగిసిన తరువాత విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది.
‘‘మా సిబ్బందికి అండగా ఉంటున్నాం. కొందరిని చాలా సేపు ప్రశ్నించారు. మరికొందరు రాత్రిళ్లు కూడా కార్యాలయంలో ఉండాల్సి వచ్చింది. మా సిబ్బంది సంక్షేమం మాకు అత్యంత ముఖ్యం. మా కార్యకలాపాలు మళ్లీ యథావిధిగా జరుగుతున్నాయి. భారతదేశంలోని, బయట ఉన్న మా ప్రేక్షకులు, పాఠకులకు వార్తలు అందించేందుకు మేం కట్టుబడి ఉన్నాం’’ అని పేర్కొంది.
‘‘బీబీసీ విశ్వసనీయమైన స్వతంత్ర మీడియా సంస్థ. ఎలాంటి భయం, పక్షపాతం లేకుండా వార్తలు రిపోర్ట్ చేసే మా జర్నలిస్టులు, సహోద్యోగులకు మేం ఎప్పుడూ అండగా నిలబడతాం’’ అని తెలిపింది.

ఫొటో సోర్స్, Reuters
బీబీసీ కార్యాలయాల్లో ఐటీ విభాగం చేపట్టిన 'సర్వే' మీద దేశీయంగా, అంతర్జాతీయంగా అనేక విమర్శలు వచ్చాయి. దీన్ని 'పత్రికా స్వేచ్ఛ మీద దాడి'గా ప్రతిపక్షాలు పేర్కొన్నాయి.
భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై విమర్శనాత్మకంగా ఉన్న ఒక డాక్యుమెంటరీని బీబీసీ బ్రిటన్‌లో ప్రసారం చేసిన కొన్ని వారాల తర్వాత బీబీసీకి చెందిన దిల్లీ, ముంబై కార్యాలయాల్లో ఈ సర్వే జరిగింది.
ప్రధాని నరేంద్ర మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో, 2002లో ఆ రాష్ట్రంలో జరిగిన మత ఘర్షణలపై ఆ డాక్యుమెంటరీని బీబీసీ రూపొందించింది.
బీబీసీ డాక్యుమెంటరీ 'ఇండియా: ది మోదీ క్వశ్చన్' కేవలం యూకేలో మాత్రమే ప్రసారం అయినప్పటికీ, ఆ డాక్యుమెంటరీ ''వలసవాద మనస్తత్వం''తో కూడిన ''శత్రుపూరిత దుష్ప్రచారం, భారత వ్యతిరేక చెత్త'' అని భారత ప్రభుత్వం అభివర్ణించింది. ఈ డాక్యుమెంటరీని ప్రజలు ఆన్‌లైన్‌లో షేర్ చేయకుండా అడ్డుకోవటానికి ప్రభుత్వం ప్రయత్నించింది.
గత నెలలో ఈ డాక్యుమెంటరీని వీక్షించటానికి గుమిగూడిన విద్యార్థులను దిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు.

ఇవి కూడా చదవండి:
- మహా శివరాత్రి: మానవాకారంలో శివుడు ఎక్కడ ఉన్నాడు?
- విటమిన్ డి లోపం ఎందుకు వస్తుంది, ఇది తగ్గాలంటే ఏం చేయాలి?
- పాంగొలిన్: ప్రపంచంలో అత్యధికంగా వేటకు బలయ్యే జంతువు ఇది.. దీని పొలుసులకు ఎందుకంత డిమాండ్?
- సార్ సినిమా రివ్యూ : మాస్టారు పాఠం మనసుల్ని గెలిచిందా...లేదా?
- వారణాసి: మేకలకు సైతం బొట్టు పెట్టి పూజించే ఈ నగరాన్ని చూసిన ఒక విదేశీయుని అనుభవం ఏంటి
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)












