పాంగొలిన్: ప్రపంచంలో అత్యధికంగా వేటకు బలయ్యే జంతువు ఇది.. దీని పొలుసులకు ఎందుకంత డిమాండ్?

పాంగొలిన్

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, హెలిన్ బ్రిగ్స్
    • హోదా, బీబీసీ న్యూస్

ప్రపంచంలో ఎక్కువగా అక్రమంగా తరలించే క్షీరదాల జాబితాలో పాంగొలిన్ మొదటి స్థానంలో ఉంటుంది.

2000-2019 మధ్య దాదాపు 9 లక్షల పాంగొలిన్లను అక్రమంగా రవాణా చేశారని ది ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ వెల్లడించింది.

మరోవైపు 2019లో మలేసియాలో 27 టన్నుల పాంగొలిన్ మాంసం, పొలుసులను అధికారులు బొర్నియోలో స్వాధీనం చేసుకున్నారు. వీటి మొత్తం విలువ 1.6 మిలియన్ పౌండ్లు (1.9 కోట్లు) వరకు ఉంటుందని అంచనా.

మనుషులపై దాడి కూడా చేయని ఈ జంతువులను ఎందుకు ఇంతలా వేటాడుతున్నారు? వీటిని ఎందుకు అక్రమంగా తరలిస్తున్నారు.

పాంగొలిన్

ఫొటో సోర్స్, TRAFFIC

పాంగొలిన్‌ల ప్రత్యేకత ఏమిటి?

పాంగొలిన్‌లను ‘‘స్కేలీ యాంట్‌ఈటర్స్’’ అని కూడా పిలుస్తుంటారు. ప్రపంచంలో పొలుసులుండే ఏకైక క్షీరదం ఇదే.

వీటి పొలుసుల్లో కెరాటిన్‌ ఉంటుంది. మనుషుల గోర్లలోనూ కెరాటిన్ కనిపిస్తుంది.

పొడవైన నాలుకతో ఇవి చీమలు, చిన్నచిన్న పురుగులను తింటుంటాయి.

పాంగొలిన్‌లో నాలుగు రకాలు ఆసియాలో కనిపిస్తుంటాయి. ఇండియన్ పాంగొలిన్, ఫిలిప్పీన్ పాంగొలిన్, సుండా పాంగొలిన్, చైనీస్ పాంగొలిన్‌గా వీటిని పిలుస్తుంటారు.

ఆఫ్రికాలోని భూమధ్య రేఖ ప్రాంతంలోని గడ్డిభూముల్లో కనిపించే ‘‘జయంట్ పాంగొలిన్’’ దాదాపు 1.8 మీటర్ల పొడవుతో 30 కేజీల బరువు ఉంటాయి.

పాంగొలిన్

ఫొటో సోర్స్, TRAFFIC

ఎందుకు అంత డిమాండ్?

పాంగొలిన్ పొలుసులకు చాలా డిమాండ్ ఎక్కువ. వీటిని చైనా సంప్రదాయ వైద్యంలో ఉపయోగిస్తుంటారు. ఇవి ఆస్థమా, క్యాన్సర్ లాంటి వ్యాధులపై చికిత్సలో ఉపయోగపడతాయని అక్కడి ప్రజల నమ్మకం. అయితే, అధ్యయనాల్లో దీన్ని రుజువుచేసే ఫలితాలేమీ కనిపించలేదని వైద్యులు చెబుతున్నారు.

మరోవైపు వీటి మాంసానికి కూడా డిమాండ్ ఎక్కువ. చాలా ఆసియా దేశాల్లో మాంసం కోసం కూడా వీటిని వేటాడుతుంటారు.

పాంగొలిన్‌ల సంరక్షణ కోసం వియత్నాంకు చెందిన థాయ్ వాన్ ఇంగుయెన్ కృషిచేస్తున్నారు. దీని కోసం ఆయన 2014లో వియత్నాం ‘‘వైల్డ్‌ లైఫ్’’అనే సంస్థను కూడా మొదలుపెట్టారు. ఇప్పటివరకు ఆయన 1500కుపైగా పాంగొలిన్‌లను రక్షించారు.

వియత్నాంలో మొట్టమొదటి పాంగొలిన్ పునరావాసం కేంద్రాన్ని కూడా థాయ్ వాన్ ఏర్పాటు చేశారు. ఇది దాదాపు 500 పాంగొలిన్లను తిరిగి అడవుల్లోకి పంపింది.

‘‘పాంగొలిన్లు ప్రతిఘటించే జంతువులు కాదు కాబట్టి వేటగాళ్లు వీటిని చాలా సులభంగా వేటాడగలరు. వీటి శరీరంపై ఉండే గట్టి పొలుసుల వల్ల పులులు సైతం పాంగొలిన్లను తినలేవు. ఇవి చాలా ప్రత్యేకమైనవి. మనకు ఎలాంటి హానీ చేయవు. కరిచేవి కూడా కావు. కానీ మానవులే వేటాడుతూ వాటికి ప్రమాదకరంగా మారుతున్నారు’’అని ఆయన చెప్పారు.

పాంగొలిన్

ఫొటో సోర్స్, Chester Zoo

వీటి జీవితం ఎలా ఉంటుంది?

పాంగొలిన్‌ల జీవితం ఎలా ఉంటుంది?, ఇవి ఎలా ప్రవర్తిస్తాయి? లాంటి అంశాలను తెలుసుకునేందుకు ఆఫ్రికాలోని యుగాండాలో ఒక పరిశోధన చేపట్టారు. దీని కోసం ప్రత్యేక కెమెరాలు ఏర్పాటుచేశారు.

ఈ దృశ్యాలు ఒక తల్లి పాంగొలిన్‌ వీపుపై ఒక పిల్ల పాంగొలిన్ కూర్చొని కనిపించింది. మరోవైపు ఒక పెద్ద పాంగొలిన్ చెట్టు ఎక్కుతూ కనిపించింది.

పాంగొలిన్

ఫొటో సోర్స్, Chester Zoo

జివా జంతువుల పరిరక్షణ కేంద్రంలో ఈ దృశ్యాలను రికార్డు చేశారు. ఇక్కడ రైనోలతో కలిసి ఇవి జీవిస్తున్నాయి. వీటిని వేటాడకుండా ఇక్కడ పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నారు.

‘‘అసలు ఇవి ఎలా ప్రవరిస్తాయో మనకు స్పష్టమైన సమాచారం అందుబాటులో లేదు. వీటి ప్రవర్తనను మనం గమనిస్తే, వీటి సంరక్షణకు మెరుగ్గా మనం చర్యలు తీసుకోవచ్చు’’అని జివా జంతువుల పరిక్ష కేంద్రానికి చెందిన స్టువార్ట్ నిక్సన్ చెప్పారు. ఆయన యుగాండా వైల్డ్ లైఫ్ అథారిటీ, రైనో ఫండ్ యుగాండాతో కలిసి ఈ ప్రాజెక్టుపై పనిచేస్తున్నారు.

వీడియో క్యాప్షన్, పులులు కూడా తినలేని జంతువు ఇది..

కొత్త టెక్నాలజీ

‘‘పాంగొలిన్‌ల సంఖ్య వేగంగా తగ్గిపోతోంది. మధ్య ఆఫ్రికాలోని ప్రాంతాల్లో ఇవి అసలు కనిపించడం లేదు. వీటిని సంరక్షించేందుకు ప్రజలు కలిసి పనిచేయాల్సిన అవసరముంది’’అని నిక్సన్ చెప్పారు.

‘‘అక్రమ రవాణాకు గురవుతున్న పాంగొలిన్‌లను రక్షించేందుకు ఈ ప్రాజెక్టు ఉపయోగపడే అవకాశముంది’’అని యుగాండా వైల్డ్ లైఫ్ అథారిటీకి చెందిన శామ్ వాంధా తెలిపారు.

మరోవైపు పాంగొలిన్‌ అక్రమ రవాణాను అడ్డుకునేందుకు ఇంగ్లండ్‌లోని పోర్ట్స్‌మత్ యూనివర్సిటీ పరిశోధకుల బృందం ఒక కొత్త టెక్నాలజీని అభివృద్ధి చేసింది.

వీడియో క్యాప్షన్, క్షీరద జాతి ప్రాణి పాంగొలిన్‌కు పొంచి ఉన్న ముప్పు

ఈ టెక్నాలజీ సాయంతో.. పాంగొలిన్ పొలుసుల మీద మనిషి వేలిముద్రలను తేలిగ్గా గుర్తించొచ్చు. దీంతో అక్రమ రవాణా చేసేవారితోపాటు వేటగాళ్లను కూడా గుర్తించే అవకాశముంది.

మరోవైపు పాంగొలిన్‌లను సంరక్షించకపోతే పర్యావరణ సమతులత్య దెబ్బతింటుందని, ఫలితంగా ఊహించని పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని థాయ్ వాన్ ఇంగుయెన్ హెచ్చరించారు.

బీబీసీ ఐస్వోటీ

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)