బీబీసీకి 100 ఏళ్ళు: శతాబ్ద కాలంలో 10 కీలక ఘట్టాలు

బీబీసీ

బ్రిటిష్ బ్రాడ్‌కాస్టింగ్ కార్పొరేషన్ (బీబీసీ) 100వ పుట్టిన రోజు జరుపుకుంటోంది.

నేడు ప్రపంచంలోనే అతిపెద్ద బ్రాడ్‌కాస్టర్‌గా పేరుపొందిన బీబీసీ.. ఇంగ్లండ్‌ రాజధాని లండన్‌లో 1922 అక్టోబరు 18న అధికారికంగా ప్రారంభమైంది. దీని వెనుక సుదీర్ఘమైన, ఆసక్తిని రేకిత్తెంచే, అద్వితీయమైన చరిత్ర ఉంది.

బీబీసీ వందో వార్షికోత్సవాన్ని జరుపుకొంటున్న నేపథ్యంలో సంస్థ చరిత్రలో మైలురాళ్లుగా నిలిచిన కొన్ని చరిత్రాత్మక ఘట్టాలు, పరిణామాలను ఇప్పుడు చూద్దాం.

1. తొలి బీబీసీ రేడియో స్టేషన్

బీబీసీ రేడియో

వరుసగా చిన్నచిన్న రేడియో స్టేషన్లు మూతపడుతున్న తరుణంలో ఇంగ్లండ్‌లోని లండన్‌లో 1922 నవంబరు 14న తొలి రేడియో సర్వీస్‌ను బీబీసీ ప్రారంభించింది.

స్థానిక కాలమానం ప్రకారం, సాయంత్రం ఆరు గంటలకు ఒక న్యూస్ బులిటెన్ ప్రసారమైంది. దీనికి అవసరమైన వార్తలను కొన్ని న్యూస్ ఏజెన్సీలు అందించాయి. ఆ తర్వాత బ్రిటన్‌లోని నేషనల్ మెటిరోలాజికల్ సర్వీస్ అందించిన వాతావరణ సమాచారాన్ని ప్రసారం చేశారు.

ఈ బులిటెన్‌లను ఇంగ్లిష్‌లో ప్రొగ్రామ్ డైరెక్టర్ ఆర్థర్ బరోస్ చదివి నిపించారు. రెండుసార్లు ఈ వార్తలను ఆయన చదివారు. మొదట ఆయన వేగంగా చదివారు. ఆ తర్వాత ఎవరైనా కావాలంటే నోట్స్ తీసుకోవడానికి వీలుగా కాస్త నెమ్మదిగా చదివారు.

2. వరల్డ్ సర్వీస్ అలా మొదలైంది..

కింగ్ జార్జి 5

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, కింగ్ జార్జి 5

1932 డిసెంబరు 19న బ్రిటన్‌తోపాటు ప్రపంచంలోని భిన్న ప్రాంతాల్లోని తమ వలస పాలిత ప్రజలకు కింగ్ జార్జి 5 ఇచ్చిన క్రిస్మస్ సందేశాన్ని బీబీసీలో ప్రసారం చేశారు.

బ్రిటిష్ సామ్రాజ్యంలోని ఇంగ్లిష్ మాట్లాడే ప్రజలే లక్ష్యంగా ఆ ప్రసారాలు జరిగాయి. ‘‘మంచు, ఎడారులతోపాటు సముద్రాల అవతల ఉండే ప్రజలకు సందేశాన్ని ఇచ్చేందుకు’’ ఈ సర్వీస్ తోడ్పడుతోందని కింగ్ జార్జి వ్యాఖ్యానించారు.

ఆయన ప్రసంగంతోనే బీబీసీ ఎంపైర్ సర్వీస్ మొదలైంది. ఇదే తర్వాత కాలంలో బీబీసీ వరల్డ్ సర్వీస్‌గా రూపాంతరం చెందింది.

కింగ్ చార్లెస్, క్వీన్ కామిలాలతో బీబీసీ అఫ్గాన్ సీనియర్ ప్రెజెంటర్ సనా సఫీ

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, కింగ్ చార్లెస్, క్వీన్ కామిలాలతో బీబీసీ అఫ్గాన్ సీనియర్ ప్రెజెంటర్ సనా సఫీ

భాషలు, ప్రేక్షకులు, ప్రాంత పరిధిలో నేడు బీబీసీ వరల్డ్ సర్వీస్ ప్రపంచంలోనే అతిపెద్ద బ్రాడ్‌కాస్టర్.

ప్రపంచ వ్యాప్తంగా 40కిపైగా భాషల్లో ఆన్‌లైన్, సోషల్ మీడియా, టీవీ, రేడియోల్లో బీబీసీ ప్రసారాలు జరుగుతున్నాయి.

3. బీబీసీ మార్కు మైక్రోఫోన్

బీబీసీ

1930ల్లో మార్కెట్‌లో అందుబాటులో ఉండే మైక్రోఫోన్లు చాలా ఖరీదైనవి. దీంతో తమ కోసం సొంతంగా మైక్రోఫోన్‌లు తయారు చేయించుకునేందుకు మార్కోనీ సంస్థతో బీబీసీ ఒప్పందం కుదుర్చుకుంది.

అలా 1934లో మార్కెట్‌లోకి వచ్చిన ‘‘టైప్ ఏ మైక్రోఫోన్’’ బ్రాడ్‌కాస్టింగ్ రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చింది.

ఆ తర్వాత కాలంలో ఈ మైక్రోఫోన్‌ను చాలా మెరుగుపరిచారు. దీన్ని అంతా బీబీసీ మైక్రోఫోన్‌గా పిలిచేవారు. బ్రిటిష్ సినిమాలు, నాటకాల్లో ఇది అప్పుడప్పుడు కనిపిస్తుంటుంది.

4. బీబీసీ తొలి విదేశీ రేడియో సర్వీస్‌గా బీబీసీ అరబిక్

అహ్మద్ కమాల్ సొరోర్ ఎఫెండీ
ఫొటో క్యాప్షన్, అహ్మద్ కమాల్ సొరోర్ ఎఫెండీ

1938లో బీబీసీ తొలి విదేశీ భాషా రేడియో సర్వీస్‌గా బీబీసీ అరబిక్ మొదలైంది. ఈజిప్షియన్ రేడియో కోసం ఆనాడు పనిచేస్తున్న అహ్మద్ కమాల్ సొరోర్ ఎఫెండీని ఈ సేవల కోసం బీబీసీ ప్రత్యేకంగా నియమించుకుంది.

ఎఫెండీ నియామకంతో బీబీసీ పేరు అప్పట్లో వార్తల్లో మార్మోగింది. అరబిక్ దేశాల్లో ఎఫెండీకి చాలా మంచి పేరుండేది.

ఆ తర్వాత మరికొన్ని భాషలు కూడా బీబీసీ సర్వీసుల్లో చేరాయి. మొదట్లో రేడియో, ఆ తర్వాత టీవీ ప్రోగ్రామ్‌ల ద్వారా ప్రపంచంలోని చాలా ప్రాంతాలకు బీబీసీ చేరువైంది.

బీబీసీ వరల్డ్ సర్వీస్

ఫొటో సోర్స్, Getty Images

బీబీసీ ఆన్‌లైన్ 1997లో మొదలైంది. ఆ తర్వాత చాలా భాషల్లో ఈ సేవలు మొదలయ్యాయి. సోషల్ మీడియా రాకతో బీబీసీ న్యూస్, బీబీసీ వరల్డ్ సర్వీస్ భాషలు కూడా భిన్న వేదికలపై తమ ఖాతాలు తెరిచాయి.

నేడు మళ్లీ డిజిటల్ ఫస్ట్ కంటెంట్ వ్యూహం దిశగా బీబీసీ వరల్డ్ సర్వీస్ అడుగులు వేస్తోంది.

5. బీబీసీ తొలి నల్లజాతి మహిళా ప్రొడ్యూసర్

ఊనా మార్సన్

బీబీసీ తొలి నల్లజాతి మహిళా ప్రొడ్యూసర్‌గా ఊనా మార్సన్ చరిత్ర సృష్టించారు.

జమైకాకు చెందిన ఆమెకు జర్నలిజంలో మంచి అనుభవముంది. 1939లో ఆమె బీబీసీలో చేరారు.

అలెగ్జాండ్ర ప్యాలెస్ టెలివిజన్ స్టూడియోలో అసిస్టెంట్‌గా ఆమె పనిచేసేవారు. 1941లో ఎంపైర్ ప్రోగ్రామ్స్ విభాగంలోని ప్రోగ్రామ్ అసిస్టెంట్‌గా ఆమె బీబీసీలో పూర్తికాల ఉద్యోగిగా చేరారు.

కవితలు అంటే ఆమెకు విపరీతమైన అభిమానం ఉండేది. కరీబియన్ వాయిస్‌గా పిలిచే వీక్లీ ఫీచర్ కోసం ఆమె పనిచేసేవారు.

6. రెండో ప్రపంచ యుద్ధం ముగింపు

రెండో ప్రపంచ యుద్ధం

ఫొటో సోర్స్, Getty Images

1945 మే 1న అడాల్ఫ్ హిట్లర్ ఆత్మహత్య చేసుకున్నట్లు బీబీసీ ప్రకటించింది. స్థానిక కాలమానం ప్రకారం సాయంత్రం ఏడు గంటలకు ప్రసారం అవుతున్న బులిటెన్‌ మధ్యలో.. ఇటలీలో జర్మనీ సేనలు లొంగిపోయినట్లు బీబీసీ వెల్లడించింది. మే 4న డెన్మార్క్‌లోనూ జర్మనీ సేనలు లొంగిపోయాయి. దీంతో దాదాపుగా ఘర్షణలు సద్దుమణిగినట్లయింది.

తర్వాత కొన్ని రోజులపాటు అసలు ఏం జరుగుతోందో ఎవరికీ తెలిసేది కాదు. మే 7న బకింగ్హమ్ ప్యాలెస్ వెలుపల పెద్దయెత్తున ప్రజలు గుమిగూడారు. ఏం జరుగుతుందో వారు తెలుసుకోవాలని అనుకున్నారు. అయితే, నాజీల వివాదం పూర్తిగా సద్దుమణిగిందని రష్యా, అమెరికాల నుంచి ధ్రువీకరణ కోసం ఆనాడు బ్రిటన్‌ ఎదురుచూస్తూ ఉండేది.

అయితే, సాయంత్ర ఆరు గంటలకు బ్రిటిష్ ప్రధాన మంత్రి చర్చిల్ ప్రసంగించబోవడంలేదని ప్రజలకు బీబీసీ వెల్లడించింది. కానీ, రాత్రి 7.40 కార్యక్రమాలు ప్రసారం అవుతుండగా.. మరుసటి రోజు ‘‘తొలి విక్టరీ ఇన్ యూరప్ లేదా వీఈ డే’’గా నిర్వహించబోతున్నారనే వార్తను బీబీసీ ప్రకటించింది.

అప్పటితో యూరప్‌లో యుద్ధం దాదాపుగా ముగిసింది. దీనిపై చర్చిల్ ఇచ్చిన సందేశాన్ని వినేందుకు భారీగా ప్రజలు బీబీసీ రేడియోను ట్యూన్ చేశారు. ఆ తర్వాత అంతా వేడుకలు చేసుకున్నారు.

పది రోజులపాటు బీబీసీ ప్రత్యేక కార్యక్రమాలను ప్రసారం చేసింది. 1937 తర్వాత తొలిసారిగా బీబీసీ సేవలకు విశేష ప్రజాదరణ లభించింది.

7. బీబీసీ టీవీ సేవలతో...

ద బీటెల్స్
ఫొటో క్యాప్షన్, ద బీటెల్స్

1967లో టీవీ ప్రోగ్రామ్ ‘‘అవర్ వరల్డ్’’ చరిత్ర సృష్టించింది.

ఈ కార్యక్రమం ప్రసారం కాకముందు, శాటిలైట్ సాయంతో టెలివిజన్ సేవలు కొన్ని ప్రాంతాలకు మాత్రమే పరిమితమై ఉండేవి. ఉదాహరణకు 1936లో ‘‘హై డెఫినిషన్’’ టెలివిజన్ సేవలను ప్రసారం చేసే తొలి బ్రాడ్‌కాస్టర్ బీబీసీ మాత్రమే.

కానీ ‘‘అవర్ వరల్డ్’’ మాత్రం భిన్నమైనది. దీనిలో తొలిసారి శాటిలైట్ సేవలతో ప్రపంచంలో భిన్న ప్రాంతాలను అనుసంధానించే ప్రయత్నం జరిగింది. దీనిలో ‘‘లైవ్‌ ఆన్ టెలివిజన్’’ సేవలతోపాటు భిన్న కార్యక్రమాలను ప్రసారం చేసేవారు.

ఈ షోలో భాగంగా బ్రిటన్ నుంచి బీటెల్స్ బ్యాండ్.. ‘‘ఆల్ యు నీడ్ ఈజ్ లవ్’’ సాంగ్‌ ప్రదర్శన ఇచ్చింది. ఆ తర్వాత మార్కెట్లోకి విడుదల చేసిన ఈ సాంగ్‌కు విశేష ప్రజాదరణ లభించింది.

ఎప్పటికీ మరచిపోలేని, ప్రపంచంలోని భిన్న ప్రాంతాలను అనుసంధానించే కార్యక్రమాలకు ఈ షో వేదికైంది. దీనిలో భాగంగానే లైవ్ ఎయిడ్ ప్రోగ్రామ్ ప్రసారమైంది.

లైవ్ ఎయిడ్

ఫొటో సోర్స్, Getty Images

ఇథియోపియాలో కరవు నుంచి ప్రజలను రక్షించేందుకు ఆర్థిక సాయం చేయాలంటూ ప్రసారమైన ఈ కార్యక్రమంలో భాగంగా బాబ్ గెల్డాఫ్, మిడ్జ్ యూరే ప్రత్యేక ప్రదర్శన ఇచ్చారు.

ఈ షో విజయవంతం కావడంలో బీబీసీ ప్రధాన పాత్ర పోషించింది. అప్పట్లో భిన్న ప్రాంతాల్లో శాటిలైట్ లింక్-అప్స్, టెలివిజన్ బ్రాడ్‌కాస్ట్‌లతో బీబీసీ సేవలు విస్తరించాయి. సంస్థ లైవ్ బ్రాడ్‌కాస్ట్‌లను 60కుపైగా దేశాల్లోని 40 కోట్లమందికిపైగా ప్రేక్షకులు చూసేవారు.

8. విషపూరితమైన గొడుగు

జార్జి మక్రోవ్

ఫొటో సోర్స్, International Spy Museum

బీబీసీ వరల్డ్ సర్వీస్ జర్నలిస్టు జార్జి మార్కోవ్ మరణానికి కారణమైన ఆయుధం ఈ గొడుగు రూపంలో పైన కనిపిస్తోంది.

1978 సెప్టెంబరు 7న మార్కోవ్ లండన్‌లోని బీబీసీ కార్యాలయానికి వస్తుండగా వెనుక నుంచి ఒక వ్యక్తి గొడుకు తెరచినట్లు వీపుపై ఆ విషపూరిత గొడుతో కొట్టారు. ఆ తర్వాత ఆ వ్యక్తి అక్కడి నుంచి పారిపోయాడు.

తీవ్ర అనారోగ్యానికి గురైన మార్కోవ్ ఆసుపత్రిలో చేరారు. ఆ తర్వాత విచారణలో బల్గేరియా సీక్రెట్ సర్వీస్‌తో సంబంధాలున్న ఆ వ్యక్తి.. గొడుగుతో ఆయనపై విషప్రయోగం చేసినట్లు సమాచారం బయటకువచ్చింది.

ఈ ఘటన తర్వాత మూడు రోజులకు, 49ఏళ్ల వయసులో మార్కోవ్ మరణించారు. ఆయనకు భార్య, రెండేళ్ల కుమార్తె ఉన్నారు.

మార్కోవ్ హత్య తర్వాత, బల్గేరియాలోని కమ్యూనిస్టు ప్రభుత్వం విమర్శలు ఎక్కువయ్యాయి.

ఆ తర్వాత వెలుగులోకి వచ్చిన కొన్ని పత్రాలు.. మార్కోవ్‌పై దాడిచేసిన వ్యక్తిని కోడ్ నేమ్ ‘‘పికడిల్లీ’’గా పేర్కొన్నారు. అయితే, ఈ హత్య కేసులో ఎవరినీ దోషిగా నిర్ధారించలేదు.

9. ద ఆఫ్రికన్ స్పోర్ట్స్ పర్సనాలిటీ ఆఫ్ ద ఇయర్ ట్రోఫీ

ద ఆఫ్రికన్ స్పోర్ట్స్ పర్సనాలిటీ ఆఫ్ ద ఇయర్

ఈ ట్రోఫీని ఏటా ఆఫ్రికాలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన క్రీడాకారులకు ఇస్తుంటారు. 2018లో ఈజిప్టుకు చెందిన లివర్‌పూల్ ఫుట్‌బాలర్ మహమ్మద్ షా కూడా దీన్ని గెలుచుకున్నారు.

2001 నుంచి ఈ అవార్డును కేవలం ఫుట్‌బాలర్‌లకు మాత్రమే ఇచ్చేవారు. అయితే, 2021లో దీన్ని ఆఫ్రికన్ స్పోర్ట్స్ పర్సనాలిటీ ఆఫ్ ద ఇయర్‌గా మార్చారు. దీని కోసం భిన్న రకాల స్పోర్ట్స్‌లలో పోటీ నిర్వహిస్తారు.

ఈ ట్రోఫీ వెనుక కథ కూడా ఉంది. సియోరాలియోన్‌లో సైనికుడినా పనిచేసిన చిన్నారి బొమ్మను దీని కోసం ఉపయోగించారు. కళల గురించి తెలుసుకున్న తర్వాత అతడి జీవితమే పూర్తిగా మారిపోయింది.

10. డేవిడ్ ఎటిన్‌బరా, ద గ్రీన్ ప్లానెట్

డేవిడ్ ఎటిన్‌బరా

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, డేవిడ్ ఎటిన్‌బరా

వైల్డ్‌లైఫ్ డాక్యుమెంటరీలతో బ్రిటిష్ బ్రాడ్‌కాస్టర్, పర్యావరణ ప్రేమికుడు డేవిడ్ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. దాదాపు ఎనిమిది దశాబ్దాలపాటు సేవలు అందించిన అనుభవం ఆయన సొంతం.

బ్లూ ప్లానెట్, లైఫ్ కలెక్షన్, నేచురల్ వరల్డ్ లాంటి ఆయన కార్యక్రమాలను కోట్ల మంది చూసేవారు. ఎమ్మీ, బఫ్టాస్ లాంటి అవార్డులను కూడా ఆయన గెలుచుకున్నారు.

1960లలో బీబీసీ కోసం పనిచేయడం ఆయన మొదలుపెట్టారు. సీనియర్ మేనేజర్ స్థాయికి ఆయన ఎదిగారు. బీబీసీ టూ కంట్రోలర్‌గా, బీబీసీ టెలివిజన్ ప్రొగ్రామింగ్ డైరెక్టర్‌గా ఆయన పనిచేశారు.

ప్రజలకు వాతావరణ మార్పులపై అవగాహన కల్పించడంతో ఆయన్ను చాంపియన్ ఆఫ్ ఎర్త్-2021గా యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్‌మెంట్ ప్రోగ్రామ్ ప్రకటించింది.

బీబీసీ తాజా సిరీస్ ద గ్రీన్ ప్లానెట్‌లోనూ డేవిడ్ కనిపిస్తారు. ఉష్ణమండల ప్రాంతాల్లోని అడవుల నుంచి ఉత్తరాన మంచుతో గడ్డకట్టిన ప్రాంతాల దిశగా వెళ్తూ ఆయన దీనిలో కనిపిస్తారు. ఈ మధ్యలో ఆయనకు కొన్ని విపరీత వాతావరణ పరిస్థితులు ఎదురవుతుంటాయి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)