వారణాసి: మేకలకు సైతం బొట్టు పెట్టి పూజించే ఈ నగరాన్ని చూసిన ఒక విదేశీయుని అనుభవం ఏంటి

వారణాసి

ఫొటో సోర్స్, Dinodia Photo/Getty Images

    • రచయిత, పికో అయ్యర్
    • హోదా, బీబీసీ ట్రావెల్

మృత్యువు ఒడికి చేరేందుకు చాలా మంది హిందువులు వారణాసిని ఎంచుకుంటారు. ఇక్కడ మరణిస్తే ముక్తి లభిస్తుందని వారి నమ్మకం. అయితే, ఇక్కడి వీధుల్లో స్వేచ్ఛగా తిరిగితే ఇది మృత్యువును కాదు, సంతోషాన్ని పంచే నగరమని తెలుస్తుంది.

గంగా తీరంలో చితి మంటలు వెలుగుతున్నాయి. దట్టమైన మంచులో కొంతమంది తలకు చలి టోపీలు పెట్టుకొని, చెప్పులు లేకుండా మంటల చుట్టూ నిలబడ్డారు.

ఒంటిపై ఎలాంటి బట్టలూ లేకుండా, బూడిద రాసుకొని, జడలు కట్టిన జుట్టుతో చేతిలో ఒక కర్ర పట్టకుని ఒక సాధువు అక్కడ కనిపిస్తున్నారు. ఇక్కడికి కొంచెం దూరంలో మంత్రాలు, గంటల శబ్దం వినిపిస్తోంది. డప్పులు కూడా వినిపిస్తున్నాయి. సాయంత్రపు వెలుగుల్లో ఈ మంటలు నదిలో నీటిపై ప్రతిబింబాల్లా కనిపిస్తున్నాయి.

వారణాసి

ఫొటో సోర్స్, Dinodia Photo/Getty Images

అసలు నేను కలగంటున్నానా? లేదా ఒక విదేశీ సంస్కృతిని చూసి ఆశ్చర్యానికి గురవుతున్నానా? విమాన ప్రయాణ బడలిక లేదా ప్రయాణం వల్ల ఇలా అంతా కొత్తగా కనిపిస్తోందా?

నా వైపుగా వస్తున్న వారు మంచు తెరల్లో నుంచి ఒక్కసారిగా ప్రత్యక్షం అయినట్లు కనిపిస్తున్నారు. కొందరు తల నుంచి కాళ్ల వరకు బూడిద పూసుకొని కనిపిస్తుంటే, మరికొందరు నుదుటి మీద మూడు అడ్డగీతల బొట్టు పెట్టుకొని వస్తున్నారు.

చితి మంటల వెనుక నుంచి వెళ్తున్నప్పుడు, ఇరుకైన సంధులు తారసపడ్డాయి. ఇక్కడ ఆవులు స్వేచ్ఛగా తిరుగుతున్నాయి. అక్కడక్కడ నేలపై పేడ కూడా కనిపిస్తోంది.

అడుగడుగునా శివ మంత్రం జపించే బృందాలు ఎదురుపడుతున్నాయి. అక్కడక్కడ వెదురు కర్రలతో చేసిన పాడెపై మోసుకొస్తున్న శవాలు కనిపిస్తున్నాయి. ఇలా ఎవరైనా ఎదురువస్తే గోడకు ఆనుకుని కాసేపు నిలబడటంతో ఒక్కసారి మృత్యువు కళ్లకు కట్టినట్లుగా అనిపిస్తోంది.

వారణాసి

ఫొటో సోర్స్, Chotani/Getty Images

భిన్నమైన ప్రపంచం..

ఇరుకైన సంధుల్లో గమ్యమనేదే లేకుండా స్వేచ్ఛగా తిరుగుతున్నప్పుడు ఇద్దరు మహిళలు అందమైన చీరలు కట్టుకొని చెప్పులు లేకుండా పవిత్రమైన గంగానది వైపుగా వెళ్తూ కనిపించారు. సాయంత్రపు చీకట్లలో మనసు చూపించే దారిలో అటూఇటూ తిరుగుతుంటే ఎన్నో దేవాలయాలు, దీపపు వెలుగులు, మంత్రాలు జపిస్తున్న భక్తులు కనిపించారు.

అంతా చాలా వింతగా అనిపించింది. సరిగ్గా 72 గంటల ముందు, దీనికి పూర్తి భిన్నమైన ప్రపంచం నుంచి ఇక్కడకు వచ్చాను. ఇక్కడ మేకలకు కూడా పవిత్రంగా బొట్టుపెడుతున్నారు. నదీ తీరం వెంబడి చాలాచోట్ల దీపాలు వెలిగిస్తున్నాయి. గోడలపై దేవుడి బొమ్మలు కనిపిస్తున్నాయి. సమీపంలోని దుకాణాలన్నింటిలోనూ గంధంతోపాటు నెయ్యితో చేసిన దీపాలు అమ్ముతున్నారు. బూడిదను, గంగా జలాన్ని తీసుకెళ్లేందుకు చిన్నచిన్న డబ్బాలు కూడా విక్రయిస్తున్నారు.

ఈ మృత్యు నగరాన్ని ఒకప్పుడు ‘‘కాశీ’’ అంటే వెలుగులు విరజిమ్మే నగరం అని పిలిచేవారు. అయితే, ప్రముఖ ఇంగ్లిష్ రచయిత రిచర్డ్ లెనాయ్ మాత్రం కాశీని ‘‘చీకటి నగరం’’గా చెప్పారు. ఒకప్పుడు ఇక్కడి దేవాలయాలకు సమీపంలో మహిళలను అపహరించేవారని, దేవుడి పేరుతో వ్యభిచారం కూడా చేసేవారని, దోపిడీలు విపరీతంగా జరిగేవని, బోగస్ సాధువులు కూడా ఇక్కడ కనిపించేవారని ఆయన పుస్తకంలో పేర్కొన్నారు.

అయితే, ఇక్కడ వీధుల్లో తిరిగినప్పుడు ఇది ‘‘సంతోషాన్ని పంచే నగరం’’గా అనిపించింది. చాలా మంది వేగంగా నన్ను దాటుకుంటూ చితి మంటలవైపు వెళ్తున్నారు. ఎటుచూసినా మంత్ర జపాలతో దేవుడికి అంతా ధన్యవాదాలు చెబుతున్నట్లుగా అనిపించింది.

వారణాసి

ఫొటో సోర్స్, Yadid Levy/Alamy

ఎందుకు ప్రత్యేకమైనది?

నిజానికి భారత్‌లోని పట్టణ ప్రాంతాలు ప్రపంచంలోని మిగతా ప్రాంతాల కంటే చాలా భిన్నంగా ఉంటాయి. కానీ, పవిత్ర వారణాసి నగరం మరింత ప్రత్యేకమైనది. ఇక్కడ వీధుల్లో ట్రాఫిక్ దాదాపు అన్ని వైపుల నుంచీ వస్తున్నట్లుగా కనిపిస్తుంది. నిజానికి చాలా కూడళ్లలో ట్రాఫిక్ లైట్లు కూడా కనిపించవు.

అక్కడక్కడ కొంత మంది ట్రాఫిక్ పోలీసులు మాస్క్ పెట్టుకొని చేతులతో కార్లు, మోటార్ సైకిళ్లతోపాటు ఆవులను కూడా నియంత్రిస్తూ కనిపిస్తుంటారు. రద్దీగా కనిపించే వీధుల్లో శునకాలు కూడా స్వైరవిహారం చేస్తుంటాయి. ఫుట్‌పాత్‌లపై కొందరు పడుకొని కూడా కనిపిస్తారు.

మొదటగా నేను పవిత్రమైన గంగానదిని చూడాలని భావించాను. దీంతో హోటల్‌లో బ్యాగు పెట్టిన వెంటనే, కారు ఎక్కి ఘాట్‌లవైపుగా వచ్చేశాను. దాదాపు 20 నిమిషాల దారిలో రెండు మృతదేహాలు, పిల్లల సమూహాలు మాకు ఎదురుపడ్డాయి.

‘‘ఇది అంత మంచి రోజు కాదు’’అని కారులో ముందు కూర్చున్న స్థానికుడు ఒకరు వెనక్కి తిరిగి నన్ను హెచ్చరించేలా చెప్పారు. ‘‘దీన్నే ఖర్మల సమయం అంటారు. ఇలాంటి వేళల్లో ఎవరూ బయటకు రారు. పెళ్లిళ్ల గురించి, వేడుకల గురించి మాట్లాడరు. అంతా మౌనంగా వెళ్లిపోతుంటారు’’అని ఆయన వివరించారు.

నిజానికి ఇదే వారణాసి మౌనంగా ఉండే సమయం అయితే, నాకెందుకు కార్ల హారన్‌లు, ట్రైన్‌ల శబ్దాలు ఇంత ఎక్కువగా వినిపిస్తున్నాయా అనిపించింది. ఒకవేళ ఏదైనా పండుగ వస్తే ఇంకెంత కోలాహలంగా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోలేకపోయాను.

వారణాసి

ఫొటో సోర్స్, Maciej Dakowicz/Alamy

మేం దగ్గర్లోని ఒక చర్చి దగ్గర ఆగాం. అక్కడకు సమీపంలోనే మృతదేహాలు గంగానది వైపుగా తీసుకెళ్తూ కనిపించాయి. ఇక్కడే ‘‘ద ఓల్డెస్ట్ సెంటర్ ఫర్ అబాకస్ క్లాసెస్’’, ‘‘గ్లోరియస్ లేడిస్ టైలర్స్’’అనే రెండు బోర్డులు కనిపించాయి. ఆ రెండో బోర్డు చూసిన తర్వాత గ్లోరీ అనే పదాన్ని మహిళల కోసమా లేక టైలరింగ్ కోసమా? అని కాస్త ఆశ్చర్యపోయాను.

వారణాసిలో దాదాపు లక్షల మంది పాత నగరం పరిధిలోని ఇరుకైన సంధుల్లో జీవిస్తారు. ఈ ప్రాంతాలను చూసే విదేశీయులు ఆశ్చర్యపోతుంటారు.

వీడియో క్యాప్షన్, కాశీ-జ్ఞాన్‌వాపి వివాదమేంటి? దాని వెనుక ఉన్న చారిత్రక మూలాలేంటి?

అయితే, ఇక్కడ అన్నీ వేగంగా మారిపోతున్నాయని మా గైడ్ చెప్పారు. కాసేపటికి మేం నదీ తీరానికి వచ్చాం. అక్కడ కొంతమంది పండితులు గొడుగుల కింద కనిపించారు. వీరి నుదుటపై అడ్డబొట్లు కనిపించాయి. ‘‘భిన్న రంగులు, భిన్న వ్యక్తిత్వాలు.. ఇక్కడకు వచ్చినప్పుడు మీరు చాలా అప్రమత్తంగా ఉండాలి’’అని గైడ్ హెచ్చరించారు.

నేను అప్పటికే చాలా అప్రమత్తంగా ఉన్నాను.

వారణాసి

ఫొటో సోర్స్, Graham Prentice/Alamy

మేం నదీ తీరం వెంబడి హాయిగా నడుచుకుంటూ ముందుకు వెళ్లాం. అయితే, అక్కడక్కడ చెత్త నీటిపై తేలుతూ కనిపించింది. దాదాపు ఎలాంటి బట్టలూ వేసుకోని ఒక వ్యక్తి అక్కడ ఉన్నారు. ఆయన ఒక చిన్న గుడిసె కింద మంట ఎదురుగా కూర్చుని ఉన్నారు.

‘‘ఆయన ధ్యానం చేస్తున్నారా?’’అని నేను ప్రశ్నించాను.

వీడియో క్యాప్షన్, కాశీ విశ్వనాథ్ ధామ్‌ను జాతికి అంకితం చేసిన ప్రధాని మోదీ

‘‘వారికి సర్వం బూడిదే. ఇలాంటి సాధువులు చితిమంటలకు దగ్గరగా జీవిస్తారు. బట్టలు వేసుకోరు. వారు మనలా ఏమీ చేయరు. వీరికి బూడిడే ప్రపంచం’’అని మా గైడ్ చెప్పారు.

కేవలం ఇక్కడ మాత్రమే 24 గంటలూ అంత్యక్రియలు నిర్వహిస్తారని అక్కడ పడవ నడిపే వ్యక్తి మాతో చెప్పారు. ‘‘మిగతా ప్రాంతాల్లో శ్మశానవాటికలను శివారు ప్రాంతాల్లో ఏర్పాటుచేస్తుంటారు. కానీ, ఇక్కడ మాత్రం నగరం మధ్యలో ఉంటాయి’’అని వివరించారు.

ఆ తర్వాత మళ్లీ నేను హోటల్‌కు వచ్చేశాను. ‘‘ఇక్కడ అంతా ప్రవాహంలా సాగుతూ ఉంటుంది. ఏదీ స్థిరంగా ఉండదు’’అని మా గైడ్ మాతో చివరగా చెప్పారు.

బీబీసీ ఐస్వోటీ

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)