నిక్కీ యాదవ్ మర్డర్: గర్ల్‌ఫ్రెండ్‌ను చంపి ఫ్రిజ్‌లో పెట్టి, మరుసటి రోజే ఇంకో అమ్మాయితో పెళ్లి, ఈ కేసులో పోలీసులు ఏం చెప్పారు?

ఫొటో సోర్స్, ANI
దిల్లీలోని నజఫ్‌గఢ్‌లో 23 ఏళ్ల నిక్కీ యాదవ్ అనే యువతిని చంపి మృతదేహాన్ని ఫ్రిజ్‌లో దాచిపెట్టిన విషయం బయటపడింది. ఈ కేసులో నిక్కీ యాదవ్ బాయ్‌ఫ్రెండ్ సాహిల్ గహ్లోత్‌ను నిందితుడిగా పేర్కొంటూ పోలీసులు కేసు నమోదు చేశారు.
పోలీసులు బుధవారం సాహిల్ గహ్లోత్‌ను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. విచారణ నిమిత్తం కోర్టు సాహిల్‌ను అయిదు రోజుల పోలీస్ రిమాండ్‌కు అప్పగించింది.
మిత్రావూ గ్రామానికి చెందిన సాహిల్ గహ్లోత్‌కు హరియాణాలోని ఝజ్జార్ గ్రామానికి చెందిన నిక్కీ యాదవ్‌కు స్నేహం ఉంది. మెడికల్ ఎగ్జామినేషన్‌కు ప్రిపేర్ అవుతున్న నిక్కీ యాదవ్ దిల్లీలో ఉంటూ ఓ కోచింగ్ సెంటర్‌లో శిక్షణ పొందుతున్నారు. రోజూ బస్సులో వెళ్లి వస్తుండే క్రమంలో ఇద్దరి మధ్య ప్రేమ మొదలైంది.
2018లో సాహిల్ గ్రేటర్ నోయిడాలోని ఓ కాలేజ్‌లో డి.ఫార్మసీ కోర్సులో చేరారని, అదే కాలేజ్‌లో నిక్కీ చేరారని.. ఆ తరువాత ఇద్దరూ సహజీవనం ప్రారంభించారని పోలీసులు చెప్పారు.
కోవిడ్ లాక్‌డౌన్ కాలంలో ఇద్దరూ తమ ఇళ్లకు వెళ్లిపోయారు. అనంతరం మళ్లీ దిల్లీ చేరుకుని ద్వారకాలో ఇల్లు అద్దెకు తీసుకుని సహజీవనం కొనసాగించారన్నారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
ఫిబ్రవరి 9, 10 తేదీల మధ్య రాత్రి సమయంలో సాహిల్ నిక్కీని చంపేసి, ఫిబ్రవరి 10న మరో యువతిని వివాహం చేసుకున్నట్లు పోలీసులు అభియోగం నమోదు చేశారు.
ఆ తరువాత పోలీసులు మిత్రావూ గ్రామం వెలుపల ఉన్న ఓ ఢాబా నుంచి ఆమె మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు.
అయితే, సాహిల్ కుటుంబసభ్యులెవరికీ వీరిద్దరి మధ్య ఉన్న బంధం గురించి తెలియదని పోలీసులు చెప్తున్నారు.

ఫొటో సోర్స్, ANI
నిక్కీని సాహిల్ చంపినట్లు తమకు నిఘా సమాచారం ఉందని పోలీసులు చెప్పారు. అయితే, నిక్కీ కనిపించడం లేదన్న ఫిర్యాదు ఏదీ ఇంత వరకు పోలీసులకు అందలేదు. అయితే, సాహిల్ ఫోన్ స్విచాఫ్ ఉండడం, ఆయన కనిపించకపోవడంతో పోలీసులు ఆయన కోసం వెతికారు.
చివరకు దిల్లీ సరిహద్దుల్లోని కైర్ గ్రామంలో ఆయన్ను అరెస్టు చేశారు.

ఫొటో సోర్స్, ANI
దిల్లీ క్రైమ్ బ్రాంచ్ స్పెషల్ పోలీస్ కమిషనర్ రవీంద్ర యాదవ్ ఈ కేసు వివరాలు వెల్లడించారు. ''ఈ కేసులో పోలీసులు వెంటనే స్పందించారు. సాహిల్ వేరే అమ్మాయిని పెళ్లి చేసుకున్న తరువాత నిక్కీ మృతదేహాన్ని అక్కడి నుంచి తరలించేస్తే కేసు విచారణ కష్టమయ్యేది. కానీ, పోలీసులు సకాలంలో రంగంలోకి దిగి ఆమె మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు' అన్నారు రవీంద్ర యాదవ్.
కాగా బుధవారమే నిక్కీ మృతదేహానికి పోస్ట్‌మార్టం నిర్వహించారు. మరోవైపు నిక్కీ హత్య జరిగిన వాహనాన్ని దిల్లీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
సాహిల్‌కు ఇంట్లో వివాహం నిశ్చయం చేశారని, ఫిబ్రవరి 9న ఆయనకు నిశ్చితార్థం జరగ్గా ఫిబ్రవరి 10న వివాహమైందని దిల్లీలోని రాజోరీ గార్డెన్ క్రైమ్ బ్రాంచ్ డీసీపీ సతీశ్ కుమార్ చెప్పారు.
సాహిల్ తన పెళ్లి విషయం నిక్కీకి చెప్పలేదని, ఆమెకు విషయం తెలిసిన తరువాత సాహిల్‌కు ఫోన్ చేసి మాట్లాడిందని పోలీసులు తెలిపారు.
'నిక్కీ ఫోన్ చేయడంతో ఆమెను కలిసేందుకు సాహిల్ వెళ్లాడు. ఇద్దరి మధ్య గొడవ జరిగింది. అప్పటికి ఇద్దరూ కారులోనే కూర్చున్నారు. గొడవ సమయంలో సాహిల్ కోపంతో నిక్కీ మెడకు తన మొబైల్ ఫోన్ చార్జింగ్ వైరు బిగించి చంపేశాడు' అని సతీశ్ కుమార్ చెప్పారు.

ఫొటో సోర్స్, ANI
నిక్కీని చంపేసిన తరువాత సాహిల్ ఆమె మృతదేహాన్ని తమ ఊరి బయట ఉన్న ఢాబాలోని ఫ్రిజ్‌లో దాచిపెట్టారని, ఆ ఢాబా సాహిల్ కుటుంబానికి చెందినదేనని సతీశ్ కుమార్ తెలిపారు.
నిక్కీని ఏ వాహనంలో అయితే సాహిల్ చంపేశాడో అదే వాహనంలో ఆమె మృతదేహాన్ని ఢాబా దగ్గరకు తీసుకొచ్చారని సతీశ్ కుమార్ చెప్పారు.
అయితే, ఫ్రిజ్‌లో దాచిన మృతదేహాన్ని సాహిల్ ఏం చేయాలనుకున్నారనేది ఆయన చెప్పలేదని, విచారణ కొనసాగుతోందని సతీశ్ కుమార్ వెల్లడించారు.

ఫొటో సోర్స్, ANI
తమ కుమార్తె హత్యకు గురైనట్లు పోలీసులు చెప్పేవరకు తెలియదని నిక్కీ యాదవ్ తండ్రి సునీల్ చెప్పారు.
తన కుమార్తెను చంపినవారికి మరణశిక్ష వేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఒకటిన్నర నెలల కిందట కుమార్తె తమ ఇంటికి వచ్చిందని, ఆ తరువాత మళ్లీ రాలేదని... ఇప్పుడు శవమై కనిపించిందని ఆయన రోదించారు.
నిక్కీని చంపినవారికి శిక్ష పడాలని ఆమె గ్రామానికి చెందిన ప్రజలూ డిమాండ్ చేస్తున్నారు.
మరోవైపు నిక్కీ యాదవ్, సాహిల్ గహ్లోత్‌లు సహజీవనం చేయలేదని ఆ గ్రామానికి చెందిన కొందరు చెప్తున్నారు. మీడియాలో తప్పుగా చూపిస్తున్నారని అలాంటిదేమీ లేదని వారు ఆరోపించారు.

ఇవి కూడా చదవండి:
- తుర్కియే, సిరియా: 'ఇది భూకంపం... అందరూ దగ్గరికి రండి, కలిసి చనిపోదాం'
- షార్ట్ సెల్లింగ్- కొనకుండానే షేర్లను ఎలా అమ్ముతారు... లాభాలు ఎలా వస్తాయ్
- బీబీసీ ఇండియన్ స్పోర్ట్స్ వుమన్ ఆఫ్ ది ఇయర్ ISWOTY: అయిదుగురు నామినీలు వీళ్ళే
- నందాదేవి: ఆ సరస్సులో మానవ అస్థికలు, పర్వత పుత్రిక ఉగ్రరూపం... ఏమిటీ కథ?
- భారత్-లో ఇంటర్నెట్ వృద్ధి రేటు ఎందుకు తగ్గిపోయింది-
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)










