‘కూతురు ప్రేమిస్తోందని తండ్రి చంపేశాడు... శవాన్ని కాల్చి బూడిదను నదిలో కలిపాడు’

శుభాంగీ జోగ్‌దండ్
ఫొటో క్యాప్షన్, శుభాంగీ జోగ్‌దండ్

ప్రేమ వ్యవహారంలో 23ఏళ్ల యువతిని ఇంట్లో వాళ్లే చంపి, శవాన్ని కాల్చి వేసినట్లు పోలీసులు తెలిపారు.

మహారాష్ట్రలోని నాందేడ్‌లో ఈ పరువు హత్య జరిగింది.

పోలీసుల కథనం ప్రకారం... నాందేడ్‌లోని పింప్రి మహిపాల్ గ్రామానికి చెందిన శుభాంగి జోగ్‌దండ్ అనే 23ఏళ్ల యువతి అదే గ్రామానికి చెందిన ఓ యువకుడిని ప్రేమిస్తోంది.

అది శుభాంగి ఇంట్లో వాళ్లకు నచ్చలేదు.

మూడు నెలల కిందట శుభాంగికి ఇంట్లో వాళ్లు పెళ్లి సంబంధం చూశారు. ఆ తరువాత ఆ పెళ్లి ఆగిపోయింది. దీని కారణం వేరే యువకునితో శుభాంగికి ఉన్న సంబంధమే కారణమని ఇంట్లో వాళ్లు భావించారు.

ఈ వ్యవహారం వల్ల తమ పరువు పోతుందని భావించిన తండ్రి ఇతర కుటుంబ సభ్యులు, శుభాంగిని హత్య చేశారు.

ఎలా వెలుగులోకి వచ్చింది?

శుభాంగి వైద్యవిద్యార్థి. నాందేడ్‌లోని ప్రభుత్వ ఆయుర్వేద కళాశాలలో బీఏఎంఎస్ మూడో సంవత్సరం చదువుతోంది.

మూడు రోజులుగా శుభాంగి కనిపించకుండా పోవడంతో మహిపాల్ పింప్రి గ్రామస్తులకు అనుమానం కలిగింది.

గ్రామానికి చెందిన కొందరు జనవరి 26న లింబ్‌గావ్ పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించారు. దీంతో పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

విచారణలో తల్లిదండ్రులు, సోదరుడు, మేనమామ కలిసి శుభాంగిని హత్య చేసి, దొరక్కుండా ఉండేందుకు ఆధారాలను ధ్వంసం చేసినట్లు తేలింది.

మహిళల మీద నేరాలు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, (ఫైల్ ఫొటో)

పెళ్లి ఆగిపోవడంతో తమ పరువు పోతుందని శుభాంగి కుటుంబసభ్యులు భావించారు.

తండ్రి జనార్ధన్ లింబాజీ, సోదరుడు కృష్ణ, ఇతర బంధువులు శుభాంగి గొంతు పిసికి చంపేశారు.

ఆ తరువాత శవాన్ని బయటకు తీసుకెళ్లి కాల్చివేశారు. బూడిద, ఎముకలను నదిలో కలిపారు. శుభాంగి మృతదేహాన్ని కాల్చిన చోట దున్ని నీళ్లు పోశారు. ఆధారాలు దొరకకుండా ఉండేందుకు ఇలా చేశారు.

ఈ విషయాన్ని కుటుంబసభ్యులు తమ విచారణలో వెల్లడించినట్లు నాందేడ్‌ పోలీస్‌ సూపరింటెండెంట్‌ శ్రీకృష్ణ కొకటే మీడియాకి తెలిపారు.

ఘటనా స్థలాన్ని పోలీసులు పరిశీలించారు. నదిలో బూడిద కలిపిన చోట కొన్ని వస్తువులు కూడా దొరికాయి. వాటిని పరీక్షల నిమిత్తం ఫోరెన్సిక్‌కు పంపారు.

ఈ హత్యకు సంబంధించి ఐదుగురు మీద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)