కుసుంద: 'వద్దు, లేదు' అనే మాటలే లేని ఈ భాషను ఎవరు మాట్లాడుతారు... వాళ్ల చరిత్ర ఏంటి?

కుసుంద

ఫొటో సోర్స్, Eileen McDougall

నేపాల్‌లో కుసుంద భాషకు మూలం తెలియదు. అవును, కాదు అనే పదాలు అందులో లేవు. ఆ భాష అనర్గళంగా మాట్లాడే వ్యక్తి ఒక్కరే మిగిలి ఉన్నారక్కడ. అయితే భాషావేత్తలు ఈ పరిస్థితిని మార్చాలని ప్రయత్నిస్తున్నారు.

నేపాల్ లోతట్టు ప్రాంతంలో టెరాయ్ కొండల్లోని ఓ పాఠశాల బోర్డింగ్ హౌస్ నుంచి 18 ఏళ్ల హిమ కుసుంద పింక్ హుడ్ టీ షర్ట్ ధరించి బయటకు వచ్చారు. ప్రస్తుతం మధ్య పశ్చిమ నేపాల్‌లో మిగిలి ఉన్న కుసుందలలో హిమ ఒకరు. కుసుంద అని పిలువబడే వారి భాష ప్రత్యేకమైనది.

ఇది ప్రపంచంలోని మరే ఇతర భాషలతోనూ సంబంధం లేనిదని భాషా నిపుణులు నమ్ముతారు. ఇది ఎలా ఉద్భవించిందో నిపుణులకు ఇప్పటికీ కచ్చితంగా తెలియలేదు. ఈ భాష అసాధారణంగా ఉంటుంది. అవును, కాదు అని చెప్పగలిగే పదాలు కానీ, దిశలకు సంబంధించిన పదాలు కానీ ఇందులో లేవు.

నేపాల్‌లో 2011 జనాభా లెక్కల ప్రకారం కుసుంద తెగ వ్యక్తులు 273 మంది మాత్రమే మిగిలి ఉన్నారు. వీరందరిలో 48 ఏళ్ల కమలా ఖత్రీ అనే మహిళ ఒక్కరే కుసుందను అనర్గళంగా మాట్లాడగలరు.

నేపాలీ సమాజంలో కుసుందలు చాలా అట్టడుగున, పేదరికంలో ఉన్నారు. చాలా మంది పశ్చిమ నేపాల్‌లోని డాంగ్ జిల్లాలో నివసిస్తున్నారు. ఆ ప్రాంతం పసుపు ఆవాల పంట చేలు, పొగమంచు, చెట్లు కొండలతో నిండి ఉంటుంది.

ఇక్కడే నేపాల్ భాషా కమిషన్ 2019 నుంచి కుసుంద తరగతులను నిర్వహిస్తోంది. గత దశాబ్దంలో అక్కడి ప్రభుత్వం నేపాల్ స్వదేశీ గ్రూపులకు సాయం చేయడానికి పలు పథకాలను ప్రారంభించింది.

దీంట్లో భాగంగానే మారుమూల ప్రాంతాల నుంచి హిమ, ఇతర కుసుంద విద్యార్థులు డాంగ్‌లోని మహీంద్రా హైస్కూల్‌లో చదువుతున్నారు. కొన్ని సందర్భాల్లో వారు 10 గంటలు ప్రయాణం చేస్తారు. అక్కడ వారికి మాతృభాష కూడా నేర్పిస్తారు.

హిమ డాంగ్ బార్డర్‌లోని ప్యూతాన్ ప్రాంతానికి చెందిన యువతి. రెండేళ్ల నుంచి కుసుంద భాష నేర్చుకుంటున్నారు. ఆమె ప్రస్తుతం ప్రాథమిక కుసుంద భాష మాట్లాడగలరు. ''డాంగ్‌లోని పాఠశాలకు రావడానికి ముందు నాకు కుసుంద భాష గురించే తెలియదు. నేను పుట్టినప్పటి నుంచి నేర్చుకోకపోయినా ఇపుడు కుసుంద తెలిసినందుకు గర్వపడుతున్నా'' అని హిమ అంటున్నారు.

"నేను థారస్, మగార్స్ వంటి ఇతర తెగలకు చెందిన వాళ్లు మాట్లాడటం వింటాను. ఆ సమయంలో నా మాతృభాషలో మాట్లాడితే ఎలా ఉంటుందో అని ఆశ్చర్యపోయేదాన్ని. కుసుంద భాషను రక్షించడం నాకు, నాతో పాటు అందరికీ చాలా ముఖ్యమని భావిస్తున్నా." అని ఆమె చెప్పారు.

హిమ

ఫొటో సోర్స్, Eileen McDougall

కుసుందలు ఎవరు... వారి చరిత్ర ఏంటి?

కుసుందలు దేశ సంచారులు. 20 శతాబ్ధం మధ్య వరకు పశ్చిమ నేపాల్‌లోని అడవుల్లో వీళ్లు నివసించేవారు. పక్షులను వేటాడేవారు.

సమీపంలోని పట్టణాల్లో బియ్యం, పిండి కోసం దుంపలు, మాంసాన్ని అమ్మేవాళ్లు. ఇపుడు గ్రామాల్లో స్థిరపడినప్పటికీ ఇప్పటికీ వాళ్లు అడవి రాజులుగానే పిలుచుకుంటారు. కానీ నేపాల్ జనాభా పెరగడం, వ్యవసాయానికి అడవులను చదును చేయడంతో కుసుందల ప్రాంతాలపై రద్దీ పెరిగింది.

1950వ దశకంలో నేపాల్ ప్రభుత్వం వారి సంచార జీవితానికి మరిన్ని అడ్డంకులు కల్పిస్తూ అడవులను జాతీయం చేసింది. ఈ పరిణామాల నేపథ్యంలో కుసుందలు స్థిరపడవలసి వచ్చింది. దీంతో కూలీ, వ్యవసాయం వైపు మళ్లారు.

చాలా తక్కువ మంది ఉండటంతో ఇతర తెగల వారిని వివాహం చేసుకోవాల్సి వచ్చేది. దీంతో తమ భాష మాట్లాడటం మానేశారు. కుసుంద ప్రజలకు వారి భాషను కోల్పోవడం అంటే వారి గతం, గుర్తింపును వదులుకోవడమే. భాషాపరంగా చూసినా ఇది నష్టమే. ఖాట్మాండులోని త్రిభువన్ యూనివర్సిటీ భాషా నిపుణుడు, ప్రొఫెసర్ మాధవ్ పోఖరేల్ గత 15 ఏళ్ల నుంచి కుసుంద భాషపై పరిశోధనలు చేస్తున్నారు.

భారత్‌కు చెందిన నిహాలీ భాష, ఉత్తర పాకిస్థాన్‌కు చెందిన బురుషాస్కీ వంటి ఇతర భాషలతో అనుసంధానించడానికి అధ్యయనాలు జరిగాయని ఆయన తెలిపారు. కానీ ఆశించిన ముగింపు దొరకలేదు.

కుసుంద టిబెటన్-బర్మన్, ఇండో-ఆర్యన్ తెగలకు ముందు ఉప-హిమాలయ ప్రాంతాలలో మాట్లాడే పురాతన ఆదిమ భాష నుంచి వచ్చినట్లు ప్రస్తుతం భాషా పరిశోధకులు భావిస్తున్నారు.

"మేం నేపాల్‌లోనే కాకుండా బయటి నుంచి ఇక్కడికి వచ్చే వ్యక్తుల భాషా తెగలను గుర్తించగలం. కానీ, కుసుంద మూలాలు మాత్రమే మనకు తెలియదు" అని పోఖారెల్ అంటున్నారు.

నేపాల్

ఫొటో సోర్స్, Eileen McDougall

కుడి, ఎడమ ఉండనే ఉండవు...

కుసుంద నేపథ్యమే మిస్టరీగా ఉంటే ఆ భాషలో అనేక అరుదైన అంశాలను భాషావేత్తలు గుర్తించారు. కుసుంద గురించి లోతైన జ్ఞానం ఉన్న భాషావేత్త భోజరాజ్ గౌతమ్ ఈ భాషలోని అత్యంత ప్రత్యేకమైన ఒక అంశాన్ని వివరించారు: ఈ భాషలో దేన్నైనా తిరస్కరించే వ్యక్తీకరణ లేదు. అసలు ప్రతికూల అర్థాలను ఇచ్చే పదాలే ఈ భాషలో లేవు. అలా ఏదైనా చెప్పాలంటే, సందర్భాన్ని బట్టి వివరించాల్సిందే. ఉదాహరణకు, "నాకు టీ వద్దు" అని చెప్పాలనుకుంటే, తాగడం అనే క్రియా పదాన్నే ఉపయోగిస్తూ తాగాల్సిన అవసరం అంత లేదంటూ సూచనప్రాయంగా పలకాలి.

కుసుందలో దిశలకు కూడా కచ్చితమైన పదాలు లేవు. ముఖ్యంగా ఎడమ, కుడి లాంటి పదాలు. బదులుగా ఆ పక్కన, ఈ పక్కన పదాలను వాడుతారు.

కుసుందలో చాలా భాషల్లో ఉన్న వ్యాకరణ నియమాలు, నిర్మాణాలు లేవని భాషావేత్తలు చెబుతున్నారు. ఇది మరింత సరళమైనది. పదబంధాలను మాట్లాడే వ్యక్తి తగినట్లుగా అర్థం చేసుకోవాలి. భూత, వర్తమానాలను సరిచూడలేం.

ఉదాహరణకు, నేను పక్షిని చూస్తాను అని చెప్పడానికి, నేను పక్షిని చూశాను అంటారు. ఈ చర్యను కుసుంద భాష వాళ్లు కాలంతో కాకుండా అనుభవంతో చూస్తారు. భవిష్యత్ చర్య సాధారణంగానే ఉంటుంది. సబ్జెక్ట్‌కు సంబంధం ఉండదు. కుసుందలోని ఈ అరుదైన లక్షణాలు భాషావేత్తలను చాలా ఆకర్షించాయి.

కుసుందను అనర్గళంగా మాట్లాడేది ఆమె ఒక్కరే...

కమలా ఖత్రీ

ఫొటో సోర్స్, Eileen McDougall

కమలా ఖత్రీ. కుసుంద భాషను అనర్గళంగా మాట్లాడే ఏకైక వ్యక్తి. ఘోరాహిలో కాఫీ షాప్‌లో ఒక గ్లాసు వేడి నీటిని పట్టుకుని ఉన్నారు. తన సొంత పిల్లలకు కుసుంద భాష నేర్పలేదని ఆమె చెప్పారు.

"వారు నేపాలీ నేర్చుకోవాలని అనుకున్నాను. ఎందుకంటే అది ఉపయోగపడుతుంది" ఆమె అన్నారు. "ప్రజలు మా భాషను ఎగతాళి చేస్తారు. ఇది విచిత్రంగా ఉందంటారు. కుసుంద మాట్లాడేవారు చాలా అవమానాలు ఎదుర్కొన్నారు.

కానీ ఇప్పుడు నేను మా సొంత భాషలో నా పిల్లలతో మాట్లాడలేనందుకు చింతిస్తున్నా" అని చెప్పారు ఖత్రీ. ఆమె ఇపుడు భాషా కమిషన్‌లో పనిచేస్తున్నారు. ఘోరాహిలోని 10 మంది కమ్యూనిటీ వాళ్లకు కుసుంద భాషను నేర్పిస్తున్నారు.

"మనం క్రమం తప్పకుండా ప్రాక్టీస్ చేయగలిగితే, మాట్లాడగలిగితే, మన పాటలను పాడగలిగితే, మన భాషను సజీవంగా ఉంచుకోగలుగుతాం" అని ఆమె చెబుతున్నారు.

కుసుంద మాట్లాడేవారు వారి జ్ఞాపకాలు గుర్తుచేసుకునేందుకు తాము పెరిగిన వాతావరణంలో ఉండటం ముఖ్యమని చెప్పారు. "వారి సొంత ప్రాంతంలోకి కుసుందాలను తీసుకురాగలగాలి. ఆ ప్రదేశంలో ఒక కుసుంద వ్యక్తి తన కథలను మరొక కుసుందకు చెబుతాడు. ఇది వారి జ్ఞాపకాలను పునరుజ్జీవింపజేస్తుంది" అని పోఖారెల్ చెప్పారు.

ప్రస్తుత పునరుజ్జీవన ప్రయత్నాలలో ఆధునిక సాంకేతికత కూడా ఉపయోగిస్తున్నారు. కుసుంద భాష, సంస్కృతి, సంప్రదాయాలను డాక్యుమెంట్ చేయడంలో నౌ హియర్ మీడియా, బెర్లిన్ ఆధారిత మీడియా స్టూడియో వారితో కలిసి పని చేస్తోంది. ముఖ్యంగా నౌ హియర్ ఒక వర్చువల్ రియాలిటీ డాక్యుమెంటరీని రూపొందించింది. ఇది కుసుందాస్ సంచార జీవితాన్ని వేటగాళ్లుగా చిత్రీకరించడానికి త్రీడీ యానిమేషన్‌ను ఉపయోగిస్తుంది.

ఇప్పుడు ఆ సంస్థ సహ వ్యవస్థాపకురాలు గాయత్రీ పరమేశ్వరన్ మాట్లాడుతూ, ''కథతో మాట్లాడటానికి, కథనంతో కొనసాగడానికి కుసుందలో పదాలు నేర్చుకోవాలి, మాట్లాడాలి. భవిష్యత్ తరాలకు అందుబాటులో ఉండేలా డిజిటల్ డేటా రూపొందించడమే లక్ష్యం'' అని గాయత్రీ పరమేశ్వరన్ వివరించారు.

అయితే, కుసుంద భాష పరిరక్షణ అనేది కథలో భాగం మాత్రమే. నేపాల్ కుసుంద డెవలప్‌మెంట్ సొసైటీ ఛైర్మన్ ధన్ బహదూర్ కుసుంద అంచనా ప్రకారం చాలా మంది కుసుందలు దారిద్య్రరేఖకు దిగువన నివసిస్తున్నారు.

భూమి హక్కులు లేకుండా కూలీలుగా లేదా కాపలాదారులుగా పనిచేస్తున్నారు. "ఆర్థికంగా, సామాజికంగా, ఆరోగ్యం, విద్య పరంగా కుసుంద ప్రజలు చాలా వెనుకబడి ఉన్నారు" అని బహదూర్ అంటున్నారు. ఇదే కుసుంద భాషపై అవగాహన పెంపొందించుకోవడానికి తోడ్పడుతుంది. కుసుందపై దృష్టిని ఆకర్షించడానికి ఇది ప్రభావవంతమైన మార్గం అని భాషా కమిషన్ కార్యదర్శి లోక్ బహదూర్ లోప్చన్ అభిప్రాయం వ్యక్తం చేశారు.

నేపాల్‌లోని ఇతర భాషా పునరుజ్జీవన ప్రాజెక్టులు కుసుంద కంటే మెరుగ్గా ఉన్న సంఘాలతో కలిసి పనిచేస్తున్నాయని లోప్‌చాన్ చెప్పారు. "వాళ్లకి భాషా పరిరక్షణ అనేది కేవలం సెంటిమెంటల్ ఆలోచన. ఇది వారికి ఇతర ప్రయోజనాలను తీసుకురాదు. అయితే, కుసుందలు చాలా అట్టడుగున ఉన్నారు. అందువల్ల ఆ భాష మాట్లాడే సంఘంగా వారి ప్రొఫైల్‌ను నిర్మించడం చాలా ముఖ్యం అని ఇతరులు కూడా అంగీకరిస్తున్నారు. కుసుందలకు వారి భాష లేకపోతే నేపాల్‌లోని ఇతర అట్టడుగు వర్గాల నుంచి వారిని వేరు చేయడం సాధ్యం కాదు. భాష వారికి ఒక గుర్తింపును ఇస్తుంది. ప్రభుత్వం దృష్టిని ఆకర్షిస్తుంది" అని లోప్చన్ చెప్పారు. లండన్ విశ్వవిద్యాలయం టిమ్ బోడ్ట్‌లోని పోస్ట్-డాక్టోరల్ ఫెలోస్, పరిశోధకుల సహాయంతో కుసుంద ఇప్పుడు "ఏకీకృత్ బస్తీ" లేదా ఏకీకృత సెటిల్‌మెంట్ కోసం భూమిని అడుగుతున్నారు. ఇక్కడ కుసుందలు అందరూ నివసించవచ్చు.

బోడ్ట్, ఆయన నేపాలీ పరిశోధన భాగస్వామి ఉదయ్ రాజ్ ఆలే ప్రస్తుతం ఈ పరిష్కారంపై సాధ్యాసాధ్యాలు, అధ్యయన నిధుల కోసం చూస్తున్నారు.

బోడ్ట్ అభిప్రాయం ప్రకారం ఈ పరిష్కారం కమ్యూనిటీ భూమి హక్కులను పొందడం, ఆరోగ్య కేంద్రం, పాఠశాలలను అందించడమే కాదు. ఇది ఆ జాతిని ఒకచోటకు చేర్చుతుంది. వారి భాషలో నేర్చుకునే, మాట్లాడే అవకాశాన్ని ఇస్తుంది.

పునరుజ్జీవింపబడిన భాషతో శ్రేయస్సు

కుసుంద

ఫొటో సోర్స్, Eileen McDougall

కుసుంద భాషను పునరుజ్జీవింపజేయడం వల్ల ఇతర ప్రయోజనాలు కూడా ఉన్నాయి. దేశీయ భాషా పునరుజ్జీవనం పెంపొందించే పరిశోధనల ఫలితంగా శారీరక, మానసిక ఆరోగ్యంపై మంచి ప్రభావం పడనుంది.

ఉత్తర అమెరికాలో స్థానిక భాషా వినియోగం ద్వారా జనాభాలో సిగరెట్ వాడకం తగ్గింది. మధుమేహం, శారీరక, మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపాయి.

కెనడాలోని బ్రిటిష్ కొలంబియాలో జరిపిన ఒక అధ్యయనంలో మాతృభాషలో నిష్ణాతులుగా ఉన్న స్థానిక తెగలలో యువత ఆత్మహత్యలు ఆరు రెట్లు ఎక్కువగా ఉన్నాయని కనుగొన్నారు. వీటిలో 50 శాతం తక్కువ సభ్యులు ఉన్న గ్రూపులే ఎక్కువ.

ఆస్ట్రేలియాలోని ఆదిమవాసులు, టోర్రెస్ స్ట్రెయిట్ కమ్యూనిటీలలో స్థానిక భాష మాట్లాడేవారు అతి తక్కువ మద్యపానం సేవిస్తారు. కానీ, చట్టవిరుద్ధమైన మాదకద్రవ్యాల వినియోగం ఎక్కువ. "భాషలో మార్పు తరచుగా వలసపాలన లేదా చరిత్రలో అణచివేతలతో సంబంధం కలిగి ఉంటుంది. వాటి వల్ల భాష స్వీయ-విలువను కోల్పోతుంది" అని లండన్ యూనివర్సిటీలో విశ్వవిద్యాలయంలో భాషా విధానం, పునరుజ్జీవన విభాగం ప్రొఫెసర్ జూలియా సల్లాబ్యాంక్ చెప్పారు. "మేం ఈ భాషను ముందుకు తీసుకువెళ్ళగలమనే అనుకుంటున్నాం. నిరంతరం మాట్లాడుతూ ఉంటే భాషను మనం సజీవంగా ఉంచవచ్చు. ఇది మన భాష, అస్తిత్వం పట్ల ఉండే ఆత్మాభిమానానికి సంబంధించిన విషయం. ఈ రకమైన భాష-సాంస్కృతిక గుర్తింపును తిరిగి పొందడం వ్యక్తిగత, సమాజ స్థాయిలో సాధికారతను కలిగిస్తుంది." అని జూలియా అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)