బంగారంతో చేసిన గుండె, నాలుక...సున్తీ చేయని పురుషాంగం పక్కనే ఓ వస్తువు, మూలన పడేసిన మమ్మీలో కోట్ల విలువైన సంపద

మమ్మీ

ఫొటో సోర్స్, S.N. Saleem, S.A. Seddik, M. el-Halwagy

    • రచయిత, కేథరిన్ ఆర్మ్‌స్ట్రాంగ్
    • హోదా, బీబీసీ న్యూస్

ఈజిప్ట్‌లో ఓ మ్యూజియం స్టోర్ రూంలో ఉంచిన మమ్మీలో కోట్ల రూపాయల విలువైన బంగారం ఉన్నట్లు గుర్తించారు. ఈ మమ్మీ వందేళ్ల కిందట బయటపడింది.

ఆ మమ్మీ గుండె, నాలుక, మరికొన్ని శరీర భాగాల స్థానంలో బంగారంతో చేసిన అవయవాలు ఉన్నట్లు గుర్తించారు.

సుమారు 14 ఏళ్ల వయసులో చనిపోయి ఉంటాడని భావిస్తున్న ఓ యువకుడికి సంబంధించిన ఈ 2,300 ఏళ్ల కిందటి మమ్మీ 1916లో తవ్వకాలలో బయల్పడింది.

అయితే దాన్ని పూర్తిగా పరిశీలించకుండానే అనేక ఇతర మమ్మీలతో కలిపి కైరోలోని ఓ మ్యూజియం స్టోర్ రూంలో ఉంచారు. సుమారు వందేళ్లుగా అది అక్కడే పడి ఉంది.

మమ్మీ

ఫొటో సోర్స్, S.N. Saleem, S.A. Seddik, M. el-Halwagy

కైరో యూనివర్సిటీకి చెందిన డాక్టర్ సహార్ సలీమ్ బృందం ఈ మమ్మీని సీటీ స్కానర్‌తో పరిశీలించడంతో లోపల ఏముందో బయటపడింది.

తాయెత్తుల్లాంటి వస్తువులు నలభై తొమ్మిదింటిని ఆ మమ్మీలో గుర్తించారు. వాటిలో చాలా వరకు బంగారంతో చేసినవే.

ఈ కారణంగానే ఆ మమ్మీని ‘గోల్డెన్ బోయ్’గా వ్యవహరిస్తున్నారు.

ఈ మమ్మీలో బాలుడికి నాలుక ఉండాల్సిన చోట బంగారు నాలుక ఉంది. అలాగే గుండె స్థానంలో బంగారంతో చేసిన వస్తువు ఉంది.

అలాగే.. సున్తీ చేయని పురుషాంగాన్ని ఆనుకుని రెండు వేళ్లంత పొడవున్న ఓ వస్తువు ఉంది.

బంగారు గుండె

ఫొటో సోర్స్, S.N. Saleem, S.A. Seddik, M. el-Halwagy

మరణానంతరం కూడా జీవితం ఉంటుందని భావించే ఈజిప్షియన్లు, భవిష్యత్తులో కూడా ఈ మృతుడు శక్తిమంతంగా ఉండాలని కాంక్షిస్తూ ఇలా బంగారు తాయెత్తులు కట్టేవారని డాక్టర్ సహార్ సలీమ్ పేర్కొన్నారు.

అలాగే ‘మరణానంతర జీవితం’లో ఆ వ్యక్తి మాట్లాడే అవకాశం ఉండాలని కోరుకుంటూ బంగారు నాలుక అమర్చేవారని చెప్పారు.

చనిపోయిన యువకుడు ఉన్నత వర్గానికి చెందిన ఆరోగ్యవంతుడైన వ్యక్తిగా ఈ స్కానింగ్ ద్వారా పరిశోధకులు గుర్తించారు.

అతని పళ్లు, ఎముకలను పరిశీలించినటప్పుడు అవి ఏ విధమైన పోషకాహార లోపానికి గురైనట్లు కనిపించలేదు.

అతడి మెదడును, మరికొన్ని అవయవాలను తొలగించడాన్ని బట్టి చూస్తే ఈ యువకుడిని శరీరాన్ని అత్యుతన్నత నాణ్యతతో మమ్మీఫికేషన్ చేసినట్లు తేలింది.

ఈజిప్ట్‌లోని ఎడ్ఫు ప్రాంతంలో 1916లో ఈ మమ్మని గుర్తించారు.

బ్రిటన్ పురాతత్వ శాస్త్రవేత్త హోవర్డ్ కార్టర్ టుటంకామన్ మమ్మీని కనుగొనడానికి ఆరేళ్ల ముందే దీనిని గుర్తించి బయటకు తీశారు.

One of four newly discovered tombs at the Saqqara archaeological site south of Cairo

ఫొటో సోర్స్, Getty Images

బంగారు ఆకులతో కప్పిన మరో మమ్మీ

ఈజిప్టులోనే 4,300 ఏళ్లుగా తెరవని ఓ శవపేటికలో బంగారు ఆకులతో కప్పిన మమ్మీని కూడా గుర్తించినట్లు పురాతత్వ శాస్త్రవేత్తలు తెలిపారు.

ఈజిప్ట్‌లో ఇంతవరకు బయటపడిన మమ్మీలలో అత్యంత పురాతనమైనది ఇదేనని భావిస్తున్నారు. అలాగే, రాజకుటుంబాలకు చెందని వ్యక్తులకు సంబంధించిన శిథిలం కాని మమ్మీ కూడా ఇదేనని చెప్తున్నారు.

ఇది హెకాషెప్స్ అనే వ్యక్తికి సంబంధించిన మమ్మీ అని పురాతత్వ శాస్త్రవేత్తలు చెప్పారు.

కైరోకు దక్షిణాన సఖారా వద్ద సొరంగంలో 50 అడుగుల లోతున ఈ శవపేటిక దొరికింది. దీంతోపాటు మరో మూడు సమాధులనూ పురాతత్వ శాస్త్రవేత్తలు వెలికితీశారు.

ఈ మూడింటిలో పెద్దదిగా ఉన్న మమ్మీ ఖ్నుమ్‌జెడెఫ్ అనే పురుషుడిదిగా చెప్తున్నారు. ఖ్నుమ్‌జెడెఫ్ ఆ కాలంలో మత బోధకుడిగా వ్యవహరించేవారని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.

మూడో మమ్మీ మెరీ అనే పురుషుడిది. ప్రత్యేకమైన మత కార్యక్రమాలు నిర్వహించే అధికారం ఉన్న వ్యక్తి ఈయన.

మరో సమాధిలో ఫెతెక్ అనే రచయిత మృతదేహం ఉంది. ఆ సమాధిలో మరికొన్ని విగ్రహాలూ ఉన్నాయి. ఆ ప్రాంతంలో తవ్వితీసిన సమాధుల్లో దొరికిన విగ్రహాలలో ఇవే పెద్దవి.

ఈ సమాధులలో కుండలు వంటి ఇతర వస్తువులూ ఉన్నాయి.

Various statues and items of pottery were found in the tombs

ఫొటో సోర్స్, Getty Images

ఈ సమాధుల్లో దొరికినవన్నీ క్రీస్తుపూర్వం 22వ శతాబ్దం నుంచి 25 శతాబ్దం మధ్య కాలం నాటివని ఈజిప్ట్ మాజీ పురాతత్వ మంత్రి జహీ హవాస్ తెలిపారు.

‘‘ఈ తవ్వకాలలో దొరికిన సమాధులు, మమ్మీలు ఆ కాలంలో రాజులు, వారి చుట్టూ ఉన్న ప్రజలతో ఎలా ఉండేవారన్నది చెప్తున్నాయి’’ అని మరో పురావస్తు శాస్త్రవేత్త అలీ అబూ దేశిష్ అన్నారు.

సఖారా 3 వేల ఏళ్లపాటు సమాధి స్థలంగా ఉండేది. దీన్ని యునెస్కో కూడా వరల్డ్ హెరిటేజ్ సైట్‌గా గుర్తించింది.

ప్రాచీన కాలంలో ఈజిప్ట్ రాజధానిగా ఉన్న మెంఫిస్ దగ్గర ఉండే ఈ సఖారాలో సుమారు 12 పిరమిడ్‌లు ఉన్నాయి. స్టెప్ పిరమిడ్ కూడా ఇక్కడిదే. దీని సమీపంలోని సొరంగంలోనే ఈ మమ్మీలు దొరికాయి.

దక్షిణ ఈజిప్ట్‌లోని లగ్జర్ నగరంలో తవ్వకాలలో క్రీస్తు శకం రెండో శతాబ్దం, మూడో శతాబ్దం మధ్య కాలం నాటి రోమన్ యుగపు నగరం ఒకటి పూర్తిగా బయల్పడిందని పురాతత్వ శాస్త్రవేత్తలు చెప్పిన మరుసటి రోజే ఈ మమ్మీలు కూడా దొరికాయి.

లగ్జర్ తవ్వకాలలో భవనాలు, టవర్లు, కుండలు, పరికరాలు, రోమన్ కాలపు నాణేలు కూడా దొరికాయి.

పురావస్తు తవ్వకాలలో బయల్పడిన అనేక వస్తువులను ఈజిప్ట్ తన పర్యటక రంగాభివృద్ధి కార్యక్రమాలలో భాగంగా ఇటీవల ప్రదర్శనకు ఉంచుతోంది.

మమ్మీ

ఫొటో సోర్స్, EPA

ఫొటో క్యాప్షన్, మమ్మీ (ఫైల్ ఫొటో )

గ్రాండ్ ఈజిప్షియన్ మ్యూజియం 2028 నాటికి ఏడాదికి 3 కోట్ల మంది టూరిస్టులను ఆకర్షిస్తుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది.

అధ్యయనపరంగా కీలకమైన పురావస్తు ఆవిష్కరణలు కాకుండా పర్యటక రంగానికి ఊతమిచ్చేలా మీడియా దృష్టిని ఆకర్షించే అంశాలకు ప్రాధాన్యమిస్తున్నారంటూ ఈజిప్ట్ ప్రభుత్వంపై విమర్శలు వస్తున్నాయి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)