పిల్లలు, పెద్దలు అందరూ తప్పనిసరిగా వేసుకోవాల్సిన వ్యాక్సీన్ లు ఇవే...

వ్యాక్సీన్

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, లక్కోజు శ్రీనివాస్
    • హోదా, బీబీసీ కోసం

మీ పిల్లలకు టీకాలు వేయించారా? వ్యాక్సీన్ వేయించడం మర్చిపోకండి. ఇలాంటి మాటలు తరచూ వింటూ ఉంటాం. అయితే టీకాలంటే పిల్లలకే అనుకుంటాం, కానీ పిల్లలతో పాటు పెద్దవాళ్లు కూడా టీకాలు వేయించుకోవాలని తెలుసా?

వీటిలో పెళ్లికి ముందు అమ్మాయిలు తప్పనిసరిగా తీసుకోవలసిన టీకాలు కూడా ఉన్నాయి. చాలా వ్యాధుల నుంచి రక్షణ పొందేందుకు 60 ఏళ్లు దాటిన వృద్ధులు సైతం టీకాలు వేయించుకోవాలి.

మార్చి 16వ తేదీన జాతీయ వ్యాక్సినేషన్ డే సందర్భంగా పిల్లలు, పెద్దలు ఏ వయసులో ఏ టీకాలు వేయించుకోవాలో ఆ వివరాలు తెలుసుకుందాం.

పిల్లలకు సంబంధించిన వ్యాక్సినేషన్ వివరాలను విశాఖపట్నానికి చెందిన డాక్టర్ వేమూరి ప్రియాంక, పెద్ద వయసు వారు ఎటువంటి వ్యాక్సీన్ లు తీసుకోవాలో డాక్టర్ టి. స్రవంతిలు తెలిపారు.

డా. ప్రియాంక

ఫొటో సోర్స్, Lakkojusrinivas

ఫొటో క్యాప్షన్, పిల్లలకు ఏ వయసులో ఏ టీకాలు వేయించాలనే విషయాలను పిడియాట్రిషియన్ డాక్టర్ వేమూరి ప్రియాంక వివరించారు.

పిల్లలకు ఏ టీకాలు ఇవ్వాలి?

సాధారణంగా శిశువు పుట్టినప్పటి నుంచి పదేళ్లు వచ్చేవరకు పిల్లల్లో వ్యాక్సినేషన్ కోసం నేషనల్ ఇమ్యూనైజేషన్ షెడ్యూల్ తో పాటు ఐఏపీ (ఇండియన్ అకాడమీ ఆఫ్ పిడియాట్రిక్స్) షెడ్యూల్ ను అనుసరిస్తుంటారు. దాని ప్రకారం పిల్లలకు ఏ వయసులో ఏ టీకాలు వేయించాలో పిడియాట్రిషియన్ డాక్టర్ వేమూరి ప్రియాంక వివరించారు.

పిల్లలు పుట్టిన 24 గంటల్లోపు వేసే వ్యాక్సీన్ నుంచి 10 ఏళ్ల లోపు వేసే వ్యాక్సీన్ లు ఉంటాయి. అప్పుడే పుట్టిన పిల్లలకి పుట్టిన రోజున జీరో డోస్ పోలియో డ్రాప్స్ ఇస్తాం. ఈసీజీ టీకా ఇస్తాం. హెపటైటిస్ బి వ్యాక్సీన్ ఇస్తాం. ఇవి ప్రపంచవ్యాప్తంగా అందరి పిల్లలకు అన్నీ దేశాల్లో ఇచ్చే వ్యాక్సీన్లు . పోలియో డ్రాప్స్ పోలియో ప్రీవెన్షన్ కోసం ఇస్తాం.

బీసీజీ వ్యాక్సీన్​ ట్యూబర్ కులోసిస్ (టీబీ) రాకుండా ఇస్తాం. జీవితంలో టీబీ ప్రతి ఒక్కరికి ఏదో ఒక దశలో వస్తుంది. అలా జరిగినప్పుడు దాని తీవ్రత ఎక్కువగా రాకుండా ఈ టీకా చూస్తుంది. అందుకే మనలో చాలామందికి టీబీ వచ్చిన విషయం, అది తగ్గిపోయిన విషయం కూడా తెలియదు.

టీకాలు

ఫొటో సోర్స్, lakkojusrinivas

చికెన్ ఫాక్స్, ఫ్లూ కోసం..

వరిసెల్లా వ్యాక్సీన్ చికెన్ ఫాక్స్ నిరోధించడానికి ఉపయోగపడుతుంది. ఏ వయసు వారైనా చికెన్ ఫాక్స్ టీకా తీసుకోవచ్చు. పిల్లలు రెండు డోసులను తీసుకోవాలి. 15 నెలలకు 1వ డోసు, 18 నుంచి 21 నెలల మధ్య 2వ డోసు తీసుకోవాలి.

బ్యాక్టీరియా కారణంగా వచ్చే డిఫ్తీరియా, టెటనస్‌, పెర్ట్యూసిస్‌లకు ఐదు డోసుల డీటీఏపీ టీకా వేస్తారు. మొదటి డోసు రెండు నెలలకు, రెండో డోసు నాలుగు నెలలప్పుడు ఇస్తారు. తర్వాత ఆరు నెలల వయసులో ఒకటి, 15 నుంచి 18 నెలలున్నప్పుడు ఇంకొకటి, 4 నుంచి 6 ఏళ్ల వయసులో మరో డోసు ఇస్తారు.

'హెమోఫిలిస్‌ ఇన్‌ఫ్లూయెంజా టైప్‌ బి' వ్యాక్సీన్ హెచ్​ఐబీ ఇన్​ఫెక్షన్​ రాకుండా మూడు లేదా నాలుగు డోసులు ఇస్తారు. మొదటి డోసు రెండు నెలలప్పుడు, రెండో డోసు నాలుగు నెలలప్పుడు, మూడో డోసు అవసరమైతే ఆరు నెలల వయసప్పుడు ఇస్తారు. చివరి డోసు 12-15 నెలల వయసు మధ్యలో ఇస్తారు.

హెపటైటిస్‌ ఏకి రెండు డోసుల హెపటైటిస్‌ ఏ టీకా ఇస్తారు. మొదటి డోసు ఒక ఏడాది వయసున్నప్పుడు, రెండో డోసు 6 నుంచి 18 నెలల వయసు మధ్యలో ఇస్తారు.

హెపటైటిస్‌ బి వ్యాక్సీన్ మూడు లేదా నాలుగు డోసులు ఇస్తారు. మొదటి డోసు బిడ్డ పుట్టినప్పుడు, రెండో డోసును 1 నుంచి 2 నెలల మధ్యలో ఇస్తారు. మూడో డోసును నాలుగు నెలలున్నప్పుడు, చివరి డోసు 6 నుంచి 18 నెలల వయసు మధ్యలో ఇస్తారు.

టీకాలు

ఫొటో సోర్స్, lakkojusrinivas

తట్టు​, రూబెల్లా కోసం..

ఇన్‌ఫ్లూయెంజా (ఫ్లూ) వ్యాక్సినేషన్‌ ఆరు నెలల చిన్నారుల నుంచి 60 ఏళ్ల వృద్ధుల వరకు అవసరం.

తొమ్మిదేళ్లకన్నా తక్కువ ఉన్న పిల్లలకు రెండు డోసులు ఇవ్వాల్సి ఉంటుంది. అయితే పిల్లల రెండో డోసు అవసరమో లేదో డాక్టర్ ను అడిగి తెలుసుకుని వేయించుకోవాలి.

పోలియోను నిరోధించేవే ఐపీవీ టీకాలు. చిన్నారులకు ఈ పోలియో వ్యాక్సినేషన్‌ నాలుగు డోసులు ఇస్తారు. మొదటి డోసు రెండు మాసాలకు, రెండో డోసు నాలుగు మాసాలకు, మూడవ డోసు 6-18 మాసాల మధ్యలో, నాల్గవ డోసు 4-6 సంవత్సరాల మధ్యలో ఇస్తారు.

నేషనల్ ఇమ్యూనైజేషన్ షెడ్యూల్ కింద మీజిల్స్‌(తట్టు), మంప్స్‌ (గవద బిళ్లలు), రుబెల్లాకు (ఎంఎంఆర్‌) రెండు డోసుల ఎంఎంఆర్‌ వ్యాక్సీన్ తీసుకోవాల్సి ఉంటుంది. మొదటి డోసు 12-15 నెలల మధ్యలో ఇస్తారు. రెండో డోసు 4-6 సంవత్సరాల మధ్యలో ఇస్తారు.

మెదడు వాపు ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లో జపనీస్ ఎన్సెఫలిటిస్ వ్యాక్సీన్ కూడా తీసుకుంటారు. జపనీస్‌ ఎన్సెఫలిటిస్‌ వల్ల బ్రెయిన్‌ ఫీవర్‌ వస్తుంది. దీన్ని నిరోధించడానికి 9-12 నెలల వయసులో వ్యాక్సీన్ ఒక డోసు, 16-24 నెలల వయసులో రెండో డోసు ఇస్తారు.

క్యాచ్ అప్ వ్యాక్సినేషన్

నేషనల్ ఇమ్యూనైజేషన్ షెడ్యూల్ ప్రకారం ఒక్కొ టీకాని ఒక్కొ నిర్ధిష్టమైన సమయంలో వేయించుకోవాల్సి ఉంటుంది. కానీ అలా టీకాలను సమయానికి వేయించుకోలేకపోతే వారి కోసం క్యాచ్ అప్ వ్యాక్సినేషన్ ఉంటుందని డాక్టర్ ప్రియాంక తెలిపారు.

వ్యాక్సినేషన్ సమయానికి తీసుకోని వారి కోసం మళ్లీ వారు అపేసిన దగ్గర నుంచి వ్యాక్సీన్ తీసుకునే విధంగా వ్యాక్సీనేషన్ షెడ్యూల్ ఇవ్వడమే క్యాచ్ అప్ వ్యాక్సినేషన్. ఇది తీసుకునేవారు, ముందుగా వైద్యులను సంప్రదించి వారి సూచన మేరకే ఈ వ్యాక్సినేషన్ తీసుకోవాలని చెప్పారు.

స్రవంతి

ఫొటో సోర్స్, Lakkojusrinivas

పిల్లలకే కాదు, పెద్దలకు కూడా: స్రవంతి

వయసు పెరిగే కొద్ది రోగనిరోధక శక్తి తగ్గుతుంది, తద్వారా వివిధ వ్యాధులకు గురయ్యే అవకాశం ఉంది. కాబట్టి పెద్దవాళ్లు కూడా టీకాలు తీసుకోవడం అవసరం. కొన్ని తప్పనిసరి అయితే, మరికొన్ని వ్యక్తి ఆరోగ్య పరిస్థతిని బట్టి వేసుకోవలసినవి ఉన్నాయని జనరల్ ఫిజిషియన్ డాక్టర్ టి. స్రవంతి తెలిపారు.

పెద్ద వయసు వారు తీసుకోవలసిన వ్యాక్సీన్ లు కోసం డాక్టర్ స్రవంతి ఏం చెప్పారంటే...

ఇన్ఫ్లుయేంజా వ్యాక్సీన్: ఫ్లూ వైరస్ అంటే జలుబు, దగ్గు వంటివి తరచూ రాకుండా రక్షణ పొందేందుకు సంవత్సరానికి ఒక డోస్ ఇన్‌యాక్టివేటెడ్ ఇన్‌ఫ్లుయేంజా వాక్సిన్ తీసుకోవాలి. అయితే ప్రతి ఏడాది దాని స్టెయిన్ మారిపోతుంటుంది. ఆ ఏడాది విడుదలయ్యే వెరియంట్ నే తీసుకోవాలి. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారితో పాటు హెల్త్ కేర్ వర్కర్స్, టీచర్లు, స్టూడెంట్లు వంటి సముహాల్లో తిరిగే వారు ఈ వ్యాక్సినేషన్ పొందాలి.

హ్యూమన్ పాపిల్లోమా వైరస్ (హెచ్పీవీ) టీకా: సర్వికల్(గర్భాశయ) క్యాన్సర్ నుంచి రక్షణ కోసం 10 ఏళ్లు దాటిన అమ్మాయిలు, అబ్బాయిలు కూడా హెచ్పీవీ వ్యాక్సీన్ తీసుకోవాలి. లైంగిక సంబంధానికి ముందు లేదా పెళ్లికి ముందే ఈ టీకా తీసుకోవాలి. లేదంటే మిగతా సమయాల్లో దీని ప్రభావం అంతలా ఉండదు. టీకా సాధారణంగా 6 నెలల వ్యవధిలో 3 మోతాదులలో తీసుకోవాలి. హ్యుమన్ ప్యాపిల్లోమా వైరస్ వలనే ఆడవాళ్లలో సర్వికల్ క్యానర్ వస్తుంది. దీనికి రెండు సర్వారికల్, గార్డసిల్ అనే రెండు రకాల వ్యాక్సీన్ లు ఉన్నాయి.

టీడాప్ (Tdap), టీడీ (Td) : టెటానస్, డిఫ్తీరియా, పెర్ట్యూసిస్ (కోరింత దగ్గు) రాకుండా ఈ వ్యాక్సీన్ తీసుకోవాలి. దీనిని మనం సాధారణంగా టీటీ ఇంజెక్షన్ అంటాం. టీడాప్ అనేది చిన్నప్పుడు అందరికి వేస్తారు. ఒకవేళ వేయనప్పుడు 18 ఏళ్లు దాటిన తర్వాత కూడా ఒక డోస్ తీసుకోవచ్చు. ప్రాథమిక టీకా షెడ్యూల్‌ను పూర్తి చేసిన 18 నుంచి 64 సంవత్సరాల మధ్య ఉన్న పెద్దలు, ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి టీడీ బూస్టర్ డోస్ తీసుకోవాలి. ఏవైనా దెబ్బలు తగిలినా ఇన్ ఫెక్ట్ అవ్వకుండా ఉంటుంది.

హెపటైటిస్ వ్యాక్సీన్: హెపటైటిస్ ఏ వ్యాక్సీన్ కాలేయ వ్యాధికి కారణమయ్యే హెపటైటిస్ వైరస్ నుండి రక్షణను అందిస్తుంది. మనం ఎక్కువగా వినేది హైపటెటిస్ బి వ్యాక్సీన్ పేరునే. హైపటెటిస్ బీ వైరస్ సోకితే లివర్ సిరోసిస్, లివర్ క్యాన్సర్ కూడా వచ్చే ప్రమాదం ఉంది. దీనిని ఈ వైరస్ సోకకుండా ముందుగా తీసుకుంటారు.

మరికొన్ని వ్యాక్సీన్: మీజిల్స్, మంప్స్, రూబెల్లా వ్యాధుల నుంచి రక్షణ పొందేందుకు ఎంఎంఆర్ టీకాను చిన్నపిల్లలతో పాటు 19 నుంచి 60 ఏళ్ల వయసు మధ్య ఉన్నవారు కూడా తీసుకోవచ్చు. న్యూమోనియా నుంచి రక్షణ పొందేందుకు న్యూమోకోకల్ వ్యాక్సీన్ తీసుకోవాలి. ఇది రెండు రకాలుగా తీసుకుంటారు.

65 ఏళ్లు దాటిన వారికి న్యూమోనియా వస్తే తట్టుకోలేరు. అందుకే వారు రక్షణ కోసం ఈ టీకా తీసుకోవాలి. అలాగే 65 ఏళ్ల లోపు వయసున్న వారికి డయాబెటిస్, లివర్, గుండె సమస్యలుంటే వారికి కూడా న్యూమోనియా రాకుండా ఈ టీకా వేయించుకోవాలి.

ఇలా పెద్ద వయసు వారు కూడా తీసుకోవలసిన అనేక టీకాలున్నాయని డాక్టర్ స్రవంతి చెప్పారు.

టీకాలు

ఫొటో సోర్స్, Lakkojusrinivas

చిన్నప్పుడు వేయించుకోలేని టీకాలను పెద్దయ్యాక తీసుకొవచ్చా?

కొందరు చిన్నతనంలో వ్యాక్సీన్ లు తీసుకోకుండా ఉంటారు. ఆ టీకాలను పెద్దయ్యాక తీసుకోవచ్చా లేదా అనే అనుమానం కూడా చాలామందికి ఉంటుంది. దీనిపై డాక్టర్ ప్రియాంక మాట్లాడుతూ.... చిన్నతనంలో వేయించుకోని టీకాలను పెద్దవయసులో అందరికీ అవసరం లేదన్నారు.

రెండేళ్ల వయసులో చికెన్ ఫాక్స్ వ్యాక్సీన్ తీసుకోని వారికి 12 ఏళ్ల వరకు చికెన్ ఫాక్స్ క్యాచ్ అప్ వ్యాక్సినేషన్ చేస్తారు. కానీ ఆ పిల్లవాడికి నాలుగో ఏటా చికెన్ ఫాక్స్ వచ్చి తగ్గిపోయిందనుకోండి, అతడు చికెన్ ఫాక్స్ వ్యాక్సీన్ తీసుకోనవసరం లేదు.

అలాగే గార్డసిల్ అనే హ్యూమన్ పాపిల్లోమా వ్యాక్సీన్​ ఉంది. ఇది సాధారణంగా 10 ఏళ్లు దాటిన ఆడపిల్లలు, మగపిల్లలందరికి 15 ఏళ్ల వయసు వరకు ఇవ్వమని చెప్తాం. అదే పెళ్లైపోయి సెక్సువల్ లైఫ్ మొదలు పెడితే వారికి ఇక ఆ వ్యాక్సీన్​ పని చేయదని డాక్టర్ ప్రియాంక చెప్పారు.

‘టీకాలు ఎవరు వేసుకోకూడదు’

కొన్ని ప్రత్యేక సందర్భాల్లో కొందరు కొన్ని రకాల టీకాలను వేసుకోకూడదని డాక్టర్ స్రవంతి సూచిస్తున్నారు

“వరిసెల్లా, జోస్టర్, ఎంఎంఆర్ వంటి టీకాలను రోగ నిరోధక శక్తి తక్కువగా ఉండే గర్భవతులు, హెచ్ఐవీ వ్యాధిగ్రస్తులు వేసుకోకూడదు. ఎందుకంటే వీటిని బతికున్న వైరస్ లతో తయారు చేస్తారు. మిగతా టీకాలను తీసుకోవచ్చునని డాక్టర్ తెలిపారు.

అలాగే వ్యాక్సినేషన్​ వేసుకోవడంలో ఒకటి, రెండు రోజులు అటుఇటూ అయినా కూడా తీసుకోవచ్చునని డాక్టర్ ప్రియాంక తెలిపారు.

టీకాలు తీసుకున్న వారిలో ముఖ్యంగా పిల్లల ప్రవర్తనలో మార్పులు కనిపిస్తున్నాయని, అటిజం వస్తుందనే ప్రచారం జరుగుతోంది, ఇదంతా అవాస్తమన్నారు డాక్టర్​ స్రవంతి.

వ్యాక్సీన్ల వివరాలు టేబుల్ రూపంలో..

వ్యాక్సినేషన్ టేబుల్
ఫొటో క్యాప్షన్, వ్యాక్సినేషన్ టేబుల్
వ్యాక్సినేషన్ టేబుల్
ఫొటో క్యాప్షన్, వ్యాక్సినేషన్ టేబుల్

ఇవి కూడా చదవండి:

బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)