అమెరికా: ఐవీఎఫ్ సేవలు క్రిమినల్ ప్రాసిక్యూషన్‌కు దారితీస్తాయా... అలబామా కోర్టు ఏం చెప్పింది?

ఫొటో సోర్స్, CARLOS DUARTE
- రచయిత, కైలా ఎప్స్టీన్
- హోదా, బీబీసీ న్యూస్
ఇక నుంచి పిండాలనూ పిల్లలుగా పరిగణిస్తామని, వాటిని ప్రమాదవశాత్తు నాశనం చేసిన వ్యక్తులను బాధ్యులుగా పరిగణిస్తామని అలబామా సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు అమెరికాలో పునరుత్పత్తి వైద్యంపై ప్రభావం చూపిస్తోంది.
కోర్టు తీర్పుతో దక్షిణ అమెరికాలోని అతిపెద్ద ఆసుపత్రి అయిన అలబామా విశ్వవిద్యాలయం తమ ఇన్-విట్రో ఫెర్టిలైజేషన్ (ఐవీఎఫ్) సేవలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది.
ఐవీఎఫ్ క్రిమినల్ ప్రాసిక్యూషన్‌కు దారితీస్తుందని భయంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.
"ఐవీఎఫ్ ద్వారా శిశువు కావాలనుకొనే పేషెంట్ల ప్రయత్నాన్ని ఇది ప్రభావితం చేస్తుందని ఆందోళన చెందుతున్నాం" అని ప్రముఖ స్టేట్ మెడికల్ ప్రొవైడర్ అయిన అలబామా విశ్వవిద్యాలయం ఒక ప్రకటనలో తెలిపారు.
ఈ ఐవీఎఫ్ చికిత్సలలో సంరక్షణ ప్రమాణాలకు కట్టుబడి ఉన్నందుకు క్రిమినల్ ప్రాసిక్యూషన్ లేదా శిక్షల ప్రమాదాన్ని ఎదుర్కొనే పేషెంట్లు, వైద్యులు గురించి ఆలోచించాల్సిన అవసరం ఉందని వర్సిటీ తెలిపింది.
కాగా, అలబామా, దాని వెలుపల సంతానోత్పత్తి చికిత్సలకు ఈ తీర్పు ప్రతికూల పరిణామాలను కలిగిస్తుందని వైద్య, పునరుత్పత్తి నిపుణులు హెచ్చరిస్తున్నారు.
అయితే, కన్జర్వేటివ్ గ్రూపులు ఈ తీర్పును స్వాగతించాయి, అతిచిన్న పిండం కూడా చట్టపరమైన రక్షణకు అర్హమైనదని వారు తెలిపారు.

ఫొటో సోర్స్, Getty Images
ఈ వ్యాజ్యం ఎందుకు వేశారు... కోర్టు తీర్పు ఏంటి?
2020లో ఒక ఫెర్టిలిటీ క్లినిక్‌లో పిండాలను పోగొట్టుకున్న మూడు జంటలు.. 'రాంగ్ ఫుల్ డెత్'పై వేసిన వ్యాజ్యంతో దీనికి బీజం పడింది.
ఒక పేషెంట్ పిండాలు భద్రపరిచిన ప్రదేశంలో తిరుగుతూ, అనుకోకుండా వాటిపై పడిపోయారు. దీంతో పిండాలు నాశనమయ్యాయి.
బాధిత జంటలు 'రాంగ్ ఫుల్ డెత్ ఆఫ్ ఏ మైనర్ యాక్ట్' ప్రకారం సెంటర్ ఫర్ రిప్రొడక్టివ్ మెడిసిన్, మొబైల్ ఇన్‌ఫర్మరీ అసోసియేషన్‌లపై దావా వేశారు.
కానీ, చట్టంలో సాధారణ పిండాల ప్రస్తావనే ఉంది, ఐవీఎఫ్ ద్వారా వచ్చే పిండాల గురించి లేదు
దీంతో ఈ పిండం ఒక వ్యక్తి లేదా బిడ్డగా అర్హత పొందలేదని, 'రాంగ్ ఫుల్ డెత్' వ్యాజ్యం కొట్టివేస్తూ దిగువ కోర్టు తీర్పు ఇచ్చింది.
అయితే, అలబామా సుప్రీంకోర్టు బాధిత జంటల వాదనతో ఏకీభవించింది, ప్రోజెన్ పిండాలనూ పిల్లలుగా పరిగణించాలని తీర్పు చెప్పింది.
'రాంగ్ ఫుల్ డెత్' చట్టం పుట్టబోయే పిల్లలందరికీ, లొకేషన్‌తో సంబంధం లేకుండా వర్తిస్తుందని పేర్కొంది.
పుట్టకముందు మనుషులందరూ భగవంతుని ప్రతిరూపాలని తీర్పు సందర్భంగా ప్రధాన న్యాయమూర్తి టామ్ పార్కర్ వ్యాఖ్యానించారు.
ఎదురయ్యే సమస్యలేమిటి?
అలబామా కోర్టు తీర్పు ఐవీఎఫ్ పద్దతిని నిషేధించదు, దానిని పరిమితమూ చేయబోదు.
అయితే, కోర్టు తీర్పు ఐవీఎఫ్‌లోని కొన్ని అంశాలు చట్టబద్ధమైనవేనా? కావా? అని గందరగోళ పరిచే అవకాశముందని నిపుణులు అంటున్నారు.
పిండాన్ని ఒక వ్యక్తిగా పరిగణిస్తే, క్లినిక్‌లకు వాటిని ఉపయోగించడానికి, నిల్వ చేయడానికి ఎలా అనుమతిస్తారనే దానిపై ప్రశ్నలు తలెత్తుతాయి.
అన్ని ఐవీఎఫ్ పిండాలనూ ఉపయోగించలేరని బీబీసీతో సెంటర్ ఫర్ రీ ప్రొడక్టివ్ రైట్స్‌లో స్టేట్ పాలసీ డైరెక్టర్ ఎలిసబెత్ స్మిత్ తెలిపారు.
పిండాలకు వ్యక్తిత్వం మంజూరు చట్టం ఐవీఎఫ్‌పై వినాశకర పరిణామాలకు దారితీస్తుందని, చాలామంది సంతానం కోసం ఐవీఎఫ్‌పై ఆధారపడ్డారని గుర్తుచేశారు.
చట్టంపై పేషెంట్లలో కూడా సందిగ్ధత ఏర్పరడవచ్చు, ఈ పద్దతి అందుబాటులో ఉందా, లేదా? అసలు చట్టబద్ధమేనా? అనే విషయాలపై ఆందోళన చెందుతారు.
ఈ నిర్ణయం అలబామియన్లందరినీ ప్రభావితం చేస్తుందని, పిల్లలు, కోడళ్లు, అల్లుల్లు, సోదరులు ఇలా కుటుంబం కావాలనుకునే వారి ఆప్షన్లను ఇది పరిమితం చేస్తుందని అక్కడి స్టేట్ మెడికల్ అసోసియేషన్ ఒక ప్రకటనలో తెలిపింది.

ఫొటో సోర్స్, Getty Images
అబార్షన్‌కు ఐవీఎఫ్‌కు ముడి...
2022లో అమెరికా సుప్రీంకోర్టు అబార్షన్ హక్కును కొట్టివేసింది, ఈ తీర్పు ఆయా రాష్ట్రాలు తమ స్వంత చట్టాలను రూపొందించుకునేలా చేసింది.
డెమోక్రటిక్-పార్టీ నియంత్రణలోని రాష్ట్రాలు అబార్షన్ సేవలు విస్తరించాయి, అయితే రిపబ్లికన్ పార్టీ నియంత్రిత రాష్ట్రాలు ఆ సేవలకు పరిమితులు విధించాయి.
అలబామాలో ఇప్పటికీ అబార్షన్‌పై పూర్తి నిషేధం ఉంది.
అలబామా కోర్టు తీర్పుపై వైట్‌హౌస్ స్పందిస్తూ.. సుప్రీంకోర్టు 'రోయ్ వర్సెస్ వేడ్' తీర్పును రద్దు చేసినపుడు ఎలాంటి గందరగోళం నెలకొందో ఇపుడదే పరిస్థితి తలెత్తుతుంది. కుటుంబాల వ్యక్తిగత నిర్ణయాలను రాజకీయ నాయకులు ప్రభావితం చేయడానికి మార్గం కల్పిస్తుందని తెలిపింది.
అబార్షన్ వ్యతిరేకులు కూడా ఈ తీర్పును నిశితంగా గమనిస్తున్నారు. పిండం చట్టబద్ధంగా ఒక వ్యక్తిగా ఎప్పుడు పరిగణిస్తారనేది తలెత్తుతున్న ప్రశ్న.
అయితే, అలబామా తీర్పు జీవితానికి అద్భుతమైన విజయంగా ది అలయన్స్ డిఫెండింగ్ ఫ్రీడం, కన్జర్వేటీవ్ క్రిస్టియన్ లీగల్ గ్రూప్ అభివర్ణించింది.
"పరిస్థితులు ఎలా ఉన్నా, గర్భం దాల్చిన క్షణం నుంచి అన్ని మానవ జీవితాలు విలువైనవి" అని గ్రూపు ప్రతినిధి డెనిస్ బర్క్, బీబీసీకి ఒక ప్రకటనలో తెలిపారు.
ఈ ప్రాథమిక సత్యాన్ని కోర్టు గుర్తించినందుకు కృతజ్ఞులమని డెనిస్ సంతోషం వ్యక్తంచేశారు.
గర్భాన్ని తీసేయడంతో పోలిస్తే ఐవీఎఫ్ తమ దృష్టిలో అంత నైతిక సమస్య కాదని అబార్షన్‌కు వ్యతిరేకంగా పోరాడుతున్న కార్యకర్తలు అంటున్నారు.
"ఫలదీకరణ తర్వాత అండానికి రక్షణ అవసరమని పుట్టబోయే బిడ్డ రక్షణ కోసం వాదించే వ్యక్తులు, సంస్థలంటున్నాయి" అని బీబీసీతో న్యాయవాది ఎరిక్ జాన్‌స్టన్ తెలిపారు.
ఎరిక్ జాన్‌స్టన్ 2018లో అబార్షన్‌పై అలబామా రాజ్యాంగ భాషను రూపొందించడంలో సహాయం చేశారు.
ఇదే సందర్భంలో గర్భస్రావంపై వ్యతిరేక అభిప్రాయాలు కలిగిన జంటలు కూడా పిల్లలను కనడానికి ఐవీఎఫ్‌ను ఉపయోగించారనే విషయాన్ని ఎరిక్ అంగీకరించారు, వాటిని ఎప్పటికీ ఖండించనని చెప్పారు.
ఇది ఒక సందిగ్ధమని, సంతృప్తికరమైన సమాధానం లేని విషయమని ఆయన తెలిపారు.
ఇతర రాష్ట్రాల్లో ఏం జరగవచ్చు?
కొన్ని చట్టాలను అమెరికా రాష్ట్రాలు పునరావృతం చేసుకుంటాయి.
ఏ చట్టాలు శాసనసభల ఆమోదం పొందాయి, లేదా ఏవి చట్టపరమైన సవాళ్లను ఎదుర్కొన్నాయి? అనే విషయాలు పరిగణనలోకి తీసుకొని ఆయా రాష్ట్రాలు ముందుకు సాగుతాయి.
అలబామా తీర్పు కేవలం ఆ రాష్ట్రానికి మాత్రమే వర్తిస్తుంది. అయినప్పటికీ, ఇతర రాష్ట్రాలలో కూడా ఇలాంటి వ్యాజ్యాలు వచ్చే అవకాశముందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
ఈ తీర్పు అలబామా స్టేట్ న్యాయస్థానంలో వెళ్లడైందని, ఇది అబార్షన్ కేసు మాదిరి సుప్రీంకోర్టు వరకు వెళ్లకపోవచ్చని మరికొందరు నిపుణులు భావిస్తున్నారు.
సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ గణాంకాల ప్రకారం 2021లో ఐవీఎఫ్ చికిత్సల ఫలితంగా అమెరికాలో 97,128 మంది పిల్లలు జన్మించారు.
అమెరికా రాజకీయాలపై ప్రభావం?
సుప్రీంకోర్టు 'రోయ్ వర్సెస్ వేడ్' తీర్పును రద్దు చేసినప్పటి నుంచి అబార్షన్ రాజ్యాంగ హక్కు అనేది డెమొక్రాట్లకు విజయవంతమైన ప్రచారంగా మారింది.
23-25 వారాల వరకు అబార్షన్ చేసే హక్కును 'రోయ్ వర్సెస్ వేడ్' తీర్పు కల్పించింది.
తాజా అలబామా తీర్పు నేపథ్యంలో అమెరికా అంతటా సంతానోత్పత్తి చికిత్సను సంరక్షించే ప్రచార కార్యక్రమాల నిర్వహణకు డెమొక్రాటిక్ అభ్యర్థులు పూనుకోవచ్చు.
ఇదే సమయంలో రిపబ్లికన్ నేతలు అమెరికాలో అబార్షన్ నిషేధించాలని లేదా దానికి పరిమితులు విధించాలని కోరుకునే వారి పక్షం నిలబడొచ్చు.
రిపబ్లికన్ అధ్యక్ష పదవికి నిక్కీ హేలీ పోటీదారుగా ఉన్నారు. ఆ పార్టీ తరఫున డొనాల్డ్ ట్రంప్‌పై పోటీకి మిగిలి ఉన్న ఏకైక ముఖ్యమైన పోటీదారు కూడా ఆమె.
తాజా అలబామా సుప్రీంకోర్టు నిర్ణయానికి నిక్కీ మద్దతు తెలుపుతూ "నాకు పిండాలే పిల్లలు" అన్నారు.
"మీరు పిండం గురించి మాట్లాడేటప్పుడు, మీరు నా జీవితం గురించి మాట్లాడుతున్నారు. నేను ఆ పిండం ఎక్కడ నుంచి వస్తుందో చూస్తాను" అని ఆమె అన్నారు.
ఇవి కూడా చదవండి:
- రైతుల ఆందోళన: ఖనౌరీ బార్డర్లో ఒకరి మృతి.. రైతులు, పోలీసుల మధ్య ఘర్షణ
- గ్రేట్ నికోబార్: భారత ప్రభుత్వ 74 వేల కోట్ల ప్రాజెక్ట్ ఆ తెగకు మరణ శాసనంగా మారనుందా
- అలెక్సీ నవాల్నీ: పుతిన్‌ను ఎదిరించిన నేతతో పెళ్లిపై యూలియా నవాల్నియా ఏమన్నారు?
- చరిత్రలో తొలిసారి రాజ్యసభలో ప్రాతినిధ్యం కోల్పోతున్న టీడీపీ.. ఈ పరిస్థితి ఎందుకొచ్చింది?
- ఎలక్టోరల్ బాండ్లు రాజ్యాంగ విరుద్ధం, క్యాష్ చేసుకోని బాండ్ల సొమ్మును 15 రోజుల్లో దాతలకు తిరిగి ఇచ్చేయాలి: సుప్రీం కోర్టు స్పష్టీకరణ
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














